శ్రీ మాధవీయ శంకరవిజయము - తృతీయ సర్గ 83 శ్లోకాలు
(
మూల శ్లోకములతో తెలుగు వ్యాఖ్య)
-
ఆచార్య తాడేపల్లి పతంజలి
శ్రీశివాయ గురవేనమః
శ్రుతి స్మృతి పురాణానామ్ ఆలయం కరుణాలయమ్ | నమామి భగవత్పాద శంకరం లోకశంకరమ్ ||
తృతీయ సర్గ - శ్లోకం 1
ఇతి బాలమృగాంకశేఖరే సతి బాలత్వముపాగతే తతః ౹
దివిషత్ప్రవరాః ప్రజజ్ఞిరే భువి షట్శాస్త్రవిదాం సతాం కులే ౹౹ 1 ౹౹
తాత్పర్యము:
ఈ విధంగా బాలచంద్రుని ధరించిన ఆ పరమశివుడు బాల రూపాన్ని పొందిన తరువాత, ఆయనకు సహాయపడటం కోసం దేవతాశ్రేష్ఠులు భూమిపై ఆరు
శాస్త్రములలో పండితులైన సత్పురుషుల వంశాలలో జన్మించారు.
వ్యాఖ్య (సంస్కృత వ్యాఖ్యాన అనువాదం):
- శివావతారాన్ని
వర్ణించిన తర్వాత, ఇతర దేవతల అవతారాలను వర్ణించడం ఇక్కడ ప్రారంభమవుతోంది.
- బాలచంద్రుడిని
శిరస్సున ధరించే శివుడు ఇలా బాల్యాన్ని (శంకరాచార్యులుగా) పొందిన తరువాత, దేవతలలో ఉత్తములైన
వారు భూమిపై షట్ శాస్త్రములు తెలిసిన సత్పురుషుల కులాలలో ఆవిర్భవించారు.
- 'షట్ శాస్త్రవిదాం' (ఆరు శాస్త్రములు తెలిసినవారు) అనే విశేషణము వారి పాండిత్యాన్ని
సూచిస్తుండగా, 'సతాం' (సత్పురుషులు) అనే పదం వారి
సద్ప్రవర్తనను మరియు బ్రహ్మజ్ఞాన యోగ్యతను సూచిస్తోంది. కేవలం శాస్త్ర
పాండిత్యం ఉండి కూడా కొన్ని ప్రతిబంధకాల వల్ల అపరోక్ష బ్రహ్మజ్ఞానం
కలగకపోవచ్చు, అందుకే అటువంటి దోషం లేని 'సత్పురుషుల'
కులాలలో వారు జన్మించారని తాత్పర్యం.
శ్లోకం 2
లిప్యంతరీకరణం:
కమలానిలయః
కలానిధే-ర్విమలాఖ్యాదజనిష్ట భూసురాత్ ౽ భువి పద్మపదం వదంతి యం సవిపద్యేన వివాదినాం
యశః ॥ 2 ॥
తాత్పర్యము:
లక్ష్మీదేవికి
నివాసస్థానమైన శ్రీమహావిష్ణువు, సకల కళలకు నిధియైన 'విమలుడు' అనే
పేరుగల బ్రాహ్మణుడికి పుత్రుడిగా జన్మించాడు. లోకంలో ఎవరినైతే 'పద్మపాదుడు' అని
పిలుస్తారో, ఆయన వాదించే ప్రతిపక్షుల కీర్తిని ఆపదలతో (ఓటమితో)
కూడినదిగా చేశాడు.
వ్యాఖ్య:
మొదటగా
విష్ణువు యొక్క అవతారాన్ని చెబుతున్నారు- లక్ష్మీదేవికి నివాసమైన శ్రీమహావిష్ణువు, సకల కళలకు నిధియైన విమలుడు అనే పేరుగల బ్రాహ్మణుడి
నుండి భూమిపై ఉద్భవించాడు. 'భువి' అనేది తర్వాతి వాక్యంతో అన్వయించుకోవాలి. ఎవరిని
భూమిపై పద్మపాదుడు అని అంటారో, ఎవరి ద్వారా వివాదుల
(ప్రతిపక్షుల) కీర్తి ఆపదతో కూడినదైందో (నశించిందో) అని అర్థం.
[ఇలా
సామాన్యంగా సకల దేవతల అవతారాల గురించి చెబుతుండగా, అందులో
విశేషాన్ని తెలుసుకోవాలనే కుతూహలం కలిగినప్పుడు, అత్యంత
పూజ్యుడు మరియు శ్రీశంకర పాదాల యందు అమితమైన భక్తి కలవాడు కావడము చేత మొదట
భగవంతుడైన విష్ణువు అవతారాన్ని వర్ణిస్తున్నారు- కమలా అని. అమరకోశం ప్రకారం 'కమల అంటే లక్ష్మి, హరిప్రియ' అని అర్థం. కమల అంటే లక్ష్మీదేవికి నిలయం లేదా
ఆశ్రయమైన శ్రీమన్నారాయణుడు అని భావం.]
[విమల
అని. విమలుడు అనేది సార్థకమైన పేరు ఎవరికి కలదో అటువంటి వాని నుండి అని అర్థం.]
శ్లోకం 3
లిప్యంతరీకరణం:
పవమానో౽ప్యజని
ప్రభాకరా-త్సవనోన్మీలితకీర్తిమండలాత్ ౽
గలహస్తితభేదవాద్యసౌ
కిల హస్తామలకాభిధామధాత్ ॥ 3 ॥
తాత్పర్యము:
వాయుదేవుడు
కూడా, యజ్ఞయాగాదుల (సవనముల) ద్వారా ప్రకాశించే కీర్తిమండలం
కలవాడు మరియు సూర్యునితో సమానుడైన 'ప్రభాకరుడు' అనే బ్రాహ్మణుడికి పుత్రుడిగా జన్మించాడు. భేదవాదులను
గొంతు పట్టి బయటకు నెట్టివేసినట్లుగా (ఓడించినట్లుగా) చేసిన ఆ వాయుదేవుడి అవతారమే 'హస్తామలకుడు' అనే
పేరును ధరించింది.
వ్యాఖ్య:
వాయుదేవుడు
కూడా, ఉదయకాలపు యజ్ఞం మొదలైన వాటి ద్వారా ప్రకాశింపబడిన
కీర్తి సమూహం కలవాడు, అంటే ఉదయకాలపు సూర్యమండలం వంటి వాడైన ప్రభాకరుడు అనే
పేరుగల బ్రాహ్మణుడి నుండి ఉద్భవించాడు. ఎవరి ద్వారా భేదవాదులు మెడ పట్టి
నెట్టివేయబడినట్లుగా, అంటే కంఠం నిరోధించబడిన వారుగా చేయబడ్డారో, అటువంటి అవతరించిన వాయువు ప్రసిద్ధమైన 'హస్తామలక' అనే
పేరును ధరించాడు.
[మెడ
అని. మల్లయుద్ధంలో ప్రత్యర్థి యొక్క మెడపై చేయి వేసి నెట్టివేస్తారనేది ప్రసిద్ధం.
అలా తిరస్కరించబడిన భేదవాదులు ఎవరి ద్వారా కలిగారో ఆయన అని భావం. ధరించాడు.]
శ్లోకం 4
లిప్యంతరీకరణం:
పవమానదశాంశతో౽జని
ప్లవమానా౽ంచతి యద్యశోంబుధౌ ౽ ధరణీ మథితా వివాదియో-క్తరణీ యేన స తోటకాహ్వయః ॥ 4 ॥
తాత్పర్యము:
వాయుదేవుని
యొక్క పదవ అంశతో 'తోటకాచార్యుడు' జన్మించాడు.
ఎవరి కీర్తి అనే సముద్రంలో భూమి తేలుతూ ప్రకాశిస్తుందో, ఎవరి ద్వారా వివాదుల (ప్రతిపక్షుల) వాక్కులనే పడవలు
ముంచివేయబడ్డాయో (మథించబడ్డాయో), ఆయనే తోటకాచార్యుడు.
వ్యాఖ్య:
వాయువు
యొక్క పదవ అంశావతారాన్ని చెబుతున్నారు- వాయుదేవుని పదియవ వంతు అంశతో ఆ తోటకుడు అనే
పేరు గలవాడు జన్మించాడు. ఎవరి కీర్తి అనే సముద్రంలో భూమి తేలుతూ ప్రకాశిస్తుందో, ఎవరి ద్వారా వివాదుల
వాక్కులనే పడవలు మథించబడ్డాయో ధ్వంసం చేయబడ్డాయో[పది సంఖ్య గల వాయువు అని మయూరవ్యంసకాది సమాసం ద్వారా విడదీసి, దాని అంశతో అని అర్థం. 'వాయువే ఓ గౌతమ! ఆ సూత్రము' అనే శ్రుతి
ప్రకారం- ప్రాణ, అపానాది పంచ
ప్రాణాలు, నాగ, కూర్మాది పంచ ఉపప్రాణాలు అనే పది విధాలైన సమష్టి
ప్రాణవాయువుకు ప్రధానమైన 'సూత్రాత్మ' అంశతో అని అర్థం.] [ధరణి అంటే పృథ్వి, అంచతి అంటే
పూజించబడుతుంది లేదా ప్రకాశిస్తుంది అని అర్థం.]
శ్లోకం 5
ఉద్భభావి శిలాదసూనునా మదవద్వాదికదంబనిగ్రహైః ౽ సముదంచితకీర్తిశాలినం యముదంకం బువతే మహీతలే ॥ 5 ॥
తాత్పర్యము: మదముతో కూడిన వాద బృందములను నిగ్రహించడం ద్వారా పొందిన గొప్ప కీర్తితో
శోభిల్లే 'ఉదంకుడు' (నందీశ్వరుని అవతారం) అనే పేరు గలవాడు, శిలాదుని కుమారుడైన నందిగా భూమిపై జన్మించాడు.
వ్యాఖ్య: శిలాదుని కుమారుడు, నంది అనే పేరు
గలవాడు ఉద్భవించాడు. మదముతో కూడిన వాద సముదాయాలను నిగ్రహించడం ద్వారా ప్రకాశించే
కీర్తితో శోభిల్లుతూ, భూమిపై ఎవరిని 'ఉదంకుడు' అని పిలుస్తారో
ఆయన అని అర్థం.
[తోటకాచార్యుని
జన్మస్థానం పద్మపాదుల వలె ఎందుకు చెప్పబడలేదు అనే సందేహానికి సమాధానంగా 'ఉద్భభావి' అని
చెప్పబడింది.] శిలాద అని. 'కంకుల ద్వారా ధాన్యాన్ని సేకరించడాన్ని శిలము అంటారు' అనే స్మృతి ప్రకారం, శిలము అనే వృత్తి ద్వారా అన్నాన్ని భుజించే ముని అని అర్థం. ఈ పేరు గల ఒక
ప్రసిద్ధ బ్రాహ్మణుని కుమారుని ద్వారా అని అర్థం. అటువంటి సూత్రాత్మాంశావతారమైన
తోటకాచార్యుని ద్వారా అని ప్రకరణాన్ని బట్టి గ్రహించాలి. [సముదంచిత అని. అమరకోశం ప్రకారం 'ఉదర్కము అంటే ఉత్తర ఫలము', అంటే వాదులను ఓడించిన తర్వాత కలిగే ఫలం అని అర్థం. భూమిపై అలా పిలుస్తారని
అన్వయం. పైన చెప్పిన విధంగా పునరుక్తి దోషం ఏమీ లేదు. ఎందుకంటే 'భవ శంకర దేశిక మే శరణం' అని తోటకాష్టక స్తోత్రం ద్వారా శ్రీభాష్యకారుల పాదాలను ఆశ్రయించిన ఇతని గొప్ప
వాక్పటిమను సూచించడానికి ఇది ఉపయోగపడుతుంది. డిండిమకారుడు (వ్యాఖ్యాత) మరో విధంగా
వివరిస్తున్నాడు: శిలాదుని కుమారుడు నంది అనే పేరుతో ఉద్భవించాడు. మదించిన వాద
సమూహాలను నిగ్రహించి కీర్తి పొందిన వానిని భూమిపై 'ఉదంకుడు' అని
పిలుస్తారు. దీని ప్రకారం ఉదంకుడు అనే పేరు గల నందీశ్వరుని అవతారమే భగవత్పాదుల
శిష్యుడని ఫలితార్థం.]
శ్లోకం 6
విధిరాస సురేశ్వరో గిరాం నిధిరానందగిరిర్వ్యజాయత ౽ అరుణః సమభూత్సనందనో వరుణో౽జాయత చిత్సుఖాహ్వయః ॥ 6 ॥
తాత్పర్యము: బ్రహ్మదేవుడు 'సురేశ్వరాచార్యుడు' (మండన మిశ్రుడు) గా జన్మించాడు. వాక్పతి (బృహస్పతి) 'ఆనందగిరి' గా
ఉద్భవించాడు. అగ్నిదేవుడు (అరుణుడు) 'సనందనుడు' (పద్మపాదుడు) గా,
వరుణ దేవుడు 'చిత్సుఖుడు' అనే పేరుతో జన్మించారు.
వ్యాఖ్య: విధి అంటే బ్రహ్మదేవుడు, మండనమిశ్రుడు
అనే పేరు గల సురేశ్వరాచార్యుడు అయ్యాడు. వాక్కులకు నిధియైన బృహస్పతి ఆనందగిరిగా
జన్మించాడు. అరుణుడు అంటే అగ్నిదేవుడు సనందనుడు అయ్యాడు. వరుణుడు చిత్సుఖుడు అనే
పేరుతో జన్మించాడు.
నందనుడు అయ్యాడు. విష్ణువే పద్మపాదుడుగా జన్మించాడని పైన
చెప్పబడింది, ఆయనే సనందనుడు
అని ముందు ముందు చెప్పబడుతుంది. అయితే ఇక్కడ సూర్యుని లేదా అరుణుని అవతారమని
చెప్పడం విరోధంగా అనిపించవచ్చు. కానీ పక్షాంతరాన్ని (మరో వాదనను) ఆశ్రయించి లేదా
ఇద్దరి అంశలు ఒకేచోట చేరాయని భావించి ఈ విరోధాన్ని తొలగించుకోవాలి. వరుణుడు
చిత్సుఖుడుగా జన్మించాడు.] [పద్మపాదుడు
విష్ణువతారమని ఒకచోట, సూర్య లేదా
అరుణుని అవతారమని మరొకచోట చెప్పడం విరోధం అనిపిస్తే- 8వ శ్లోకంలో మండనమిశ్ర, ఆనందగిరుల విషయంలో కూడా బృహస్పతి, నందీశ్వరుల
అవతారాల గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి మొదట చెప్పబడిన
విష్ణువతారత్వమే ముఖ్యమైనదిగా భావించాలి.]
శ్లోకం 7
అపరే౽ప్యభవన్ దియౌకసః స్వపరేర్ష్యాపరవిద్విషః ప్రభోః ౽ చరణం పరిసేవితుం జగ చ్ఛరణం భూసురపుంగవాత్మజాః ॥ 7 ॥
తాత్పర్యము: తమ కన్నా పరుల (అద్వైత వ్యతిరేకుల) పట్ల ఉండే ఈర్ష్యతో కూడిన శత్రువులను
(ద్వైతవాదులను) జయించే శక్తి గల ఇతర దేవతలు కూడా, జగత్తుకే శరణ్యమైన శ్రీశంకర భగవత్పాదుల పాదసేవ చేయడానికి భూమిపై బ్రాహ్మణ
శ్రేష్ఠుల కుమారులై జన్మించారు.
వ్యాఖ్య: తమ వారితోను మరియు ఇతరులతోను మత్సరపడే రాక్షసులను ద్వేషించే దేవతలు అని అర్థం.
లేదా, తమ పరభేదం
చూపుతూ ఈర్ష్య పడేవారిని ద్వేషించే ఆ ప్రభువైన శ్రీశంకరుని యొక్క జగత్ శరణ్యమైన
పాదాలను సేవించడానికి వారు బ్రాహ్మణోత్తముల పుత్రులుగా జన్మించారు.
[స్వ అని.
అమరకోశం ప్రకారం 'ఈర్ష్య లేదా
అసూయ అంటే ఇతరుల విషయాల పట్ల కలిగే స్పృహ (కోరిక)'. తమ ఆత్మకంటే ఇతరులు గొప్పవారనే ఈర్ష్య కలిగి ఉండటం, ఇతరుల సంపద లేదా కీర్తిని చూసి కలిగే అంతఃకరణ వృత్తి
విశేషమైన సుఖంపై అభీలాష కలిగి ఉండటం వంటి లక్షణాలు గల సకల భేదవాదులు ఎవరికి
శత్రువులో, అటువంటి
ప్రభువైన శ్రీశంకర భగవత్పాదాచార్యుల అని అర్థం.]
శ్లోకం 8
చార్వాకదర్శనవిధానసరోషధాతుః శాపేన గీష్పతిరభూద్భువి
మండనాఖ్యః ౽ నందీశ్వరః
కరుణయేశ్వరచోదితః స-స్నానందగిర్యభిధయా వ్యజనీతి కేచిత్ ॥ 8 ॥
తాత్పర్యము: చార్వాక దర్శనాన్ని (నాస్తిక వాదాన్ని) రచించినందుకు కోపగించిన బ్రహ్మదేవుని
శాపం వల్ల దేవగురువు బృహస్పతి భూమిపై 'మండనుడు' (మండన మిశ్రుడు) అనే పేరుతో జన్మించాడు. నందీశ్వరుడు
ఈశ్వరుని ఆజ్ఞతో కరుణతో 'ఆనందగిరి' అనే పేరుతో జన్మించాడని కొందరు చెబుతారు.
వ్యాఖ్య: 'బ్రహ్మ
సురేశ్వరుడుగా, బృహస్పతి
ఆనందగిరిగా జన్మించారు' అని పైన
చెప్పబడింది. ఇప్పుడు మతాంతరాన్ని (మరో అభిప్రాయాన్ని) చెబుతున్నారు- దేహమే ఆత్మ
అని వాదించే నాస్తిక చార్వాక శాస్త్రాన్ని రచించినందుకు ఆగ్రహించిన బ్రహ్మదేవుని
శాపం వల్ల, దేవగురువైన
బృహస్పతి భూమిపై మండనుడు అనే పేరుతో జన్మించాడు. నందీశ్వరుడు మహాదేవుని ప్రేరణతో
కరుణతో ఆనందగిరి అనే పేరుతో జన్మించాడని కొందరు అంటారు. (ఇది వసంతతిలక వృత్తం).
[చార్వాక
శాస్త్రం దేహమే ఆత్మ అనే వాదాన్ని ప్రధానంగా కలిగి ఉంటుంది. అసురులను
మోహింపజేయడానికి బృహస్పతి దీనిని రచించాడని పద్మపురాణాదులలో ప్రసిద్ధం.] ఇక్కడ 'కేచిత్' (కొందరు) అనే
పదాన్ని వాడటం వల్ల, ఈ అభిప్రాయం
అందరు శిష్టులకు సమ్మతం కాకపోవచ్చునని సూచించబడింది.
