శ్రీ శివాయ గురవే నమః.
శ్రీమద్రాజాధిరాజ, రాజపరమేశ్వర, వైదిక మార్గప్రవర్తకుడైన శ్రీ బుక్కరాయలచే (విజయనగర సామ్రాజ్య స్థాపకుడు) అర్చించబడిన
పాదపద్మములు కలవారు; తమ గురువుల సేవ ద్వారా లౌకిక, వైదిక విద్యలన్నింటినీ సంపూర్ణంగా ఆకళింపు చేసుకున్నవారు; ముల్లోకాలనే రంగస్థలంపై నాట్యం చేసే తన కీర్తి అనే నటి యొక్క చెవి పోగులలా
సూర్యచంద్రులను ప్రకాశింపజేసినవారు; కర్ణాటక సామ్రాజ్య భారమంతటినీ మోస్తూ, పండితులలో శ్రేష్ఠుడైనవారు;సమస్త వేదములకు వ్యాఖ్యానాలు రచించి విశేష
ఖ్యాతిని పొందినవారు; సకల కళా గ్రంథాలను నిర్మించడంలో నేర్పరి మరియు 'సర్వజ్ఞ శిరోమణి' అని పిలవబడే శ్రీ మాధవాచార్యులచే (శ్రీ విద్యారణ్య స్వామి) ఈ శంకరవిజయ గ్రంథం రచించబడింది.
సంసారం అనే బురదలో మునిగిపోయిన ఆస్తికులకు, ఎటువంటి కష్టం లేకుండా మోక్షాన్ని ప్రసాదించడం కోసం ఇది రచింపబడింది. సకల
అనర్థాలను తొలగించి, పరమానందాన్ని కలిగించే పరమ పురుషార్థమైన 'అద్వైత జ్ఞానాన్ని' పెంపొందించడమే ఈ శ్రీ శంకర విజయం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
శ్రీ పరమహంస పరివ్రాజకాచార్యులైన శ్రీ బాలగోపాల తీర్థుల శిష్యులు, దత్త వంశోద్ధారకులు మరియు రామకుమారుని పుత్రుడైన ధనపతి సూరి రచించిన 'శ్రీ శంకరాచార్య విజయ డిండిమము' అనే సంస్కృత వ్యాఖ్యానానికి ఆచార్య తాడేపల్లి పతంజలి అనువాద గ్రంథంఇది
శ్రీ మాధవీయ శంకరవిజయము
- 01వ సర్గ శ్లోకాలు
(
మూల శ్లోకములతో తెలుగు వ్యాఖ్య)
-
ఆచార్య తాడేపల్లి పతంజలి
శ్రీశివాయ గురవేనమః
శ్రుతి స్మృతి పురాణానామ్ ఆలయం కరుణాలయమ్ | నమామి భగవత్పాద శంకరం లోకశంకరమ్ ||
శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జీవిత విశేషాలను, అద్వైత సిద్ధాంత ప్రచారాన్ని వివరించే అత్యంత ప్రామాణికమైన
గ్రంథాలలో 'శ్రీ మాధవీయ శంకర విజయం' అగ్రగణ్యమైనది.
దీనిని 'సంక్షేప శంకర విజయం' అని కూడా
పిలుస్తారు.
ఈ గ్రంథాన్ని 14వ
శతాబ్దానికి చెందిన శ్రీ విద్యారణ్య స్వామి (మాధవాచార్యులు)
రచించారు. వీరు విజయనగర సామ్రాజ్య స్థాపనకు మూలపురుషులు మరియు శృంగేరి శారదా
పీఠానికి అధిపతులు. అందుకే దీనికి 'మాధవీయ' శంకర విజయం అనే పేరు వచ్చింది.
ఆదిశంకరాచార్యుల జీవిత చరిత్రకు సంబంధించి, ఆయన తత్త్వశాస్త్ర అనుయాయులు రాసిన సుమారు పది ముఖ్యమైన 'శంకర విజయాలు' (జీవిత చరిత్రలు) ప్రచారంలో ఉన్నాయి.
- బృహత్ శంకర విజయం: శంకరాచార్యుల ప్రత్యక్ష శిష్యుడు మరియు సహాధ్యాయి అయిన
శ్రీ చిత్సుఖాచార్యులు దీనిని రచించారు.
- ప్రాచీన శంకర విజయం: భాష్యాలకు మరియు వార్తికలకు ప్రసిద్ధ వ్యాఖ్యాత అయిన
ఆనందగిరి దీనిని రచించారు.
- వ్యాసాచలీయం: ఆత్మపురాణం మరియు ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలపై దీపికలు
రాసిన విద్యాశంకరుడు (లేదా శంకరానందుడు) దీని రచయిత.
- ఆచార్య చరిత (కేరళీయ శంకర విజయం): కేరళకు చెందిన పండితుడు గోవిందనాథుడు దీనిని
రచించారు.
- శంకరాభ్యుదయం: అనేక సంస్కృత కావ్యాలు, నాటకాలు రచించిన చూడామణి దీక్షితులు దీనిని వ్రాసారు.
- గురు విజయం (ఆచార్య విజయం): దీనిని అనంతానందగిరి రచించారు.
- ఆచార్య దిగ్విజయం: శృంగేరి మఠానికి చెందిన వల్లిసహాయకవి దీనిని రచించారు.
- శంకర దిగ్విజయ సారం: శృంగేరి మఠం అనుయాయుడైన సదానందులు దీనిని వ్రాసారు
- శంకర విజయ విలాసం: శృంగేరి మఠానికి చెందిన చిద్విలాసులు దీనిని రచించారు.
- సంక్షేప శంకర విజయం: శృంగేరి మఠం అనుయాయులైన మాధవాచార్యులు(విద్యారణ్య స్వామి) దీనిని రచించారు.(
THE AGE OF SANKARA అను ఆంగ్ల పుస్తకం నుంచి అనువాదం పుట32)
వీటన్నింటిలో
విద్యారణ్య స్వామి రచించిన సంక్షేప శంకర విజయ కావ్యం అత్యంత
భక్తిపూర్వకమైనదిగా, చారిత్రక ఆధారాలతో కూడినదిగా పండితులు
భావిస్తారు. ఇది మొత్తం 16 సర్గలుగా (అధ్యాయాలు) విభజించబడింది.మొత్తం
1843 శ్లోకాలు.
శంకర విజయం కావ్యంలోని ప్రధానాంశాలు
ఈ కావ్యం కేవలం జీవిత చరిత్ర మాత్రమే కాదు, ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక విజ్ఞాన సర్వస్వం. ఇందులో
శంకరుల బాల్య చరితం,సన్న్యాసం స్వీకరించుట,ఆత్మవిద్యను స్థాపించుట,వ్యాస దర్శనాది చరిత వర్ణనము,శ్రీమదాచార్య - మండనమిశ్ర
సంవాదము, శంకరాచార్య - సరస్వతీ సంవాదము, పరకాయ ప్రవేశం,ఉగ్రభైరవుని ఓడించుట,శిష్యులను స్వీకరించుట,బ్రహ్మవిద్యను ప్రచారం చేయుట,పద్మపాదుల యాత్ర,దిగ్విజయ యాత్ర, శంకరాచార్యుల శారదాపీఠ నివాస వర్ణనము మొదలయిన అంశాలు ఉన్నాయి. ఈ గ్రంథం సంస్కృత భాషలో అత్యంత
మనోహరమైన శ్లోకాలతో, కావ్య లక్షణాలతో కూడి ఉంటుంది. శంకర భక్తులు
దీనిని పారాయణ గ్రంథంగా ఉపయోగిస్తారు.
శంకరవిజయ భావప్రకాశికా (అవతరణిక)
శ్లోకం:
సర్వతంత్ర స్వతంత్రాయ సదాత్తాద్వైత వేదినే | శ్రీమతే శంకరార్యాయ వేదాంతగురవే నమః ||
భావం: అన్ని శాస్త్రములలోనూ ఆరితేరినవాడు
(సర్వతంత్ర స్వతంత్రుడు), ఎల్లప్పుడూ ఆత్మజ్ఞానమును,
అద్వైత తత్త్వాన్ని ఎరిగినవాడు, వేదాంత గురువు
అయిన శ్రీ శంకరాచార్యుల వారికి నమస్కారం.
దుఃఖమనే ఊబిలో మునిగిపోయిన ఈ జగత్తును
ఉద్ధరించాలనే గొప్ప సంకల్పంతో, పరమ దయాళువైన పరమేశ్వరుడు కింది
విధంగా ప్రతిజ్ఞ చేశాడు:
శ్లోకం:
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత | అభ్యుత్థానమధర్మస్య తదాఽఽత్మానం సృజామ్యహమ్ ||
భావం: "ఓ
అర్జునా! ధర్మానికి హాని కలిగి, అధర్మం పెచ్చుమీరినప్పుడు,
నన్ను నేను సృజించుకుంటాను (అవతరిస్తాను)."
ఈ మాటను నిలబెట్టుకోవడానికి, పురాణ ప్రమాణాల ప్రకారం:
శ్లోకం:
ఆద్యే సత్త్వమునిః సతాం వితరతి జ్ఞానం ద్వితీయే
యుగే | దత్తో ద్వాపరనామకే తు సుమతిర్వ్యాసః కలౌ
శంకరః ||
భావం: కృతయుగంలో 'సత్త్వముని'గా, త్రేతాయుగంలో
'దత్తాత్రేయుడు'గా, ద్వాపరయుగంలో 'వ్యాసుడు'గా
జ్ఞానాన్ని పంచిన ఆ పరమాత్మ, ఈ కలియుగంలో శంకరుడుగా
అవతరించాడు.
శంకర విజయ ప్రస్థానం
పై ప్రమాణాల ప్రకారం, కలియుగంలో విక్రమ శకం ప్రారంభంలో, 'ఈశ్వర'
నామ సంవత్సర వైశాఖ మాసంలో శ్రీ శంకరాచార్యుల వారు మనుష్య రూపంలో
భూమిపై అవతరించారు.
- శాస్త్ర పాండిత్యం: వారు విధిగా వేదాలను చదివి, సకల శాస్త్రాలను అభ్యసించారు. వేదవ్యాసుడు రచించిన
బ్రహ్మసూత్రాలకు, ఉపనిషత్తులకు అద్వైత పరంగా 'భాష్యాలు' రచించారు.
- మత సంస్కరణ: అద్వైత ప్రచారం కోసం వేద విరుద్ధమైన బౌద్ధ, చార్వాక వంటి దుర్మతాలను, కేవలం
కర్మకాండకే ప్రాధాన్యతనిచ్చే మీమాంసకులను వాదనలో ఓడించారు.
- మండన మిశ్ర విజయం: బ్రహ్మదేవుని అవతారమైన మండన మిశ్రుడిని వాదంలో గెలిచి, అతనికి సన్న్యాసం ఇచ్చారు. ఆయన భార్య అయిన సరస్వతీ
దేవిని కూడా తన జ్ఞానంతో వశీకృతం చేసుకున్నారు.
- శిష్య పరంపర & పీఠాలు:
శృంగేరి (ఋశ్యశృంగాశ్రమము) వంటి చోట్ల నివసిస్తూ, 12 ఏళ్ల
పాటు తన భాష్యాలను బోధించారు. సురేశ్వరాచార్య, పద్మపాద,
హస్తామలక, తోటకాచార్యులనే నలుగురు ప్రధాన
శిష్యులను నియమించారు.
- శక్తి పీఠాలు: కాంచీపురం వంటి చోట్ల ఉన్న 18 శక్తి పీఠాలలో యంత్ర ప్రతిష్ఠలు చేసి, అమ్మవారి అనుగ్రహంతో అణిమాది అష్టసిద్ధులను పొందారు. షణ్మతాలను (ఆరు
రకాల ఉపాసన పద్ధతులను) సంస్కరించి స్థాపించారు.
- చివరి ప్రయాణం: కాశ్మీర దేశానికి వెళ్లి 'సర్వజ్ఞ పీఠాన్ని' అధిరోహించారు. ఆ
తర్వాత బదరికాకాశ్రమంలో గడిపి, కేదారక్షేత్రానికి
చేరుకున్నారు.
చివరగా, దేవతలందరూ
ప్రార్థించగా, సిద్ధులు, చారణులు
స్తుతిస్తుండగా.. పరమశివుని వాహనమైన వృషభాన్ని అధిరోహించి, తన
నిజ నివాసమైన కైలాసానికి వేంచేశారు.
౧. మాతృభక్తి - ఆచార్య లక్షణం
శ్లోకం:
న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః పరదైవతమ్
భావం: గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు. ఈ
వచనం ప్రకారం అందరూ తల్లి ఆజ్ఞను ఎల్లప్పుడూ పాటించాలనే ధర్మాన్ని శంకరులు
చాటిచెప్పారు. తాను సన్న్యాసాశ్రమంలో (తుర్యాశ్రమము) ఉన్నప్పటికీ, తల్లి అంత్యక్రియలను స్వయంగా నిర్వహించి లోకానికి ఆచరించి చూపారు. తద్వారా
'లోకాచార్యుడు' అనే ఖ్యాతిని పొందారు.
ఆచార్యుడంటే ఎవరు?:
ఆచినోతి హి శాస్త్రాణి హ్యాచారే స్థాపయత్యపి | స్వయమాచరతే యస్తాత్తస్మాదాచార్య ఇష్యతే ||
భావం: శాస్త్ర విషయాలను సేకరించి, ఇతరులను ఆచార మార్గంలో
నడిపిస్తూ, తాను కూడా స్వయంగా ఆచరించి చూపేవారినే 'ఆచార్యుడు' అని అంటారు.
౨. దుర్జన నిగ్రహం - కేరళ దేశాచారం
ఆచార్యుల వారు తన తల్లి అంత్యక్రియల సమయంలో
సహాయం నిరాకరించిన కేరళ దేశస్థులకు (ఆచార భ్రష్టులైన వారికి) ఒక శాపాన్ని ఇచ్చారు.
ఆపత్కాలంలో ఉన్నవారికి పొరుగువారు తప్పక సహాయం చేయాలనే విధిని పాటించని పక్షంలో, దుర్జనులను శిక్షించడం కూడా ఆచార్యుల బాధ్యతేనని దీని ద్వారా
నిరూపించారు.
౩. గురు శిష్య సంప్రదాయం
శ్రీ శంకరాచార్యుల వారు సాక్షాత్తు శివావతారమే
అయినప్పటికీ, సకల రహస్యాలు తెలిసిన వారైనప్పటికీ.. "గురు ఉపదేశం లేకుండా ఆత్మ విచారణ చేయకూడదు"
అనే నియమాన్ని లోకానికి తెలియజేయడం కోసం శ్రీ గోవింద భగవత్పాదులను దర్శించి,
వారిని సేవించి, వారి వద్ద శిష్యరికం చేసి
గురు భక్తిని చాటారు.
౪. వైరాగ్యం మరియు పరకాయ ప్రవేశం
లోకంలోని సాంసారిక సుఖాలు అశాశ్వతమని
చాటిచెప్పడానికి వారు బ్రహ్మచర్య ఆశ్రమం నుండే నేరుగా సన్న్యాసాశ్రమాన్ని
స్వీకరించారు.
శ్లోకం:
యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః
భావం: "ఉత్తములు దేనిని
ఆచరిస్తారో, సామాన్యులు కూడా దానినే అనుసరిస్తారు" అనే
గీతాచార్యుని (శ్రీకృష్ణుని) వాక్యాన్ని మనసులో ఉంచుకుని, శంకరులు
సరస్వతీ దేవిని (ఉభయ భారతిని) వాదంలో గెలవడానికి 'పరకాయ
ప్రవేశం' ద్వారా రాజు దేహంలోకి ప్రవేశించి కామశాస్త్ర
రహస్యాలను తెలుసుకున్నారు.
దీని ద్వారా వారు తెలియజేసిన ముఖ్య ఉద్దేశ్యం
ఏంటంటే: సన్న్యాసాశ్రమంలో ఉన్నవారు స్త్రీల గురించి చర్చించడం చీకటితో సమానమని
(అజ్ఞానమని), కానీ అనుభవపూర్వకంగా సత్యాన్ని తెలుసుకున్న
వాడే నిజమైన తత్త్వజ్ఞాని అని నిరూపించారు.
౬. గురు శుశ్రూష - తోటకాచార్యుని అనుగ్రహం
భావం: కేవలం గురు సేవ (గురు శుశ్రూష) ద్వారానే విద్య లభిస్తుందని నిరూపించడం కోసం, తన సేవలో నిమగ్నమై ఉన్న తోటకాచార్యునిపై మనస్సుతోనే అనుగ్రహం
కురిపించారు. దీనివల్ల ఏ శాస్త్రము చదవకపోయినా తోటకాచార్యుడు ఒక్కసారిగా పదునాలుగు
విద్యలలో (చతుర్దశ విద్యలు) పండితుడైపోయాడు. గురు భక్తి యొక్క గొప్పతనాన్ని
శంకరులు దీని ద్వారా స్పష్టం చేశారు.
౭. ఆశ్రమ ధర్మాలు - పీఠాధిపత్యం
భావం: తాను స్వయంగా బ్రహ్మచర్య ఆశ్రమం నుండి నేరుగా సన్న్యాసాశ్రమాన్ని
స్వీకరించినప్పటికీ, గృహస్థాశ్రమంలో ఉన్న మండన
మిశ్రుడిని అనుగ్రహించి అతనికి సన్న్యాసం ఇచ్చారు. ఆ పైన ఆయనకు 'సురేశ్వరాచార్యులు' అనే నామకరణం చేసి శృంగేరి
పీఠాధిపత్యం అప్పగించారు. దీని ద్వారా సర్వజ్ఞత్వాది గుణములతో కూడిన క్రమ
సన్న్యాసులకు (గృహస్థాశ్రమం తర్వాత సన్న్యాసం తీసుకున్న వారికి) కూడా పీఠాధిపత్యం
వహించే అధికారం ఉందని లోకానికి చాటి చెప్పారు.