శ్లోకం 9
అథావతీర్ణస్య విధేః పురంధ్రీ సా౽భూద్యదాఖ్యోభయభారతీతి ॥ సరస్వతీ సా ఖలు వస్తువృత్యా లోకో౽పి తాం వక్తి
సరస్వతీతి ॥ 9 ॥
తాత్పర్యము: ఆ విధంగా అవతరించిన బ్రహ్మదేవుని (మండనమిశ్రుని) భార్యగా ఆ సరస్వతీ దేవి 'ఉభయ భారతి' అనే పేరుతో
జన్మించింది. యథార్థానికి ఆమె సాక్షాత్తు సరస్వతీ దేవియే, లోకం కూడా ఆమెను సరస్వతి అనియే పిలుస్తుంది.
వ్యాఖ్య: ఆ విధంగా అవతరించిన బ్రహ్మదేవుని భార్య, ప్రసిద్ధురాలైన సరస్వతి జన్మించింది. 'కాకాక్షి గోళక న్యాయం' ప్రకారం (ఒక
కన్ను రెండు వైపులా చూసినట్లు) 'అభూత్' అనే పదం ఇటు బ్రహ్మకు, అటు సరస్వతికి రెండింటికీ వర్తిస్తుంది. ఎవరి పేరు 'ఉభయ భారతి' అని ప్రసిద్ధి
చెందిందో ఆమె అని అర్థం. యథార్థానికి ఆమె సరస్వతియే, లోకం కూడా ఆమెను సరస్వతి అనియే అంటుంది. [అమరకోశం ప్రకారం 'కుటుంబిని, పురంధ్రి అంటే భార్య' అని అర్థం. అంటే సరస్వతి అనే పేరు గల భార్య అని భావం.]
శ్లోకం 10
పురా కిలాధ్యైషత ధాతురంతికే సర్వజ్ఞకల్పా మునయో నిజం నిజమ్
॥ వేదం తదా
దుర్వసనో౽తికోపనో వేదానధీయన్ క్వచిదస్ఖలత్స్వరే ॥ 10 ॥
తాత్పర్యము: పూర్వం బ్రహ్మదేవుని సన్నిధిలో సర్వజ్ఞుల వంటి మునులందరూ తమ తమ వేదాలను
అధ్యయనం చేస్తున్నారు. అప్పుడు అత్యంత కోపిష్ఠియైన దుర్వాస మహాముని వేద పఠనం
చేస్తూ ఒకచోట స్వరంలో పొరపాటు (స్ఖలనం) చేశాడు.
వ్యాఖ్య: సరస్వతీ దేవి అవతరించడానికి కారణం చెబుతున్నారు- పూర్వం బ్రహ్మదేవుని సమీపంలో
సర్వజ్ఞులకంటే కొంచెం తక్కువైన మునులందరూ తమ తమ వేదాలను చదువుతున్నారు. అప్పుడు
అత్యంత కోపిష్ఠియైన దుర్వాస ముని వేదాలు చదువుతూ ఒకచోట స్వరంలో తప్పు చేశాడు.
శ్లోకం 11
తదా జహాసేందుముఖీ సరస్వతీ యదంగమర్ణోద్భవ శబ్దసంతతిః ॥ చుకోప తస్యై దహనానుకారిణా నిరీక్షతాక్ష్యా
మునిరుగ్రశాసనః ॥ 11 ॥
తాత్పర్యము: ఆ సమయంలో చంద్రబింబం వంటి ముఖం గల సరస్వతీ దేవి (ఆ తప్పు విన్నప్పుడు)
నవ్వింది. ఎవరి దేహం వర్ణ సముదాయం (శబ్ద సంతతి) నుండి పుట్టిందో అటువంటి ఆ
సరస్వతిపై, ఉగ్రమైన శాసనం
గల దుర్వాస ముని మంటల వంటి కళ్లతో చూస్తూ కోపగించాడు.
వ్యాఖ్య: ఆ సమయంలో చంద్రుని వంటి ముఖం గల సరస్వతి నవ్వింది. అక్షరాల (వర్ణాల) నుండి
పుట్టిన శబ్ద సముదాయం ఎవరికి అంగమో అటువంటి సరస్వతిపై కోపపడ్డాడు. ఆ కోపపు ముద్రను
చూపిస్తున్నారు- అగ్నిని అనుకరించేలా ఉన్న, అంటే ఎర్రగా మండుతున్న కన్నులతో ఆ ఉగ్ర శాసనుడైన ముని ఆమెను చూశాడు.
[ఇందు అని. దీని
ద్వారా ఆమె నవ్వు అత్యంత మందంగా (సున్నితంగా) ఉందని ధ్వనిస్తోంది. యదంగ అని. ఎవరి
శరీరం యొక్క కాంతి వర్ణమయమో అని అర్థం. సిద్ధాంత కౌముది ప్రకారం 'ఋణ' శబ్దం జలానికి
కూడా వర్తిస్తుంది. జలం అనేక విధాలైన లావణ్య తరంగాల గుణం కలిగి ఉంటుంది కాబట్టి, దాని నుండి పుట్టిన శబ్ద సంతతి అంటే- అకారాది 64 వర్ణాలతో కూడిన అనంతమైన శబ్దబ్రహ్మ పరంపర అని అర్థం. సకల
శబ్ద బ్రహ్మకు మూలమైన ఆమె, స్వర లోపం
జరిగినప్పుడు నవ్వడం సముచితమే అని భావం.]
శ్లోకం 12
శశాప తాం దుర్వినయే౽వనీతలే జాయస్వ మర్త్యేష్వబిభేత్సరస్వతీ
॥ ప్రసాదయామాస
నిసర్గకోపనం తత్పాదమూలే పతితా విషాదినీ ॥ 12 ॥
తాత్పర్యము: "ఓ దుర్వినీతురాలా! భూలోకంలో మనుష్యులలో జన్మించు" అని
ఆ దుర్వాస ముని సరస్వతిని శపించాడు. ఆ శాపానికి సరస్వతీ దేవి భయపడింది. దుఃఖిస్తూ
ఆ ముని పాదాల చెంత పడి, స్వభావసిద్ధంగా
కోపిష్ఠియైన ఆ మునిని అనుగ్రహించవలసిందిగా ప్రార్థించింది.
వ్యాఖ్య: ఆ తర్వాత ఆయన ఏమి చేశాడు అనే ఆకాంక్షకు సమాధానమిది- ఆమెను శపించాడు. ఆ శాపం
ఏమిటంటే- "ఓ దుర్వినయము కలదానా! భూమిపై మనుష్యులలో జన్మము పొందుము". ఇలా
శపించబడిన సరస్వతి భయపడింది. భీతురాలై,
దుఃఖిస్తూ (విషాదముతో), ఆ శాపం నుండి
విముక్తి పొందే ఉపాయాన్ని ఆలోచిస్తూ మనోవ్యధతో ఆ దుర్వాసుని పాదాల సమీపంలో పడింది.
స్వభావసిద్ధంగా కోపిష్ఠియైన ఆ మునిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించింది.
[ఆ తర్వాత ఆమె
ఏమి చేసింది అనే దానికి వివరణ- ఎప్పుడైతే సరస్వతి ఆ శాపం వల్ల భయపడిందో, అప్పుడు ఆమె విషాదంతో ఖేదాన్ని పొందింది. లేదా, ఆమె సర్వజ్ఞురాలు కాబట్టి భవిష్యత్తులో తన భర్త
(బ్రహ్మదేవుడు) కూడా అవతరిస్తాడని తెలిసి, చింత లేనిదై (అవిషాదిని), స్త్రీ కావడం
చేత కేవలం పంచాంగ నమస్కారం చేస్తూ, స్వభావక్రూరుడైన
ఆ దుర్వాసుని ప్రసన్నం చేసుకుంది.]
శ్లోకం 13
దృష్ట్వా విషణ్ణాం మునయః సరస్వతీం ప్రసాదయాంచక్రిముం
తమాదరాత్ ॥ కృతాపరాధా
భగవన్ క్షమస్వ తాం పితేవ పుత్రం విహితాగసం మునే ॥ 13 ॥
తాత్పర్యము: విచారంలో ఉన్న సరస్వతీ దేవిని చూసి, అక్కడున్న మునులందరూ ఆదరంతో ఆ దుర్వాసుని ఇలా ప్రార్థించారు: "ఓ
భగవంతుడా! మునీంద్రా! తప్పు చేసిన పుత్రుడిని తండ్రి ఏ విధంగా క్షమిస్తాడో, అలాగే అపరాధం చేసిన ఈ సరస్వతిని క్షమించు".
వ్యాఖ్య: అప్పుడు మునులు ఖేదముతో ఉన్న సరస్వతిని చూసి, ఆ దుర్వాసుని ఆదరంతో ప్రసన్నం చేసుకున్నారు. "ఓ మునీ! అపరాధం చేసిన
పుత్రుడిని తండ్రి ఏ విధంగా క్షమిస్తాడో, అలాగే ఓ భగవంతుడా! అపరాధం చేసిన ఆ సరస్వతిని క్షమించుము".
శ్లోకం 14
ప్రసాదితో౽భూదథ సంప్రసన్నో వాణ్యా మునీంద్రైరపి శాపమోక్షమ్
॥ దదౌ యదా
మానుషశంకరస్య సందర్శనం స్యాద్భవితాస్యమర్త్యా ॥ 14 ॥
తాత్పర్యము: సరస్వతీ దేవి చేత, మునీంద్రుల చేత
ప్రార్థించబడిన దుర్వాస ముని శాంతించి,
శాప విమోచనాన్ని ప్రసాదించాడు. "ఎప్పుడైతే మానవ రూపంలో ఉన్న శంకరుని
(శంకరాచార్యుల) సందర్శనం కలుగుతుందో, అప్పుడు నీవు
తిరిగి దేవతవు అవుతావు" అని పలికాడు.
వ్యాఖ్య: ఆ విధంగా సరస్వతి చేత మరియు మునీంద్రుల చేత ప్రసన్నం చేసుకోబడిన దుర్వాసుడు
శాంతించిన వాడై శాప మోక్షాన్ని ఇచ్చాడు. దాని గురించి చెబుతున్నారు- శంకరాచార్యుల
రూపంలో అవతరించిన మానవ శంకరుని యొక్క దర్శనం సాక్ష్యములతో సహా ఎప్పుడు కలుగుతుందో, అప్పుడు నీవు మరల అమర్త్యురాలివి (దేవతవు) అవుతావు అని
అర్థం.
శ్లోకం 15
సా శోణతీరే౽జని విప్రకన్యా సర్వార్థవిత్సర్వగుణోపపన్నా ॥ యస్యా బభూవుః సహజాశ్చ విద్యాః శిరోగతం కే
పరిహర్తుమీశాః ॥ 15 ॥
తాత్పర్యము: ఆ సరస్వతీ దేవి శోణ నదీ తీరంలో విష్ణుమిత్రుడు అనే బ్రాహ్మణుడికి కుమార్తెగా
జన్మించింది. ఆమె సకల విషయాలు తెలిసినది, సర్వ సద్గుణములు కలది. ఆమెకు విద్యలన్నీ సహజంగానే (పుట్టుకతోనే) అబ్బాయి.
తలరాతను తప్పించడానికి ఎవరికి సాధ్యం?
వ్యాఖ్య: ఆ సరస్వతి శోణ అనే నది తీరంలో విష్ణుమిత్రుడు అనే పేరుగల వాని కుమార్తెగా
జన్మించింది. ఆమెను వివరిస్తున్నారు- సకల అర్థాలను (విషయాలను) తెలిసినది మరియు
సర్వ గుణములతో కూడినది. ఎవరికైతే విద్యలు - అంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలనే నాలుగు వేదాలు; శిక్ష, కల్పము, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిష్యము, నిరుక్తము అనే
ఆరు అంగాలు; మీమాంస, ధర్మశాస్త్రము, న్యాయము, పురాణము అనే పద్నాలుగు విద్యలు పుట్టుకతోనే కలిగాయో ఆమె అని
అర్థం. ఎందుకంటే శిరస్సుపై ఉన్న దానిని (తలరాతను) తొలగించడానికి ఎవరు సమర్థులు? ఎవరూ లేరు, దుర్వాసాదుల
శాపం వల్ల ఇది తప్పలేదు అని భావం.
[శిరోగతము అంటే
శిరస్సుపై పుట్టిన వెండ్రుకల వంటిది. వాటిని తొలగించడానికి ఎవరికి శక్తి ఉంటుంది? భావం ఏమిటంటే- ఏ విధంగా వెండ్రుకలు శరీరానికి సహజంగా
పుడతాయో, అలాగే ఆమెకు
సర్వ విద్యలతో కూడిన శబ్దబ్రహ్మ రూపమైన అవయవాలు స్వభావసిద్ధంగానే ఉన్నాయి. ఇక్కడ
అర్థాంతరన్యాస అలంకారం ధ్వనిస్తోంది. కువలయానందంలో చెప్పినట్లు- సామాన్య విశేషాల
ద్వారా చెప్పడం అర్థాంతరన్యాసం. హనుమంతుడు సముద్రాన్ని దాటాడు, మహాత్ములకు సాధ్యం కానిది ఏముంది? గుణమున్న వస్తువుతో చేరడం వల్ల అల్పమైనది కూడా గౌరవాన్ని
పొందుతుంది, పూలమాలతో
కలిసిన దారం తలపై ధరించబడుతుంది కదా.]
శ్లోకం 16
సర్వాణి శాస్త్రాణి షడంగవేదా-న్కావ్యాదికాన్వేత్తి పరం చ
సర్వమ్ ॥ తన్నాస్తి నో
వేత్తి యదత్ర బాలా తస్మాదభూచ్చిత్రపదం జనానామ్ ॥ 16 ॥
తాత్పర్యము: ఆమె సాంఖ్య, పాతంజల, వైశేషిక, న్యాయ, మీమాంస, వేదాంతాలనే సకల
శాస్త్రాలను, ఆరు అంగాలతో
కూడిన వేదాలను, కావ్య
నాటకాదులను, ఇంకా తక్కిన
సమస్తాన్ని ఎరుగును. ఈ లోకంలో ఆ చిన్నారికి తెలియని విషయం అంటూ ఏదీ లేదు. అందుకే
ఆమె జనులకు ఆశ్చర్యానికి నిలయమైంది.
వ్యాఖ్య: సాంఖ్యము, పాతంజలము, వైశేషికము, న్యాయము, మీమాంస, వేదాంతము అనే
సకల శాస్త్రాలను, వ్యాకరణాది ఆరు
అంగాలను, ఋగాది వేదాలను, కావ్య నాటకాలను,
ఇంకా ఇతరమైన వాటన్నింటినీ ఆమె తెలుసుకున్నది. ఇంకా చెప్పాలంటే- ఈ జగత్తులో ఆ
సరస్వతికి తెలియనిది ఏదీ లేదు. ఆ కారణం చేతనే ఆ బాలిక ఈ లోకంలో జనులకు
ఆశ్చర్యానికి ఆశ్రయమైంది (నిలయమైంది).
[మరియు
మన్వాదులు రచించిన సకల స్మృతులు, ఉపస్మృతులు
వంటి ధర్మశాస్త్రాలను, అలాగే శ్రీ
బాదరాయణాదులు రచించిన పద్దెనిమిది మహాపురాణాలు, ఉపపురాణ సమూహాలను కూడా ఆ బాలిక తెలుసుకున్నదని అన్వయం. ఈ విధంగా-
"పురాణము, న్యాయము, మీమాంస, ధర్మశాస్త్రము, వేదాంగాలు కలిసిన వేదాలు కలిపి విద్యలకు మరియు ధర్మానికి
పద్నాలుగు స్థానములు" అని చెప్పబడింది.]
శ్లోకం 17
సా విశ్వరూపం గుణినం గుణజ్ఞా మనోభిరామం ద్విజపుంగవేభ్యః ॥ శుశ్రావ తాం చాపి స
విశ్వరూప-స్తస్మాత్తయోర్దర్శనలాలసా౽భూత్ ॥ 17 ॥
తాత్పర్యము: గుణవతియైన ఆ సరస్వతి (ఉభయ భారతి), మనోహరుడు మరియు
సద్గుణవంతుడైన విశ్వరూపుని (మండనమిశ్రుని) గురించి బ్రాహ్మణ శ్రేష్ఠుల ద్వారా
విన్నది. అలాగే ఆ విశ్వరూపుడు కూడా ఆమె గురించి విన్నాడు. దానితో వారిద్దరిలో
ఒకరినొకరు చూడాలనే కోరిక (దర్శనలాలస) కలిగింది.
వ్యాఖ్య: ఈ విధంగా సరస్వతి ఆవిర్భావాన్ని వర్ణించి, ఆమె వివాహం గురించి చెప్పడం ప్రారంభిస్తున్నారు. గుణములను గుర్తించగల ఆ
సరస్వతి, మండనమిశ్రుడనే
మరో పేరు కలిగిన, సద్గుణవంతుడు
మరియు మనోహరుడైన విశ్వరూపుని గురించి బ్రాహ్మణ శ్రేష్ఠుల ద్వారా విన్నది. ఆ
గుణజ్ఞుడైన విశ్వరూపుడు కూడా గుణవతి మరియు మనోహరియైన ఆ సరస్వతి గురించి
బ్రాహ్మణోత్తముల ద్వారా విన్నాడు. అందువల్ల ఆ మండన-సరస్వతులకు పరస్పరం చూసుకోవాలనే
తీవ్రమైన కోరిక కలిగింది. [గుణజ్ఞ అని -
ఇది ముందు ముందు కలగబోయే అనురాగానికి కారణాన్ని సూచించే విశేషణం.]
శ్లోకం 18
అన్యోన్యసందర్శనలాలసౌ తౌ చింతాప్రకర్షాదధిగమ్య నిద్రామ్ ॥ అవాప్య సందర్శనభాషణాని పునః ప్రబుద్ధౌ
విరహాగనితప్తౌ ॥ 18 ॥
తాత్పర్యము: ఒకరినొకరు చూసుకోవాలనే కోరికతో ఉన్న వారిద్దరూ, అధికమైన ఆలోచనల వల్ల కలిగిన నిద్రలో (స్వప్నంలో) పరస్పరం చూసుకోవడం, మాట్లాడుకోవడం చేశారు. నిద్ర మేల్కొన్న తర్వాత విరహవేదన అనే
అగ్నితో తపించిపోయారు.
వ్యాఖ్య: అటువంటి స్థితిలో ఉన్న వారిద్దరికీ, తీవ్రమైన చింతన వల్ల కలిగిన స్వప్నంలో పరస్పర దర్శనం, సంభాషణలు కలిగాయి. కానీ నిద్ర మేల్కొన్న సమయంలో విరహ తాపం
కలిగిందని చెబుతున్నారు.
శ్లోకం 19
దిదృక్షమాణావపి నేక్షమాణా-వన్యొన్యవార్తాహృతమానసౌ తౌ ॥ యథోచితాహారవిహారహీనౌ తనౌ తనుత్వం స్మరణాదుపేతౌ ॥
19 ॥
తాత్పర్యము: చూడాలని కోరిక ఉన్నప్పటికీ ఒకరినొకరు చూసుకోలేక, ఒకరి వార్తలను వినడం ద్వారా హరించబడిన మనస్సు గలవారై, వారు సరైన ఆహార విహారాలను మానివేశారు. నిరంతరం ఒకరినొకరు
స్మరించుకోవడం వల్ల వారి శరీరాలు కృశించిపోయాయి.
వ్యాఖ్య: చూడాలని కోరుకుంటున్నా చూడలేక, స్వప్నంలో
కలిగిన పరస్పర సంభాషణల ద్వారా చిత్తము అపహరించబడినవారై, తగిన ఆహారము మరియు విహారము లేనివారై, ఒకరినొకరు స్మరించుకోవడం వల్ల శరీరంలో సన్నబడటాన్ని
(కృశించడాన్ని) పొందారు.
[ఇక్కడ సరస్వతి
మరియు విశ్వరూపుల పరస్పర గుణగణాలను వినడం ద్వారా ఉద్దీపన కలిగి, ఆహార విహారాలు లేకపోవడం వల్ల కలిగే శరీర కార్శ్యము
(సన్నబడటం) అనే అనుభావం ద్వారా, రతి అనే స్థాయి
భావం ప్రధానంగా ధ్వనిస్తోంది. ఇక్కడ సమానమైన అనురాగం కలవారికి వియోగ కాలంలో కలిగే 'విప్రలంబ శృంగార రసం' పోషించబడింది. అలంకారం 'పరికర అలంకారం'.
శ్లోకం 20
దృష్ట్వా తదీయౌ పితరౌ కదాచి-దపృచ్ఛతాం తౌ పరికర్షితాంగౌ ॥ వపుః కృశం తే మనసో౽ప్యగర్వో న వ్యాధిమీక్షే న చ
హేతుమన్యమ్ ॥ 20 ॥
తాత్పర్యము: ఒకానొక సమయంలో, కృశించిపోయిన
శరీరములతో ఉన్న వారిని (విశ్వరూపుడిని అతని తండ్రి, సరస్వతిని ఆమె తండ్రి) చూసి వారి తండ్రులు ఇలా అడిగారు: "నీ శరీరం
చిక్కిపోయింది, మనస్సులో
ఉత్సాహం (గర్వం) లేదు. దీనికి కారణమేమిటి? నాకు వ్యాధి గానీ, ఇతర కారణమేదీ
గానీ కనిపించడం లేదు."
వ్యాఖ్య: ఒకానొక సమయంలో వారి తండ్రులు మిక్కిలి కృశించిన శరీరములతో ఉన్న వారిని చూసి
అడిగారు. అది ఏమిటో ఇక్కడ చెబుతున్నారు- నీ శరీరం కృశించింది, మనస్సులో గర్వం (ఉల్లాసం) లేదు. దీనికి కారణమేమిటి? నేను రోగమును గానీ, దీనికి కారణమైన మరే ఇతర విషయాన్ని గానీ చూడటం లేదు.
[ఇక్కడి నుండి 'ఓ పుత్రీ!' లేదా 'ఓ పుత్రా!' అనే సంబోధనను
సందర్భాన్ని బట్టి రెండు పక్షాలలోనూ (విశ్వరూపుడు/సరస్వతి) అధ్యాహారం చేసుకోవాలి.]
శ్లోకం 21
ఇష్టస్య హానేరనిష్టయోగా-ద్భవంతి దుఃఖాని శరీరభాజామ్ ॥ వీక్షే న తౌ ద్వావపి వీక్షమాణో వినా నిదానం నహి
కార్యజన్మ ॥ 21 ॥
తాత్పర్యము: శరీరధారులకు ఇష్టమైన వస్తువు దూరమవ్వడం వల్ల గానీ, ఇష్టం లేనిది ప్రాప్తించడం వల్ల గానీ దుఃఖాలు కలుగుతాయి.
ఆలోచించి చూస్తే ఈ రెండు కారణాలు నీకు ఉన్నట్లు నాకు కనిపించడం లేదు. కానీ కారణం
(నిదానం) లేకుండా కార్యం (ఫలితం) పుట్టదు కదా!
వ్యాఖ్య: 'ఇతర కారణమేదీ
కనిపించడం లేదు' అన్న దానిని
వివరిస్తున్నారు- ఇష్టమైన దాని వియోగం వల్ల లేదా అనిష్టమైన దాని సంయోగం వల్ల దేహము
కలవారికి దుఃఖాలు కలుగుతాయి. నేను విచారించి చూసినా ఆ రెండు కారణాలు నాకు
కనిపించడం లేదు. అయితే కారణం (నిదానం) లేకుండా కార్యం పుట్టదు అనేది ప్రసిద్ధం.
కాబట్టి నాకు కనిపించని ఆ కారణమేమిటో నీవే చెప్పాలి అని అర్థం.
శ్లోకం 22
న తే౽త్యగాదుద్వహనస్య కాలః పరావమానో న చ నిఃస్వతా వా ॥ కుటుంబభారో మయి దుఃసహో౽యం కుమారవృత్తేస్తవ
కా౽త్ర పీడా ॥ 22 ॥
తాత్పర్యము: నీకు వివాహ వయస్సు ఇంకా మించిపోలేదు. ఇతరుల నుండి అవమానమేమీ లేదు, పేదరికమూ లేదు. దుర్భరమైన ఈ కుటుంబ భారం కూడా నాపైనే ఉంది.
బ్రహ్మచారిగా (లేదా కన్యగా) ఉన్న నీకు ఇక్కడ పీడ (కష్టం) ఏమిటి?
వ్యాఖ్య: ఇతర కారణాలు కూడా లేవని చెబుతున్నారు- నీ వివాహ కాలం కూడా మించిపోలేదు. ఇతరుల
నుండి నీకు అవమానం లేదు. నీకు దరిద్రం కూడా లేదు. అంతేకాక, భరించడానికి కష్టమైన ఈ కుటుంబ భారం నాపైనే ఉన్నది. కాబట్టి
ఈ లోకంలో నీకు బాధ ఏమిటి? ఏమీ లేదు అని
అర్థం.
[కుమార అని -
ఇది భావ ప్రధానమైన నిర్దేశం. కౌమార దశలో ఉండటం వల్ల అని అర్థం.]
శ్లోకం 23
న మూఢభావః పరితాపహేతుః పరాజితిర్వా తవ తన్నిదానమ్ ॥ విద్వత్సు
విస్పష్టతయా౽గ్రపాఠా-త్సుదుర్గమార్థాదపి తర్కవిద్భిః ॥ 23 ॥
తాత్పర్యము: నీ సంతాపానికి కారణం అజ్ఞానం కాదు,
అలాగే ఓటమి కూడా కారణం కాదు. ఎందుకంటే తర్కశాస్త్ర పండితులకు కూడా
గ్రహించడానికి వీలుకాని గహనమైన విషయాలలో కూడా విద్వాంసుల సభలో నీవే అగ్రగామిగా
(మొదటి వరుసలో) ఉన్నావు.
వ్యాఖ్య: మరియు సంతాపానికి కారణమైన మూర్ఖత్వం (అజ్ఞానం) నీకు లేదు. అలాగే సంతాప కారణమైన
పరాజయం కూడా నీకు లేదు. దానికి కారణం- విద్వాంసులలో, తర్కవేత్తలకు కూడా అత్యంత దుర్గమమైన (గ్రహించడానికి కష్టమైన) అర్థము గల
శాస్త్ర విషయాలలో కూడా నీ పాఠము స్పష్టంగా అందరికంటే ముందు ఉండటమే.
శ్లోకం 24
ఆ జన్మనో విహితకర్మనిషేవణం తే స్వప్నే౽పి నాస్తి
విహితేతరకర్మసేవా ॥ తస్మాన్న
భేయమపి నారకయాతనాభ్యః కిం తే ముఖం ప్రతిదినం గతశోభమాస్తే ॥ 24 ॥
తాత్పర్యము: నీవు పుట్టినప్పటి నుండి వేదవిహితమైన కర్మలనే ఆచరిస్తున్నావు. శాస్త్రం
నిషేధించిన కర్మల ఊసే నీకు స్వప్నంలో కూడా లేదు. అలాంటప్పుడు నరకయాతనల గురించి
భయపడాల్సిన అవసరమే లేదు. మరి నీ ముఖం రోజురోజుకూ కాంతిహీనమై (శోభ తగ్గి) ఎందుకు
కనిపిస్తోంది?
వ్యాఖ్య: మరియు పుట్టినప్పటి నుండి నీకు వేదవిహితమైన కర్మల యొక్క చక్కని సేవ (ఆచరణ)
ఉన్నది. శాస్త్రవిరుద్ధమైన కర్మల సేవ అనేది నీకు కలలో కూడా లేదు. కాబట్టి నరకయాతనల
గురించి కూడా నీవు భయపడనవసరం లేదు. ఇహ పర లోకాల దుఃఖాలు లేని నీ ముఖం, శోభ లేకుండా ఎందుకు ఉన్నది? దీనికి కారణమేమిటి అని అర్థం.
[ఒకవేళ - 'విహిత కర్మలు చేయకపోవడం వల్ల, నిందించబడిన పనులు చేయడం వల్ల, ఇంద్రియ
నిగ్రహం లేకపోవడం వల్ల నరుడు పతనమవుతాడు' అనే స్మృతి వాక్యం ప్రకారం, ఎక్కడ పతనం
అవుతానో అనే భయంతో ఈ సంతాపం కలుగుతోందేమో అని భావిస్తారేమోనని 'ఆ జన్మతః' అని వసంతతిలక
వృత్తంలో చెప్పారు.]
శ్లోకం 25
నిర్బంధతో బహుదినం ప్రతిపాద్యమానో వక్తుం
కృపాభరయుతావిదమూచతుః స్మ ॥ నిర్బంధతస్తవ
వదామి మనోగతం మే వాచ్యం న వాచ్యమితి యద్వితనోతి లజ్జామ్ ॥ 25 ॥
తాత్పర్యము: తల్లిదండ్రులు చాలా రోజుల నుండి పట్టుబట్టి అడుగుతుండటంతో, వారిపై ఉన్న ప్రేమ మరియు దయతో ఆ మండనమిశ్రుడు, సరస్వతి (ఉభయభారతి) తమ మనసులోని మాటను ఇలా చెప్పారు:
"నీవు పట్టుబట్టడం వల్ల నా మనసులోని మాటను చెబుతున్నాను. నిజానికి ఇది
చెప్పదగినదో కాదో అని నాకు చాలా సిగ్గుగా ఉంది."
వ్యాఖ్య: ఈ విధంగా అత్యంత ఆసక్తితో (అత్యాగ్రహంతో) చాలా రోజులు కారణం చెప్పమని
అడుగుతుండటంతో, స్నేహం వల్ల
కలిగిన దయాతిశయం గల ఆ పితరులకు (తల్లిదండ్రులకు) మండనమిశ్రుడు మరియు సరస్వతి ఈ
క్రింది విధంగా చెప్పారు. మొదట మండనమిశ్రుని వచనాన్ని ఉదాహరిస్తున్నారు. ఏదైతే
చెప్పాలో లేదో అని నాకు లజ్జను (సిగ్గును) కలిగిస్తోందో, అటువంటి నా మనస్సులోని విషయాన్ని నీ నిర్బంధం వల్ల
చెబుతున్నాను.
శ్లోకం 26
శోణాఖ్యపుంనదతటే వసతో ద్విజస్య కన్యా శృతిం గతవతీ
ద్విజపుంగవేభ్యః ॥ సర్వజ్ఞతాపదమనుత్తమరూపవేషాం
తాముద్వివక్షతి మనో భగవన్మదీయమ్ ॥ 26 ॥
తాత్పర్యము: "ఓ తండ్రీ! శోణ అనే నదీ తీరంలో నివసించే విష్ణుమిత్రుడనే
బ్రాహ్మణుని కుమార్తె గురించి గొప్ప పండితుల ద్వారా విన్నాను. సకల విజ్ఞానానికి
నిలయమై, సాటిలేని
రూపలావణ్యాలు కలిగిన ఆమెను వివాహం చేసుకోవాలని నా మనస్సు కోరుకుంటోంది."
వ్యాఖ్య: ఆ విషయాన్ని చూపిస్తున్నారు - శోణ అనే పుంనదం (నది) ఒడ్డున నివసించే
విష్ణుమిత్రుడు అనే బ్రాహ్మణుని కుమార్తె, సర్వజ్ఞతకు ఆశ్రయమైనది మరియు సాటిలేని రూపం, అలంకరణ కలది. ఆమె గురించి బ్రాహ్మణ శ్రేష్ఠుల ద్వారా విన్నాను. కాబట్టి ఓ
భగవంతుడా (తండ్రీ)! నా మనస్సు ఆమెను వివాహం చేసుకోవాలని (ఉద్వోఢుమ్) కోరుకుంటోంది.
[ఓ భగవంతుడా అని
పిలవడంలో - మున్ముందు చెప్పబోయే కోరికను తీర్చడానికి కావలసిన సామర్థ్యం తండ్రికి
ఉందని సూచించబడింది. 'శోణ' అనే నదిని పుంనదం (పురుష నది) అనడంలో - జడ పదార్థమైనప్పటికీ
అది ఉత్తమమైనది, ఎందుకంటే
అటువంటి గొప్ప కన్యా రత్నం అక్కడ జన్మించింది అని భావం.]
శ్లోకం 27
పుత్రేణ సో౽తివినయం గదితో౽న్వశాద్దో విప్రౌ వధూవరణకర్మణి
సంప్రవీణౌ ॥ తావాపతుర్ద్విజగృహం
ద్విజసందిదృక్షూ దేశానతీత్య బహులానిజకార్యసిద్ధయే ॥ 27 ॥
తాత్పర్యము: కుమారుడు అత్యంత వినయంతో చెప్పిన మాటలు విని, ఆ హిమమిత్రుడు (విశ్వరూపుని తండ్రి) కన్యావరణ కార్యంలో ఆరితేరిన ఇద్దరు
బ్రాహ్మణులను పంపాడు. వారు తమ కార్యసిద్ధి కోసం అనేక దేశాలను దాటుకుంటూ, ఆ బ్రాహ్మణుడిని (విష్ణుమిత్రుడిని) చూడాలనే కోరికతో అతని
ఇంటికి చేరుకున్నారు.
వ్యాఖ్య: కుమారుడు అత్యంత వినయంగా చెప్పిన మాటలు విని, ఆ హిమమిత్రుడు వధువును నిశ్చయించే కార్యంలో నిపుణులైన ఇద్దరు బ్రాహ్మణులను
ఆజ్ఞాపించి పంపాడు. వారు తమ కార్యము నెరవేర్చుకోవడానికి, విష్ణుమిత్రుడిని దర్శించాలనే కోరికతో అనేక దేశాలను దాటి
అతని ఇంటికి చేరుకున్నారు.
శ్లోకం 28
భూభృన్నికేతనగతః శ్రుతవిశ్వశాస్త్రః శ్రీవిశ్వరూప ఇతి యః
ప్రథితః పృథివ్యామ్ ॥ తత్పాదపద్మరజసే
స్పృహయామి నిత్యం సాహాయ్యమత్ర యది తాత భవాన్విదధ్యాత్ ॥ 28 ॥
తాత్పర్యము: (ఇక్కడ సరస్వతి/ఉభయభారతి తన తండ్రితో అంటోంది): "రాజభవనంలో నివసిస్తూ, సకల శాస్త్రాలను అభ్యసించి, ఈ భూమిపై 'శ్రీవిశ్వరూపుడు' అని ప్రసిద్ధి చెందిన ఆయన పాదపద్మ ధూళిని నేను నిరంతరం
కోరుకుంటున్నాను. ఓ తండ్రీ! ఈ విషయంలో మీరు నాకు సహాయం చేస్తే నా కోరిక
నెరవేరుతుంది."
వ్యాఖ్య: ఇప్పుడు ఉభయభారతి వాక్యాన్ని ఉదాహరిస్తున్నారు- రాజస్థానంలో నివసిస్తూ, అఖిల శాస్త్రాలను విన్నవాడై, భూమిపై 'విశ్వరూపుడు' అని ఎవరైతే ప్రసిద్ధి చెందారో, ఆయన చరణ రేణువుల కోసం నేను నిత్యం కోరిక (స్పృహ) కలిగి
ఉన్నాను. 'స్పృహేరీప్సితః' అనే వ్యాకరణ సూత్రం ప్రకారం ఇక్కడ సంప్రదాన సంజ్ఞ కలిగింది.
ఓ తండ్రీ! ఆ పాదపద్మ రజస్సును పొందడంలో మీరు సహాయం చేస్తే నా కోరిక సఫలమవుతుంది
అని భావం. [భూభృత్ అని -
దీని ద్వారా ఆయనకు లోకరీత్యా కూడా గొప్ప సంపదలు ఉన్నాయని ధ్వనిస్తోంది.]
శ్లోకం 29
పుత్ర్యా వచః పిబతి కర్ణపుటేన తాతే శ్రీవిశ్వరూపగురుణా
గురుణా ద్విజానామ్ ॥ ఆజగ్మతుః
సువసనౌ విశదాభయష్టీ సంప్రేషితౌ సుతవరోద్వహనక్రియాయై ॥ 29 ॥
తాత్పర్యము: కుమార్తె చెప్పిన మాటలను తండ్రి (విష్ణుమిత్రుడు) చెవులతో ఆసక్తిగా వింటున్న
సమయంలోనే, బ్రాహ్మణులకు
గురువైన విశ్వరూపుని తండ్రి హిమమిత్రునిచే పంపబడిన ఇద్దరు బ్రాహ్మణులు అక్కడకు
చేరుకున్నారు. వారు చక్కని వస్త్రాలు ధరించి, తెల్లని కాంతితో మెరుస్తున్న దండాలను (యష్టి) చేతబూని, కుమారుని వివాహ నిశ్చయ కార్యార్థం వచ్చారు.
వ్యాఖ్య: కుమార్తె మాటలను తండ్రి తన చెవులతో అమృతంలా తాగుతున్న (వినోదిస్తున్న)
సమయంలోనే, బ్రాహ్మణులలో
శ్రేష్ఠుడైన విశ్వరూపుని తండ్రి హిమమిత్రుని చేత తన కుమారుని వివాహ కార్యం కోసం
పంపబడిన వారు అక్కడకు వచ్చారు. వారు స్వచ్ఛమైన కాంతి గల రెండు దండాలను ధరించి
ఉన్నారు. [పుత్రీ అనే పదం
ద్వారానే ఆయన తండ్రి అని తెలిసినా, మరలా 'తాత' (తండ్రి) అని
వాడటం పునరుక్తిలా అనిపించవచ్చు. కానీ,
సతీదేవి తండ్రియైన దక్షప్రజాపతి తన అల్లుడిని ద్వేషించడం వల్ల తండ్రికి
ఉండాల్సిన గుణాలు కోల్పోయినట్లు శాస్త్రాలలో ఉంది. అటువంటి దోషం ఇక్కడ లేదని, ఈయన కుమార్తె కోరికను మన్నించే తండ్రి అని చెప్పడానికి 'తాత' అనే పదం
ఉపయుక్తమైంది.] [కర్ణ అని -
తాగుతున్నాడు అంటే ఆదరంతో వింటున్నాడు అని అర్థం. దీని ద్వారా ఆ మాటలు అమృతం
వంటివని సూచించబడింది.] [సువసనౌ అంటే
తెల్లని వస్త్రాలు, తలపాగా వంటివి
ధరించిన వారు. విశదాభ అని - నిర్మలమైన కాంతి గల దండములు కలవారు.]