౮. బ్రహ్మవిద్యా అధికారం
భావం: ప్రభాకరుడు వంటి శిష్యులకు తత్త్వోపదేశం చేయడం ద్వారా, సాధన చతుష్టయ సంపత్తి (వివేకం, వైరాగ్యం
వంటివి) కలిగిన గృహస్థులకు కూడా బ్రహ్మవిద్యను అభ్యసించే అధికారం ఉంటుందని
శంకరాచార్యులు విశదీకరించారు. బ్రహ్మజ్ఞానం అనేది కేవలం సన్న్యాసులకే పరిమితం
కాదని, అర్హత గల ఎవరికైనా దక్కుతుందని నిరూపించారు.
౯. తీర్థయాత్రలు మరియు మత స్థాపన
భావం: శ్రీ భగవత్పాదులు స్వయంగా తీర్థయాత్రలు చేయడం ద్వారా, జ్ఞానులు కూడా లోకకళ్యాణం కోసం క్షేత్ర దర్శనాలు, దేవతా దర్శనాలు చేయాలని స్పష్టం చేశారు. సేతువు (రామేశ్వరం) నుండి
హిమాలయాల వరకు దేశమంతా సంచరించి, అన్యమతాలలోని దోషాలను
తొలగించి, అద్వైత మతాన్ని ప్రతిష్ఠిం చారు.
జగద్గురు పీఠాలను అధిరోహించే వారు నిరంతరం
దుర్మతాలను ఖండిస్తూ, స్వమత ధర్మాలను రక్షించడమే
ప్రధాన లక్ష్యంగా (ఐదంపర్యేణ) పనిచేయాలని వారు ఈ పర్యటనల ద్వారా మార్గనిర్దేశం
చేశారు.
ప్రేరణ
శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతులు శ్రీ విధు శేఖర
భారతీ మహా స్వామివారి ఆదేశంతో దర్శనం మాసపత్రిక సంపాదకులు శ్రీ మారుమాముల
వేంకటరమణ శర్మగారు సంస్కృతంలో ఉన్న ఈ మాధవీయ శంకర విజయాన్ని మూల వ్యాఖ్యతో సంస్కృతం
నుండి తెలుగులోకి అనువదించమని నా అదృష్టవశాత్తు
నన్ను కోరారు. వారికి కృతజ్ఞతలు తెలియ చేస్తూ
సంస్కృత భాషా విద్వాంసుడిని కాకపోయినా , సంస్కృత భాషాసేవకుడిని కనుక , “అన్నీ
శారదాంబ చూసుకొంటుంది” అను భరోసాతో అంగీకరించాను. శ్రీశ్రీశ్రీ
భారతీ తీర్థ మహాస్వామి , శ్రీ శ్రీశ్రీ విధుశేఖర భారతీ మహా స్వామివారి ఆశీస్సులతో
ఈ బృహత్కార్యం మొదలుపెడుతున్నాను.
1956లో దేవ
నాగరి లిపిలో శృంగేరి మఠం వారు ప్రచురించిన మూలమాత్రాత్మకమైన శ్రీ మచ్చంకరదిగ్విజయము
నాఈ వ్యాఖ్యానానికి ప్రధాన ఆధార గ్రంథము.అందులోని శ్లోకాలను స్వీకరించి ఈ వ్యాఖ్య వ్రాస్తున్నాను. మాధవీయ శంకర విజయ గ్రంథంలోని
గూఢమైన అర్థాలను వివరించడానికి సంస్కృతంలో ప్రధానంగా రెండు
వ్యాఖ్యానాలను పెద్దలు ప్రామాణికంగా పరిగణిస్తారు. 1.
అద్వైత రాజ్యలక్ష్మి: దీనిని అచ్యుత రాయలు రచించారు. ఇది గ్రంథంలోని
తాత్త్విక అంశాలను క్షుణ్ణంగా వివరిస్తుంది.2. డిండిమ
వ్యాఖ్యానం: దీనిని ధనపతి సూరి రచించారు. ఇది సాహిత్య పరమైన అంశాలను, వ్యాకరణ విశేషాలను వివరిస్తూ సాగుతుంది. దేవ నాగరి లిపిలో ప్రచురితమైన
ఈ రెండు గ్రంథాల సమ్మేళనాన్ని ఆనందాశ్రమ సంస్కృత గ్రంథావళివారు 1919లో ప్రచురించారు.
ఈ గ్రంథాన్ని కూడా ఈ నా వ్యాఖ్యలో ఉపయోగించుకొంటున్నాను.
కావ్యంలోకి ప్రవేశించబోయే ముందుగా 1972 లో అఖిల భారత
సేవాసమితి వారు ప్రచురించిన శ్రీ మాధవీయ మచ్చంకరదిగ్విజయము గ్రంథానికి శ్రీ జగద్గురు శృంగేరి శ్రీమదభినవ విద్యాతీర్థ స్వాముల వారు సంస్కృతములో
అనుగ్రహించిన శ్రీముఖమును తెలుగులోకి అనువదించి
వారి ఆశీస్సులు స్వీకరిస్తాను.
===============================================================
శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం, శారదా పీఠం
శృంగేరి-కడూర్, మైసూర్ స్టేట్
శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యులు, వేద వేదాంగాలలో నిష్ణాతులు, యమ నియమాది
అష్టాంగ యోగ నిష్ఠాగరిష్ఠులు, తపశ్చక్రవర్తులు, అనాదిగా వస్తున్న శ్రీ శంకరాచార్య గురు పరంపరను పొందినవారు, షడ్దర్శన స్థాపనాచార్యులు, వ్యాఖ్యాన
సింహాసనాధీశ్వరులు, సకల వేద శాస్త్ర సారము తెలిసినవారు,
సాంఖ్యత్రయ ప్రతిపాదకులు, వైదిక మార్గ
ప్రవర్తకులు, సర్వతంత్ర స్వతంత్రులు, విద్యానగర
మహారాజధాని మరియు కర్ణాటక సింహాసన ప్రతిష్ఠాపనాచార్యులు, శ్రీమద్రాజాధిరాజ
గురువులు, భూమండలాచార్యులు, శృంగేరి
పురాధీశ్వరులు, తుంగభద్రా తీరవాసులు, శ్రీ
విద్యశంకర పాదపద్మ ఆరాధకులు అయిన...శ్రీ జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి
వారి కరకమల సంజాతులైన (అనగా వారి శిష్యులైన) శ్రీ జగద్గురు శృంగేరి శ్రీమదభినవ
విద్యాతీర్థ స్వాముల వారుఅనుగ్రహించిన ॥ శ్రీముఖము ॥
తత్వచింతన చేసే భారతీయులందరూ జీవుడు నిత్యుడు అని
అంగీకరిస్తారు. ఆ జీవుడు అవిద్య (అజ్ఞానం), కోరికలు, మరియు
కర్మలకు వశుడై అనుభవం కోసం రకరకాల శరీరాలను ధరిస్తుంటాడు. జీవుడు స్వతహాగా పుట్టుక
లేనివాడైనప్పటికీ, అజ్ఞానం వల్ల కలిగిన ఈ శరీర సంబంధం
కారణంగా తాను పుట్టానని, మరణిస్తున్నానని
భావిస్తుంటాడు. అదే అవిద్య వల్ల తన నిజస్వరూపాన్ని మర్చిపోయి, నానా రకాల దుఃఖాలను అనుభవిస్తూ, ఏమి చేయాలో పాలుపోక బాధపడుతుంటాడు.
అలాంటి జీవుడిని ఉద్ధరించడం కోసమే భగవంతుడు ప్రవృత్తి, నివృత్తి అనే లక్షణాలు గల ధర్మాన్ని ఉపదేశించాడు. లోకంలో
బాహ్య విషయాల పట్ల ఆసక్తి ఉన్నవారు ఎక్కువవడంతో, ఆ ధర్మం
కేవలం మానవ బుద్ధికి తోచినట్లుగా వ్యాఖ్యానించబడి వక్రీకరించబడింది. దీనివల్ల
లోకంలో ధర్మ సంస్కారాలు తగ్గిపోయి యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి. శాంతి వంటి
సద్గుణాలు అంతరించిపోయాయి. స్వర్గమోక్షాల పట్ల ఆశ లేకుండా పోయింది. కామక్రోధాది
శత్రువుల ప్రభావం వల్ల ఇహలోక జీవితంలో కూడా సుఖం కరువైంది. రకరకాల వ్యక్తులు
కల్పించిన తప్పుడు మతాలపై నమ్మకం ఉంచినప్పటికీ, మనశ్శాంతి
లభించక ప్రజలు తమ జన్మను వృధా చేసుకున్నారు.
ఆ సమయంలో, భగవంతుడైన పరమశివుడు శ్రీ
శంకరాచార్యుల రూపంలో అవతరించి వేదోక్తమైన ధర్మాన్ని సుస్థిరం చేసారు. అందుకే నేటికీ మనం భారతదేశంలో వైదిక సంప్రదాయాన్ని చూడగలుగుతున్నాం,
ఆచరించగలుగుతున్నాం. మరియు స్వర్గమోక్షాలను
పొందగలుగుతున్నాం.
అలాంటి పరమాచార్యుల జీవిత చరిత్రను
తెలుసుకోవాలని, స్మరించుకోవాలని కోరిక ఉన్నప్పటికీ,
సరైన పుస్తకాలు అందుబాటులో లేకపోవడం మనస్తాపాన్ని కలిగిస్తుంది.
ఆచార్యుల చరిత్రను తెలిపే కొన్ని కావ్యాలు ఉన్నప్పటికీ, వాటిలో
'మాధవీయ శంకర విజయం' అనే కావ్యం చాలా కాలంగా
సేతు హిమాచలం వరకు పండితులందరిచే ప్రమాణంగా అంగీకరించబడింది. శ్రీ శంకర జయంతి వంటి
సమయాల్లో పారాయణలకు, ప్రవచనాలకు దీనినే ఉపయోగిస్తున్నారు.
భగవత్పాదులు స్థాపించిన నాలుగు ఆమ్నాయ పీఠాల అధిపతులు కూడా ఈ కావ్యాన్ని ఎంతో
కాలంగా ఆమోదిస్తున్నారు.
ఇంతటి విశిష్టమైన కావ్యాన్ని ఆంగ్ల భాష తెలిసిన
వారు కూడా చదివి తెలుసుకోవాలనే సంకల్పంతో, భగవత్పాదుల పై భక్తితో, మా ప్రియ శిష్యులు మరియు ధర్మ కార్య నిరతులైన శ్రీ సుబ్బరత్నయ్య గారు ఆంగ్లానువాదాన్ని రచించారు. దీనిని చూసి మేము ఎంతో సంతోషిస్తున్నాము, వారిని అభినందిస్తున్నాము.
అనువాదంతో కూడిన ఈ కావ్యం అంతటా శంకర భక్తిని
పెంపొందిస్తూ, ప్రజలను ధర్మ మార్గంలో ప్రేరేపిస్తూ,
సహృదయులకు ఆనందాన్ని కలిగిస్తూ చిరకాలం ప్రకాశించాలని
కోరుకుంటున్నాము. శ్రీ సుబ్బరత్నయ్య గారు మరియు వారి వంశీయులు ఆయురారోగ్య
ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదిస్తున్నాము.
శృంగగిరి (శృంగేరి) 29-08-1972
ఇతి నారాయణ స్మరణం (నారాయణ స్మరణలతో..)
=======================================================
ఆ శ్రీ జగద్గురు శృంగేరి శ్రీమదభినవ విద్యాతీర్థ
స్వాముల ఆశీర్వచన కాంతులు ఈ
తెలుగు వ్యాఖ్యపై కూడా సదా ప్రసరించాలని వారి పాద పద్మములకు నమస్కరిస్తూ శ్రీ విద్యారణ్య
వాణీ సేవాప్రాంగణమయిన శ్రీ శ్రీమచ్ఛంకర దిగ్విజయమను అనువాద దేవాలయములోకి అడుగుపెడుతున్నాను.
==================================
శ్రీమచ్ఛంకర దిగ్విజయము - ప్రథమ సర్గ (ఉపోద్ఘాతము)
శ్లోకం 1:
ప్రణమ్య పరమాత్మానం శ్రీవిద్యాతీర్థరూపిణమ్ ।
ప్రాచీనశంకరజయే సారః సంగృహ్యతే స్ఫుటమ్ ॥
తాత్పర్యం:
శ్రీ విద్యాతీర్థ రూపంలో ఉన్న పరమాత్మకు (తన గురువుకు)
నమస్కరించి, పూర్వకవులు రచించిన శంకర విజయాలలోని ప్రధాన సారాంశాన్ని గ్రహించి, ఈ గ్రంథాన్ని స్పష్టంగా రచిస్తున్నాను.
వ్యాఖ్య
గురువే దైవం (శ్రీ విద్యాతీర్థ రూపం)
ఇక్కడ పరమాత్మను 'శ్రీ విద్యాతీర్థ రూపం' లో ఉన్నవారిగా వర్ణించారు. దీని ద్వారా రెండు
ముఖ్యాంశాలు సూచించబడ్డాయి:
- తన గురువుగారైన శ్రీ
విద్యాతీర్థ స్వామి సాక్షాత్తు
ఈశ్వరావతారమని, అందువల్లనే
వారు సర్వజ్ఞులని (అన్నీ తెలిసినవారని) చెప్పారు.
- పరమాత్మ పట్ల, గురువు
పట్ల సమానమైన భక్తి ఉన్నప్పుడే మోక్షం లభిస్తుందని ధ్వనింపజేశారు.
శ్రుతి ప్రమాణం: "యస్య దేవే పరా భక్తిః యథా దేవే తథా
గురౌ..." ఎవరికైతే దేవుని పట్ల ఎంతటి భక్తి ఉంటుందో, గురువు పట్ల కూడా అంతటి భక్తి ఉంటుందో, అటువంటి మహాత్ములకు మాత్రమే వేదాంత రహస్యాలు
అర్థమవుతాయి.
'శ్రీ విద్యాతీర్థ' పదానికి మరొక అర్థం
తార్కికులు తమ కుతర్కాలతో మలినం చేసిన 'విద్య'ను (సరస్వతీ దేవిని), ఆ మాలిన్యాన్ని కడిగివేసి శుద్ధి చేసిన
పవిత్రమైన తీర్థం వంటివారు కాబట్టి ఆయన 'విద్యాతీర్థులు'. బ్రహ్మవిద్య అనే సంపద
(శ్రీ) తో కూడి ఉన్నందున భగవత్పాదులను 'శ్రీ విద్యాతీర్థ రూపం' అని పిలిచారు.
దీనినే సంక్షేప శారీరక గ్రంథకర్త ఇలా కొనియాడారు: "ఎవరిని ఆశ్రయించడం వల్ల నిత్యమైన సరస్వతీ దేవి
తన నిజమైన అర్థాన్ని పొందిందో, కుతర్కాలనే బురదను కడిగివేసిందో, అటువంటి శంకరాచార్యుల పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను."
శివావతార నిరూపణ
శ్రీ శంకర భగవత్పాదులు సాక్షాత్తు పరమశివుని అవతారమని శివపురాణం వంటి గ్రంథాలు నిరూపిస్తున్నాయి.
"వ్యాస సూత్రాలకు అర్థం చెబుతూ, వేదాల పరమార్థాన్ని వివరించే శంకరుడు సాక్షాత్తు
శివుడే కానీ మరెవరో కాదు."అని శివపురాణ వాక్యం.
పరమాత్మ స్వరూపం (వేదాంతార్థం):
మరొక విధంగా చెప్పాలంటే, ప్రత్యగాత్మ (జీవాత్మ) కంటే భిన్నం కాని ఆ
పరమేశ్వరుడినే ఇక్కడ 'శ్రీవిద్యాతీర్థరూపిణమ్' అని పిలిచారు.
- శ్రీ: అంటే మాయ.
- విద్య: అనే శబ్దం
ద్వారా 'పర విద్య' (బ్రహ్మజ్ఞానం)
మరియు 'అపర విద్య' (లౌకిక
జ్ఞానం) అని అర్థం. వీటి ద్వారా పొందే మోక్షం మరియు దేవలోకాలను కూడా ఇక్కడ
గ్రహించాలి.
- తీర్థ:
'విశ్వకోశం' అనే
నిఘంటువు ప్రకారం 'తీర్థ' శబ్దానికి శాస్త్రము, యజ్ఞము, పుణ్యక్షేత్రము, పాత్రత
(యోగ్యత),
ఉపాధ్యాయుడు, మంత్రి, ఋషులు సేవించిన జలము అని అనేక అర్థాలు ఉన్నాయి.
అందువల్ల, 'శ్రీవిద్యాతీర్థరూపిణమ్' అంటే ఈ సమస్తమైన శాస్త్ర, క్షేత్ర, జ్ఞాన స్వరూపమైన సర్వాత్మకమైన బ్రహ్మము అని
అర్థం. "సర్వం ఖల్విదం బ్రహ్మ" (ఈ సమస్తమూ బ్రహ్మమే), "ఏకమేవాద్వితీయం" (ఉన్నది ఒక్కటే, రెండోది లేదు) అనే శ్రుతి వాక్యాల ప్రకారం ఆ
పరమాత్మయే ఇదంతా.
గ్రంథ ప్రయోజనం:
శ్రీ శంకర విజయమును నిరూపించడం అంటే, శంకరులు బోధించిన 'బ్రహ్మాత్మైక్య భావన' (జీవుడు, బ్రహ్మము ఒక్కటే అనే సత్యం) యొక్క విజయాన్ని చాటడమే.
- విషయం: తెలియని ఆ
బ్రహ్మ తత్వమే ఈ గ్రంథానికి 'విషయం'.
- ప్రయోజనం: ఆ
తత్వాన్ని తెలుసుకోవడమే పరమ 'ప్రయోజనం'.
- అవాంతర ప్రయోజనం: ఆచార్యుల
విజయగాథను తెలుసుకోవడం ఒక మధ్యంతర ప్రయోజనం.
అలంకార విశేషం: ఇక్కడ ఒకే శబ్దానికి అనేక అర్థాలు వచ్చేలా
పదప్రయోగం చేయడం వల్ల 'శ్లేషాలంకారము' అని పిలుస్తారు. "నానార్థసంశ్రయః శ్లేషః" అని దీని లక్షణం.