శ్లోకం 30
తావర్చ్య స ద్విజవరౌ విహితోపచారై-రాయానకారణమథో శనకైరపృచ్ఛత్
॥ శ్రీవిశ్వరూపగురువాక్యత
ఆగతౌ స్వ ఇత్యూచతుర్వరణకర్మణి కన్యకాయాః ॥ 30 ॥
తాత్పర్యము: ఆ విష్ణుమిత్రుడు శ్రేష్ఠులైన ఆ బ్రాహ్మణులను శాస్త్రోక్తమైన ఉపచారములతో
పూజించి, ఆ తర్వాత
మెల్లగా వారు వచ్చిన కారణాన్ని అడిగాడు. దానికి వారు "మేము శ్రీవిశ్వరూపుని
తండ్రిగారి ఆజ్ఞ మేరకు, మీ కుమార్తెను
వరించు (వివాహ నిశ్చయ) కార్యము నిమిత్తము వచ్చాము" అని చెప్పారు.
వ్యాఖ్య: ఆ విష్ణుమిత్రుడు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠులను ధర్మశాస్త్ర విహితమైన పాద్యము మొదలైన
వాటితో గౌరవించి, ఆ తర్వాత వారు
వచ్చిన కారణాన్ని అడిగాడు. ఐహిక ఆముష్మిక సకల సంపదలు కలిగినవాడు, విశ్వవిఖ్యాత పండితుడైన విశ్వరూపుని తండ్రియునైన
హిమమిత్రుని ఆజ్ఞతో, కన్యావరణం
(వివాహ నిశ్చయం) కోసం వచ్చామని వారు చెప్పారు.
[అథో అని -
అమరకోశం ప్రకారం ఇది మంగళం, అనంతరము మొదలైన
అర్థాలలో వాడబడుతుంది. ఇక్కడ ఆ బ్రాహ్మణులు వచ్చిన తర్వాత అని అర్థం. పూజించి అని
- 'అర్చ్య' అనేది తప్పు పాఠం కావచ్చు, ఎందుకంటే ఉపసర్గ లేని ధాతువుకు 'ల్యాప్' రాదు. అందుకే కాళిదాసు కూడా రఘువంశంలో 'అర్చయిత్వా' అని 'క్త్వా' ప్రత్యయాన్నే
వాడారు.] [శ్రీ అని - సకల
సంపదలు మరియు విద్యాకీర్తి గల విశ్వరూపుని తండ్రి అని భావం. 'నిషేకాది కృద్గురుః' అనే అమరకోశ వాక్యం ప్రకారం తండ్రిని గురువుగా పేర్కొన్నారు.] [వరణ అని - విశ్వరూపుడు మీ కుమార్తె పాణిగ్రహణం చేసేందుకు
ఉద్దేశించిన వివాహ శాస్త్ర విహిత క్రియల గురించి చర్చించేందుకు అని అర్థం.]
శ్లోకం 31
సంప్రేషితౌ శ్రుతవయఃకులవృత్తధర్మైః సాధారణీం శ్రుతవతా
స్వసుతస్య తేన ॥ యాచావహే తవ
సుతాం ద్విజ తస్య హేతో-రన్యోన్యసంఘటనమేతు మణిద్వయం తత్ ॥ 31 ॥
తాత్పర్యము: "శాస్త్ర పాండిత్యము, వయస్సు, కులము, శీలము మరియు ధర్మాచరణలో తన కుమారుడికి సమానమైన యోగ్యత గల మీ
కుమార్తె గురించి విన్న ఆ హిమమిత్రుడు మమ్మల్ని పంపాడు. ఓ బ్రాహ్మణోత్తమా! ఆయన
కుమారుని కోసం మీ కుమార్తెను ఇమ్మని ప్రార్థిస్తున్నాము. ఆ మణిద్వయం (విశ్వరూపుడు
మరియు ఉభయభారతి) పరస్పర అనుసంధానము (వివాహము) పొందుగాక!"
వ్యాఖ్య: శాస్త్ర పరిజ్ఞానము, కులము, నడవడిక మరియు ధర్మములలో తన కుమారుడికి సమానమైన (సాధారణీం)
యోగ్యత గల మీ కుమార్తె గురించి విన్న ఆ హిమమిత్రుడు మమ్మల్ని పంపాడు. ఆయన పక్షాన
మేము మీ కుమార్తెను యాచిస్తున్నాము. ఓ ద్విజుడా! ఆ విశ్వరూప-సరస్వతులనే మణిద్వయం
జగదీశ్వరుని కృపచేత పరస్పర సంబంధాన్ని పొందుగాక!
[తత్ అని - ఆ
విశ్వరూప మరియు సరస్వతి రూపము అని అర్థం. మణి అని - రత్న ద్వయము. అన్యోన్య అని -
పరస్పర సమ్మేళనము పొందుగాక అని అన్వయం. 'తస్య హేతోః' అంటే ఆ కారణము
చేత అని అర్థం. వ్యాకరణ రీత్యా ఇక్కడ నిమిత్త పర్యాయ ప్రయోగంలో షష్ఠీ విభక్తి
వచ్చినది.]
శ్లోకం 32
మహ్యం తదుక్తమభిరోచత ఏవ విప్రౌ పృష్ట్వా వధూం మమ పునః
కరవాణి నిత్యమ్ ॥ కన్యాప్రదానమిదమాయతతే
వధూషు నో చేదమూర్వ్యసనసక్తిషు పీడయేయుః ॥ 32 ॥
తాత్పర్యము: విష్ణుమిత్రుడు ఆ బ్రాహ్మణులతో ఇలా అన్నాడు: "ఓ బ్రాహ్మణులారా! ఆ
హిమమిత్రుడు పంపిన సందేశం నాకు ఎంతో ఇష్టంగానే ఉంది. అయినప్పటికీ, నా భార్యను అడిగి దీనిపై నిర్ణయం తీసుకుంటాను. ఎందుకంటే
కన్యాదాన విషయంలో భార్య అభిప్రాయం ప్రధానమైనది. ఒకవేళ ఆమె అనుమతి లేకుండా చేస్తే, భవిష్యత్తులో ఏవైనా కష్టాలు (వ్యసనములు) వచ్చినప్పుడు ఆమె
నన్ను నిందిస్తుంది."
వ్యాఖ్య: ఆ విధంగా చెప్పబడిన విష్ణుమిత్రుడు ఇలా అన్నాడు- ఓ బ్రాహ్మణులారా! ఆ
హిమమిత్రుడు చెప్పినది నాకు ఇష్టమే, అయినప్పటికీ నా
భార్యను అడిగి ఆమె చెప్పినట్లు చేస్తాను. ఎందుకంటే ఈ కన్యాదానమనేది ఎప్పుడూ
భార్యకు ఆధీనమై ఉంటుంది. ఒకవేళ ఆమె అనుమతి లేకపోతే, దైవవశాత్తు కన్యకు ఏవైనా అశుభాలు (దుఃఖాలు) కలిగినప్పుడు, ఆ శోకంతో ఆమె భర్తను పీడించే అవకాశం ఉంటుంది.
[ఆయతతే అంటే
అంతటా ప్రయత్నం వ్యాపించి ఉండటం అని అర్థం. కన్యాదాన విషయంలో సరైన వరుని వెతకడం
వంటి ప్రయత్నాలన్నీ ప్రధానంగా భార్యకు సంబంధించినవే అని భావం. వ్యసన అని- 'వ్యసనం అంటే అశుభం' అని మేదిని కోశం చెబుతోంది. అశుభం కలిగినప్పుడు ప్రేమ అతిశయం వల్ల కలిగే
శోకంతో వారు పీడిస్తారు అని అన్వయం.]
శ్లోకం 33
భార్యామపృచ్ఛదథ కిం కరవావ భద్రే విప్రౌ వరీతుమనసౌ ఖలు
రాజగేహాత్ ॥ ఏతాం సుతీం
సుతనిభాం తవ యా౽స్తి కన్యా బ్రూహి త్వమేకమనుమాయ పునర్న వాచ్యమ్ ॥ 33 ॥
తాత్పర్యము: ఆ తర్వాత విష్ణుమిత్రుడు తన భార్యను ఇలా అడిగాడు: "ఓ భద్రే! నీకు
పుత్రునితో సమానమైన ఈ కుమార్తెను వరించడానికి రాజభవనం (కాశ్మీర రాజ నివాసం) నుండి
ఈ బ్రాహ్మణులు వచ్చారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నీవు సాధ్యాసాధ్యాలను ఆలోచించి నీ నిర్ణయం చెప్పు. ఎందుకంటే ఒక్కసారి ఇస్తానని
చెప్పిన తర్వాత తిరిగి వెనక్కు తీసుకోకూడదు కదా!"
వ్యాఖ్య: అటుపిమ్మట భార్యను అడిగారు- ఓ భద్రే! నీకు పుత్రునితో సమానమైన కుమార్తెను
వరించాలనే కోరికతో రాజభవనం నుండి వీరు వచ్చారు. ఇక్కడ మనం ఏం చేద్దాం? ఇవ్వాలా వద్దా? కాబట్టి నీవు
రెండు పక్షాలను (ఇవ్వడం, ఇవ్వకపోవడం)
చక్కగా ఆలోచించి చెప్పు. ఎందుకంటే 'కన్యను
ఒక్కసారే దానం చేస్తారు' అనే స్మృతి
వాక్యం ప్రకారం, ఒకసారి
ఇస్తామని చెప్పి మళ్ళీ మార్చుకోకూడదు.
[ఓ భద్రే అంటే
మంగళ స్వరూపిణి అని అర్థం. దీని ద్వారా ధర్మాది మంగళ కార్యాలు ఆమెపైనే ఆధారపడి
ఉన్నాయని సూచించబడింది. రాజగేహాత్ అంటే కాశ్మీర రాజు గారి నివాసం నుండి అని అర్థం.
దీని ద్వారా వారికి లోకరీత్యా ఉన్న సంపద వ్యక్తమవుతోంది.]
శ్లోకం 34
దూరే స్థితిః శ్రుతవయఃకులవృత్తజాతమ్ న జ్ఞాయతే తదపి కిం
ప్రవదామి తుభ్యమ్ ॥ విత్తాన్వితాయ
కులవృత్తసమన్వితాయ దేయా సుతేతి విదితం శ్రుతిలోకయోశ్చ ॥ 34 ॥
తాత్పర్యము: విష్ణుమిత్రుని భార్య ఇలా అన్నది: "మొదటి విషయం- వారు చాలా దూరంలో
ఉన్నారు. వారి విద్యాబుద్ధులు, వయస్సు, కులగోత్రాలు, శీలము వంటి
వివరాలేవీ మనకు ప్రత్యక్షంగా తెలియవు. అలాంటప్పుడు నేనేమని చెప్పగలను? అయితే, సంపద కలిగి
ఉండి, ఉత్తమ
కులశీలములు కలవానికే కుమార్తెను ఇవ్వాలనేది వేదాలలోనూ, లోకంలోనూ ప్రసిద్ధమైన విషయమే."
వ్యాఖ్య: భార్య ఇలా సమాధానమిచ్చింది- మొదటిగా ఆ ప్రదేశం చాలా దూరంలో ఉంది. అలాగే మనం
తెలుసుకోవలసిన వారి విద్య, వయస్సు, కులం, నడవడిక వంటి
విషయాలేవీ మనకు (ప్రత్యక్షంగా) తెలియవు. కాబట్టి నేను నీకు ఏమి చెప్పగలను? అయితే ధనవంతుడై,
ఉత్తమ కులము, చదువు, శీలము మరియు వృత్తి కలిగిన వానికే కన్యను ఇవ్వాలనేది
వేదాలలోనూ, లోకంలోనూ
తెలిసిన విషయమే.
శ్లోకం 35
నైవం నియన్తుమనఘే తవ శక్యమేత-త్తాం రుక్మిణీం యదుకులాయ
కుశస్థలీశే ॥ ప్రాదాత్స
భీష్మకనృపః ఖలు కుణ్డినేశ-స్తీర్థాపదేశమటతే త్వపరీక్షితాయ ॥ 35 ॥
తాత్పర్యము: విష్ణుమిత్రుడు తన భార్యతో ఇలా అన్నాడు: "ఓ పుణ్యవతీ! 'పరీక్షించకుండా కన్యను ఇవ్వకూడదు' అని నీవు నియమం పెట్టడం సరికాదు. పూర్వం కుండిన నగర
ప్రభువైన భీష్మక మహారాజు, తీర్థయాత్రల
నెపంతో తిరుగుతున్నవాడు, తాను స్వయంగా
పరీక్షించనివాడు మరియు ద్వారకాధీశుడు అయిన శ్రీకృష్ణుడికి తన కుమార్తె రుక్మిణిని
ఇచ్చి వివాహం చేయలేదా?"
వ్యాఖ్య: భార్య మాటలు విన్న విష్ణుమిత్రుడు ఇలా అన్నాడు- ఓ పాపరహితమైనదానా (అనఘే)! నీవు
చెప్పిన ఈ నియమం పాటించడం సాధ్యం కాదు. ఎందుకంటే యదువంశీయుడు, ద్వారకాధీశుడు (కుశస్థలీశుడు) అయిన శ్రీకృష్ణుడికి, కుండిన నగర రాజైన భీష్మకుడు తన కుమార్తె రుక్మిణిని
ఇచ్చాడు. అప్పుడు ఆ కృష్ణుడు తీర్థయాత్రల నెపంతో తిరుగుతున్నాడు, భీష్మకుడు ఆయన్ను స్వయంగా పరీక్షించలేదు. కాబట్టి
లోకప్రసిద్ధుడైన వరుడికి పరీక్షించకుండానే కన్యను ఇవ్వవచ్చునని భావం.
[ఓ అనఘే అంటే
కాయిక, వాచికాది సకల
దోషాలు లేని ప్రియురాలా అని అర్థం. భీష్మక అని - భీష్మక అనే పేరు గల రాజు అని
అర్థం. యదుకుల అని - యదువంశానికి చెందినవాడు. తీర్థ అని - లోపల రుక్మిణి పంపిన
పత్రిక (లేఖ) వల్ల అత్యంత ఉత్సాహం ఉన్నప్పటికీ, బయటకు మాత్రం తీర్థయాత్రల మిషతో రథంపై తిరుగుతున్న శ్రీకృష్ణుడికి అని అర్థం.]
శ్లోకం 36
కిం కేన సంగతమిదం సతి మా విచారీ-ర్యో వైదికీం సరణిమప్రహర్తా
ప్రయత్నాత్ ॥ ప్రాతిష్ఠిపత్సుగతదుర్జయనిర్జయేన
శిష్యం యమేనమశిషత్స చ భట్టపాదః ॥ 36 ॥
తాత్పర్యము: "ఓ సాధ్వీ! ఏది దేనితో సమానమని నీవు విచారించవద్దు
(శ్రీకృష్ణుడితో ఈ వరుడికి పోలిక ఏమని తలచవద్దు). ఎందుకంటే, జయించడానికి వీలుకాని బౌద్ధులను (సుగతులను) ఓడించి, వైదిక మార్గాన్ని ఎంతో ప్రయత్నంతో తిరిగి ప్రతిష్ఠించిన
కుమారిల భట్టపాదుల వారే స్వయంగా ఈ విశ్వరూపుడిని తన శిష్యుడిగా స్వీకరించి
విద్యాబోధన చేశారు."
వ్యాఖ్య: శ్రీకృష్ణుడు పరమేశ్వరుడు, ఈ విశ్వరూపుడు
సామాన్య మానవుడు కదా, వీరిద్దరికీ
పోలిక ఏమిటి? అని
శంకించవద్దు. ఓ పతివ్రతా (సతి)! ఏది దేనితో సాటి అని ఆలోచించకు. ఎందుకంటే వైదిక
మార్గాన్ని పాడుకాకుండా నిలిపి, జయించలేని
బౌద్ధులను జయించడం ద్వారా ధర్మాన్ని ప్రతిష్ఠించిన కుమారిల భట్టపాదుల వారు, ఎవరిని తన శిష్యునిగా చేసుకున్నారో ఆ విశ్వరూపుడు
సామాన్యుడు కాడు.
[వైదిక సరణి
అంటే వేద మార్గం. సుగత అంటే బౌద్ధులు. వారిని నిర్జయించడం (ఓడించడం) ద్వారా వైదిక
ధర్మాన్ని నిలబెట్టిన భట్టపాదుల శిష్యుడు ఈ విశ్వరూపుడు. అటువంటి గురువు వద్ద
విద్యనభ్యసించిన వాడు కాబట్టి ఈయన యోగ్యతను శంకించనవసరం లేదు.]
శ్లోకం 37
కిం వర్ణ్యతే సుదతి యో మవితా వరో నో విద్యా ధనం ద్విజవరస్య
న బాహ్యవిత్తమ్ ॥ యా౽న్వేతి
సంతతమనంతదిగంతభాజం యాం రాజచోరవనితా నచ హర్తుమీశాః ॥ 37 ॥
తాత్పర్యము: విష్ణుమిత్రుడు తన భార్యతో ఇలా అంటున్నాడు: "ఓ చక్కని పండ్లు గలదానా
(సుదతీ)! మనకు వరుడు కాబోయే ఆ విశ్వరూపుని గురించి ఎంతని వర్ణించగలను? బ్రాహ్మణ శ్రేష్ఠులకు విద్యా ధనమే అసలైన సంపద, బయట కనిపించే ధనం కాదు. ఆ విద్య అనేది దిగంతాలకు
వెళ్ళినప్పుడూ నిరంతరం మనిషిని అనుసరించి ఉంటుంది. ఆ విద్యా ధనాన్ని రాజులు గానీ, దొంగలు గానీ, వనితలు గానీ
అపహరించలేరు."
వ్యాఖ్య: మనకు వరుడు కాబోయే ఆ విశ్వరూపుని గురించి వర్ణించడం అసాధ్యం. విద్వాంసుడైన
విశ్వరూపుని ఉత్కృష్టతను తెలపడానికి విద్య యొక్క గొప్పతనాన్ని నిరూపిస్తున్నారు.
బ్రాహ్మణుడికి విద్యయే ధనం, బాహ్యమైన సంపద
కాదు. ఎందుకంటే విద్య అనేది అనంతమైన దిగంతాల వరకు నిరంతరం అనుసరించి వస్తుంది.
రాజులు, దొంగలు, వనితలు దీనిని దొంగిలించడానికి సమర్థులు కారు.
[ఓ సుదతీ అని
సంబోధించడం ద్వారా - కేవలం విద్యను మాత్రమే ప్రశంసించడం చూసి ఆమెకు కలిగిన సందేహం
వల్ల వచ్చిన చిరునవ్వు సూచించబడుతోంది. 'అనంత...' అంటే
అసంఖ్యాకమైన ప్రదేశాలకు వెళ్ళిన పురుషుడిని కూడా విద్య అనుసరిస్తుంది అని అర్థం.
ఇక్కడ వనిత అంటే వేశ్య అని భావం, ఎందుకంటే ఆమెయే
విత్తాన్ని హరిస్తుంది. కానీ విద్యను వారు కూడా ఏమీ చేయలేరు. దీనివల్ల రాజులు
అపహరించుకుపోయే సామాన్య ధనం కంటే విద్య గొప్పదని వ్యక్తమవుతోంది. ఇక్కడ 'ప్రతీప' విశేషాలంకారం
లేదా 'పర్యస్తాహ్నుతి' అలంకారం ధ్వనిస్తోంది.]
శ్లోకం 38
వైధ్యర్జనావనపరివ్యయగాని తాని విత్తాని చిత్తమనిశం
పరిఖేదయంతి ॥ చోరనృపాత్స్వజనతశ్చ
భయం ధనానాం శర్మేతి జాతు న గుణః ఖలు బాలిశస్య ॥ 38 ॥
తాత్పర్యము: "లోకంలో ధనాన్ని సంపాదించడం, దానిని కాపాడుకోవడం, ఖర్చు చేయడం
వంటివన్నీ మనస్సుకు నిరంతరం దుఃఖాన్ని కలిగించేవే. ధనం ఉన్నవారికి దొంగల వల్ల, రాజుల వల్ల, స్వజనుల
(బంధువుల) వల్ల ఎప్పుడూ భయమే ఉంటుంది. ధనం వల్ల సుఖం కలుగుతుందనుకోవడం కేవలం
మూర్ఖుడి లక్షణం."
వ్యాఖ్య: ధనాన్ని సంపాదించడం, దానిని
రక్షించడం, అది ఖర్చైపోవడం
వంటి వాటి వల్ల లోకప్రసిద్ధమైన సంపదలు చిత్తాన్ని ఎప్పుడూ పరిఖేదానికి (దుఃఖానికి)
గురిచేస్తాయి. దొంగల నుండి, రాజుల నుండి, తమ బంధువుల నుండి ధనము కలవారికి భయం ఉంటుంది. ధనం వల్ల సుఖం
కలుగుతుందనే గుణం కేవలం అజ్ఞానికే (బాలిశస్య) ఉంటుంది.
[ఈ విధంగా బాహ్య
సంపద కంటే విశ్వరూపుని వద్ద ఉన్న విద్యా సంపద మిన్న అని తండ్రి తన భార్యకు
విడమరిచి చెప్పాడు.]
శ్లోకం 39
కేచిద్ధనం నిదధతే భువి నోపభోగం కుర్వంతి లోభవశగా న విదంతి
కేచిత్ ౽ అన్యేన
గోపితమథాన్యజనా హరంతి తచ్చేన్నదీపరిసరే జలమేవ హర్తృ ॥ 39 ॥
తాత్పర్యము: కొందరు లోభత్వానికి లొంగిపోయి ధనాన్ని భూమిలో పాతిపెడతారు కానీ అనుభవించరు.
మరికొందరు తాము పాతిపెట్టిన ధనం ఎక్కడుందో కూడా మర్చిపోతారు. ఒకరు దాచిన ధనాన్ని
ఇతరులు దొంగిలిస్తారు. ఒకవేళ ఆ ధనాన్ని నదీ తీరంలో దాచిపెడితే, నదీ జలాలే దానిని ప్రవాహంలో కొట్టుకుపోయేలా చేస్తాయి
(హరిస్తాయి).
వ్యాఖ్య: మరియు కొందరు లోభానికి వశమై ధనాన్ని భూమిలో ఉంచుతారు కానీ అనుభవించరు.
కొందరైతే భూమిలో దాచిన ధనాన్ని అనుభవించాలనుకున్న సమయంలో అది ఎక్కడుందో
తెలుసుకోలేరు (లభించదు). ఇంకా ఒకరు దాచిన ధనాన్ని మరొకరు అపహరిస్తారు. ఒకవేళ ఆ ధనం
నది ఒడ్డున దాచబడితే, జలమే దానిని
హరిస్తుంది. కాబట్టి అనేక దుఃఖాలతో కూడిన బాహ్య సంపద కంటే విద్యా ధనమే
శ్రేష్ఠమైనది అని భావం.
శ్లోకం 40
సర్వాత్మనా దుహితరో న గృహే విధేయా-స్తాశ్చేత్పురా
పరిణయాద్రజ ఉద్గతం స్యాత్ ౽ పశ్యేయురాత్మపితరౌ
బత పాతయంతి దుఃఖేషు ఘోరనరకేష్వితి ధర్మశాస్త్రమ్ ॥ 40 ॥
తాత్పర్యము: కుమార్తెలను ఎల్లకాలం ఇంట్లోనే ఉంచుకోకూడదు (తగిన వయస్సులో వివాహం చేయాలి).
ఒకవేళ వివాహం కాకముందే వారు రజస్వల అయితే, ఆ పాపం వల్ల వారు తమ తండ్రులను ఘోరమైన నరక దుఃఖాలలో పడవేస్తారని ధర్మశాస్త్రం
చెబుతోంది.
వ్యాఖ్య: మరియు ఏ రకంగానూ కుమార్తెలను (వివాహం చేయకుండా) ఇంట్లోనే ఉంచకూడదు. ఒకవేళ అలా
ఉంచితే కలిగే దోషాన్ని చెబుతున్నారు - ఆ కుమార్తెలు వివాహానికి ముందే తమలో కలిగిన
రజస్సును చూస్తే (రజస్వల అయితే), అప్పుడు తమ
తండ్రులను దుఃఖమయమైన ఘోర నరకాల్లో పడవేస్తారని ధర్మశాస్త్రం చెబుతోంది. ఈ విధంగా
చెప్పబడింది - "తండ్రి ఇంట్లో ఉండగానే ఏ కన్య అయితే సంస్కారం (వివాహం)
కాకుండా రజస్వల అవుతుందో, ఆ తండ్రి
భ్రూణహత్యా పాపాన్ని పొందుతాడు, ఆ కన్య వృషలి
(శూద్రురాలు) అవుతుంది".
శ్లోకం 41
మా భూదయం మమ సుతా కలహః కుమారీం పృచ్ఛావ సా వదతి యం భవితా
వరో౽స్యాః ౽ ఏవం విధాయ సమయం
పితరౌ కుమార్యా అభ్యాశమీయతురితో గదితేష్టకార్యౌ ॥ 41 ॥
తాత్పర్యము: "మన మధ్య ఈ విషయంలో కలహం వద్దు. మన కుమార్తెనే అడుగుదాం. ఆమె
ఎవరిని కోరుకుంటుందో ఆయనే ఆమెకు వరుడు అవుతాడు" అని ఒక నిర్ణయానికి వచ్చి, తమ కుమార్తె వద్దకు వెళ్లి తాము అనుకున్న కార్యం గురించి
ఆమెకు వివరించారు.
వ్యాఖ్య: నాతో నీకు కలహం వద్దు. మన కుమార్తెను అడుగుదాం. నా కుమార్తె ఎవరిని చెబుతుందో
అతడే ఆమెకు వరుడు అవుతాడు - అని ఇలా ఒక సంకేతాన్ని (నిర్ణయాన్ని) చేసుకుని, తల్లిదండ్రులు ఆ ప్రదేశం నుండి కుమార్తె సమీపానికి
వెళ్లారు. వారు తాము అనుకున్న ఇష్టమైన కార్యం గురించి ఆమెతో చెప్పారు. [సమయము అంటే ప్రతిజ్ఞ. మేదిని కోశం ప్రకారం - సమయము అంటే
శపథము, ఆచారము, సిద్ధాంతము, సంకేతము, కాలము మరియు నియమము అనే అర్థాలు ఉన్నాయి.]
శ్లోకం 42
శ్రీవిశ్వరూపగురుణా ప్రహితౌ ద్విజాతీ కన్యార్థినౌ సుతను కిం
కరవావ వాచ్యమ్ ౽ తస్యాః
ప్రమోదనిచయో న మమౌ శరీరే రోమాంచపురమిషతో బహిరుజ్జగామ ॥ 42 ॥
తాత్పర్యము: "ఓ సుందరీ! (సుతనూ!) శ్రీవిశ్వరూపుని తండ్రిగారు తన కుమారుని
కోసం నిన్ను కోరుతూ ఇద్దరు బ్రాహ్మణులను పంపారు. ఇప్పుడు మనం ఏం చేద్దామో నీవే
చెప్పు" అని తండ్రి అడిగాడు. ఆ మాట వినగానే ఆమె శరీరంలో కలిగిన అమితమైన
సంతోషం పట్టలేక, గగుర్పాటు
(రోమాంచము) అనే నెపంతో శరీరం నుండి బయటకు వచ్చినట్లుగా కనిపించింది.
వ్యాఖ్య: వెళ్లి వారు ఏమి చెప్పారో ఇక్కడ చూపిస్తున్నారు- శ్రీవిశ్వరూపుని తండ్రియైన
హిమమిత్రుని చేత కన్యను కోరుతూ పంపబడిన ఇద్దరు బ్రాహ్మణులు వచ్చారు. ఓ చక్కని
శరీరం కలదానా! మేము ఏమి చేయాలో నీవే చెప్పాలి అని అర్థం. ఈ విధంగా తనకిష్టమైన
వార్తను విన్న ఆమె శరీరంలో సంతోష సముదాయం ఇమడలేకపోయింది, కానీ రోమాంచము (గగుర్పాటు) అనే వ్యాజముతో (నెపంతో) బయటకు
వచ్చింది.
[ఇక్కడ శ్రీ అనే
శబ్దముతో ఐహిక, ఆముష్మిక సకల
సంపదలు సూచించబడ్డాయి. ద్విజాతీ అంటే ఇద్దరు బ్రాహ్మణులు. ఇక్కడ 'రోమాంచ...' అనే చోట
కైతవాపహ్నుతి అలంకారం కంటే, విశ్వరూప
పండితుడనే ఆలంబనము, తండ్రి చెప్పిన
బ్రాహ్మణుల రాక అనే ఉద్దీపనము, రోమాంచమనే
అనుభావము, ప్రమోదమనే
సంచారీ భావములతో పరిపుష్టమైన రతి అనే స్థాయి భావమే శృంగార రసంగా ప్రధానంగా
ధ్వనిస్తోంది. అలంకార లక్షణం కువలయానందంలో ఇలా చెప్పబడింది- నెపం (వ్యాజం) మొదలైన
వాటితో నిజాన్ని దాచి మరొకటి చెప్పడం కైతవాపహ్నుతి. ఉదాహరణకు: ఇవి మన్మథ బాణాలు
కావు, కాంత యొక్క
కడగంటి చూపులు అనే నెపంతో బయటకు వస్తున్నాయి.]
శ్లోకం 43
తేనైవ సా ప్రతివచః ప్రదదౌ పితృభ్యాం తేనైవ తావపి
తయోర్యుగలాయ సత్యమ్ ౽ ఆదాయ విప్రమపరం
పితృగేహతో౽స్యా-స్తౌ జగ్మతుర్ద్విజవరౌ స్వనికేతనాయ ॥ 43 ॥
తాత్పర్యము: గగుర్పాటు రూపంలో బయటకు వచ్చిన ఆ సంతోషం ద్వారానే ఆమె తన తల్లిదండ్రులకు
సమాధానం ఇచ్చింది. తల్లిదండ్రులు కూడా అదే సంతోషం ద్వారా ఆ ఇద్దరు బ్రాహ్మణులకు తమ
అంగీకారాన్ని (సత్యం) తెలిపారు. ఆ తర్వాత ఆమె (సరస్వతి) తండ్రి ఇంటి నుండి మరొక
బ్రాహ్మణుడిని తోడుగా తీసుకుని, ఆ ఇద్దరు
బ్రాహ్మణ శ్రేష్ఠులు తమ నివాసానికి బయలుదేరారు.
వ్యాఖ్య: రోమాంచము అనే నెపంతో బయటకు వచ్చిన ఆ సంతోషము ద్వారానే ఉభయభారతి తన తల్లికి, తండ్రికి ప్రత్యుత్తరాన్ని ఇచ్చింది. తల్లిదండ్రులు కూడా
అదే రోమాంచము అనే నెపంతో బయటకు వచ్చిన సంతోషముతో ఆ బ్రాహ్మణ ద్వయానికి ఆ జంట
(విశ్వరూప-సరస్వతుల) వివాహం గురించి నిశ్చయమైన (సత్యం) ప్రత్యుత్తరాన్ని ఇచ్చారు.
ఆ తర్వాత ఆమె తండ్రి ఇంటి నుండి వేరొక బ్రాహ్మణుడిని వెంటబెట్టుకుని, ఆ ఇద్దరు బ్రాహ్మణులు తమ ఇంటికి వెళ్లారు.
[తయోః అంటే
సరస్వతి మరియు విశ్వరూపుల అని అర్థం. యుగలాయ అంటే ఆ జంట యొక్క దాంపత్యం కోసం అని
అర్థం. 'సత్యం' అంటే నిశ్చయం చేశారని అన్వయించుకోవాలి. అటుపిమ్మట ఏమి
జరిగింది అంటే- అస్యాః అంటే ఈ సరస్వతి యొక్క అని అర్థం. తౌ అంటే విశ్వరూపుని
తండ్రి పంపిన ఆ ఇద్దరు అని భావం.]
శ్లోకం 44
అస్మాచ్చతుర్దశదినే భవితా దశమ్యాం యామిత్రమాదిశుభయోగయుతో
ముహూర్తః ॥ ఏవం విలిఖ్య
గణితాదిషు కౌశలాస్యా వ్యాఖ్యాపరాయ దిశతి స్మ సరస్వతీ సా ॥ 44 ॥
తాత్పర్యము: గణిత శాస్త్రంలో ఆరితేరిన సరస్వతీ దేవి (ఉభయభారతి) "ఈ రోజు నుండి
పద్నాలుగవ రోజున, దశమి తిథి నాడు, యామిత్ర నక్షత్ర శుభయోగములతో కూడిన ముహూర్తం ఉన్నది"
అని స్వయంగా లగ్న పత్రికను రాసింది. ఆ పత్రికను తన తండ్రి పంపే బ్రాహ్మణుడికి
(వివరాలు వివరించడానికి) అందజేసింది.
వ్యాఖ్య: గణిత శాస్త్రంలో నైపుణ్యం (కౌశలం) తన ముఖంలోనే (వాక్కులోనే) కలిగి ఉన్న ఆ
సరస్వతి, ప్రస్తుతమున్న
రోజు నుండి పద్నాలుగవ రోజున, దశమి తిథి నాడు, లగ్న నక్షత్రం నుండి పద్నాలుగవదైన 'యామిత్ర' నక్షత్రం
(చంద్రుడి నుండి ఏడవ స్థానం) లో శుభగ్రహాల యోగంతో కూడిన ముహూర్తం ఉంటుందని
రాసింది. ఆ లగ్న పత్రికను తన తండ్రి పక్షాన వెళ్లే బ్రాహ్మణుడికి లగ్న నిశ్చయ
వివరణ కోసం అందజేసింది.
[కౌశలాస్యా అని
- గణిత జ్యోతిష విషయాల చాతుర్యం ఆమె ముఖంలోనే ఉంది. దీని ద్వారా ఆమెకు లెక్కింపులు
చేయడానికి ఎలాంటి శ్రమ అవసరం లేదని ధ్వనిస్తోంది.]
శ్లోకం 45
తౌ హృష్టపుష్టమనసౌ విహితేష్టకార్యౌ
శ్రీవిశ్వరూపగురుముత్తమమీక్షిషాతాం ॥ సిద్ధం సమీహితమితి ప్రథితానుభావో దృష్ట్వైవ తన్ముఖమసావథ నిశ్చికాయ ॥ 45 ॥
తాత్పర్యము: తాము అనుకున్న కార్యం నెరవేరడంతో ఎంతో సంతోషంగా ఉన్న ఆ ఇద్దరు బ్రాహ్మణులు, ఉత్తముడైన విశ్వరూపుని తండ్రి హిమమిత్రుని వద్దకు
చేరుకున్నారు. గొప్ప ప్రభావం గల ఆ హిమమిత్రుడు వారి ముఖాలను చూడగానే, తాను కోరుకున్న కార్యం సిద్ధించిందని నిశ్చయించుకున్నాడు.
వ్యాఖ్య: ఇష్టకార్యం నెరవేరినందున సంతోషంతో ఉన్న మనస్సు గల ఆ ఇద్దరు విప్రులు ఉత్తముడైన
విశ్వరూపుని తండ్రిని దర్శించారు. అటుపిమ్మట ప్రసిద్ధమైన ప్రభావం గల ఆ హిమమిత్రుడు
వారి ముఖములను చూడగానే తన కోరిక నెరవేరిందని నిశ్చయించుకున్నాడు.
[ఉత్తమము అంటే
ఆయన ఎంతో ప్రసన్నంగా ఉన్నాడని అర్థం.]
శ్లోకం 46
అన్యః స్వహస్తగతపత్రమదాత్స పత్రం దృష్ట్వా జహాస సుఖవారానిధౌ
మమజ్జ ॥ విప్రాన్యథోచితమపూపూజదాగతాంస్తా-న్నత్వా౽ంశుకాదిభిరథం
బహువిత్తలభ్యైః ॥ 46 ॥
తాత్పర్యము: ఆ ఇద్దరితో పాటు వచ్చిన విష్ణుమిత్రుని (సరస్వతి తండ్రి) బ్రాహ్మణుడు తన
చేతిలోని లగ్న పత్రికను అందించాడు. హిమమిత్రుడు ఆ పత్రికను చూసి సంతోషంతో నవ్వుతూ
ఆనంద సముద్రంలో మునిగిపోయాడు. వచ్చిన బ్రాహ్మణులందరికీ నమస్కరించి, ఎంతో విలువైన వస్త్రాలు, రత్నాభరణాలతో వారిని యథావిధిగా గౌరవించాడు.
వ్యాఖ్య: ఆ ఇద్దరు కాక విష్ణుమిత్రుడు పంపిన మూడవ బ్రాహ్మణుడు తన చేతిలోని పత్రికను
అందించాడు. హిమమిత్రుడు ఆ పత్రికను చూసి నవ్వుతూ సుఖ సముద్రంలో మునిగిపోయాడు.
వచ్చిన బ్రాహ్మణులకు నమస్కరించి, ఎంతో ధనంతో
లభించే రత్న వస్త్రాదులతో వారిని యోగ్యతకు తగినట్లుగా పూజించాడు.
[అన్యః అంటే
ఇచ్చినవాడు అని అర్థం. అతడు లగ్న పత్రికను సమర్పించాడు.]
శ్లోకం 47
పిత్రా౽నుశిష్టవసుధాసురశంసితేన విజ్ఞాపితః సుఖమవాప స
విశ్వరూపః ॥ కార్యాణ్యథా౽౽హ
పృథగాత్మజనాన్సమేతా-న్బంధుప్రియః పరిణయోచితసాధనాయ ॥ 47 ॥
తాత్పర్యము: తండ్రి పంపిన బ్రాహ్మణులు తెచ్చిన శుభవార్తను (లగ్న నిశ్చయాన్ని) తండ్రి
ద్వారా విన్న విశ్వరూపుడు అమితానందాన్ని పొందాడు. బంధువుల పట్ల ప్రేమ గల ఆయన, వివాహానికి కావలసిన వస్తువులను, ఏర్పాట్లను సమకూర్చుకోవడానికి తన వారిని (సేవకులను, బంధువులను) పిలిచి ఎవరికి ఏ పని అప్పగించాలో ఆ పనులను
వేర్వేరుగా ఆదేశించాడు.