మంగళాచరణ నియమం:
కావ్యం ప్రారంభంలో దేవతావాచక శబ్దాలను లేదా 'భద్ర' వంటి శుభప్రదమైన పదాలను వాడాలి. అటువంటి పదాలు ఛందస్సు లేదా గణాల పరంగా ఎలాంటి
దోషాలు ఉన్నా నింద్యమైనవి కావు (అంటే అవి ఎప్పుడూ శుభాన్నిస్తాయి). అందుకే
విద్యారణ్య స్వామివారు పరమాత్మ ప్రార్థనతో
కావ్యాన్ని ప్రారంభించారు.
శ్లోకం 2:
యద్వద్ఘటానాం పటలో విశాలో విలోక్యతే౽ల్పే కిల దర్పణే౽పి ।
తద్వన్మదీయే లఘుసంగ్రహే౽స్మిన్నుద్వీక్ష్యతాం
శాంకరవాక్యసారః ॥
తాత్పర్యం:
ఒక చిన్న అద్దంలో కూడా పెద్ద పెద్ద ఏనుగుల గుంపు
లేదా కుండల సమూహం ప్రతిబింబించినట్లుగా, నా ఈ చిన్న గ్రంథంలో (సంక్షేప శంకర విజయం)
శ్రీశంకరుల జీవితంలోని ప్రధాన అంశాలన్నీ ప్రతిబింబిస్తాయి. పాఠకులు ఇందులో శంకర
చరిత్ర సారాన్ని దర్శించవచ్చు.
వ్యాఖ్య
అద్దం - ప్రతిబింబం
ప్రశ్న (శంక): "ప్రాచీన శంకర విజయ కావ్యాలలో ఉన్న భగవత్పాదుల
అమూల్యమైన వాక్యాల సారాన్ని, నీవు రచించిన ఈ అతి చిన్నదైన (లఘు) సంగ్రహ
గ్రంథంలో చూడటం ఎలా సాధ్యం?" అని ఎవరైనా ప్రశ్నిస్తే, దానికి విద్యారణ్య స్వామివారు ఇక్కడ సమాధానం ఇస్తున్నారు:
సమాధానం: ఒక చిన్న అద్దంలో కూడా అతిపెద్దవైన కుంభాలు
(ఘటములు), ఏనుగుల సమూహాలు (కరిఘటలు) లేదా పర్వత శిఖరాలు (అద్రిశృంగములు) ఎలాగైతే
స్పష్టంగా కనిపిస్తాయో.. అలాగే నా ఈ చిన్న గ్రంథంలో కూడా శంకర భగవత్పాదుల వాక్యాల
సారాన్ని మీరు సమగ్రంగా దర్శించవచ్చు.
విశేషార్థాలు:
- ఉపమాలంకారం: ఇక్కడ
అద్దం మరియు గ్రంథాన్ని పోల్చడం ద్వారా కవి 'ఉపమాలంకారాన్ని' ప్రయోగించారు.
సామాన్య ధర్మాన్ని బట్టి రెండు వస్తువులను పోల్చడమే ఉపమ.
- ఛందస్సు: ఈ శ్లోకం 'ఉపజాతి'
వృత్తంలో ఉంది. ఇంద్రవజ్ర మరియు ఉపేంద్రవజ్ర అనే రెండు
ఛందస్సుల కలయికనే ఉపజాతి అంటారు.
- శబ్దార్థము (ఘటానామ్): 'మేదిని' నిఘంటువు ప్రకారం 'ఘట' అనే శబ్దానికి కేవలం కుండ అనే అర్థమే కాకుండా, ఏనుగుల సమూహం అనే అర్థం కూడా ఉంది. అంటే అద్దంలో ఏనుగుల వంటి భారీ రూపాలు
కూడా ఇమిడిపోయినట్లుగా, ఈ చిన్న
గ్రంథంలో శంకరుల మహత్తర చరిత్ర ఇమిడి ఉందని భావం.
- శాంకరవాక్యసారః: ఇక్కడ శంకర
వాక్యాలు అంటే భగవత్పాదులవే కాకుండా, వారి
ప్రశిష్యుడైన ఆనందగిరి వంటి వారు రాసిన గ్రంథాలలోని సారాంశాన్ని కూడా గ్రహించినట్లు భావించవచ్చు.
శ్లోకం 3:
యథా౽తిరుచ్యే మధురే౽పి రుచ్యుత్పాదాయ
రుచ్యాంతరయోజనార్హా ।
తథేష్యతాం ప్రాక్-కవి-హృద్య-పద్యేష్వేషా౽పి
మత్పద్య-నివేశభంగీ ॥
తాత్పర్యం:
చాలా తీపిగా ఉన్న పదార్థాన్ని తింటున్నప్పుడు
కూడా, రుచిని మరింత పెంచడానికి మధ్యలో కొంచెం ఉప్పగా లేదా కారంగా ఉండే పదార్థం ఎలా తోడ్పడుతుందో, అలాగే పూర్వకవుల అద్భుతమైన కావ్యాల మధ్యలో నా ఈ
సామాన్యమైన శ్లోకరచన కూడా పాఠకులకు ఒక కొత్త రుచిని, ఆనందాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాను.
వ్యాఖ్య
ప్రశ్న (శంక): "మధురమైన ప్రాచీన శంకర విజయ కావ్యాలు ఇప్పటికే
ఉండగా, మళ్ళీ ఈ కొత్త రచన ఎందుకు? ఇది వ్యర్థం (వైయర్థ్యం) కాదా?" అని ఎవరైనా అడిగితే, దానికి సమాధానం ఈ శ్లోకంలో ఉంది:
సమాధానం: ఎంతటి మధురమైన, ఇష్టమైన తియ్యటి పదార్థం (పాయసం వంటిది)
తింటున్నా, మధ్యమధ్యలో రుచిని మార్చడానికి, ఆ మధురాన్ని మరింత ఆస్వాదించడానికి కొంచెం ఉప్పగా ఉండే పదార్థం ఎలా అవసరమో, ఇక్కడ నా రచన కూడా అటువంటిదే.
విశేషార్థాలు:
- రుచ్యంతర యోజన: తీపి పదార్థం
తిన్నతరువాత నోరు మొద్దుబారకుండా ఉండటానికి 'నిమ్మరసం' (నింబూరస)
వంటి పుల్లని లేదా ఉప్పని పదార్థాలను ఎలా ఉపయోగపడి రుచిని పెంచుతాయో (రుచ్యుత్పాదాయ), నా ఈ సాధారణ పద్యాల అమరిక (మత్పద్య నివేశ భంగీ) కూడా ప్రాచీన కవుల
మనోజ్ఞమైన పద్యాల పట్ల పాఠకులకు మళ్ళీ కొత్త ఆసక్తిని, రుచిని కలిగిస్తుందని విద్యారణ్యస్వామి వారి
భావం.
- వినమ్రత: పూర్వ కవుల
పద్యాలు 'మధురమైనవి' అని చెబుతూ, తన పద్యాలు ఆ మధురాన్ని ఆస్వాదించడానికి తోడ్పడే 'రుచ్యంతరాలు' మాత్రమేనని కవి తన
వినయాన్ని చాటుకున్నారు.
శ్లోకం 4:
స్తుతో౽పి సమ్యక్ కవిభిః పురాణైః కృత్యా౽పి నస్తుష్యతు భాష్యకారః ।
క్షీరాబ్ధివాసీ సరసీరుహాక్షః క్షీరం పునః కిం
చకమే న గోష్ఠే ॥
తాత్పర్యం:
పూర్వకవులందరూ భాష్యకారులైన శ్రీశంకరులను ఎంతో
గొప్పగా స్తుతించారు. అయినప్పటికీ, నా ఈ వినయపూర్వకమైన రచనతో ఆయన సంతుష్టుడు
అవుతారని నమ్ముతున్నాను. సాక్షాత్తు క్షీరసముద్రంలో నివసించే ఆ కమలలోచనుడైన
విష్ణుమూర్తి, కృష్ణావతారంలో గోపికల ఇళ్లలోని పాలను కోరుకోలేదా? (అంటే భగవంతుడు అర్పించే వస్తువు కంటే భక్తినే చూస్తారని భావం).
వ్యాఖ్య
ప్రశ్న (శంక): "పూర్వకాలం నుండి ఎందరో మహర్షులు, గొప్ప కవులు శంకర భగవత్పాదులను (భాష్యకారులను) అత్యద్భుతమైన స్తోత్రాలతో
స్తుతించారు. మరి నీవు చేసే ఈ స్వల్పమైన రచనతో ఆ మహానుభావుడు ఎలా తృప్తి చెందుతాడు?" అని ఎవరైనా ప్రశ్నిస్తే, దానికి సమాధానం ఇక్కడ ఉంది:
సమాధానం: సాక్షాత్తు పరమేశ్వరుడైన శంకరుడు 'ఆప్తకాముడు' (అన్ని కోరికలు తీరినవాడు). ఆయనకు కావాల్సింది పాండిత్యం కాదు, భక్తి. భక్తితో సమర్పించేది చిన్నదైనా ఆయనకు అది ఎంతో ప్రీతిని కలిగిస్తుంది.
విశేషార్థాలు:
- బహువచన ప్రయోగం: ఇక్కడ 'నః'
(మమ్ములను/మా యొక్క) అనే బహువచనాన్ని వాడారు. ఇది రచయిత
యొక్క వాక్కు, మనస్సు మరియు కాయము (శరీరము) అనే త్రికరణాలను సూచిస్తుంది. అంటే తన సర్వస్వాన్ని అర్పించి ఈ రచన
చేస్తున్నానని భావం.
- క్షీరాబ్ధివాసీ - గోష్ఠే: దీనికి విద్యారణ్యస్వామి వారు ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు.
సాక్షాత్తు క్షీరసముద్రంలో నివసించేవాడు, పద్మముల వంటి కన్నులు కలిగినవాడు అయిన ఆ విష్ణుమూర్తి, కృష్ణావతారంలో ఉన్నప్పుడు ఆనందంతో 'గోష్ఠము' (గోపికల నివాస ప్రాంతం) లో గోపికలు భక్తితో ఇచ్చే కొద్దిపాటి పాలను ఎందుకు
కోరుకున్నాడు? తన వద్ద
పాల సముద్రమే ఉన్నా, గోపికల
ప్రేమతో కూడిన ఆ స్వల్ప క్షీరం ఆయనకు పరమానందాన్ని ఇచ్చింది.
- దృష్టాంతాలంకారం: పూర్వకవుల
స్తుతిని 'క్షీరసముద్రం'తోనూ, తన అల్పమైన స్తుతిని గోపికల ఇళ్లోని 'చిన్న గిన్నె పాలు'తోనూ
పోల్చడం వల్ల ఇక్కడ 'దృష్టాంతాలంకారం' ఏర్పడింది. బింబ-ప్రతిబింబ భావం (ఒకదానిని చూసి మరొకటి గుర్తుకు రావడం)
ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది.
శ్లోకం 5:
పయోబ్ధివివరీసునిఃసృతసుధాఝరీ మాధురీ-
ధురీణభణితాధరీకృతఫణాధరాధీశితుః ।
శివంకరసుశంకరాభిధజగద్గురోః ప్రాయశో
యశో
హృదయశోధకం కలయితుం సమీహామహే ॥
తాత్పర్యం: క్షీరసముద్రం నుండి ఉద్భవించిన అమృత ధారల
మాధుర్యాన్ని మించినది, సాక్షాత్తు ఆదిశేషుడు కూడా గర్వపడేంతటి
అద్భుతమైన వాక్చాతుర్యం కలిగినది అయిన జగద్గురువు శ్రీశంకరుల కీర్తిని
వర్ణించడానికి నేను ( విద్యారణ్యస్వామి వారు )ప్రయత్నిస్తున్నాను.
వారి చరిత్రను కీర్తించడం మన హృదయాలను శుద్ధి చేస్తుంది.
1. నామ వైశిష్ట్యం (శివంకర - సుశంకర): భగవత్పాదులైన భాష్యకారులకు 'శివంకరుడు' మరియు 'సుశంకరుడు' అనే పేర్లు ఎందుకు వచ్చాయో ఇక్కడ వివరిస్తున్నారు:
- శివంకర: 'శివం' అంటే మంగళం లేదా సుఖం. లోకానికి మంగళాన్ని కలిగించేవాడు కాబట్టి ఆయన
శివంకరుడు.
- సుశంకర: అత్యంత
శ్రేష్ఠమైన రీతిలో సుఖాన్ని ప్రసాదించేవాడు కాబట్టి ఆయన 'సుశంకరుడు'. అలాంటి
జగద్గురువు యొక్క యశస్సును (కీర్తిని) వర్ణించడానికి, తద్వారా మన హృదయాలను శుద్ధి చేసుకోవడానికి (హృదయ శోధకం) మేము
ప్రయత్నిస్తున్నాము. ఇక్కడ 'సమీహామహే' అంటే కేవలం కోరుకోవడం మాత్రమే కాదు, ఆ దిశగా
గొప్ప ప్రయత్నం (సమ్యక్ చేష్ట) చేస్తున్నాము అని అర్థం.
2. వాక్చాతుర్యం (అమృత మాధుర్యం): శంకరుల వాక్కులు ఎంతటి మధురమైనవో ఒక అద్భుతమైన
పోలికతో విద్యారణ్యస్వామి వారు వివరించారు:
- క్షీరసముద్రం లోపల ఉండే అతి సూక్ష్మమైన రంధ్రాల (వివరీభ్యః) నుండి అతి
సున్నితంగా ప్రవహించే అమృత ధారల
మాధుర్యాన్ని కూడా
మించిపోయేవి శంకరుల భాషితాలు.
- ఆయన మాటల ముందు సాక్షాత్తు వెయ్యి తలల ఆదిశేషుడు (సర్పాధిపతి) కూడా తల
వంచుకోవాల్సిందే. అంటే, ఆదిశేషుడి
పాండిత్యం కూడా శంకరుల వాక్ ప్రవాహం ముందు చిన్నబోతుంది.
3. సాహిత్య విశేషాలు (శబ్దాలంకారం మరియు ఛందస్సు): ఈ శ్లోకంలో కవి మాధవాచార్యులవారు అద్భుతమైన కవితా శిల్పాన్ని
ప్రదర్శించారు:
- వృత్త్యనుప్రాస: ఈ శ్లోకంలో
'ర'
అనే అక్షరం పదే పదే రావడం వల్ల (రేఫస్య అసకృదావృత్యా)
వినడానికి ఎంతో ఇంపుగా ఉంటుంది. దీనిని 'శబ్ద టంకారము' అని కూడా
అంటారు.
- పృథ్వీ వృత్తం: ఈ శ్లోకం 'పృథ్వీ'
అనే ఛందస్సులో ఉంది.
శ్లోకం 6
కేమే శంకరసద్గురోర్గుణగణా దిగ్జాలకూలంకషాః
కాలోన్మీలితమాలతీపరిమలావష్టమ్భముష్టింధయాః |
క్వాహం హంత తథాఽపి సద్గురుకృపాపీయూషపారంపరీ-
మగ్నోన్మగ్నకటాక్షవీక్షణబలాదస్తి
ప్రశస్తాఽర్హతా || 6 ||
తాత్పర్యం
నది రెండు గట్లు తెంచుకుని ప్రవహించే వరదలాగా, శంకరాచార్యులవారి కీర్తి దిగంతాలకు వ్యాపించింది.
వసంత, శరదృతువులలో వికసించి సువాసనలు
వెదజల్లే మల్లెపూలు సైతం, గురువుగారి సద్గుణాల పరిమళం ముందు
వెలవెలబోయి సిగ్గుపడుతున్నాయి. (అనగా ఆయన గుణాలు మల్లెపూల కన్నా పవిత్రమైనవి,
సుగంధభరితమైనవి).
"అంతటి మహానుభావుడి చరిత్ర రాయడానికి
నేనెంతటివాడిని? నా శక్తి చాలా స్వల్పం. కానీ, నా గురువుగారి కరుణాకటాక్షం అనే అమృతం నాపై కురుస్తోంది. ఆ కృపా బలంతోనే
నేను ఈ పవిత్ర చరిత్రను పూర్తి చేయగలను"
వ్యాఖ్య
'సదేవ సోమ్యేదమగ్ర ఆసీదేకమేవాద్వితీయమ్'
(ఓ సౌమ్యుడా! సృష్టికి పూర్వం అద్వితీయమైన పరమాత్మ ఒక్కడే ఉన్నాడు)
వంటి శ్రుతి వాక్యాల ద్వారా బోధించబడే అద్వైత తత్త్వాన్ని ఉపదేశించే సద్గురువుల
(శంకరాచార్యుల) గుణగణాలను ఇక్కడ వర్ణిస్తున్నారు.
పదాల అర్థ వివరణ:
- గుణగణాః: సత్పురుషులకు గురువైన ఆ శంకరాచార్యుల యొక్క గుణాల సమూహాలు.
- దిగ్జాలకూలంకషాః: దిక్కులనే గట్లను ఒరిపిడి చేసేవి (అనగా దిగంతాల వరకు
వ్యాపించినవి అని అర్థం). వ్యాకరణ రీత్యా ఇక్కడ 'ఖచ్' ప్రత్యయం, 'ముమ్' ఆగమం వచ్చాయి.
- కాలోన్మీలితమాలతీ...: సమయానుకూలంగా వికసించిన మాలతీ (జాజి) పూల పరిమళం
యొక్క గర్వాన్ని అణచివేసేవి. అనగా, ఈ
గుణాల సువాసన వికసించిన పూల సువాసన కంటే కూడా మిన్నగా ఉండి, మనస్సుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని భావం.
కవి వినయం:
- క్వాహం: అత్యంత అల్పుడనైన నేను ఎక్కడ? (వ్యాఖ్యానంలో 'హంత' అనేది
ఇక్కడ ఖేదాన్ని లేదా ఆశ్చర్యాన్ని సూచిస్తుంది).
- తథాపి: అయినప్పటికీ, లోకప్రసిద్ధులైన
ఆ శంకర సద్గురువుల కృప అనే అమృత ప్రవాహంలో మునిగి తేలే (మగ్నోన్మగ్న) వారి
కటాక్ష వీక్షణాల వల్ల నాకు ఈ కావ్యాన్ని రచించే గొప్ప యోగ్యత కలిగింది.
సాహిత్య విశేషాలు (అలంకారాలు):
- ఇక్కడ పరస్పర విరుద్ధమైన అంశాల (అల్పుడైన కవికి, గొప్పదైన గుణవర్ణనకు) కలయికను వర్ణించడం వల్ల 'విషమ అలంకారం' ఉంది.