వ్యాఖ్య: తండ్రి ద్వారా విషయమంతా తెలుసుకున్న విశ్వరూపుడు సుఖాన్ని పొందాడు. అటుపిమ్మట
వివాహానికి తగిన సాధనాలను సమకూర్చుకోవడానికి, వచ్చిన బంధువులకు వారి వారి యోగ్యతను బట్టి పనులను అప్పగించాడు.
శ్లోకం 48
మౌహూర్తికైర్బహుభిరేత్య ముహూర్తకాలే సందర్శితే
ద్విజవరైర్బహువిద్భిరిష్టైః ॥ మాంగల్యవస్తుసహితో౽ఖిలభూషణాఢ్యః
స ప్రాప క్షతతనుః పృథుశోణతీరమ్ ॥ 48 ॥
తాత్పర్యము: జ్యోతిష శాస్త్ర పండితులైన అనేకమంది బ్రాహ్మణులు వచ్చి శుభ ముహూర్తాన్ని
నిర్ణయించి చెప్పగా, విశ్వరూపుడు
మంగళ ద్రవ్యములతో, సకల ఆభరణములతో
అలంకరించుకుని, ఆరోగ్యవంతమైన
శరీరంతో (అక్షత తనుః) విశాలమైన శోణ నదీ తీరానికి (కన్యాదాత ఇంటికి) చేరుకున్నాడు.
వ్యాఖ్య: ముహూర్త శాస్త్రం తెలిసిన విద్వాంసులు నిర్ణయించిన సమయానికి, పెరుగు, దూర్వాలు
(గరికపోచలు) వంటి మంగళ వస్తువులతో కూడి, సకల ఆభరణములను ధరించి విశ్వరూపుడు శోణ తీరానికి వెళ్ళాడు. [క్షతతనుః అంటే ఎటువంటి అనారోగ్యం లేని దృఢమైన దేహము కలవాడని
అర్థం.]
శ్లోకం 49
శోణస్య తీరముపయాతముపాశృణోత్స జామాతరం బహువిధం కిల
విష్ణుమిత్రః ॥ ప్రత్యుజ్జగామ
ముముదే ప్రియదర్శనేన ప్రావీవిశద్గృహమముం బహువాద్యఘోషైః ॥ 49 ॥
తాత్పర్యము: తన అల్లుడు (విశ్వరూపుడు) అనేక పరివారంతో శోణ తీరానికి చేరుకున్నాడని విన్న
విష్ణుమిత్రుడు, వెంటనే
ఎదురువెళ్లి ఆయనను ఆహ్వానించాడు. తనకిష్టమైన వరుని చూడగానే ఆయన ఎంతో సంతోషించాడు.
అనేక వాద్యఘోషల మధ్య అల్లుడిని తన ఇంటికి తీసుకువచ్చాడు.
వ్యాఖ్య: అల్లుడు వచ్చాడని విన్న విష్ణుమిత్రుడు ఎదురువెళ్లి, ప్రియమైన అల్లుడి దర్శనంతో ఆనందాన్ని పొంది, మంగళ వాయిద్యాలతో ఆయనను గృహ ప్రవేశం చేయించాడు. [ప్రియదర్శనేన అంటే తాను కోరుకున్న సద్గుణములు గల వరుని
చూడటం వల్ల కలిగిన ఆనందం అని అర్థం.]
శ్లోకం 50
దత్త్వా౽౽సనం మృదు వచః సముదీర్య తస్మై పాద్యం దదౌ
సమధుపర్కమనేర్ఘపాత్రే ॥ అర్ఘ్యం
దదావహమియం తనయా గృహాస్తే గావో హిరణ్యమఖిలం భవదీయమూచే ॥ 50 ॥
తాత్పర్యము: విశ్వరూపుడికి ఆసనాన్ని ఇచ్చి, మృదువైన మాటలతో
పలకరించి, వెలకట్టలేని
పాత్రలలో పాద్యమును, మధుపర్కమును, అర్ఘ్యమును సమర్పించాడు. "నేను, నా ఈ కుమార్తె, ఈ ఇల్లు, గోవులు, సంపద అంతా ఇకపై
నీవే" అని అత్యంత భక్తితో పలికాడు.
వ్యాఖ్య: ఆసనం ఇచ్చి, మధురంగా
సంభాషించి, అమూల్యమైన
పాత్రలో మధుపర్కముతో కూడిన పాద్యమును ఇచ్చాడు. "నేను, నా కుమార్తె, ఈ గృహము, గోవులు, హిరణ్యము
(బంగారము) - సమస్తము నీవే" అని విష్ణుమిత్రుడు సమర్పించుకున్నాడు.
శ్లోకం 51
అస్మాకమద్య పవిత్రం కులమాహృతాః స్మః సందర్శనం
పరిణయవ్యపదేశతో౽భూత్ ॥ నో
చేద్భవాన్బహువిదగ్రసరః క చాహం భద్రేణ భద్రముపయాతి పుమాన్విపాకాత్ ॥ 51 ॥
తాత్పర్యము: విష్ణుమిత్రుడు అంటున్నాడు: "ఈ రోజు మా కులము పవిత్రమైనది, మేము ధన్యులమయ్యాము. వివాహం అనే నెపంతో మీ వంటి వారి దర్శనం
కలిగింది. లేకపోతే, సకల శాస్త్ర
కోవిదులలో అగ్రగణ్యులైన మీరు ఎక్కడ? అల్పుడనైన నేను
ఎక్కడ? పుణ్యకర్మల
పరిపాకం వల్లనే మనిషికి ఇటువంటి శుభకరమైన సంఘటనలు (శ్రేయస్సు) కలుగుతాయి."
వ్యాఖ్య: నేడు మా వంశం పునీతమైంది. వివాహ వ్యాజము (నెపం) వల్ల మీ దర్శనం దొరికింది.
లేదంటే, బహుజ్ఞులలో
(పండితులలో) శ్రేష్ఠులైన మీరు ఎక్కడ, నేను ఎక్కడ? అయినా సరే, పూర్వపుణ్యం
వల్ల మనిషికి ఇటువంటి కళ్యాణప్రదమైన యోగం పడుతుంది.
శ్లోకం 52
యద్యద్గృహే౽త్ర భగవన్నిహ రోచతే తే తత్తన్నివేద్యమఖిలం
భవదీయమేతత్ ॥ వక్ష్యామి
సర్వమభిలాషపదం త్వదీయం యుక్తం హి సంతతముపాసితవృద్ధపూగే ॥ 52 ॥
తాత్పర్యము: విష్ణుమిత్రుడు ఇంకా ఇలా అన్నాడు: "ఓ మహానుభావా! ఈ ఇంట్లో మీకు ఏది
ఇష్టమో అదంతా మీదే అని భావించి నివేదించండి." దానికి హిమమిత్రుడు (వరుని
తండ్రి) ఇలా బదులిచ్చాడు: "నీ సంపద అంతా నాదే, అలాగే నాది కూడా నీదే. నాకేది కావాలో నేను అడుగుతాను. నిరంతరం పెద్దలను, జ్ఞానులను సేవించే నీ వంటి సంస్కారవంతుడికి ఇటువంటి మాటలు
పలకడం తగినదే."
వ్యాఖ్య:
"ఓ భగవంతుడా! ఈ గృహంలో నీకు ఏది ప్రీతికరమో అదంతా నీదే అని మనవి
చేస్తున్నాను" అని పలికిన విష్ణుమిత్రునితో హిమమిత్రుడు ఇలా అన్నాడు-
"నీవు చెప్పినట్లు సమస్తము నాదే. నాకేది కావాలో నేను తప్పక అడుగుతాను. నీవు 'అంతా మీదే' అని అనడం, ఎల్లప్పుడూ వృద్ధులను (జ్ఞానులను) సేవించే నీ వంటి
ఉత్తముడికి ఎంతో యుక్తమైనది." [పూగః అంటే
సమూహం అని అర్థం. ఇక్కడ జ్ఞానవృద్ధుల సమూహాన్ని సేవించినవాడు అని భావం.]
శ్లోకం 53
ఏవం మిథః పరినిగద్య విశేషమృద్వ్యా వాచా యుతౌ
ముదమవాపనురుత్తమాం తౌ ॥ అన్యే చ
సంముముదిరే ప్రియసత్కథాభిః స్వేచ్ఛావిహారహసనైరుభయే విధేయాః ॥ 53 ॥
తాత్పర్యము: ఈ విధంగా ఆ ఇద్దరు తండ్రులు (విష్ణుమిత్ర హిమమిత్రులు) అత్యంత మృదువైన
వాక్కులతో పరస్పరం మాట్లాడుకుని గొప్ప ఆనందాన్ని పొందారు. మిగిలిన బంధుమిత్రులు, పరివారమంతా కూడా ప్రియమైన గోష్ఠులతో (మంచి కథలతో), విహారములతో, హాస్యములతో
ఎంతో సంతోషంగా గడిపారు. అందరూ తమ తమ పనులు పూర్తి చేసుకుని కృతకృత్యులయ్యారు.
వ్యాఖ్య: పరస్పరం కోమలమైన మాటలతో సంభాషించుకున్న విష్ణుమిత్ర, హిమమిత్రులు ఉత్తమమైన సంతోషాన్ని పొందారు. ఇరు పక్షాల వారు
(వరుని వైపు, కన్య వైపు
వారు) కూడా ఇష్టమైన కథా కాలక్షేపాలతో, జల యంత్ర లీలా
వినోదాలతో, హాస్యాలతో
సంతోషించారు. అందరూ చేయవలసిన పనులు పూర్తి చేసుకుని (అవిధేయాః - అంటే ఇక మిగిలిన
పనులు లేనివారై) ఆనందంగా ఉన్నారు.
శ్లోకం 54
కన్యావరౌ ప్రకృతిసిద్ధసురూపవేషౌ దృష్ట్వోభయే౽పి పరికర్మ
విలమ్బమానాః ॥ చక్రుర్విధేయమితి
కర్తుమనీశ్వరాస్తే శోభావిశేషమపి మఙ్గలవాసరే౽స్మిన్ ॥ 54 ॥
తాత్పర్యము: స్వభావసిద్ధంగానే మిక్కిలి అందమైన రూపము, వేషము కలిగిన ఆ వధూవరులను (విశ్వరూప-ఉభయభారతులను) చూసి, అలంకరించేవారు వారి సౌందర్యానికి ముగ్ధులై పనులను ఆలస్యం
చేశారు. "శాస్త్రవిధి ప్రకారం ఏదో ఒకటి చేయాలి కదా" అన్నట్లుగా, ఆ మంగళప్రదమైన రోజున వారు చేయగలిగినంత అలంకారాన్ని మరియు
శోభను అతికష్టం మీద పూర్తి చేశారు.
వ్యాఖ్య: సహజంగానే సుందరమైన రూపం గల వధూవరులను చూసి, వారిని అలంకరించేవారు వారి రూపంపైనే దృష్టి నిలిపి అలంకరించడంలో వెనుకబడ్డారు.
అమరకోశం ప్రకారం 'పరికర్మ' అంటే అలంకరణ. ఆ మంగళవారము (శుభదినము) నాడు వస్త్రములు, గంధము, ఆభరణములతో
కూడిన శోభను కేవలం విధిగా భావించి (కన్యావరౌ ప్రకృతి సిద్ధులు కాబట్టి) పూర్తి
చేశారు.
శ్లోకం 55
ఏతత్ప్రభాప్రతిహతాత్మవిభూతిభావా-దాకల్పజాతమపి నాతిశయం
వితేనే ॥ లోకప్రసిద్ధిమనుసృత్య
విధేయబుద్ధ్యా భూషాం వ్యధుస్తదుభయే న విశేషబుద్ధ్యా ॥ 55 ॥
తాత్పర్యము: ఆ వధూవరుల దేహకాంతి ముందు వారు ధరించిన రత్నాభరణాల మెరుపు కూడా వెలవెలబోయింది.
ఆ అలంకరణ వారి సహజ సౌందర్యానికి ఏ కొత్త అందాన్ని తీసుకురాలేకపోయింది. లోకమర్యాదను
అనుసరించి, "పెళ్లిలో
అలంకారం చేయాలి" అనే ఉద్దేశంతోనే ఇరుపక్షాల వారు వారిని అలంకరించారు తప్ప, అలంకారం వల్ల వారి అందం పెరుగుతుందని ఏమాత్రం ఆశించలేదు.
వ్యాఖ్య: వారి శరీర కాంతి (ప్రభ) చేత ఆభరణాల ప్రకాశం కూడా ఓడిపోయింది. కాబట్టి ఆభరణ
సమూహం (ఆకల్పం) వారిలో ఎటువంటి అదనపు అతిశయాన్ని కలిగించలేదు. లోకాచారాన్ని
పాటించాలనే బుద్ధితోనే వారు భూషణాలను అలంకరించారు తప్ప, భూషణాల వల్ల ఏవైనా కొత్త విశేషం కలుగుతుందని కాదు.
శ్లోకం 56
మౌహూర్తికా బహువిదో౽పి ముహూర్తకాల-మప్రాక్షురక్షతధియం
ఖేలన్తీం సఖీభిః ॥ పశ్చాత్తదుక్తశుభయోగయుతే
శుభాంషే మౌహూర్తికాః స్వమతితో జగృహుర్ముహూర్తమ్ ॥ 56 ॥
తాత్పర్యము: జ్యోతిష శాస్త్రంలో ఆరితేరిన పండితులైనప్పటికీ, ఆ సిద్ధాంతులు తమ సఖులతో ఆడుకుంటున్న, అప్రతిహతమైన మేధస్సు (అక్షత ధియం) కలిగిన ఉభయభారతిని ముహూర్త కాలం గురించి
అడిగారు. ఆ తర్వాత ఆమె సూచించిన శుభయోగము మరియు శుభ నవాంశమును బట్టి, ఆ పండితులు తమ బుద్ధితో ముహూర్తాన్ని స్థిరపరిచారు.
వ్యాఖ్య: సకల విద్యలు తెలిసిన జ్యోతిష్కులు కూడా, సఖులతో ఆడుకుంటున్న ఉభయభారతిని ముహూర్త సమయం గురించి అడిగారు. ఆమె
సర్వజ్ఞురాలు కాబట్టి ఆమె మేధస్సు ఎక్కడా ఆగిపోదు. ఆమె చెప్పిన శుభ గ్రహాల
యోగాన్ని అనుసరించి, ఆ పండితులు తమ
మతితో ముహూర్తాన్ని గ్రహించి నిశ్చయించారు.
శ్లోకం 57
జగ్రాహ పాణికమలం హిమమిత్రసూనుః శ్రీవిష్ణుమిత్రదుహితుః
కరపల్లవేన ॥ భేరీమృదఙ్గపటహాధ్యయనాబ్జఘోషై-ర్దిఙ్మణ్డలే
సుపరిమూర్ఛతి దివ్యకాలే ॥ 57 ॥
తాత్పర్యము: భేరీలు, మృదంగాలు, పటహాలు మ్రోగుతుండగా, వేద మంత్రాల ఘోష మరియు శంఖ నాదాలు దిక్కులన్నిటా వ్యాపించిన ఆ దివ్యమైన
ముహూర్త సమయంలో, హిమమిత్రుని
కుమారుడైన విశ్వరూపుడు విష్ణుమిత్రుని కుమార్తె (ఉభయభారతి) యొక్క హస్తపల్లవాన్ని
తన కమలం వంటి చేతితో గ్రహించి పాణిగ్రహణం చేశాడు.
వ్యాఖ్య: భేరీ, మృదంగ, పటహ వాద్యములతో పాటు వేదాధ్యయన శబ్దము మరియు శంఖ నాదము
(అబ్జఘోష) దిక్కుల అంతటా వ్యాపించి ఉండగా, ఆ దివ్య సమయంలో హిమమిత్ర పుత్రుడైన మండనమిశ్రుడు సరస్వతీ దేవి (ఉభయభారతి)
చేతిని అందుకున్నాడు. ఇది అత్యంత వైభవంగా జరిగిన వివాహ ఘట్టం.
శ్లోకం 58
యం యం పదార్థమభికామయతే పుమాన్య-స్తం తం ప్రదాయ సమతూతుషతాం
తదీజ్యౌ ॥ దేవద్రుమావివ
మహాసుమనస్త్వయుక్తౌ సంభూషితౌ సదసి చేరతురాత్మలాభౌ ॥ 58 ॥
తాత్పర్యము: ఎవరెవరు ఏయే పదార్థాలను కోరుకున్నారో, వారికి ఆయా వస్తువులన్నింటినీ దానం చేసి ఆ వధూవరుల తల్లిదండ్రులు (విష్ణుమిత్ర, హిమమిత్రులు) అందరినీ సంతృప్తిపరిచారు. గొప్ప పుష్పములతో
అలరారే కల్పవృక్షాల వలె, ఉదార స్వభావము
(మహాసుమనస్త్వము) కలిగి, ఆభరణాలతో
అలంకృతులైన ఆ తండ్రులు తమ కోరికలు సిద్ధించిన వారై ఆ సభలో సంచరించారు.
వ్యాఖ్య: ఏ పురుషుడు ఏ వస్తువును ప్రార్థించాడో, అతనికి దానిని ఇచ్చి ఆ పూజ్యులైన తల్లిండ్రులు అందరినీ సంతోషపెట్టారు.
కల్పవృక్షాల వలె గొప్ప ఉదారతతో, అలంకారములతో ఆ
సభలో వారు మెరిశారు.
గమనిక: ఇక్కడ 'సుమనస్సు' అంటే పువ్వులు అని ఒక అర్థం, మంచి మనస్సు (ఉదారత) అని మరో అర్థం. కల్పవృక్షాలు స్థిరంగా ఉంటే, ఈ తండ్రులు మాత్రం సభలో సంచరిస్తూ దానాలు చేశారని చెప్పడం
ద్వారా ఇక్కడ వ్యతిరేక
అలంకారం ధ్వనిస్తోంది.
శ్లోకం 59
ఆధాయ వహ్నిమథ తత్ర జుహావ సమ్య-గృహ్యోక్తమార్గమనుసృత్య స
విశ్వరూపః ॥ లాజాజ్జుహావ చ
వధూః పరిజిఘ్రతి స్మ ధూమం ప్రదక్షిణమథాకృత సో౽పి చాగ్నిమ్ ॥ 59 ॥
తాత్పర్యము: అటుపిమ్మట విశ్వరూపుడు తన గృహ్యసూత్రాలలో చెప్పబడిన విధిని అనుసరించి అగ్నిని
ప్రతిష్ఠించి హోమం చేశాడు. వధువు (ఉభయభారతి) లాజ హోమం (పేలాలు) చేసి, ఆ అగ్ని ధూమాన్ని ఆగ్రాణించింది. ఆ తర్వాత విశ్వరూపుడు
ఆమెతో కలిసి అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేశాడు.
వ్యాఖ్య: విశ్వరూపుడు తన శాఖకు సంబంధించిన గృహ్యసూత్ర విధి ప్రకారం అగ్నిని స్థాపించి
హోమక్రియలు నిర్వహించాడు. వధువు వేయించిన ధాన్యములను (లాజలు) హోమం చేసింది. ఆ
తర్వాత ఇద్దరూ కలిసి అగ్ని ప్రదక్షిణమును కావించారు.