- అలాగే, తన అశక్తతను చెప్పుకుంటూనే గురుకృప
వల్ల సాధ్యమైందని చెప్పడం ద్వారా 'ఆక్షేప అలంకారం'
కూడా కనిపిస్తుంది.
- ఈ రెండు అలంకారాలు కలిసి ఉండటం వల్ల దీనిని 'సంకర అలంకారం' అని అంటారు.
ఛందస్సు:
- ఈ శ్లోకం 'శార్దూలవిక్రీడితము'
అనే ఛందస్సులో వ్రాయబడింది.
దిగ్జాలకూలంకషాః
(దిక్కులనే గట్లను ఒరిపిడి చేసేవి):
- అర్థం: 'దిక్' అంటే
తూర్పు మొదలైన దిక్కుల సమూహం. ఈ గుణగణాలు నదీ ప్రవాహం తన గట్లను (కూలములను)
ఎలాగైతే ఒరిపిడి చేస్తూ ప్రవహిస్తుందో, అలా దిగంతాల
వరకు విస్తరించి ఉన్నాయి.
- విశేషం: దీని ద్వారా శంకరాచార్యుల గుణాల అనంతత్వం సూచించబడుతోంది. అవి
ఎక్కడో ఒకచోట ఆగిపోయేవి కావు, దిక్కులనే
హద్దులను కూడా దాటి వెళ్లేవి అని భావం.
కాలోన్మీలితమాలతీ... (సమయానికి వికసించిన మాలతీ పరిమళం):
- కాలం: వసంతం వంటి ఆయా ఋతువుల ప్రభావం చేత, సమయం వచ్చినప్పుడు వికసించే మాలతీ పూలు.
- మాలతీ: అమరకోశం ప్రకారం "సుమనా మాలతీ జాతిః" - అంటే మాలతీ లేదా
జాజి పువ్వులు. ఇవి వసంత, గ్రీష్మ
ఋతువులలో తమ సహజసిద్ధమైన పరిమళాన్ని వెదజల్లుతాయి.
- పరిమళం: అమరకోశం ("విమర్దేత్థే పరిమలో గంధే జనమనోహరే")
ప్రకారం.. వికసించిన పూల నుండి వచ్చే మనోహరమైన సువాసన అని అర్థం.
ముష్టింధయాః
(ముష్టిని తాగే పసిబిడ్డల వంటివి):
- భావం: పసిపిల్లలు (స్తనధయులు) తమ గుప్పిటను నోట్లో పెట్టుకుని ఎలాగైతే
పాలు తాగుతారో, ఈ
శంకరాచార్యుల గుణాల సువాసన కూడా మాలతీ పూల పరిమళం యొక్క గర్వాన్ని ఆ విధంగా
అణచివేసి/తాగేస్తోంది.
- అంటే, ఆ పూల సువాసన కంటే గురువుగారి గుణాల
పరిమళమే అత్యంత గొప్పది మరియు శక్తివంతమైనది.
సద్గురుః
(బ్రహ్మ నిష్ఠ కలిగిన గురువు):
- శ్రుతి ప్రమాణం: "బ్రహ్మవిద్
బ్రహ్మైవ భవతి" (బ్రహ్మమును తెలిసినవాడు బ్రహ్మమే అవుతాడు) అనే వేద
ప్రమాణం ప్రకారం.. ఇక్కడ 'సద్గురువు' అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన శంకరాచార్యుల వారు అని అర్థం.
సారాంశం
ఈ వ్యాఖ్యానం శంకరాచార్యుల గుణాలను అనంతమైనవిగా మరియు ప్రకృతి
సిద్ధమైన సువాసనల కన్నా మిన్నయైనవిగా వర్ణిస్తోంది. గురువుగారిని కేవలం ఒక
వ్యక్తిగా కాకుండా, సాక్షాత్తు పరబ్రహ్మగా
భావించాలని ఈ టీక స్పష్టం చేస్తోంది.
శ్లోకం 7
ధన్యంమన్యవివేకశూన్యసుజనంమన్యాబ్ధికన్యానటీ-
నృత్యోన్మత్తనరాధమాధమకథాసంమర్దదుష్కర్దమైః |
దిగ్ధాం మే గిరమద్య
శంకరగురుక్రీడాసముద్యద్యశః-
పారావారసముచ్చలజ్జలఝరైః సంక్షాలయామి స్ఫుటమ్ ||
7 ||
ఇందులో కవి తన వాక్కును (మాటను) ఎలా శుద్ధి చేసుకుంటున్నారో
చెబుతూ లోకంలోని
అల్పులైన మనుషుల స్వభావము ఎలా ఉన్నదో చాలా చక్కగా వివరించారు.
తాత్పర్యం
ఇంతకాలం
నేను లోకంలో ఉన్న అల్పమైన మనుషులను స్తుతించాను. అసలు దాతృత్వమే లేనివారిని గొప్ప
దాతలని పొగిడాను. తమను తాము గొప్పగా భావించుకునే అహంకారులను, చంచలమైన లక్ష్మీకటాక్షం (డబ్బు) ఉందన్న గర్వంతో ఉన్నవారిని కీర్తించాను. ఆ
అబద్ధపు పొగడ్తల వల్ల నా నాలుక అపవిత్రమై, బురదలో
కూరుకుపోయినట్లు ఉంది."శ్రీ శంకరాచార్యుల వారి దివ్య
లీలా విశేషాలు ఒక మహాసముద్రం వంటివి. ఆ పవిత్రమైన గాథలను గానం చేయడం ద్వారా,
నా నాలుకకు అంటుకున్న ఆ అపవిత్రతను కడిగి
వేసుకోవాలనుకుంటున్నాను."
వ్యాఖ్య
1. లోకంలోని మనుషుల స్వభావం (దుర్జన వర్ణన):
- ధన్యమ్మన్య: ఏమీ సాధించకపోయినా, తనను
తాను చాలా గొప్పవాడినని (ధన్యుడినని) భావించుకునేవాడు.
- సుజనమ్మన్య: వివేకం శూన్యమైనా, దుర్జనుడైనా
సరే.. తనను తాను 'సజ్జనుడు' అని
లోకానికి చెప్పుకునేవాడు.
- అబ్ధికన్యానటీ: సముద్ర పుత్రిక అయిన లక్ష్మీదేవి (సంపద). సంపద అనేది ఒక
నర్తకి (నటి) వంటిది, ఎందుకంటే
అది ఒకచోట స్థిరంగా ఉండదు, చంచలమైనది.
- నృత్యోన్మత్త: అశాశ్వతమైన ఆ సంపద అనే నర్తకి ఆటలు చూసి, మదంతో ఉన్మత్తులైన నరాధములను ఇక్కడ వర్ణించారు.
2. వాక్కుకు అంటిన మాలిన్యం:
- దుష్కర్దమైః: అటువంటి నరాధముల యొక్క నీచమైన కథలను వినడం వల్ల లేదా
వర్ణించడం వల్ల కవి వాక్కుకు 'పాప
పంకిలం' (దుష్టమైన బురద) అంటుకుంది. దీన్నే వ్యాఖ్యాత 'దుష్కర్దమ' అని పిలిచారు.
3. వాక్కును శుద్ధి చేసే విధానం:
- శంకరగురు క్రీడా సముద్యద్యశః: శంకర సద్గురువుల దివ్య లీలా విశేషాలు మరియు
వారి కీర్తి అనేవి ఒక పారావారము (మహా
సముద్రం) వంటివి.
- సంక్షాలయామి: ఆ కీర్తి సముద్రం నుండి ఉప్పొంగే స్వచ్ఛమైన జలధారలతో, బురద అంటిన నా వాక్కును ఇప్పుడు స్పష్టంగా కడిగి శుభ్రం
చేసుకుంటున్నాను అని విద్యారణ్యస్వామి వారిభావం.
4. వేదవ్యాసుల ప్రమాణం:
- ఈ సందర్భంలో వ్యాఖ్యాత భగవాన్ వేదవ్యాసుల మాటలను ఉదహరించారు: "శ్రీహరి కథలనే గంగానదిలో మునగడం ద్వారానే మన వాక్కు
పవిత్రమవుతుంది." అదే
విధంగా ఇక్కడ శంకరాచార్యుల చరిత్ర ద్వారా వాక్కు పవిత్రమవుతుందని అర్థం.( అసత్కీర్తన కాంతరపరివర్తన శంసులామ్ | వాచా శౌరికథాలాపైర్గఙ్గయేవ పునీమహే)
5. అలంకార విశేషం:
- ఇందులో 'సంసృష్టి అలంకారం' ఉంది. అంటే.. ఇక్కడ రూపక అలంకారం మరియు ఇతర అలంకారాలు ఒకదానితో ఒకటి
కలవకుండా, బియ్యం మరియు నువ్వులు కలిసినట్లుగా
(తిలతండుల న్యాయం) స్పష్టంగా విడివిడిగా కనిపిస్తూనే కలిసి ఉన్నాయి.
శ్లోకం 8
వంధ్యాసూనుఖరీవిషాణసదృశక్షుద్రక్షితీంద్రక్షమా-
శౌర్యౌదార్యదయాదివర్ణనకలాదుర్వాసనావాసితామ్ |
మద్వాణీమధివాసయామి యమినస్త్రైలోక్యరంగస్థలీ-
నృత్యత్కీర్తినటీపటీరపటలీచూర్ణైర్వికీర్ణైః
క్షితౌ
తాత్పర్యం
గతంలో నేను రాజులను ప్రసన్నం చేసుకోవడానికి వారిలో లేని
గుణాలను ఉన్నట్టుగా వర్ణించాను. ఓర్పు, పరాక్రమం, దాతృత్వం, జాలి వంటివి వారిలో లేకపోయినా ఉన్నాయని
పొగిడాను. అటువంటి పొగడ్తలు 'వంధ్యా పుత్రుడు' (పిల్లలు లేని స్త్రీకి
పుట్టిన కొడుకు) లేదా 'గాడిద కొమ్ములు' వంటివి. అంటే అవి అసంభవం, అసత్యం. అటువంటి అబద్ధాలు పలకడం వల్ల నా నాలుక అపవిత్రమైంది.""శ్రీ శంకరాచార్యుల వారి 'కీర్తి' అనే ఒక అందమైన నర్తకి ముల్లోకాలనే రంగస్థలంపై
నాట్యం చేస్తోంది. ఆమె నాట్యం చేస్తున్నప్పుడు ఆమె శరీరం నుండి రాలిన సుగంధభరితమైన
పరాగ రేణువుల వలె శంకరుల గుణాలు లోకమంతా వ్యాపించాయి.""ఆ దివ్యమైన కీర్తి పరాగాన్ని నా నాలుకకు అద్దుకుని, నా మాటలను తీయగా, సువాసనభరితంగా మార్చుకుంటాను. తద్వారా నా గత
పాపాలను కడిగివేసుకుంటాను."
వ్యాఖ్య
1. అల్పులైన రాజుల వర్ణన (వాక్కుకు పట్టిన
దుర్వాసన):
- వంధ్యాసుత-ఖరీవిషాణ: గొడ్రాలి కొడుకు, గాడిద కొమ్ములు ఎలాగైతే అబద్ధమో (అసంభవమో), అల్పులైన
రాజుల వద్ద లేని గుణాలను ఉన్నట్టుగా వర్ణించడం కూడా అంతే వ్యర్థం.
- క్షుద్ర క్షితీంద్ర: నీచులైన రాజుల యొక్క క్షమ, శౌర్యం, ఔదార్యం, దయ వంటి గుణాలను (నిజానికి వారిలో లేనివి) వర్ణించడం వల్ల నా
వాక్కుకు 'దుర్వాసన' అంటుకుంది.
దీన్నే వ్యాఖ్యాత 'దుర్వాసనా వాసితామ్' (చెడు వాసనతో నిండినది) అని పేర్కొన్నారు.
2. వాక్కును సుగంధభరితం చేసే విధానం:
- యమినః (శ్రీశంకరస్య): గొప్ప యతి అయిన శ్రీశంకరాచార్యుల వారి కీర్తి అనే
నర్తకి (నటి), ఈ
మూడు లోకాలనే 'రంగస్థలం' మీద
నాట్యం చేస్తోంది.
- పటీర పటలీ చూర్ణైః: ఆ కీర్తి అనే నటి నాట్యం చేస్తున్నప్పుడు, ఆమె శరీరం నుండి చిందే చందనపు పొడి (గంధపు పొడి) భూమండలమంతా వ్యాపించి ఉంది.
- అధివాసయామి: ఆ దివ్యమైన గంధపు పొడితో నా వాక్కును ఇప్పుడు సుగంధభరితం
(పవిత్రం) చేస్తున్నాను అని కవి భావం.
3. చారిత్రక ప్రస్తావన (శ్రీ బుక్కరాయల
ఉదాహరణ):
- వ్యాఖ్యానంలో చివరగా శ్రీ బుక్కరాయల (విజయనగర సామ్రాజ్య చక్రవర్తి) వంటి రాజుల స్తుతి చాతుర్యాన్ని
ఉదాహరణగా చూపారు. ఇక్కడ విద్యారణ్యస్వామి వారు తన
పాండిత్యాన్ని, వినయాన్ని ప్రదర్శిస్తూ, కేవలం లోక విరుద్ధమైన స్తుతి కంటే గురువుల కీర్తన మిన్న అని
చెబుతున్నారు.
4. క్షితి (భూమి):
- ఇక్కడ 'క్షితౌ' అంటే ఈ
భరతవర్షం (భారతదేశం) అంతటా అని అర్థం.
శ్లోకం 9
పీయూషద్యుతిఖండమండనకృపారూపాంతరశ్రీగురు-
ప్రేమస్థేమసమర్పణార్హమధురవ్యాహారసూనోత్కరః |
ప్రౌఢోఽయం నవకాళిదాసకవితాసంతానసంతానకో
దద్యాదద్య సముద్యతః సుమనసామామోదపారంపరీమ్ ||
9 ||
తాత్పర్యం
అమృత కిరణాలను కురిపించే చంద్రుడిని ధరించిన ఆ పరమశివుడే, మానవులపై జాలితో శంకరాచార్యులుగా అవతరించారు.నవ కాళిదాసు (రచయిత) రాసిన ఈ
మధురమైన మాటలు భక్తితో నిండినవి. వీటిని శ్రీ శంకరుల పాదాల చెంత పుష్పమాలగా సమర్పిస్తున్నాను. కల్పవృక్షం దేవతలకు ఆనందాన్ని ఇచ్చినట్లుగా, ఈ గ్రంథం పండితులందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది.
వ్యాఖ్య
1. కావ్యం - కల్పవృక్షం (నవకాళిదాస కవితా
సంతానం):
- నవకాళిదాస: ఈ కావ్య కర్త
అయిన విద్యారణ్య స్వామివారు తనను తాను 'నవకాళిదాసు'గా పేర్కొన్నారు.
- కల్పవృక్ష రూపకం: ఈ కావ్యం ఒక కల్పవృక్షం వంటిది. కల్పవృక్షం ఎలాగైతే
దేవతలకు (సుమనసులకు) కావాల్సినవన్నీ ఇచ్చి ఆనందింపజేస్తుందో, ఈ 'శంకర దిగ్విజయం' అనే కావ్యం కూడా పండితులకు (సుమనసులకు) నిరంతర ఆనందాన్ని (ఆమోద
పరంపరను) ప్రసాదిస్తుంది.
2. గురువుగారి వర్ణన (శివ స్వరూపం):
- పీయూషద్యుతి ఖండమండన: చంద్రుడిని (అమృత కిరణుడిని) శిరోభూషణంగా ధరించిన ఆ
పరమశివుని యొక్క మరొక రూపమే (రూపాంతరమే) ఈ సద్గురువులు.
- మధుర వ్యాహార సూనోత్కరః: ఆ గురువుగారి పట్ల ఉన్న నిశ్చలమైన భక్తితో
సమర్పించబడిన మధురమైన మాటలే ఈ కల్పవృక్షానికి పూలు (సూనములు). ఆ పూల
గుత్తులతో ఈ కావ్యం శోభిస్తోంది.
3. అలంకార విశేషం (రూపక అలంకారం):
- ఇందులో 'రూపక అలంకారం' ఉంది.
- లక్షణం: "విషయస్య
భేద తాద్రూప్య రంజనం విషయస్య యత్ | రూపకం తత్" -
అంటే, ఉపమేయానికి (కావ్యానికి), ఉపమానానికి
(కల్పవృక్షానికి) మధ్య ఎటువంటి భేదం లేదని చెప్పడం వల్ల ఇది రూపక అలంకారం
అయింది. కవి తన కవితా సంతానాన్ని నేరుగా కల్పవృక్షంగానే చిత్రించారు.
శ్లోకం 10
సామోదైరనుమోదితా మృగమదైరానందితా చందనై-
ర్మందారైరభివందితా ప్రియగిరా కాశ్మీరజైః
స్మేరితా |
వాగేషా నవకాళిదాసవిదుషో దోషోజ్ఝితా దుష్కవి-
వ్రాతైర్నిష్కరుణైః క్రియేత వికృతా
ధేనుస్తురుష్కైరివ || 10 ||
తాత్పర్యం:
- 'నవ కాళిదాసు'గా పిలవబడే
ఈ కవి మాటలు కొందరి ద్వారా గౌరవించబడతాయి.
- గంధం పూసి, మందార
పూలతో అలంకరించి, కస్తూరి
మరియు కుంకుమలతో సువాసనభరితంగా మార్చిన ఒక పవిత్రమైన గోవును పూజించినట్లుగా, పుణ్యాత్ములు ఈ గ్రంథాన్ని ఆరాధిస్తారు.
- అయితే,
అదే ఆవును కొందరు క్రూరులు (మ్లేచ్ఛులు)
హింసించినట్లుగా, దుర్మార్గులు
ఈ కావ్యాన్ని అవహేళన చేయవచ్చు.
వ్యాఖ్య
మంచి వస్తువునైనా సరే, కుటిల బుద్ధి గలవారు
(దుష్కవులు) ఎలా వికృతం చేస్తారో కవి ఇక్కడ ఒక పదునైన పోలికతో వివరించారు.