శ్లోకం 60
హోమావసానపరితోషితవిప్రవర్యః ప్రస్థాపితాఖిలసమాగతబంధువర్గః ॥ సంరక్ష్య వహ్నిమనయా సమమగ్నిగేహే దీక్షాధరో
దినచతుష్కమువాస హృష్టః ॥ 60 ॥
తాత్పర్యము: హోమం ముగిసిన తర్వాత బ్రాహ్మణులను దానాదులతో తృప్తిపరిచి, వచ్చిన బంధువులందరినీ సాగనంపిన విశ్వరూపుడు, అగ్నిశాలలో ఆ వివాహాగ్నిని రక్షిస్తూ (ఆహితాగ్నియై), తన భార్యతో కలిసి సంతోషంగా నాలుగు రోజుల పాటు 'చతుర్థీ కర్మ' దీక్షను
ఆచరించాడు.
వ్యాఖ్య: హోమానంతరం విప్రులను సంతోషపెట్టి, బంధువులను
పంపివేసిన తర్వాత, అగ్నిని
కాపాడుకుంటూ ఆ వివాహ వేదిక (అగ్నిగేహం) వద్దే భార్యతో కలిసి దీక్షాధరుడై నాలుగు
రోజులు నివసించాడు. దీనినే వివాహ ప్రక్రియలో 'చతుర్థీ కర్మ' అని అంటారు.
శ్లోకం 61
ప్రతిష్ఠమానే దయితే వరే౽స్మి-న్నుపేత్య మాతాపితరౌ వరాయాః ॥ ఆభాషిషాతాం శృణు సావధానో బాలేవ బాలా న తు వేత్తి
కించిత్ ॥ 61 ॥
తాత్పర్యము: ప్రియుడైన ఆ వరుడు (విశ్వరూపుడు) వధువును తీసుకుని బయలుదేరుతుండగా, కన్య యొక్క తల్లిదండ్రులు ఆయన వద్దకు వచ్చి ఇలా పలికారు:
"ఓ వరుడా! సావధానంగా విను. ఈమె పసిబాల వంటిది. లోకజ్ఞానం గానీ, గృహకార్యాలు గానీ ఈమెకు ఏమీ తెలియవు."
వ్యాఖ్య: విశ్వరూపుడు ప్రయాణానికి సిద్ధమవుతుండగా, విష్ణుమిత్రుడు మరియు అతని భార్య వచ్చి ఇలా అన్నారు- సావధానంగా విను, పాలు తాగే పసిపాపకు ఏమీ తెలియని విధంగానే, సుకుమారమైన అంగాలు కలిగిన మా కుమార్తెకు కూడా ఏమీ తెలియదు.
శ్లోకం 62
బాలైరియం క్రీడతి కందుకాద్యై-ర్జాతక్షుధా గేహముపైతి దుఃఖాత్
॥ ఏకేతి బాలా
గృహకర్మ నోక్తా సంరక్షణీయా నిజపుత్రితుల్యా ॥ 62 ॥
తాత్పర్యము: "ఈమె ఇతర పిల్లలతో కలిసి బంతి ఆటలు ఆడుకుంటూ ఉంటుంది. ఆకలి
వేసినప్పుడు మాత్రమే బాధతో ఇంటికి వస్తుంది. మాకు ఒక్కతే కుమార్తె అవ్వడం వల్ల
మేము ఈమెకు ఎన్నడూ ఇంటి పనులు చెప్పలేదు. కాబట్టి ఈమెను నీ సొంత కుమార్తె వలె
మిక్కిలి ప్రేమతో సంరక్షించుకోవాలి."
వ్యాఖ్య: ఈమె బంతులతో, ఆట వస్తువులతో
పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది. ఆకలి వేసినప్పుడు బాధతో ఇంటికి వస్తుంది. "మీరు
ఈమెకు ఇంటి పనులు ఎందుకు నేర్పలేదు?"
అని అడుగుతారేమోనని వారే చెబుతున్నారు- మాకు ఉన్నది ఒక్కతే సంతానం కాబట్టి
ఈమెకు మేము ఏ పనీ చెప్పలేదు. కాబట్టి నీవు ఈమెను నీ బిడ్డలాగే చూసుకోవాలి.
శ్లోకం 63
బాలేయమఙ్గ వచనైర్మృదుభిర్విధేయా కార్యా న రూక్షవచనైర్న
కరోతి రుష్టా ॥ కేచిన్మృదుక్తివశగా
విపరీతభావాః కేచిద్విహాతుమనలం ప్రకృతిం జనో హి ॥ 63 ॥
తాత్పర్యము: "ఓ నాయనా! ఈమెను మృదువైన మాటలతోనే పనులకు నియోగించాలి.
కఠినంగా మాట్లాడితే ఈమె కోపగించుకుని ఏ పనీ చేయదు. లోకంలో కొందరు మెత్తని మాటలకు
లొంగుతారు, కొందరు
కఠినత్వానికి లొంగుతారు. ఎవరి స్వభావం వారిది కదా! ఎవరూ తమ సహజ స్వభావాన్ని
వదులుకోలేరు."
వ్యాఖ్య: అయితే ఈమెతో అస్సలు పనులు చేయించకూడదా? అంటే- అలా కాదు, ఓ అల్లుడా!
(అఙ్గ) ఈమెకు ఏవైనా పనులు చెప్పాలంటే సున్నితమైన మాటలతో చెప్పాలి, కఠినమైన మాటలతో కాదు. కఠినంగా చెబితే ఈమె అలక పూని పని
చేయదు. మృదువుగా చెబితే ఎందుకు చేస్తుంది? అంటే- ప్రకృతి వైచిత్ర్యం వల్ల. కొందరు మృదువైన మాటలకే వశమవుతారు. లోకంలో ఎవరూ
తమ సహజ స్వభావాన్ని వదులుకోలేరు కదా! [అఙ్గ అని సంబోధించడం ద్వారా అల్లుడి పట్ల వారికున్న
వాత్సల్యం, అలాగే మృదువుగా
మాట్లాడాలనే సూచన వ్యక్తమవుతోంది.]
కుమార్తెను అత్తగారింటికి పంపేటప్పుడు ఏ తల్లిదండ్రులకైనా
ఉండే ఆందోళన, వారి సున్నిత
మనస్తత్వం ఈ శ్లోకాలలో ప్రతిబింబిస్తాయి. ఇక్కడ సరస్వతీ దేవి అవతారమైన ఉభయభారతిని
ఒక సామాన్య బాలికగా చిత్రించడం కవి యొక్క చాతుర్యం
శ్లోకం 64
కశ్చిద్ద్విజాతిరధిగమ్య కదాచిదేనా-ముద్వీక్ష్య
లక్షణమయొచదనిందితాత్మా ॥ మానుష్యమాత్రజననం
నిజదేవభావే-త్యస్మాచ్చ వో వచనముగ్రమయోజ్యమస్యామ్ ॥ 64 ॥
తాత్పర్యము: "ఒకానొక సమయంలో నిందారహితుడైన ఒక బ్రాహ్మణోత్తముడు ఈమెను
చూసి, ఈమె
అంగలక్షణాలను గమనించి ఇలా చెప్పాడు: 'ఈమె మనుష్య
రూపంలో జన్మించినప్పటికీ, నిజానికి ఈమె
సాక్షాత్తు దైవ స్వరూపిణి (సరస్వతి). కాబట్టి ఈమె విషయంలో మీరు ఎప్పుడూ కఠినమైన
మాటలను వాడకూడదు'."
వ్యాఖ్య:
"మా కుమార్తెను ఎందుకు శిక్షించలేదు?" అని మీరు అడగవచ్చు, కానీ దానికి కారణం ఇది- ఒకానొకప్పుడు ఒక గొప్ప బ్రాహ్మణుడు వచ్చి ఈమె
లక్షణాలను చూసి, ఈమె కేవలం
మనిషి మాత్రమే కాదు, నిత్యమైన
దైవత్వము (దేవభావం) కలిగినది అని చెప్పాడు. 'నిజ' అంటే
నిత్యమైనది లేదా స్వకీయమైనది అని అర్థం. కాబట్టి ఈమెపై కఠినమైన మాటలు ప్రయోగించడం
తగదని ఆయన మాకు ఉపదేశించాడు.
శ్లోకం 65
సర్వజ్ఞతాలక్షణమస్తి పూర్ణ-మేషా కదాచిద్వదతోః కథాయామ్ ॥ తత్సాక్షిభావం భజితా౽నవద్యా సందిశ్య నావేవమసౌ
జగామ ॥ 65 ॥
తాత్పర్యము: "ఆ బ్రాహ్మణుడు ఇంకా ఇలా చెప్పాడు: 'ఈమెలో సర్వజ్ఞత (సకలము తెలిసిన స్థితి) యొక్క లక్షణాలు
పూర్తిగా ఉన్నాయి. భవిష్యత్తులో ఎప్పుడైనా ఇద్దరు పండితులు వాదించుకుంటున్నప్పుడు, దోషరహితమైన ఈమె వారి వాదానికి సాక్షిగా (మధ్యవర్తిగా)
వ్యవహరిస్తుంది'. ఇలా మాకు
ఉపదేశించి ఆ విప్రుడు వెళ్ళిపోయాడు."
వ్యాఖ్య: ఈమెలో సర్వజ్ఞురాలికి ఉండవలసిన అన్ని గుర్తులు ఉన్నాయి. అంతేకాక, భవిష్యత్తులో జరిగే ఒక గొప్ప శాస్త్ర చర్చలో (వాదంలో) ఈమె
సాక్షిగా నిలుస్తుందని ఆయన ముందే చెప్పారు. (ఇది భవిష్యత్తులో శంకరాచార్యులకు
మరియు మండనమిశ్రుడికి మధ్య జరిగే వాదానికి సూచన). ఇలా చెప్పి ఆ బ్రాహ్మణుడు
వెళ్ళిపోయాడు.
శ్లోకం 66
శ్వశ్రూర్వరాయా వచనేన వాచ్యా స్నుషాభిరక్షా౽౽యతతే హి
తస్యామ్ ॥ నిక్షేపభూతా తవ
సుందరీయం కార్యా గృహే కర్మ శనైః శనైస్తే ॥ 66 ॥
తాత్పర్యము: విష్ణుమిత్రుడు అల్లుడితో ఇలా అంటున్నాడు: "ఓ అల్లుడా! మా తరపున నీ
తల్లిగారితో (అత్తగారితో) ఇలా చెప్పు- 'కోడలిని రక్షించుకోవాల్సిన బాధ్యత అత్తగారిపైనే ఉంటుంది. ఈ సుందరి నీ వద్ద ఒక
దాచబడిన నిధి (న్యాసము) వంటిది. కాబట్టి ఈమె చేత ఇంటి పనులను చాలా నెమ్మదిగా, అలవాటు చేస్తూ చేయించుకో'."
వ్యాఖ్య: గుణవతియైన మా కుమార్తె గురించి నీ తల్లిగారికి మా మాటగా ఇలా విన్నవించు- కోడలి
క్షేమం అత్తగారి చేతుల్లోనే ఉంటుంది. ఈమె నీకు ఒక అపురూపమైన కానుక (నिक्षేపము) వంటిది.
కాబట్టి గృహకార్యాలను ఈమెతో ఒక్కసారిగా కాకుండా, నెమ్మది నెమ్మదిగా చేయించమని ప్రార్థన.
ఉభయభారతి యొక్క మహోన్నతమైన భవిష్యత్తును మరియు ఆమె దైవిక
నేపథ్యాన్ని ఈ శ్లోకాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా 65వ శ్లోకంలో ఆమె 'సాక్షిగా' వ్యవహరిస్తుందని చెప్పడం శంకర విజయంలోని ప్రధాన మలుపుకు
(శంకర-మండన వాదం) పునాది వంటిది.
శ్లోకం 67
బాల్యేషు బాల్యాత్సులభో౽పరాధః స నేక్షణీయో గృహిణీజనేన ॥ వయం సుధీభూయ హి సర్వ ఏవ పశ్చాద్గురుత్వం శనకైః
ప్రయాతాః ॥ 67 ॥
తాత్పర్యము: "బాల్యంలో తెలియక తప్పులు చేయడం సహజం. ఆ చిన్న చిన్న
తప్పులను ఇంట్లోని పెద్దలు (అత్తగారు మొదలైనవారు) లెక్కలోకి తీసుకోకూడదు. మనమందరం
కూడా మొదట పిల్లలుగా ఉండి, పెరిగి
పెద్దయ్యాక, అనుభవంతోనే కదా
క్రమంగా తెలివితేటలను, గౌరవాన్ని
(గురుత్వాన్ని) పొందింది!"
వ్యాఖ్య: పిల్లలు చిన్నతనంలో చాపల్యం వల్ల పొరపాట్లు చేయడం సహజం. దానిని గృహిణులు
(అత్తలు) పెద్దది చేయకూడదు. మనమందరం కూడా ఒకేసారి జ్ఞానులుగా పుట్టలేదు, కాలక్రమేణా అనుభవం ద్వారానే పెద్దరికాన్ని పొందాము అని
తల్లిదండ్రులు అల్లుడికి విన్నవిస్తున్నారు.
శ్లోకం 68
దృష్ట్వా౽భిధాతుమనలం చ మనో౽స్మదీయం గేహాభిరక్షణవిధౌ నహి
దృశ్యతే౽న్యః ॥ దృష్ట్వా౽భిధానఫలమేవ
యథా భవేన్నౌ బ్రూయాత్తథేష్ఠజనతా జననీం వరస్య ॥ 68 ॥
తాత్పర్యము: "వరుని తల్లిని (విశ్వరూపుని తల్లిని) ప్రత్యక్షంగా చూసి
ఇవన్నీ చెప్పడానికి మా మనసు అంగీకరించడం లేదు (సిగ్గు లేదా భయం వల్ల). ఈ ఇంటిని
(కుమార్తెను) రక్షించే విషయంలో ఆమె తప్ప మాకు వేరే దిక్కు లేదు. కాబట్టి, మీ బంధుమిత్రులు (వరుని పక్షం వారు) మా తరపున ఆమెకు ఈ
విషయాలను నచ్చజెప్పి, మా కుమార్తె
క్షేమంగా ఉండేలా చూడాలి."
వ్యాఖ్య: అత్తగారిని చూసి నేరుగా ఇవన్నీ చెప్పడం మాకు సాధ్యం కావడం లేదు. కానీ గృహ
రక్షణలో (కోడలిని చూసుకోవడంలో) ఆమెయే ప్రధానం. కాబట్టి హిమమిత్రుని (వరుని తండ్రి)
బంధువులు మా మనసులోని మాటను ఆమెకు చేరవేసి, మేము స్వయంగా చెబితే ఎలాంటి ఫలితం ఉంటుందో అటువంటి శుభ ఫలితాన్ని కలిగించాలి.
శ్లోకం 69
వత్సే త్వమద్య గమితా౽సి దశామపూర్వాం తద్రక్షణే నిపుణధీర్భవ
సాధు నిత్యమ్ ॥ కుర్యాన్న
బాలవిహృతిం జనతోపహాస్యాం సా నావివాపరమియం పరితోషయేత్తే ॥ 69 ॥
తాత్పర్యము: (తల్లిదండ్రులు కుమార్తెకు చెబుతున్నారు): "అమ్మా! నీవు ఇప్పుడు ఒక కొత్త
దశలోకి (గృహిణీ ధర్మంలోకి) అడుగుపెట్టావు. ఆ కొత్త బాధ్యతను కాపాడుకోవడంలో ఎప్పుడూ
మెలకువగా ఉండు. ఇకపై ఇతరులు నవ్వుకునేలా చిన్నపిల్లల ఆటలు ఆడకు. అత్తవారింట్లో నీ
నడవడిక మమ్మల్ని మరియు నీ భర్తను సంతోషపెట్టేలా ఉండాలి."
వ్యాఖ్య: ఓ వత్సా! నేడు నీవు అపూర్వమైన గృహిణీ దశను పొందవు. ఆ గౌరవాన్ని
రక్షించుకోవడంలో నిత్యం నిపుణమైన బుద్ధితో మసలుకో. లోకులు నవ్వుకునేలా పసితనపు
చేష్టలు చేయకు. నీ సత్ప్రవర్తన ద్వారా నీ భర్తను, మమ్మల్ని తృప్తిపరచు.
శ్లోకం 70
పాణిగ్రహాత్స్వాధిపతీ సమీరితౌ పురా కుమార్యాః పితరౌ తతః
పరమ్ ॥ పతిస్తమేకం
శరణం భజానిశం లోకద్వయం జేష్యసి యేన దుర్జయమ్ ॥ 70 ॥
తాత్పర్యము: "అమ్మా! వివాహానికి ముందు కుమార్తెకు తల్లిదండ్రులే అధిపతులు
(రక్షకులు). కానీ పాణిగ్రహణం జరిగిన తర్వాత పతియే ఏకైక దైవం మరియు అధిపతి. కావున
నీవు ఎల్లప్పుడూ నీ భర్తనే శరణు వేడుకో. ఆ పతిసేవ వల్లనే నీవు జయించడానికి
వీలుకాని ఇహపర లోకాలను రెండింటినీ సులభంగా జయిస్తావు."
వ్యాఖ్య: శాస్త్ర ప్రకారం పెళ్లికి ముందు తండ్రి రక్షణలో ఉండే కన్యకు, పెళ్లి తర్వాత భర్తయే సర్వస్వం. కాబట్టి పతినే ఏకైక గతిగా
భావించి సేవించు. దీనివల్ల ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి.
శ్లోకం 71
పశ్యావభుక్తవతి సుందరి మా స్మ భుంక్ష్వ యాతే ప్రయాతమపి మా
స్మ భవేద్విభూషా ॥ పూర్వాపరాదినియమో౽స్తి
నిమజ్జనాదౌ వృద్ధాంగనాచరితమేవ పరం ప్రమాణమ్ ॥ 71 ॥
తాత్పర్యము: "ఓ సుందరీ! భర్త భోజనం చేయకుండా నీవు భుజించవద్దు. ఆయన ఏదైనా
పని మీద ఊరు వెళ్ళినప్పుడు నీవు అధికంగా అలంకరించుకోవద్దు. స్నానము, భోజనము వంటి కృత్యాలలో 'భర్త కంటే ముందు ఏది చేయాలి, భర్త తర్వాత
ఏది చేయాలి' అనే నియమాలు
ఉన్నాయి. వీటన్నిటికీ అరుంధతి, లోపాముద్ర వంటి
వృద్ధ సాధ్వీమణుల చరిత్రలే నీకు పరమ ప్రమాణాలు."
వ్యాఖ్య: పతివ్రతా ధర్మాలను వివరిస్తూ - భర్త తిన్న తర్వాతే భార్య తినాలి. భర్త దగ్గర
లేనప్పుడు ప్రసాధనములు (మేకప్/అలంకరణలు) విసర్జించాలి. స్నానాదులు భర్త కంటే ముందే
ముగించుకోవాలి, భోజనాదులు భర్త
తర్వాత చేయాలి. ఈ విషయాల్లో పురాణ కాలం నాటి గొప్ప పతివ్రతల నడవడికను ఆదర్శంగా
తీసుకోవాలి.