1. ఉత్తమమైన వాక్కుకు ఉన్న గౌరవం:
- సామోదైః: పండితులకు సంతోషాన్ని కలిగించే ఈ వాక్కు (కావ్యం), కస్తూరి (మృగమదము), చందనము మరియు
మందార పుష్పాల వంటి సుగంధ ద్రవ్యాల చేత గౌరవించబడింది.
- కాశ్మీరజైః: కాశ్మీర దేశపు కుంకుమపువ్వు వంటి మధురమైన మాటలతో ఈ వాక్కు
వికసింపజేయబడింది (శ్లాఘించబడింది). అంటే, విజ్ఞులైన వారు ఈ కావ్యాన్ని ఎంతో ఆదరిస్తారని అర్థం.
2. దుష్కవుల వల్ల కలిగే వికృతి (పోలిక):
- దోషోజ్ఝితా: ఈ వాక్కు ఎటువంటి తప్పులు (దోషాలు) లేనిది. అయినప్పటికీ, దయలేని దుష్కవుల సమూహం దీనిని వికృతం చేయడానికి
ప్రయత్నిస్తుంది.
- ధేనుస్తురుష్కైరివ: దీనిని వివరించడానికి వ్యాఖ్యాత ఒక ఉదాహరణ ఇచ్చారు:
పాలిచ్చే పావనమైన ఆవు (ధేనువు) ఎంతో ఉత్తమమైనది. కానీ, దయలేని తురుష్కులు (మ్లేచ్ఛులు) ఆ ఆవును ఎలాగైతే
హింసించి వికృతం చేస్తారో, అలాగే ఈ సుగుణాల కావ్యాన్ని
కూడా దుష్ట కవులు తమ కుతర్కాలతో, అసూయతో వికృతం
చేస్తారు.
3. పద వివరణ:
- తూరుష్కః: మేదినీ కోశం ప్రకారం 'తూరుష్క'
అంటే సింహళ లేదా మ్లేచ్ఛ జాతికి చెందినవారు (దయలేని వారు) అని
అర్థం.
- నవకాళిదాసస్య: 'నవకాళిదాసు'
అనే బిరుదు కలిగిన తన యొక్క ఈ వాక్కును,
దుష్ట కవుల గుంపు తమ కఠినత్వంతో మార్చివేసే ప్రమాదం ఉందని మాధవ
విద్యారణ్య స్వామివారు హెచ్చరిస్తున్నారు.
సామోదైః
(సత్పురుషుల ఆనందం):
- అల్పాక్షరాలతో చెప్పాలంటే, అంతటా
ఆనందంతో కూడిన సత్పురుషుల చేత ఈ కావ్యం కొనియాడబడింది. దీని ద్వారా ఈ కావ్యం
చదివిన వారికి నిరుపమానమైన ఆనందం కలుగుతుందని సూచించబడింది.
అమృగమదైః
(అహింస మరియు పవిత్రత):
- కవితా పరంగా: 'మృగము'
అంటే మాంసము అనే అర్థం కూడా ఉంది. మాంస భక్షణ వల్ల కలిగే మదం
లేనివారు, అంటే మాంసాహారం ముట్టని పవిత్రులైన
బ్రాహ్మణోత్తముల చేత ఇది ఆమోదించబడిందని మరొక అర్థం.
అచందనైః (వైరాగ్యం):
- 'చందనము' అనేది ఇక్కడ ప్రాపంచిక
సుఖాలకు, అంటే స్త్రీలు, విలాస
వస్తువులకు గుర్తు. అటువంటి ఐహిక సుఖాల పట్ల విముఖత కలిగిన విరాగులైన పండితుల
చేత ఈ కావ్యం ఆనందంతో స్వీకరించబడింది.అంటే ఈ శంకర విజయ కావ్యం కేవలం విషయలోలుర కోసం కాక, విరక్తులైన జ్ఞానుల కోసం ఉద్దేశించబడిందని భావం..
మందారైః (పరమాత్మ బోధ):
- 'అ' కారము అంటే విష్ణువు
(వాసుదేవుడు) అని కోశం చెబుతోంది. మందబుద్ధులైన వారికి కూడా భగవత్
తత్త్వాన్ని అందజేసే పరమ పవిత్రులైన ముముక్షువుల (మోక్షాన్ని కోరేవారు) చేత ఈ
వాక్కు అభినందించబడింది.
కాశ్మీరజైః (విద్వత్తు):
- సాధారణ అర్థం: కాశ్మీరజములు అంటే కుంకుమపువ్వు వంటి సుగంధ ద్రవ్యాలు, ఇవి తిలకం లేదా లేపనం ద్వారా ముఖానికి అందాన్ని, ఆనందాన్ని ఇస్తాయి.
- కావ్య పరంగా: కాశ్మీర దేశానికి చెందిన (శారదా పీఠం వంటి విద్యా కేంద్రాల)
గొప్ప విద్వాంసుల చేత, వారి
మధురమైన మాటలతో ఈ కావ్యం శ్లాఘించబడింది.
6. ఉపమానం (ఆవు మరియు వాక్కు):
- చివరగా, దయలేని వారు ఆవును హింసించినట్లుగా,
దుష్ట కవులు నా వాక్కును వికృతం చేస్తారని విద్యారణ్య స్వామి వారు బాధపడ్డారు. దీని ద్వారా ఆ దుష్ట కవుల నీచత్వం, కవి వాక్కు యొక్క పవిత్రత (ఆవుతో సమానమైనది) వెల్లడవుతోంది. వేదాలలోని 'వాక్కును ఆవుగా ఉపాసించాలి' (వాచం ధేనుముపాసీత) అనే వాక్యం ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
శ్లోకం 11
యద్వా దీనదయాలవః సహృదయాః సౌజన్యకల్లోలినీ-
దోలాందోలనఖేలనైకరసికస్వాంతాః సమంతాదమీ |
సంతః సంతి పరోక్తిమౌక్తికజుషః కిం
చింతయాఽనంతయా
యద్వా తుష్యతి శంకరః పరగురుః కారుణ్యరత్నాకరః
|| 11 ||
తాత్పర్యం
బలహీనుల పట్ల దయ చూపే వారు, ఇతరుల కష్టాన్ని గుర్తించి అభినందించే వారు, అందరికీ మేలు చేయాలని తపించే వారు అన్ని చోట్లా
ఉంటారు. ఇతరులు చెప్పే మంచి మాటలను తమ మెడలోని హారాల వలె (హృదయంలో) భద్రపరుచుకునే
అంకితభావం గల వ్యక్తులు లోకంలో ఎప్పుడూ ఉంటారు. కాబట్టి, నా రచనను ఎవరు మెచ్చుకుంటారు, ఎవరు విమర్శిస్తారు అనే విషయం గురించి నేను
ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా, కరుణామయుడైన జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు నా భక్తికి తప్పక
ప్రసన్నమవుతారు. ఆయన అనుగ్రహం ఉంటే చాలు, నా ఈ ప్రయత్నం ఏనాటికీ వృథా పోదు.
వ్యాఖ్య
ఈ శ్లోకం ,
కావ్యం రాసేటప్పుడు కలిగే ఆందోళనలను (చింతను) కవి ఎలా
పోగొట్టుకుంటున్నారో వివరిస్తుంది.
1. కావ్యం పట్ల ఆందోళనను తొలగించుకోవడం:
కావ్యం రచించేటప్పుడు తలెత్తే అంతులేని చింతలను, ఆటంకాలను తొలగిస్తూ కవి ఈ విధంగా చెబుతున్నారు. లోకంలో దుష్ట
కవులు ఉన్నప్పటికీ, వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.
2. సత్పురుషుల స్వభావం (సౌజన్య కల్లోలినీ):
- దీనదయాలవః: సత్పురుషులు
దీనుల పట్ల ఎంతో దయ కలిగిన వారు. ఇతరుల శ్రమను, గొప్పదనాన్ని
గుర్తించగల హృదయం ఉన్నవారు.
- సౌజన్య కల్లోలినీ: వారి
మనస్సు 'సౌజన్యం' (మంచి తనం) అనే
నదిలో అలల మీద ఊగుతున్న ఉయ్యాల వంటిది. ఇతరుల మాటలలో చిన్నపాటి పొరపాట్లు
(స్ఖలనం) ఉన్నా, వాటిని పట్టించుకోకుండా కేవలం అందలి
రసాన్ని ఆస్వాదించే రసిక హృదయులు వారు.
- పరోక్తి మౌక్తికజుషః: ఇతరుల
మాటలను ముత్యాల్లా భావించి గౌరవించే సత్పురుషులు అంతటా ఉన్నారు.
3. పరమ గురువుపై విశ్వాసం:
ఒకవేళ అటువంటి సత్పురుషులు లభించడం కష్టమని అనుకున్నా, మనకు ఒకే ఒక దారి ఉంది. అదేమిటంటే:
- యద్వా కార్యుణ్యరత్నాకరః: కరుణకు
సముద్రం వంటివారైన పరమ గురువు శ్రీ శంకరాచార్యుల వారు ఈ కావ్యం పట్ల
సంతోషిస్తే చాలు.
- ఆయనను సంతోష పెట్టడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ప్రయత్నించాలి.
అందువల్ల, అనవసరమైన చింతలు చెందడం వల్ల ఎటువంటి
ప్రయోజనం లేదు.
4. సాహిత్య విశేషం (ఆక్షేప అలంకారం):
- ఇందులో 'ఆక్షేప అలంకారం' ఉంది. ముందు శ్లోకంలో (10వ శ్లోకం) దుష్ట కవుల
వల్ల కలిగే బాధను (చింతను) వ్యక్తం చేసిన విద్యారణ్య స్వామి, ఈ శ్లోకంలో 'యద్వా' (లేదా)
అంటూ ఆ చింతను ఆక్షేపించి (ప్రతిషేధించి) నివృత్తి చేసుకున్నారు.
- సత్పురుషులు ఇతరుల మాటలను ముత్యాల వలె స్వీకరిస్తారనే గుణం ఇక్కడ
ప్రధానంగా చెప్పబడింది.
శ్లోకం 12
ఉపక్రమ్య స్తోతుం కతిచన గుణాఞ్ఛఙ్కరగురోః
ప్రభగ్నాః శ్లోకార్ధే కతిచన తదర్ధార్ధరచనే |
అహం తుష్టుషస్తానహహ కలయే శీతకిరణం
కరాభ్యామాహర్తుం వ్యవసితమతేః సాహసికతామ్ || 12
తాత్పర్యం
- శ్రీ శంకరుల దివ్య గుణాలను వర్ణించడానికి గతంలో ఎందరో ప్రయత్నించారు.
కానీ ఆ మహానుభావుడి గొప్పతనం ముందు వారు సగం శ్లోకం కూడా పూర్తి
చేయలేకపోయారు. మరికొందరు ఒక పాదం (శ్లోకంలో నాల్గవ వంతు) కూడా రాయలేక
వెనుదిరిగారు.
- చందమామ కోసం పాకులాట: "అంతటి
మేధావులకే సాధ్యం కాని పనిని నేను చేయబూనడం ఎలా ఉందంటే.. ఆకాశంలో ఎక్కడో ఉన్న
చందమామను తన రెండు చేతులతో పట్టుకోవాలని చూసే మొండివాని ప్రయత్నంలా
ఉంది."
1. కవి సాహసం - పూర్వపక్షం:
శ్రీ శంకరాచార్యుల గుణాలను వర్ణించడంలో ఎందరో మహానుభావులు
ప్రయత్నించి విఫలమయ్యారు. అటువంటప్పుడు నీవు ఈ ప్రయత్నానికి పూనుకోవడం కేవలం
సాహసమే అవుతుంది కదా? అని ఎవరైనా ప్రశ్నిస్తే..
దానికి సమాధానంగా కవి ఈ శ్లోకాన్ని చెబుతున్నారు.
2. పద వివరణ:
- ప్రభగ్నాః: శంకరాచార్యుల గుణాలను స్తుతించడం మొదలుపెట్టి కొందరు
శ్లోకంలోని మొదటి సగభాగంలోనే ఆగిపోయారు. మరికొందరు శ్లోకంలోని పాదము (నాల్గవ
వంతు) కూడా పూర్తి చేయలేక విఫలమయ్యారు.
- అహం తుష్టుషుః: అటువంటి
అనంతమైన గుణాలను స్తుతించాలని కోరుకుంటున్న నేను 'అహహ'
(ఎంతో ఆశ్చర్యం!) అత్యంత సాహసానికి ఒడిగడుతున్నాను.
3. చంద్రబింబం - హస్తాల పోలిక:
- ఆకాశంలోని శీతకిరణుడిని (చంద్రుడిని) తన రెండు చేతులతో పట్టుకోవాలని
ప్రయత్నించే బాలుని బుద్ధి ఎంతటి సాహసంతో కూడుకున్నదో, శంకరాచార్యుల గుణాలను వర్ణించాలనుకుంటున్న నా ప్రయత్నం
కూడా అటువంటిదే అని కవి తన వినయాన్ని చాటుకున్నారు.
4. సాహిత్య విశేషాలు:
- అలంకారము: ఇందులో 'నిదర్శనాలంకారం'
ఉంది. సంభవించని వస్తువుల సంబంధాన్ని (చంద్రుడిని చేతులతో
పట్టుకోవడం) కవి తన ప్రయత్నంతో పోల్చడం వల్ల ఇది నిదర్శనాలంకారం అయింది.
- ఛందస్సు: ఈ శ్లోకం శిఖరిణీ
అనే ఛందస్సులో ఉంది.
శ్లోకము 13
తథాఽప్యుజ్జృంభంతే మయి విపులదుగ్ధాబ్ధిలహరీ-
లలత్కల్లోలాలీలసితపరిహాసైకరసికాః |
అమీ మూకాన్వాచాలయితుమపి శక్తా యతిపతేః
కటాక్షాః కిం చిత్రం భృశమఘటితాభీష్టఘటనే || 13
తాత్పర్యం
క్షీర సాగరపు అలల వలె స్వచ్ఛమైన శంకర భగవత్పాదుల కటాక్షం
నాపై ప్రసరిస్తోంది. మూగవారిని కూడా మహా పండితులుగా మార్చగల ఆ చూపులు, నా వంటి అల్పుడి కోరికను నెరవేర్చి ఈ కావ్యాన్ని పూర్తి
చేయించడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు.
వ్యాఖ్య
1. గురు కటాక్షం - క్షీర సాగర పోలిక:
- విపుల దుగ్ధాబ్ధి లహరీ: శంకరాచార్యుల
(యతిపతి) కటాక్ష వీక్షణాలు విశాలమైన క్షీర సముద్రపు అలల వలె అత్యంత
స్వచ్ఛమైనవి.
- పరిహాసైక రసికాః: ఆ
తెల్లని అలల వరుసలు ఎలాగైతే నవ్వుతున్నట్లుగా (పరిహాసం) అనిపిస్తాయో, గురువుగారి కటాక్షాలు కూడా అంతటి ప్రకాశంతో, స్వచ్ఛతతో
ఉన్నాయి. అవి నాపై ప్రసరిస్తున్నాయి (మయి ఉజ్జృంభంతే).
2. అసాధ్యమైన దానిని సుసాధ్యం చేయడం:
- మూకాన్ వాచాలయితుమపి: అమరకోశం
ప్రకారం "వాచాటః" అంటే అతిగా మాట్లాడేవాడు అని అర్థం. గురు కటాక్షం
లభిస్తే, ఏమీ మాట్లాడలేని మూగవారు సైతం అనర్గళంగా
మాట్లాడగలిగే శక్తిని పొందుతారు.
- అఘటితాభీష్టఘటనే: సాధారణంగా
జరగని (అసాధ్యమైన) కోరికలను కూడా నెరవేర్చడంలో గురు కటాక్షం అత్యంత
సమర్థవంతమైనది. అటువంటప్పుడు, అల్పుడనైన నేను ఈ
కావ్యాన్ని పూర్తి చేయాలనుకోవడం అనే అసాధ్యమైన పనిని ఆయన నెరవేర్చడంలో
ఆశ్చర్యం ఏముంది? (కిం చిత్రమ్).
3. వివరణ:
- వాగింద్రియ లోపం ఉన్నవారిని కూడా విద్వాంసులుగా మార్చగల శక్తి ఆ యతిపతి
కటాక్షానికి ఉంది. కాబట్టి, నా ఈ
కావ్య రచన ఆయన కృప వల్ల తప్పకుండా సఫలమవుతుందని కవి ధీమా వ్యక్తం
చేస్తున్నారు.
శ్లోకము 14
అస్మజ్జిహ్వాగ్రసింహాసనముపనయతు
స్వోక్తిధారాముదారా-
మద్వైతాచార్యపాదస్తుతికృతసుకృతోదారతా శారదామ్బా |
నృత్యన్మృత్యుంజయైశ్చైర్ముకుటతటకుటీనిఃస్రవత్స్వఃస్రవంతీ
కల్లోలోద్వేలకోలాహలమదలహరీఖండపాండిత్యహృద్యామ్
|| 14
తాత్పర్యం
పరమశివుడి జటాజూటం అనే నాట్యశాల నుండి బయటకు వచ్చి, భూమి మీదకు ఉరకలు వేస్తూ పారుతున్న గంగానది తరంగాలకు చాలా
వేగం, గంభీరత ఉంటాయి."నా
గురువుగారి గుణాలను కీర్తించే క్రమంలో.. నా మాటల ప్రవాహం ఆ గంగానది అలల గర్వాన్ని
కూడా అణచివేసేలా (అంతటి గంభీరంగా, పవిత్రంగా) ఉండాలి.
అటువంటి అద్భుతమైన భావ వ్యక్తీకరణ శక్తిని సరస్వతీ దేవి నాకు
అనుగ్రహించుగాక!"
వ్యాఖ్య
ఈ శ్లోకం లో కవి తన కావ్య రచన సఫలం
కావాలని జగన్మాత అయిన సరస్వతీ దేవిని ప్రార్థిస్తున్నారు.
1. మనఃస్థిరత్వం కోసం ప్రార్థన:
శంకరాచార్యుల వంటి మహనీయుల చరిత్రను రాయడం తన వంటి
అల్పుడికి సాధ్యం కాదనే భయం ఉన్నప్పటికీ, మనస్సును స్థిరం చేసుకుని కవి
ఇప్పుడు జగజ్జనని అయిన సరస్వతీ దేవిని (శారదాంబను) ప్రార్థిస్తున్నారు.
2. శారదాంబ అనుగ్రహం:
- అద్వైతాచార్యపాదస్తుతి: అద్వైత
మత స్థాపకులైన శ్రీ శంకరాచార్యుల పాదాలను స్తుతించడం ద్వారా కలిగే పుణ్యం
వల్ల శారదామాత అనుగ్రహం కలుగుతుంది.
- ఆ పుణ్యం వల్ల కలిగే ఉదారతతో శారదాదేవి తనపై కరుణ చూపాలని కవి
కోరుకుంటున్నారు.
3. గంగానది హోరును మించిన పాండిత్యం:
- నృత్యన్మృత్యుంజయ: నాట్యం
చేస్తున్న పరమశివుని జటాజూటం నుండి ప్రవహించే దేవగంగ (స్వర్గగంగ) శబ్దం ఎంతో
గంభీరంగా ఉంటుంది.
- ఆ గంగానది అలల ఉద్ధృతికి ఉండే గర్వాన్ని (మదాన్ని) కూడా అణచివేయగల
అనర్గళమైన, విశాలమైన వాక్ ప్రవాహాన్ని (వాక్కును)
ప్రసాదించమని కవి అడుగుతున్నారు.
- అటువంటి పాండిత్యంతో నిండిన తన వాక్కు మనోహరంగా ఉండాలని ఆయన కోరిక.
4. జిహ్వాగ్ర సింహాసనం:
- సరస్వతీ దేవి తన వాక్ ప్రవాహాన్ని ఎక్కడో కాదు, నేరుగా తన నాలుక చివర (జిహ్వాగ్రం) అనే సింహాసనం మీద
ఉంచాలని కవి ప్రార్థిస్తున్నారు. ఇక్కడ 'ఉపనయతు'
(అందించు/చేర్చు) అనే పదాన్ని ప్రార్థనా పూర్వకమైన
ఆజ్ఞార్థకంలో (లోట్ లకారం) ఉపయోగించారు.
5. ఛందస్సు:
- ఈ శ్లోకం 'స్రగ్ధర'
(స్రగ్ధర) అనే ఛందస్సులో ఉంది.
శారదాంబ - శబ్దబ్రహ్మ స్వరూపిణి:
- శారదేతి: శ్రుతి
వాక్యం ప్రకారం ("స భూరితి వ్యాహరత్..."), సృష్టి
అంతా శబ్దబ్రహ్మ లేదా ప్రణవ నాదం (ఓంకారం) నుండి ఉద్భవించింది.
- ఈ సకల ప్రపంచ సృష్టికి మూలమైన శబ్దబ్రహ్మను అధిష్టించి, తన విగ్రహం (రూపం) ద్వారా సకల విజ్ఞానాన్ని ప్రసాదించే
మాయాశక్తియే శారదాదేవి.
- ఆమె జగత్తు మొత్తానికి జన్మనిచ్చిన తల్లి (జగజ్జనని) కాబట్టి, ఆమెను 'అంబ' అని
పిలవడం సర్వదా సముచితం.
స్వోక్తిధారా
- వాక్ ప్రవాహం:
- స్వోక్తిధారా: తన
అంతరాత్మ నుండి వెలువడే మాటల ప్రవాహం.
- మదానంద: ఆ మాటల ద్వారా కలిగే గొప్ప
ఆనందానుభూతి.
- ఆరః: మేదినీ కోశం ప్రకారం ("ఆరా
చర్మప్రభేదిన్యాం..."), 'ఆర' అంటే ఒక రకమైన సూది వంటి పనిముట్టు లేదా ఒక పనిలో ఉండే సూక్ష్మమైన
అగ్రభాగం అని అర్థం.
- ఇక్కడ కవి తన వాక్చాతుర్యంతో కలిగే ఆనందం యొక్క ప్రారంభ దశను
(ప్రథమావస్థను) తన నాలుకపై ప్రసాదించమని శారదాదేవిని కోరుకుంటున్నారు..
శ్లోకము 15
క్వేదం శంకరసద్గురోః సుచరితం క్వాహం వరాకీ
కథం
నిర్బంధాసి చిరార్జితం మమ యశః కిం
మజ్జయస్యంబుధౌ |
ఇత్యుక్త్వా చపలాం పలాయితవతీం వాచం నియుంక్తే బలాత్
ప్రత్యాహృత్య గుణస్తుతౌ కవిగణశ్చిత్రం
గురోర్గౌరవమ్ || 15
తాత్పర్యం
శ్రీ
శంకరాచార్యుల వారి దివ్య చరిత్ర ఎక్కడ? అత్యంత అల్పమైన నేను
ఎక్కడ? నన్ను ఎందుకు ఈ కష్టమైన పనికి పురమాయిస్తున్నారు?
ఎన్నో ఏళ్ల కృషి తర్వాత నాకు కొంచెం పేరు వచ్చింది. ఇప్పుడు శంకరుల
అనంతమైన గుణాలను వర్ణించలేక, ఆ అపారమైన కీర్తి సముద్రంలో
మునిగిపోయి, నాకున్న కొద్దిపాటి పేరును కూడా
పోగొట్టుకోమంటారా?" అని 'వాక్కు'
అనే సుకుమారమైన స్త్రీ భయంతో పారిపోవడానికి ప్రయత్నిస్తోందట. ఆ
విధంగా భయపడుతున్న వాక్కును కవులు బలవంతపెట్టి.. "లేదు, నువ్వు ఆచార్యుల వారి సద్గుణాలను వర్ణించాల్సిందే" అని వెన్నుతట్టి
ప్రోత్సహిస్తున్నారు.
వ్యాఖ్య
ఈ శ్లోకంలో కవి తన వాక్కుకు
(సరస్వతికి), తనకూ మధ్య జరిగే ఒక ఆసక్తికరమైన సంభాషణను
వర్ణిస్తూ, గురువుగారి గొప్పతనాన్ని వివరిస్తున్నారు.
కవి వినయం (అహమ్ వరాకీ):
- అహమ్ వరాకీ: "నేను చాలా అల్పురాలిని (శక్తి లేనిదాన్ని)" అని కవి వాక్కు
అంటోంది. శంకరాచార్యుల వంటి మహనీయుల అనంతమైన గుణాలను వర్ణించే సామర్థ్యం తనకు
లేదని, అందుకే తాను అత్యంత తుచ్ఛమైనదాన్ని (అతితుచ్ఛా)
అని వాక్కు తనను తాను నిందించుకుంటోంది.
వాక్కు అన్వయం (క్వేత్యాది):
- క్వేత్థం మాం తద్వర్ణనం కథం నిబధ్నాసి: "అసలు నీవు నన్ను (వాక్కును) ఆ గుణ వర్ణనలో ఎందుకు బంధిస్తున్నావు?
ఆ మహనీయుని చరిత్ర ఎక్కడ? నా శక్తి ఎక్కడ?"
అని వాక్కు ప్రశ్నిస్తోంది. ఇక్కడ వ్యాకరణం ప్రకారం 'అధ్యాహార్య' (ఊహించుకోవలసిన) పదాలను చేర్చి
అన్వయం చెప్పారు.
కీర్తి నశిస్తుందనే భయం (యశః మజ్జయసి):
- చిరార్జితం మమ యశః: "చాలా కాలం నుండి నేను సంపాదించుకున్న కీర్తిని, ఈ అసాధ్యమైన పనికి పూనుకోవడం ద్వారా సముద్రంలో ముంచేయాలని
చూస్తున్నావా? (అంబుధౌ మజ్జయసి)" అని వాక్కు
వాపోతోంది. అంటే, సరిగ్గా వర్ణించలేకపోతే లోకం
నవ్వుతుందని, దానివల్ల తన గౌరవం పోతుందని వాక్కు
భయపడుతోంది.
4. పారిపోతున్న వాక్కు (పలాయితవతీమ్):
- పలాయితవతీమేతాదృశీం వాచమ్: ఇలా
రకరకాలుగా వాదించి, భయపడి పారిపోతున్న తన చంచలమైన
(చపలామ్) వాక్కును కవి పట్టుకున్నారు. అటువంటి వాక్కును కూడా గురు స్తుతిలో
నిమగ్నం చేయడం కేవలం ఆ గురువుగారి మహిమ వల్లే సాధ్యమైందని భావం.
శ్లోకము 16
రూక్షైకాక్షరవాఙ్నిఘంటుశరణైరౌణాదికప్రత్యయ-
ప్రాయైర్హంత యడంతదంతంతరైర్దుర్బోధదూరాన్వయైః |
క్రూరాణాం కవితావతాం కతిపయైః కష్టైః కృష్టైః
పదై-
ర్హాహా స్యాద్వశగా కిరాతవితతేరేణీవ వాణీ మమ || 16
తాత్పర్యం
"నా మాటలు (రచన) క్రూరమైన
వేటగాళ్ల మధ్య చిక్కుకున్న ఒక ఆడలేడి పరిస్థితిని ఎదుర్కోబోతున్నాయి. (ఇక్కడ వేటగాళ్లు అంటే 'కఠినమైన విమర్శకులు'.)
విమర్శకులు నా రచనను ఎలా హింసిస్తారంటే:
నేను అనుకున్న సహజమైన అర్థం రాకుండా, పదాలను తమకు నచ్చినట్లుగా విడగొడతారు.నిఘంటువుల సహాయంతో ఒక్కో
పదానికి ఉండే రకరకాల అర్థాలను తీసి, నేను చెప్పని భావాలను
నాపై రుద్దుతారు.ఉణాది మరియు యఙ్ వంటి కఠినమైన వ్యాకరణ సూత్రాలను అన్వయించి,
పదాల రూపాన్ని మార్చి, వాటి అర్థాలను
వక్రీకరిస్తారు.ఎక్కడో ఒకచోట ఉన్న పదాన్ని, మరెక్కడో ఉన్న
పదంతో సంబంధం లేకపోయినా కలిపి తప్పుడు అర్థాలను ప్రచారం చేస్తారు."( క్లిష్టమైన వ్యాకరణ పదాలతో, వినడానికి కఠినంగా ఉండే
పదజాలంతో కవిత్వం రాసే మొండి కవుల మధ్య నా మృదువైన కవిత్వం, వేటగాళ్ల
గుంపులో చిక్కుకున్న ఆడజింకలా భయం భయంగా ఉందని సారాంశం)
వ్యాఖ్య
. ఈ శ్లోకంలో కవి తన సుకుమారమైన
కవిత్వం, కఠినమైన పదజాలం వాడే దుష్ట కవుల (కుకవుల) మధ్య పడి
ఎలా ఇబ్బంది పడుతుందో ఒక చక్కని పోలికతో వివరించారు.
1. దుష్ట కవుల కఠిన పదజాలం:
కావ్య రచనకు పూనుకున్న తన వాక్కు, క్రూరులైన ఇతర కవుల దోషాల వల్ల ఎలాంటి ఇబ్బందులకు గురవుతుందో
కవి ఇక్కడ ఆవేదనతో చెబుతున్నారు:
- రూక్షైకాక్షర: వినడానికి
కఠినంగా ఉండే పదాలు, నిఘంటువులలో (కోశాలలో) మాత్రమే
కనిపించే అరుదైన ఏకాక్షర పదాలను వారు ఉపయోగిస్తారు.
- ఔణాదిక ప్రత్యయ: సాధారణంగా
వాడకంలో లేని 'ఉణాది' వంటి
వ్యాకరణ ప్రత్యయాలతో కూడిన క్లిష్టమైన పదాలను వారు వాడుతుంటారు.
- యడంత దంతంతరైః: వినడానికి
కర్ణకఠోరంగా, ఎగుడుదిగుడుగా (దంతురం) ఉండే 'యడంత' రూపాలను వారు ప్రయోగిస్తారు. 'దంతురం' అంటే ఎత్తుపల్లాలుగా ఉండేది లేదా
విషమంగా ఉండేది అని అర్థం.
- దుర్బోధ దూరాన్వయైః: సులభంగా
అర్థం కాని (దుర్బోధ), ఒక పదానికి మరో పదానికి సంబంధం
ఎక్కడో ఉండే (దూరాన్వయ) క్లిష్టమైన రచనలు వారివి.
2. వేటగాళ్ల మధ్య జింక (ఉపమానం):
- క్రూరాణాం కవితావతాం: ఇటువంటి
కఠినమైన పదాలను బలవంతంగా లాగి తెచ్చి (కృష్టైః పదైః) కవిత్వం రాసే క్రూర
స్వభావం గల కవుల మధ్య నా వాక్కు చిక్కుకుంది.
- ఏణీవ కిరాతవితతేః: అడవిలో
క్రూరమైన వేటగాళ్ల (కిరాతుల) సమూహం మధ్య చిక్కుకున్న ఒక లేడి (జింక) పరిస్థితి
ఎలా ఉంటుందో, ఈ కుకవుల మధ్య నా వాణి (కవిత్వం)
పరిస్థితి కూడా అలాగే ఉంది.
3. విశేష వివరణ:
- వేటగాళ్లు చాలామంది ఉండి, జింక
ఒక్కటే ఉన్నట్టుగా.. ఆ కఠిన కవులు చాలామంది ఉన్నారు, నా
సుకుమారమైన వాక్కు ఒక్కటే ఉంది. అందుకే నా వాణి వారి వశమైపోతుందేమో (వశగా
స్యాత్) అని కవి భయపడుతున్నారు.
- ఇది కుకవుల పట్ల కవికి ఉన్న అసహనాన్ని, తన కవిత్వం పట్ల ఉన్న సుకుమార భావనను తెలియజేస్తోంది.
శ్లోకము 17
నేతా యత్రోల్లసతి భగవత్పాదసంజ్ఞో మహేశః
శాంతిర్యత్ర ప్రకచతి రసః శేషవ్రానుజ్వలాద్యైః
|
యత్రావిద్యాక్షతిరపి ఫలం తస్య కావ్యస్య కర్తా
ధన్యో వ్యాసాచలకవివరస్తత్కృతిజ్ఞాశ్చ ధన్యాః || 17
తాత్పర్యం
ఈ మహాకావ్యానికి కథానాయకుడు సాక్షాత్తూ ఆ పరమశివుడే. ఆయనే
ఇక్కడ మనకు "శ్రీ శంకర భగవత్పాదుల" రూపంలో దర్శనమిస్తారు. సాధారణ
కావ్యాలలో శృంగారమో, వీరమో ప్రధానంగా ఉంటాయి. కానీ ఈ
కావ్యంలో 'శాంతం'
అనేది ప్రధాన భావం . ప్రేమ (శృంగారం)
మరియు ఇతర రసాలు కేవలం శాంత రసానికి అలంకారాలుగా, సహాయకారులుగా
మాత్రమే ఉంటాయి. ఈ కావ్యం చదవడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం 'అజ్ఞాన నాశనం'. మనలో ఉన్న అజ్ఞానపు చీకట్లను
తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగించడమే దీని లక్ష్యం. ఇంతటి గంభీరమైన లోతు కలిగిన
కావ్యాన్ని రచించిన రచయిత ధన్యుడు. అలాగే దీనిని శ్రద్ధగా చదివి, అర్థం చేసుకునే పాఠకులు కూడా ధన్యులే.
వ్యాఖ్య
ఈ శ్లోకంలో కవి తన
కావ్యంలోని విశిష్టతను, నాయకుడిని మరియు దీనిని చదవడం
వల్ల కలిగే ప్రయోజనాన్ని (ఫలాన్ని) వివరించారు.
1. కావ్య నాయకుడు (నేత):
- నేతా యత్రోల్లసతి: ఏ
కావ్యంలో అయితే సాక్షాత్తు పరమశివుని అవతారమైన 'భగవత్పాద'
అనే పేరు గల శంకరాచార్యుల వారు నాయకుడిగా (ముఖ్య పురుషుడిగా)
ప్రకాశిస్తున్నారో.. ఆ కావ్యం ధన్యమైనది. సాధారణంగా కావ్యం అంటే శబ్దార్థాలు,
గుణాలు కలిగి ఉండాలి. కానీ ఇది వేదాల వలె కేవలం శాస్త్రం
మాత్రమే కాకుండా, పురాణేతిహాసాల వలె ధర్మాన్ని
బోధిస్తూనే, ఒక ప్రియురాలు (కాంత) చెప్పే మాటల వలె
మధురంగా హృదయానికి హత్తుకునేలా ఉంటుంది.
2. కవి పరిచయం (వ్యాసాచల కవివరః):
- అటువంటి లోకోత్తరమైన కావ్యాన్ని రచించిన మాధవుడు (వ్యాసాచల కవి) ధన్యుడు.
ఇక్కడ 'వ్యాసాచల' అంటే
వ్యాస మహర్షి వలె స్థిరమైన పాండిత్యం కలిగి, అందరిచేత
గౌరవించబడే కవి అని అర్థం.
3. కావ్య రసం (శాంతి రసము):
- శాంతిర్యత్ర ప్రకచతి రసః: ఈ
కావ్యంలో ప్రధానమైన రసం 'శాంత రసం'.
- శేషవాన్: దీనికి
అంగముగా (సహాయకారిగా) శృంగార, వీర, కరుణ, అద్భుత, హాస్య,
భయానక, బీభత్స, రౌద్ర
రసాలన్నీ ఉన్నాయి. అమరకోశం ప్రకారం 'ఉజ్జ్వల' అంటే శృంగార రసం. ఇక్కడ శృంగారాది రసాలన్నీ శాంత రసానికి లోబడి,
కావ్యాన్ని రసవత్తరంగా మారుస్తున్నాయి.
4. కావ్య ఫలం (అవిద్యాక్షతి):
- అవిద్యాక్షతిరపి ఫలమ్: వేదాంత
సిద్ధాంతం ప్రకారం మోక్షం అంటే అజ్ఞానం (అవిద్య) నశించి బ్రహ్మానందాన్ని
పొందడం. ఈ కావ్యాన్ని చదవడం వల్ల కలిగే ఫలం కూడా అదే. కేవలం ఐహికమైన సంతోషమే
కాకుండా, అజ్ఞానాన్ని పోగొట్టి ఆత్మజ్ఞానాన్ని
ప్రసాదించడం ఈ కావ్య ప్రధాన ఉద్దేశం.
5. పాఠకుల ధన్యత:
- ఈ కావ్యాన్ని రచించిన మాధవుడు ఎంత ధన్యుడో, దీనిలోని అంతరార్థాన్ని, కవి శ్రమను గుర్తించి
చదివే వారు (తత్కృతిజ్ఞాః) కూడా అంతే ధన్యులు.