శ్లోకం 72
రుష్టే ధ్రువే సతి రుషేహ న వాచ్యమేకం క్షంతవ్యమేవ సకలం స తు
శామ్యతీత్థమ్ ॥ తస్మిన్ప్రసన్నవదనే
చకితేవ వత్సే సిద్ధ్యత్యభీష్టమనఘే క్షమయైవ సర్వమ్ ॥ 72 ॥
తాత్పర్యము: "ఒకవేళ భర్త కోపగించుకుంటే, నీవు తిరిగి కోపంతో ఒక్క మాట కూడా అనవద్దు. ఆయన అన్నవన్నీ ఓర్పుతో క్షమించు, అప్పుడే ఆయన శాంతిస్తారు. ఆయన ప్రసన్నంగా ఉన్నప్పుడు నీవు
వినయంతో (చకితవ - భయపడుతున్నట్లుగా) ప్రవర్తించు. ఓ పుణ్యవతీ! క్షమ (ఓర్పు)
ద్వారానే స్త్రీకి సమస్త కోరికలు సిద్ధరిస్తాయి."
వ్యాఖ్య: భర్త ఆగ్రహించినప్పుడు ఎదురు చెప్పకుండా మౌనంగా ఉండటం వల్ల గృహంలో శాంతి
నెలకొంటుంది. నీవు చూపే ఓర్పు (క్షమ) వల్ల ఆయన మనసు కరిగి ప్రసన్నుడవుతాడు. లోకంలో
స్త్రీకి ఓర్పును మించిన ఆభరణం లేదు.
ఈ ఉపదేశాలు ప్రాచీన భారతీయ గృహస్థాశ్రమ ధర్మాలను
ప్రతిబింబిస్తాయి. ఉభయభారతి సాక్షాత్తు సరస్వతియే అయినా, లోకరీతిని అనుసరించి తల్లిదండ్రులు ఈ హితబోధ చేశారు.
శ్లోకం 73
భర్తుః సమక్షమపి తద్వదనం సమీక్ష్య వాచ్యో న జాతు సుభగే పరపురుషస్తే ॥ కిం వాచ్య ఏష రహసీతి తవోపదేశః శంకా వధూపురుషయోః క్షపయేద్ధి హార్దమ్ ॥ 73 ॥
తాత్పర్యము: "ఓ సుభగే! నీ భర్త ఎదుట ఉన్నప్పుడు పరపురుషుని ముఖం వైపు
చూస్తూ మాట్లాడవద్దు. ఇక ఏకాంతంలో పరపురుషునితో మాట్లాడకూడదని వేరే చెప్పనవసరం
లేదు కదా! భార్యాభర్తల మధ్య పరపురుషుని విషయంలో చిన్న అనుమానం కలిగినా, అది వారి మధ్య ఉన్న హృదయపూర్వకమైన ప్రేమను (హార్దమ్) నాశనం
చేస్తుంది."
వ్యాఖ్య: భర్త ఎదుట ఉన్నప్పుడు పరపురుషుని ముఖం చూసి నేరుగా మాట్లాడటం సముచితం కాదు
(అధోముఖంగా ఉండి మాట్లాడాలి). పరాయి పురుషునితో స్నేహం లేకపోయినా, అటువంటి ప్రవర్తన వల్ల భర్తకు కలిగే చిన్న శంక కూడా వారి
దాంపత్య అనురాగాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ప్రవర్తనలో మిక్కిలి జాగ్రత్త
అవసరమని భావం.
శ్లోకం 74
ఆయాతి భర్తరి తు పుత్రి విహాయ కార్యం ఉత్థాయ శీఘ్రముదకేన పాదావనేకః ॥ కార్యో యథాభిరుచి హే సతి జీవనం వా నోపేక్షణీయమణుమాత్రమపీహ కే తే ॥ 74 ॥
తాత్పర్యము: "పుత్రికా! నీ భర్త బయట నుండి ఇంటికి రాగానే, నీవు చేస్తున్న పనిని పక్కన పెట్టి, వెంటనే లేచి వెళ్లి ఆయనకు ఎదురురావాలి. స్వయంగా నీ చేతులతో
ఆయన పాదాలను నీటితో కడగాలి. ఆయనకు ఇష్టమైన ఆహార పానీయాలను (జీవనమ్) అందించాలి. ఈ
లోకంలో నీకు భర్త కంటే గొప్ప సుఖం (కే - సుఖం) ఏదీ లేదు, కాబట్టి ఆయన సేవలో అణుమాత్రం కూడా అశ్రద్ధ చేయవద్దు."
వ్యాఖ్య: భర్త ఇంటికి వచ్చినప్పుడు గృహిణి నిర్వహించాల్సిన బాధ్యతలను ఇక్కడ వివరించారు.
ఇంటి పనిలో ఎంత నిమగ్నమైనా, పతి రాగానే
దానిని వదిలి ఆయనకు దాహార్తిని తీర్చి,
పాద సేవ చేయాలి. ఆయన ఇష్టాఇష్టాలను గమనిస్తూ మసలుకోవాలి.
శ్లోకం 75
ధవే పరోక్షే౽పి కదాచిదేయు- ర్గృహం తదీయా అపి వా మహాంతః ॥ తే పూజనీయా బహుమానపూర్వం నో చేన్నిరాశాః కులదాహకాః స్యుః ॥ 75 ॥
తాత్పర్యము: "నీ భర్త ఇంట్లో లేని సమయంలో (పరోక్షే) ఆయన బంధువులు గానీ, ఇతర పెద్దలు గానీ ఇంటికి వస్తే, వారిని ఎంతో గౌరవంతో పూజించాలి. ఒకవేళ నీవు వారిని సరిగా
గౌరవించక వారు నిరాశతో వెనుదిరిగితే, అది నీ వంశ
గౌరవానికి భంగం కలిగిస్తుంది."
వ్యాఖ్య: అతిథి అభ్యాగతులను గౌరవించడం గృహిణి ధర్మం. భర్త ఇంట్లో లేనప్పుడు ఆయన తరపు
బంధువులను లేదా గౌరవనీయులను ఆదరించడం వల్ల కుటుంబ ప్రతిష్ఠ పెరుగుతుంది. వారిని
చిన్నచూపు చూస్తే కలిగే దోషం గురించి ఇక్కడ హెచ్చరించారు.
ఈ ఉపదేశాలతో తల్లిదండ్రులు ఉభయభారతిని అత్తవారింటికి
సాగనంపారు. ఇది కేవలం ఉభయభారతికి మాత్రమే కాక, ఆనాటి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించే ప్రతి గృహిణికి ఆదర్శప్రాయమైన బోధనగా
పరిగణించబడుతుంది.
శ్లోకం 76
పిత్రోరివ శ్వశురయోరనువర్తితవ్యం తద్వన్మృగాక్షి సహజేష్వపి
దేవరేషు ॥ తే స్నేహినో హి
కుపితా ఇతరేతరస్య యోగం విభ విద్యురితి మే మనసి ప్రతర్కః ॥ 76 ॥
తాత్పర్యము: "ఓ మృగాక్షీ! నీ తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తావో, నీ అత్తమామలను కూడా అలాగే అనుసరించు. అలాగే నీ బావమరుదుల
(దేవరుల) పట్ల కూడా సోదర భావంతో మెలగు. ఎందుకంటే, ఇంటి సభ్యుల మధ్య కోపతాపాలు కలిగితే, అది ఎంతటి గాఢమైన స్నేహాన్నైనా, బంధాన్నైనా
ముక్కలు చేస్తుంది. ఇది నా మనసులోని హెచ్చరిక."
వ్యాఖ్య: అత్తమామలను కన్నవారిలా చూడాలని, భర్త సోదరులతో
సఖ్యతగా ఉండాలని తండ్రి కుమార్తెకు బోధించాడు. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు వస్తే
ప్రేమానురాగాలు (యోగము) నశిస్తాయని ఆయన భావన.
శ్లోకం 77
హితోపదేశే వినివిష్టమానసౌ వధూవరీ రాజగృహం సమీయతుః ॥ లబ్ధానుమానౌ గురుబంధువర్గతో బభూవ
సంజ్ఞోభయభారతీతి ॥ 77 ॥
తాత్పర్యము: పెద్దలు చేసిన హితోపదేశాలను మనసులో నిలుపుకుని, ఆ వధూవరులు (విశ్వరూప-సరస్వతులు) గురువుల మరియు బంధువుల ఆశీస్సులు, సత్కారాలు పొంది తమ రాజగృహానికి (కాశ్మీరంలోని నివాసానికి)
చేరుకున్నారు. అప్పుడే ఆమెకు 'ఉభయభారతి' అనే సార్థక
నామధేయం స్థిరపడింది.
వ్యాఖ్య: గురువు (కుమారిల భట్టపాదులు) మరియు బంధువుల వీడ్కోలు తీసుకుని వారు ఇంటికి
వెళ్లారు. పుట్టిన ఇంటా (విష్ణుమిత్రుని ఇల్లు), మెట్టిన ఇంటా (విశ్వరూపుని ఇల్లు) - రెండు చోట్లా సరస్వతి వలె విద్యావంతురాలు
కావడం వల్ల ఆమెకు 'ఉభయభారతి' అనే పేరు సమస్త పండితుల చేత గుర్తింపు పొందింది.
శ్లోకం 78
సా భారతీ దుర్వాసనేన దత్తః పునః ప్రసన్నేన పురా౽౽త్తహర్షా ॥ శాపవధిం సంసది వత్స్యతే య-త్సర్వజ్ఞతానిర్వహణాయ
సాక్ష్యమ్ ॥ 78 ॥
తాత్పర్యము: ఆ ఉభయభారతి ఎవరో కాదు, పూర్వం దుర్వాస
మహర్షి శాపం వల్ల భూమిపై జన్మించిన సాక్షాత్తు సరస్వతీ దేవి. ఆ మహర్షి
అనుగ్రహించిన శాప విమోచన కాలం సమీపించింది. భవిష్యత్తులో శంకరాచార్యుల వారి
సర్వజ్ఞతను నిరూపించే సభలో సాక్షిగా వ్యవహరించడం ద్వారా ఆమె తన శాప విముక్తిని
పొందబోతోంది.
వ్యాఖ్య: సరస్వతీ దేవి బ్రహ్మసభలో దుర్వాసుని శాపానికి గురై భూమిపై ఉభయభారతిగా
జన్మించింది. శంకరాచార్యులు-మండనమిశ్రుల వాదంలో మధ్యవర్తిగా ఉండటమే ఆమె భూమిపై
చేయవలసిన ఆఖరి పని. ఆ తర్వాత ఆమె తన నిజధామానికి చేరుకుంటుంది.
శ్లోకం 79
స భారతీసాక్షికసర్వవిత్త్వో-ప్యాత్మీయశక్త్యా శిశువద్విభాతః
॥ స్వశైశవస్యౌచితమన్యకాంక్షీ-త్స
కేశవో యద్వదుదారవృత్తః ॥ 79 ॥
తాత్పర్యము: ఆ ఉభయభారతి సాక్షిగా సర్వజ్ఞుడని నిరూపించుకోబోయే శ్రీశంకర భగవత్పాదులు, తన ఆత్మీయ శక్తి (మాయ) చేత ఒక చిన్న బాలుడి వలె
ప్రకాశిస్తున్నారు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ (కేశవుడు) పసితనంలో ఎలాగైతే
లీలామానుష విగ్రహుడై లోకాన్ని మురిపించారో, అలాగే శంకరులు కూడా తన బాల్యానికి తగిన క్రీడలతో సంచరిస్తున్నారు.
వ్యాఖ్య: శంకరాచార్యులు సాక్షాత్తు శివుని అవతారమైనప్పటికీ, లోకరీతిని అనుసరించి ఒక సాధారణ బాలుడి వలె కనిపిస్తూ
విద్యలను అభ్యసిస్తున్నారు. కృష్ణుడు చిన్నతనంలో ఎలాగైతే తన దైవత్వాన్ని దాచి
బాల్యలీలలు చేశారో, శంకరులు కూడా
అలాగే ప్రవర్తిస్తున్నారు.
ఈ శ్లోకాలతో ఉభయభారతి వివాహ ఘట్టం మరియు ఆమె నేపథ్యం
పూర్తయ్యింది. ఇక్కడ ఒక వైపు ఉభయభారతి గృహస్థాశ్రమంలో ఉండగా, మరొక వైపు బాల శంకరులు సన్న్యాసం స్వీకరించే దిశగా అడుగులు
వేస్తున్నారు.
శ్లోకం 80
శైశవే స్థితవతా చపలాశే శార్జ్గిణేవ వటవృక్షపలాశే ॥ ఆత్మనీమఖిలం విలులోకే భావిభూతమపి యత్ఖలు లోకే ॥ 80 ॥
తాత్పర్యము: చంచలమైన కోరికలు గల బాల్యదశలో ఉన్నప్పటికీ, శంకర భగవత్పాదులు ఈ లోకంలోని భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు సంబంధించిన సమస్తాన్ని తనలోనే దర్శించారు.
ప్రళయ కాలంలో వటపత్రం (మర్రి ఆకు) మీద పవళించిన విష్ణుమూర్తి, తన కుక్షిలోనే (కడుపులోనే) సమస్త బ్రహ్మాండాన్ని ఎలాగైతే
చూస్తారో, బాల శంకరులు
కూడా అలాగే సమస్తాన్ని తన ఆత్మలోనే వీక్షించారు.
వ్యాఖ్య: సాధారణంగా బాల్యం అంటే చంచలత్వానికి నిలయం. కానీ శంకరులు ఆ దశలోనే
త్రికాలజ్ఞానిగా వెలిగారు. ఇక్కడ కవి అద్భుతమైన పోలికను ఇచ్చారు. వటపత్రశాయి అయిన
శ్రీమహావిష్ణువు చిన్న బాలుడి రూపంలో ఉండి కూడా అనంత విశ్వాన్ని తనలో ఎలా కలిగి
ఉంటారో, శంకరులు కూడా
అలాగే సర్వజ్ఞులై భాసించారు.
శ్లోకం 81
తం దదర్శ జనతా౽ద్భుతబాలం లీలయా౽ధిగతనూతనదోలమ్ ॥ వాసుదేవమివ వామనలీలం లోచనైరనిమిషైరనువేలమ్ ॥ 81 ॥
తాత్పర్యము: లీలగా ఊయల లూగుతున్న, అద్భుతమైన ఆ
బాలుడిని (శంకరులను) ప్రజలందరూ కనురెప్ప వేయకుండా నిరంతరం చూస్తూనే ఉన్నారు. వామన
అవతారంలో ఉన్నప్పుడు లేదా చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు (వాసుదేవుడు)
తన సుందర చేష్టలతో అందరినీ ఎలా ఆకట్టుకున్నారో, శంకరులు కూడా అలాగే తమ దివ్య బాల్యంతో ప్రజల కళ్లకు విందు చేశారు.
వ్యాఖ్య: శంకరుల బాల్యం సాక్షాత్తు వాసుదేవుని బాల్యంలా ఉంది. ఆయన ఊయల లూగుతుంటే
చూసేవారికి కన్నులు చాలడం లేదు. 'అనిమిషైః' అంటే దేవతల వలె కనురెప్ప వేయకుండా చూడటం అని అర్థం. అంటే
ఆయన సౌందర్యం మనుషులనే కాక దేవతలను కూడా మురిపించింది.
శ్లోకం 82
కోమలేన నవనీరదరాజి-శ్యామలేన నితరాం సమరాజి ॥ కేశపాశతమసా౽ధికమస్య కేశవేశచతురాస్యసమస్య ॥ 82 ॥
తాత్పర్యము: విష్ణువు (కేశవ), శివుడు (ఈశ), బ్రహ్మ (చతురాస్య) - ఈ ముగ్గురు మూర్తుల అంశతో సమానమైన ఆ
శంకరుల శిరోజాలు (జుట్టు) ఎంతో కోమలంగా ఉన్నాయి. కొత్తగా వచ్చిన నీలి మేఘాల మాల
(నవనీరదరాజి) వలె శ్యామల వర్ణంతో మెరుస్తున్న ఆయన కేశపాశము చీకటిని (తమస్సు) కూడా
మించి ప్రకాశిస్తోంది.
వ్యాఖ్య: బాల శంకరుల శిరోజాల వర్ణన ఇది. ఆయన జుట్టు ఎంత నల్లగా ఉందంటే, అది మేఘమాలలను పోలి ఉంది. సాధారణంగా చీకటి ప్రకాశించదు, కానీ ఇక్కడ ఆయన కేశాల నలుపు ఒక వింతైన కాంతిని (శ్యామల
కాంతిని) వెదజల్లుతోంది. ఆయన త్రిమూర్తి స్వరూపుడని కవి ఇక్కడ ధ్వనింపజేశారు.
ఈ శ్లోకాలు బాల శంకరుల లోకోత్తరమైన దివ్యత్వాన్ని మన కళ్లకు
కడతాయి. ఆయన కేవలం ఒక బాలుడు మాత్రమే కాదు, సాక్షాత్తు పరమాత్మ స్వరూపమని ఈ వర్ణనలు స్పష్టం చేస్తున్నాయి.
శ్లోకం 83
(తృతీయ సర్గ ముగింపు)
శాక్యైః పాశుపతైరపి క్షపణకైః కాపాలికైర్వైష్ణవై- రప్యన్యైరఖిలైః ఖలైః ఖలు ఖిలం
దుర్వాదిభిర్వైదికమ్ ॥ పంథానం
పరిరక్షితుం క్షితితలం ప్రాప్తః పరిక్రీడతే ఘోరే సంసృతికాననే విచరతాం భద్రేకరః శంకరః ॥ 83 ॥
తాత్పర్యము: బౌద్ధులు (శాక్యులు), పాశుపతులు, క్షపణకులు (దిగంబర జైనులు), కాపాలికులు, వైష్ణవులు
మొదలైన దుర్వాదుల వల్ల వేద మార్గం నశించిపోతున్న సమయంలో, ఆ వైదిక ధర్మాన్ని రక్షించడానికి పరమశివుడు శంకరాచార్యులుగా
భూమిపై అవతరించారు. ఘోరమైన సంసారారణ్యంలో పడి కొట్టుమిట్టాడుతున్న వారికి మోక్షమనే
మంగళాన్ని (భద్రం) చేకూర్చే ఆ శంకర భగవత్పాదులు భూమిపై బాల లీలలు చేస్తున్నారు.
వ్యాఖ్య: ఈ శ్లోకంతో మూడవ సర్గ ముగిసింది. వేద విరుద్ధమైన అనేక మతాలు ప్రబలి, సనాతన ధర్మం క్షీణిస్తున్న తరుణంలో లోకోద్ధరణ కోసం శివుడు
శంకరుడిగా వచ్చారని కవి వర్ణించారు.
శ్రీ శంకరభగవత్పాదుల కృపతో తాడేపల్లి పార్వతీశశాస్త్రి, సుశీలల మూడవ కుమారుడు తాడేపల్లి పతంజలి వ్యాఖ్యానించిన శ్రీ మాధవీయ
శంకరవిజయములో మూడవ సర్గ సమాప్తము
No comments:
Post a Comment