6. ఛందస్సు:
- ఈ శ్లోకం 'మందాక్రాంత'
అనే ఛందస్సులో ఉంది.
శ్లోకము 18
తత్రాదిమ ఉపోద్ఘాతో ద్వితీయే తు తదుద్భవః |
తృతీయే తత్తదమృతానిత్యవతారనిరూపణమ్ || 18
తాత్పర్యం
ఈ కావ్యంలోని
- 1వ సర్గ: దేవతల సంవాదం (పీఠిక).
- 2వ సర్గ: శివుని ఆవిర్భావం.
- 3వ సర్గ: ఇతర దేవతల అవతారాల వర్ణన.
వ్యాఖ్య
ఈ శ్లోకం నుండి కవి గ్రంథంలోని
సర్గల (అధ్యాయాల) క్రమాన్ని, వాటిలోని విషయాలను క్లుప్తంగా
వివరిస్తున్నారు.
1. గ్రంథ పరిచయం:
శ్రీ శంకరాచార్యుల చరిత్రను వివరంగా చెప్పడానికి ముందు, చదువరులు సులభంగా అర్థం చేసుకోవడం కోసం 16 సర్గలతో కూడిన ఈ కావ్య ఇతివృత్తాన్ని కవి ఇక్కడ సంక్షిప్తంగా (విషయ సూచిక
వలె) తెలియజేస్తున్నారు.
2. మొదటి సర్గ (ప్రథమ సర్గము):
- తత్రాదిమ ఉపొద్ఘాతః: ఈ 16
సర్గల కావ్యంలో మొదటి సర్గ 'ఉపోద్ఘాతం'
(పీఠిక).
- విషయం: ఉపోద్ఘాతం అంటే అసలు కథకు పునాది
వంటిది. ఇందులో శివుడు మరియు ఇతర దేవతల మధ్య జరిగిన సంవాదం (చర్చ) మొదలైన
విషయాలు వివరించబడ్డాయి.
3. రెండవ సర్గ (ద్వితీయ సర్గము):
- ద్వితీయే తు తదుద్భవః: రెండవ
సర్గలో భగవంతుడైన మహేశ్వరుడు (శివుడు) అవతరించడం (ఆవిర్భావం) గురించి
వర్ణించబడింది.
4. మూడవ సర్గ (తృతీయ సర్గము):
- తృతీయే తత్తదమృతానిత్యవతారనిరూపణమ్: మూడవ
అధ్యాయంలో దేవతల అవతారాల గురించి వివరించారు.
- అమృతాంధసాం: అమరకోశం
ప్రకారం 'అమృతాంధసులు' అంటే
అమృతాన్ని ఆహారంగా స్వీకరించే దేవతలు. శివుడు శంకరాచార్యుడిగా
అవతరిస్తున్నప్పుడు, ఆయనకు సహాయం చేయడానికి ఇతర దేవతలు
కూడా భూమిపై వివిధ రూపాల్లో అవతరించారు. ఆ దేవతల అవతార విశేషాలను ఈ సర్గలో
నిరూపించారు.
శ్లోకము 19
చతుర్థసర్గై తచ్ఛుద్ధాష్టమప్రాక్చరితం
స్థితమ్ |
పంచమే తద్యోగ్యసుఖాశ్రమప్రాప్తినరూపణమ్ || 19
తాత్పర్యం
- 4వ సర్గ: ఎనిమిదేళ్ల వయస్సు వరకు
జరిగిన విలక్షణమైన బాల్య చరిత్ర.
- 5వ సర్గ: లోక కల్యాణం కోసం పరమహంస
సన్న్యాసాశ్రమ స్వీకారం.
వ్యాఖ్య
ఈ శ్లోకం శంకర భగవత్పాదుల బాల్య విశేషాలు మరియు వారి సన్న్యాస
దీక్షకు సంబంధించిన సర్గల వివరాలను తెలియజేస్తుంది.
1. నాలుగవ సర్గ (చతుర్థ సర్గము):
- తచ్ఛుద్ధాష్టమప్రాక్చరితమ్: నాలుగవ
సర్గలో శంకరాచార్యుల వారి ఎనిమిదేళ్ల వయస్సు వరకు జరిగిన బాల్య విశేషాలు
(అష్టమ-ప్రాక్-చరితం) వర్ణించబడ్డాయి.
- శుద్ధత్వం: ఇక్కడ
'శుద్ధం' అంటే సామాన్య మానవ
పిల్లల బాల్య చేష్టల వలె కాకుండా, పరమేశ్వరుని దివ్య
లీలలతో కూడిన విలక్షణమైన ప్రవృత్తి అని అర్థం. అంటే ఎనిమిదేళ్ల ప్రాయంలోనే
సకల వేదశాస్త్ర పారంగతులు కావడం వంటి అసాధారణ అంశాలు ఇందులో ఉన్నాయి.
2. ఐదవ సర్గ (పంచమ సర్గము):
- తద్యోగ్యసుఖాశ్రమప్రాప్తినరూపణమ్: ఐదవ
సర్గలో శంకరులు తమకు యోగ్యమైన 'సుఖాశ్రమము'ను స్వీకరించడం గురించి వివరించారు.
- సుఖాశ్రమము: ఇక్కడ
సుఖాశ్రమము అంటే 'సన్న్యాసాశ్రమము' (చతుర్థాశ్రమము). ప్రాపంచిక బంధాల నుండి విముక్తిని ప్రసాదించి,
బ్రహ్మానంద సుఖాన్ని ఇచ్చేది కాబట్టి దీనిని సుఖాశ్రమమని
పిలిచారు.
- విశేషం: ఈ సన్న్యాసం కేవలం వేషధారణ కోసం కాదు,
ఇది 'జీవన్ముక్తి'ని
ఇచ్చేది. శుద్ధాద్వైత బ్రహ్మవిద్యను లోకానికి చాటిచెప్పడానికి అనువైన పరమహంస
సన్న్యాస దీక్షను ఆయన స్వీకరించిన వృత్తాంతం ఇందులో ఉంటుంది.
3. వ్యాఖ్యాన విశేషం:
- శంకరులు ధరించిన ఈ ఆశ్రమ రూపం కేవలం మాయా శక్తితో కూడిన లీల మాత్రమే
(మాయిక లీలా విగ్రహం). పరమాత్మ తత్త్వాన్ని లోకంలో ప్రతిష్ఠించడానికి ఆయన
ఎంచుకున్న మార్గమిది. అందుకే వ్యాఖ్యాత దీనిని 'గౌరవప్రదమైన మరియు నిరతిశయ సుఖాన్నిచ్చే మార్గం' అని పేర్కొన్నారు.
శ్లోకం 20
మహతాఽనేహసా యైషా సంప్రదాయాగతా గతా |
తస్యాః శుద్ధాత్మవిద్యాయాః షష్ఠే సర్గే ప్రతిష్ఠితిః ||
20
తాత్పర్యం
కాలక్రమేణా విచ్ఛిన్నమైపోయిన అద్వైత సంప్రదాయాన్ని
(శుద్ధాత్మ విద్యను) తిరిగి నిలబెట్టడానికి సంబంధించిన పూర్తి వివరాలు
ఈ కావ్యంలోని 6వ అధ్యాయంలో ఉన్నాయి.
వ్యాఖ్య
. ఈ శ్లోకం అద్వైత విద్య (శుద్ధాత్మ
విద్య) యొక్క ప్రాముఖ్యతను మరియు ఆరవ సర్గలో దాని పునఃప్రతిష్ఠాపన గురించి
వివరిస్తుంది.
1. సంప్రదాయ విచ్ఛిన్నత:
- మహతా కాలేన: అత్యంత
పవిత్రమైన ఈ 'శుద్ధాత్మ
విద్య'
(అద్వైత జ్ఞానం) ప్రాచీన కాలం నుండి గురు-శిష్య పరంపరగా
(సంప్రదాయం ద్వారా) వస్తోంది.
- సంప్రదాయస్య విచ్ఛిన్నత్వాద్గతా: అయితే, కాలక్రమేణా సరైన బోధకులు, గ్రహీతలు
లేకపోవడం వల్ల ఈ సంప్రదాయం మధ్యలో విచ్ఛిన్నమై, ఆ విద్య అంతరించిపోయినట్లుగా అనిపించింది.
2. విద్య పునఃప్రతిష్ఠాపన:
- శుద్ధాత్మ విద్యాయాః ప్రతిష్ఠితిః: అటువంటి
క్లిష్ట సమయంలో, అంతరించిపోతున్న
ఆత్మవిద్యను తిరిగి శాస్త్రీయంగా, దృఢంగా
స్థాపించడం (ప్రతిష్ఠించడం) అవసరమైంది.
- షష్ఠే సర్గే స్థితమ్: ఈ
పునఃప్రతిష్ఠాపన ఏ విధంగా జరిగింది, శంకరాచార్యుల
వారు ఈ విద్యను ఎలా తిరిగి వెలుగులోకి తెచ్చారు అనే విశేషాలు ఆరవ సర్గలో వివరించబడ్డాయి.
-------
శ్రీ మాధవీయ శంకరవిజయము
- ప్రథమ సర్గ 21 శ్లోకం నుండి చివరి 98 శ్లోకం వరకు
(
మూల శ్లోకములతో తెలుగు వ్యాఖ్య)
-
ఆచార్య తాడేపల్లి పతంజలి
శ్రీశివాయ గురవేనమః
తద్వ్యాసాచార్యసందర్శవిచిత్రం
సప్తమే స్థితమ్ |
స్థితో౽ష్టమే మణ్డనార్యసంవాదో నవమే
మునేః || 21
తాత్పర్యం
ఏడవ సర్గలో ఆ శంకరాచార్యులకు మరియు
వ్యాసాచార్యులకు మధ్య జరిగిన పరస్పర దర్శనం (కలయిక) అత్యంత విచిత్రంగా, ఆశ్చర్యకరంగా వర్ణించబడింది. ఎనిమిదవ
సర్గలో మండనమిశ్రులు (మండనార్యులు) మరియు భాష్యకారులు (శంకరాచార్యులు) మధ్య జరిగిన
సంవాదం (చర్చ) ఉంది.
వ్యాఖ్య
- తదితి: ఆ భగవత్పాదులైన భాష్యకారులకు కలిగిన ప్రత్యక్ష
జ్ఞానమే 'సందర్శము'.
- వ్యాసాచార్య: వ్యాసుల వారు ఆచార్యులు.
ఆచార్యుడు అంటే ఎవరో ఈ శ్లోకం వివరిస్తోంది:
ఆచినోతి చ శాస్త్రార్థమాచారే స్థాపయత్యపి |
స్వయమప్యాచరేద్యస్తు స ఆచార్య ఇతి స్మృతః ||
తాత్పర్యం:
ఎవరైతే శాస్త్రార్థాలను క్షుణ్ణంగా పరిశీలించి
గ్రహిస్తారో, ఇతరులను సదాచారంలో నిలుపుతారో
మరియు స్వయంగా తానే ఆ ధర్మాలను ఆచరిస్తారో... అటువంటి వారినే 'ఆచార్యుడు' అని అంటారు.
కృతే తు భగవాన్ వ్యాసః త్రేతాయాం దత్త ఏవ చ | ద్వాపరే భగవాన్వ్యాసః కలౌ శ్రీశంకరః స్వయమ్ ||
"కృతయుగంలో భగవంతుడు దత్తాత్రేయుడిగా,
త్రేతాయుగంలో రాముడిగా (కొన్ని చోట్ల
దత్తుడిగానే పేర్కొంటారు), ద్వాపరయుగంలో వ్యాసుడిగా మరియు
కలియుగంలో సాక్షాత్తు శ్రీ శంకరాచార్యులుగా అవతరించాడు" అని పెద్దల మాట
(అభియుక్తోక్తి).దీని ప్రకారం శంకరాచార్యులు అద్వైత విద్యకు ప్రాచీన సంప్రదాయాన్ని
పునరుద్ధరించిన ప్రవక్త. అటువంటి శంకరాచార్యులకు, వ్యాసాచార్యులకు
మధ్య జరిగిన ఆ దర్శనం (సందర్శం) అత్యంత విచిత్రమైనది మరియు అద్భుతమైనది.
(వారిద్దరి కలయికతో కూడిన 'చరిత్ర' అని
ఇక్కడ అర్థం చేసుకోవాలి).
వాణీసాక్షికసార్వజ్ఞనిర్వహోపాయచింతనమ్
|
దశమే యోగశక్త్యా
భూపతికాయప్రవేశనమ్ || 22
తాత్పర్యం
తొమ్మిదవ సర్గలో సరస్వతీ దేవి సాక్షిగా, ఆ ముని
శ్రేష్టుడైన శంకరాచార్యుల యొక్క 'సర్వజ్ఞత్వము' (అన్ని విద్యలు తెలిసిన వాడు అనుట) నిరూపించబడటం, మరియు
ఆ సర్వజ్ఞత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన అవలంబించిన ఉపాయం గురించి చింతన (ఆలోచన)
ఉంది.
పదవ సర్గలో తన యోగశక్తి ద్వారా 'అమరకుడు' అనే పేరు గల
రాజు యొక్క శరీరంలోకి (పరకాయ ప్రవేశం ద్వారా) ప్రవేశించడం వర్ణించబడింది. ||
22 ||
వ్యాఖ్య
- సరస్వతీ సాక్షికం: మండన మిశ్రుని భార్య అయిన ఉభయ భారతి
(సరస్వతీ దేవి అవతారం) సాక్షిగా చర్చలు జరిగాయి. శంకరాచార్యుల
సర్వజ్ఞత్వాన్ని ఆమె పరీక్షించిన సందర్భం ఇది.
- నిర్వాహః తదుపాయస్య: సన్యాసి అయిన శంకరాచార్యులకు
గృహస్థ ధర్మాలు, కామశాస్త్రం
వంటి విషయాల్లో అనుభవం ఉండదు. తన సర్వజ్ఞత్వాన్ని నిరూపించుకోవడానికి ఆయా
విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దాని కోసం ఆయన ఒక ఉపాయాన్ని
ఆలోచించారు.
- పరకాయ ప్రవేశం: ఆ ఉపాయమే 'పరకాయ ప్రవేశం'. మరణించిన
'అమరక' మహారాజు శరీరంలోకి తన
ప్రాణాన్ని ప్రవేశపెట్టి, రాజభోగాలను అనుభవిస్తూ
లోకజ్ఞానాన్ని గ్రహించడం ఈ సర్గలోని ప్రధానాంశం.
బుద్ధ్వా
మీనధ్వజకలాస్తత్ప్రసఙ్గప్రపఞ్చనమ్ |
సర్గే ఏకాదశే
తూగ్రభైరవాభిధనిర్జయః || 23
తాత్పర్యం
మకరధ్వజుడైన (చేప గుర్తు గల జెండా కలవాడు) ఆ మన్మథుని
యొక్క కళలను గ్రహించి, ఆ కళలకు సంబంధించిన విషయాలను
విస్తృతంగా వివరించడం (ప్రకటీకరించడం) గురించి పదవసర్గలో ఉన్నది. . ఇక పదకొండవ
సర్గలో 'ఉగ్రభైరవుడు' అనే పేరు గల
కాపాలికుడిని శంకరాచార్యులు జయించడం (నిర్జయః) వివరించబడింది. || 23 ||
వ్యాఖ్య
- తత్ప్రసంగే: ఉభయ భారతి (సరస్వతీ దేవి అవతారం) తో
జరిగిన ఆ చర్చా ప్రసంగంలో...
- పునర్జల్పాది: ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే
క్రమంలో జరిగిన వాదోపవాదాలు.
- ప్రపంచనం: కామశాస్త్రానికి సంబంధించిన ఆయా విషయాలను
వివరంగా తెలియజేయడం అని అర్థం.
ద్వాదశే
హస్తధాచార్యతోటకోభయసంశ్రయః |
వార్తికాంతబ్రహ్మవిద్యాచాలనం తు
త్రయోదశే || 24
తాత్పర్యం
పన్నెండవ సర్గలో హస్తామలకాచార్యులు మరియు తోటకాచార్యులు అనే ఇద్దరు గొప్ప
శిష్యులు శంకరాచార్యులను ఆశ్రయించడం (శిష్యులుగా చేరడం) వివరించబడింది. పదమూడవ
సర్గలో వార్తికములతో కూడిన బ్రహ్మవిద్యను అంతటా ప్రచారం చేయడం (చాలనం) గురించి
వివరించబడింది. || 24 ||
వ్యాఖ్య
- హస్తామలక-తోటక-ఉభయసంశ్రయః: హస్తామలకుడు మరియు తోటకుడు
అనే ఇద్దరు శిష్యులుగా చేరిన ఘట్టం.
- చాలనం: గ్రంథ రచనల ద్వారా మరియు పర్యటనల ద్వారా అద్వైత
బ్రహ్మవిద్యను అఖిల భారత దేశమంతటా వ్యాప్తి చేయడం (ప్రచారం చేయడం) అని అర్థం.
- హస్తామలకాచార్యులు: ఈయన చిన్నతనం నుండే ఆత్మజ్ఞాని.
శంకరాచార్యులు అడిగిన ప్రశ్నలకు ఈయన ఇచ్చిన సమాధానమే 'హస్తామలక స్తోత్రం'. అరచేతిలో ఉసిరికాయ (హస్త-ఆమలక) ఎంత స్పష్టంగా కనిపిస్తుందో, ఆత్మజ్ఞానం ఈయనకు అంత స్పష్టంగా తెలుసు కాబట్టి ఈ పేరు వచ్చింది.
- తోటకాచార్యులు: ఈయన గురుసేవలో తలమునకలై ఉండేవారు.
గురువుగారి అనుగ్రహంతో సంస్కృతంలోని 'తోటక' ఛందస్సులో అద్భుతమైన
స్తోత్రాన్ని ఆశువుగా పఠించారు, అందుకే ఈయనకు
తోటకాచార్యులు అనే పేరు స్థిరపడింది.
- వార్తికములు: శంకరాచార్యుల భాష్యాలకు
సురేశ్వరాచార్యులు (పూర్వాశ్రమంలో మండనమిశ్రులు) వ్రాసిన వివరణాత్మక
గ్రంథాలను 'వార్తికములు'
అంటారు. వీటి ద్వారా అద్వైత సిద్ధాంతం దేశవ్యాప్తంగా
ప్రచారమైంది.
చతుర్దశే
పద్మపాదతీర్థయాత్రానిరూపణమ్ |
సర్గే పఞ్చదశే తూక్తం
తదాశాజయకౌతుకమ్ || 25
పదునాలుగవ సర్గలో పద్మపాదాచార్యుల తీర్థయాత్రల
గురించి వివరించబడింది. పదిహేనవ సర్గలో ఆ శంకరాచార్యుల యొక్క ఆశాజయము (దిశలను
జయించడం) లేదా దిగ్విజయ యాత్రకు సంబంధించిన వ్యాఖ్య (కౌతుకం) చెప్పబడ్డాయి. || 21 ||
వ్యాఖ్య
- పద్మపాద: పద్మపాదాచార్యులు శ్రీమహావిష్ణువు యొక్క
అంశతో జన్మించినవారు మరియు శంకరాచార్యుల యొక్క ప్రధాన శిష్యులు.
- ఆశాజయము: దీనినే 'దిగ్విజయం' అని కూడా అంటారు. అంటే
నాలుగు దిక్కులలో ఉన్న పండితులను జయించి, అద్వైత
సిద్ధాంతాన్ని స్థాపించడం.
- కౌతుకం: ఆశ్చర్యకరమైన లేదా ఆసక్తికరమైన వ్యాఖ్య అని
అర్థం.
- పద్మపాదాచార్యులు: శంకరాచార్యుల నలుగురు ప్రధాన
శిష్యులలో ఈయన మొదటివారు. గురువు పిలవగానే గంగానదిపై నడుచుకుంటూ వెళ్తుంటే, ఆయన అడుగుల కింద పద్మాలు (తామర పూలు)
ఉద్భవించాయని, అందుకే ఈయనకు 'పద్మపాదుడు'
అనే పేరు వచ్చిందని చెబుతారు.
- తీర్థయాత్రలు: పద్మపాదుడు రామేశ్వరం వంటి
పుణ్యక్షేత్రాలను సందర్శించినప్పుడు జరిగిన ఘటనలు (ముఖ్యంగా ఆయన రాసిన 'పంచపాదిక' గ్రంథం
దహనం కావడం, మళ్ళీ గురువుగారు దానిని గుర్తుకు
తెచ్చుకోవడం) ఈ సర్గలో ఉన్నాయి.
- దిగ్విజయం: శంకరాచార్యులు భారతదేశం అంతటా పర్యటించి
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అద్వైత జెండాను ఎగురవేయడం ఈ ఘట్టంలోని
ప్రధానాంశం.
షోడశే శారదాపీఠవాసస్తస్య మహాత్మనః
|
ఇతి షోడశభిః సర్గేర్వ్యుత్పాద్యా
శాఙ్కరీ కథా || 26
తాత్పర్యం
పదహారవ సర్గలో ఆ మహాత్ముడైన శంకరాచార్యులు 'శారదా పీఠం'పై
అధిష్ఠించి నివసించడం వర్ణించబడింది. ఈ విధంగా మొత్తం పదహారు సర్గల ద్వారా శంకరాచార్యుల
పవిత్ర గాథ (శాంకరీ కథ) వివరించబడుతోంది. || 26 ||
వ్యాఖ్య
- శారదా పీఠం: భేదవాదులందరినీ (ద్వైతము, ఇతర మతాల పండితులను) జయించి, సర్వజ్ఞుడిగా అందరిచేత గుర్తింపు పొందిన ఆ శంకరాచార్యులు, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన 'సరస్వతీ పీఠం'
(శారదా పీఠం) మీద నివసించడం లేదా దానిని అధిరోహించడం
సముచితమైనది. ఇది పెద్దల మాట (శిష్ట కింవదంతి).
- సర్వజ్ఞ పీఠం: కాశ్మీర దేశంలో ఉన్న శారదా పీఠాన్ని
అధిరోహించడానికి నాలుగు దిక్కుల ద్వారాల నుండి వచ్చే పండితులను ఓడించాల్సి
ఉంటుంది. శంకరాచార్యులు తన పాండిత్యంతో అందరినీ మెప్పించి, ఆ పీఠాన్ని అధిష్టించి 'సర్వజ్ఞుడు' అని పించుకున్నారు.
- షోడశ సర్గలు: ఈ గ్రంథం (మాధవీయ శంకర విజయం) మొత్తం 16 సర్గలతో పూర్తి అవుతుంది. ఇందులో
శంకరుల జననం నుండి ఆయన అవతార సమాప్తి (నిర్యాణం) వరకు గల ముఖ్య ఘట్టాలన్నీ
క్రమపద్ధతిలో వివరించబడ్డాయి.
- భేదవాది విజియ్య: సమాజంలో ఉన్న రకరకాల మత వైషమ్యాలను, తప్పుడు వాదనలను శంకరాచార్యులు తన
తర్కంతో మరియు అద్వైత సిద్ధాంతంతో జయించారని దీని అర్థం.
సైషా కలిమలచ్ఛేత్రీ
సకృచ్ఛ్రుత్యా౽పి కామదా |
నానాప్రశ్నోత్తరై రమ్యా
విదామారభ్యతే ముదే || 27
తాత్పర్యం
ఈ శాంకరీ కథ (శంకరాచార్యుల చరిత్ర) కలియుగంలోని పాపాలను (కలిమలములను) నశింపజేస్తుంది.
దీనిని ఒక్కసారి విన్నా కూడా, మనిషి కోరుకునే ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే 'చతుర్విధ పురుషార్థాలను' ప్రసాదిస్తుంది. అనేక రకాల
ప్రశ్నలు-సమాధానాలతో ఎంతో మనోజ్ఞంగా ఉండే ఈ గ్రంథాన్ని, విద్వాంసుల
ఆనందం (ప్రమోదం) కోసం ఇక్కడ ప్రారంభించడం జరుగుతోంది. || 27 ||
వ్యాఖ్య
కలీతి: ఇది సాక్షాత్తు ఈశ్వరుని యొక్క అత్యంత
సాత్వికమైన అవతార చరిత్ర (శంకరులు శివావతారం) కాబట్టి, ఇది కలి పాపాలను పోగొడుతుంది.
- కలిమలనాశక: కలియుగంలో మానవులకు కలిగే మానసిక
మాలిన్యాలను, అజ్ఞానాన్ని
ఈ కథా శ్రవణం తొలగిస్తుంది.
- పురుషార్థ ప్రదాయిని: సాధారణంగా ఒక్కో వ్రతం లేదా కథ
ఒక్కో ఫలాన్ని ఇస్తుంది, కానీ శంకర విజయం వినడం వల్ల ఐహిక సుఖాలు (అర్థ, కామ) మరియు ఆధ్యాత్మిక ఉన్నతి (ధర్మ, మోక్షం)
రెండూ లభిస్తాయి.
- నానాప్రశ్నోత్తరైః: ఈ గ్రంథం కేవలం కథ మాత్రమే కాదు, ఇందులో అనేక దార్శనిక చర్చలు, ప్రశ్నలు మరియు శంకరాచార్యులు ఇచ్చిన అద్భుతమైన సమాధానాలు ఉంటాయి.
అందుకే ఇది పండితులకు (విద్వాంసులకు) అమితానందాన్ని ఇస్తుంది.
ఏకదా దేవతా రూప్యాచలస్థముపతస్థిరే
|
దేవదేవం తుషారాంశుమివ
పూర్వాచలస్థితమ్ || 28
తాత్పర్యం
ఒకానొక రోజున, దేవతలందరూ కలిసి తమలో శ్రేష్టుడైనవాడు, కైలాస
నివాసి మరియు ఉదయాద్రి (తూర్పు కొండ) పై ప్రకాశించే చంద్రుని వలె ఎల్లప్పుడూ
దేదీప్యమానంగా వెలిగిపోయే ఆ పరమశివుని ప్రార్థించారు (ఆశ్రయించారు).
వ్యాఖ్య
ఒకానొక సమయంలో, 'రూప్యాచలం' అనబడే కైలాస పర్వతం మీద
ఉన్న దేవదేవుడైన మహాదేవుని (శివుడిని), ఉదయాద్రి (తూర్పు కొండ) మీద ఉన్న చంద్రుని వలె ప్రకాశిస్తున్న వానిని,
బ్రహ్మాది దేవతలు అందరూ వచ్చి సేవించారు (ఉపాసించారు). ఇక్కడ 'దేవతలు' అంటే ముఖ్యంగా బ్రహ్మదేవుడు మొదలైన వారిని
గ్రహించాలి.
వేదోక్తమైన ఆచారాలను (నిగమాచారములను)
వదిలిపెట్టి, కేవలం ఆగమ శాస్త్రాలలోని
తాంత్రిక పద్ధతులలో మునిగిపోయిన బ్రాహ్మణాది వర్ణాల వారిని చూసి, సత్యలోకం నుండి వచ్చిన నారద మహర్షి ప్రేరణతో బ్రహ్మదేవుడు తన భక్తులతో
కలిసి శివలోకానికి వెళ్ళాడు. అక్కడ పంచముఖుడైన పరమశివునికి ప్రణామం చేసి ఇలా
పలికాడు... అని ప్రాచీన 'శంకర విజయం'లో
చెప్పబడింది.
రూప్యాచలే: వెండి కొండ అయిన కైలాసముపై.
- చంద్రునితో పోలిక: ఉదయగిరిపై చంద్రుడు ఎలాగైతే అమృతం
కోసం దేవతలచే సేవింపబడతాడో, అలాగే మోక్షమనే అమృతాన్ని ఇచ్చే శివుని దేవతలు ఆశ్రయించారు.
- సందర్భం: లోకంలో అగ్నిహోత్రాది వైదిక కర్మలు
నశించిపోవడం, అద్వైత
విద్య పట్ల అవగాహన తగ్గడం చూసి, లోక కల్యాణం కోసం
బ్రహ్మదేవుడు శివుడిని స్తుతించడం ఇక్కడ ప్రధానాంశం.
ప్రసాదానుమితస్వార్థసిద్ధయః
ప్రణిపత్య తమ్ |
ముకుళీకృతహస్తాబ్జా వినయేన
వ్యజిజ్ఞపన్ || 29
తాత్పర్యం
ఆ పరమశివుని ప్రసన్నమైన ముఖకవళికలను చూసి, తమ కోరికలు నెరవేరుతాయని దేవతలు
గ్రహించారు. అందుకే, వారు అత్యంత వినయ విధేయతలతో, తమ చేతులను మొగ్గల్లా (అంజలి ఘటించి) జోడించి ఇలా పలికారు:
వ్యాఖ్య
దేవతలు శివుడిని ఉపాసించి ఏమి చేశారో ఈ శ్లోకంలో
చెప్పబడింది. శివుని ఉపాసించడం ద్వారా ఆయన అనుగ్రహాన్ని పొందారు. ఆయన ముఖంలోని ప్రసన్నత
అనే చిహ్నం (గుర్తు) ద్వారా తమ కోరికలు నెరవేరబోతున్నాయని వారు ఊహించారు. అప్పుడు
వారు తమ పద్మాల వంటి చేతులను మొగ్గల్లా జోడించి (బద్ధాంజలులై), ఆ దేవదేవుడైన మహాదేవునికి సాష్టాంగ
నమస్కారం చేసి, అత్యంత వినయంతో తమ విన్నపాన్ని (విజ్ఞాపనను)
తెలియజేశారు.
లింగేనానుమితా: ఇక్కడ 'లింగం' అంటే ఒక గుర్తు
లేదా సంకేతం అని అర్థం. శివుని ముఖంలో కనిపించే ప్రసన్నతను చూసి, తమ కార్యం సిద్ధించబోతోందని దేవతలు ముందే గ్రహించారు.
- ముకులీకృతాః: వికసించిన పద్మాల వంటి తమ హస్తాలను
నమస్కార ముద్రలో ముడిచారు (దోసిలి ఒగ్గారు).
- దేవదేవ ప్రణిపత్య: దేవతలకు కూడా దేవుడైన ఆ పరమశివునికి
ప్రణామం చేసి, 'ప్రకర్షము'గా (అంటే పూర్ణమైన భక్తితో) నమ్రులయ్యారు.
- బ్రహ్మాదయో దేవాః: ఇక్కడ దేవతలు అంటే బ్రహ్మదేవుడు
మరియు ఇతర దేవగణాలు అని అర్థం చేసుకోవాలి.
విజ్ఞాతమేవ భగవన్విధ్యతే యద్ధితాయ
నః |
వఞ్చయన్సుగతాన్ బుద్ధవపుర్ధారీ
జనార్దనః || 30
తాత్పర్యం
ఓ స్వామీ! మాకు (దేవతలకు) మేలు చేయడం కోసం, ఆ శ్రీ జనార్దనుడు (విష్ణుమూర్తి) 'సుగతులను' (బౌద్ధులను) మోహింపజేయడానికి (దారి
మళ్లించడానికి) బుద్ధుడిగా అవతరించిన విషయం మీకు తెలిసిందే.
వ్యాఖ్య
హితాయ: లోక కల్యాణం మరియు దేవతల హితం కోసం.
బుద్ధవపుర్ధారీ: బుద్ధుని రూపాన్ని ధరించినవాడు.
సుగతాన్ వఞ్చయన్: ఇక్కడ 'వంచించడం' అంటే వేదాలను దూషించే అసుర ప్రవృత్తి గలవారిని, వేద
కర్మలకు దూరంగా ఉంచి వారి శక్తిని తగ్గించడం అని అర్థం.
విజ్ఞాతమేవ: ఇది మీకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు, సర్వజ్ఞుడైన
మీకు అంతా తెలిసినదే అని దేవతలు శివునితో విన్నవిస్తున్నారు
కీకట దేశమునందు (నేటి బీహార్ ప్రాంతం) జినసుతుడు
అనే పేరుతో బుద్ధుడు అవతరిస్తాడు" అని భాగవత పురాణంలో(1.3.24) చెప్పబడింది. ఇక్కడ 'బుద్ధావతారము'
అంటే అదే అని అర్థం.
తత్ప్రణీతాగమాలమ్బైర్భౌద్ధైర్దర్శనదూషకైః
|
వ్యాప్తేదానీం ప్రభో ధాత్రీ
రాత్రిః సంతమసైరివ || 31
తాత్పర్యం
31. ఓ దేవా! బుద్ధావతార సమయంలో
బోధించిన సిద్ధాంతాలను అనుసరిస్తూ, ఈశ్వర తత్వాన్ని (ఈశ్వర
ఉనికిని) నిందించే బౌద్ధులు ప్రపంచమంతటా విస్తరించారు. దీనివల్ల ఈ భూమండలం అంతా
దట్టమైన చీకటి అలముకున్న గాఢాంధకార నిశీధిలా (చీకటి రాత్రిలా) కనిపిస్తోంది.
వ్యాఖ్య
గతంలో శ్రీమహావిష్ణువు మా (దేవతల) మేలు కోరి
రాక్షసులను వంచించినప్పటికీ, ఇప్పుడు ఆ బుద్ధుడు
రచించిన ఆగమ శాస్త్రాలను ఆధారంగా చేసుకుని బౌద్ధులు ప్రపంచమంతటా విస్తరించారు.
కర్మ, ఉపాసన మరియు జ్ఞాన మార్గాలను ప్రతిపాదించే వేద
శాస్త్రాలను నిందించే ఆ బౌద్ధుల వల్ల భూమండలమంతా నిండిపోయింది. ఇది ఎలా ఉందంటే,
గాఢాంధకారం (చీకటి) కమ్మిన రాత్రిలాగా భూమి కనిపిస్తోంది.
వారందరినీ ఎదిరించి, నివారించగల సమర్థుడవు నీవే అని
సూచించడానికే ఇక్కడ శివుడిని 'ప్రభో!' అని
సంబోధించారు. "నీ వంటి ప్రభువు (రక్షకుడు) ఉండగా, లోకానికి
ఈ గతి పట్టడం అత్యంత అనుచితం" అని దేవతల సంబోధనలోని అంతరార్థం.
- దర్శన దూషకైః: ఆస్తిక మతానికి చెందిన ఆరు దర్శనాలను
(షడ్దర్శనములు - న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ,
మీమాంస, వేదాంత) నిందించే వారు అని
అర్థం.
- ధాత్రీ: 'ధాత్రీ' అంటే మేదినీ కోశం ప్రకారం
తల్లి, ఉసిరి, భూమి అని అర్థాలు
ఉన్నాయి. ఇక్కడ 'భూమి' అని అర్థం.
- సంతమసైః: మిక్కిలి దట్టమైన చీకటి. వేద జ్ఞానం లేని
స్థితిని చీకటితో పోల్చారు.
- వేద విరుద్ధత: బౌద్ధులు వేదాల్లోని కర్మ మార్గాన్ని
(యజ్ఞాలు), ఉపాసనను
మరియు జ్ఞానాన్ని వ్యతిరేకించడం వల్ల ధర్మ గ్లాని ఏర్పడిందని దేవతల విన్నపం.
- శివుని బాధ్యత: విష్ణువు తన పని తాను చేశారు, కానీ ఇప్పుడు ఏర్పడిన ఈ 'జ్ఞాన అంధకారాన్ని' తొలగించడానికి జ్ఞాన
స్వరూపుడైన శివుడే దిగిరావాలని దేవతలు కోరుతున్నారు.
వర్ణాశ్రమసమాచారాన్ద్విషంతి
బ్రహ్మవిద్విషః |
బ్రువంత్యామ్నాయవచసాం
జీవికామాత్రతాం ప్రభో || 32
తాత్పర్యం
ఈ శ్లోకం సాధారణంగా ధర్మవిరుద్ధంగా నడిచే వారి
మనస్తత్వాన్ని, వారు వేదాలను కేవలం ఒక వృత్తిగా
ఎలా చూస్తారో వివరిస్తుంది.
ఓ స్వామీ! ఈ లోకంలో మనుషులు వేదాలను, బ్రాహ్మణులను, వర్ణాశ్రమ
ధర్మాలను ద్వేషిస్తున్నారు. వేదాల్లో చెప్పబడిన విషయాలు కేవలం ఈ లోకానికి (భూమి
మీద బ్రతకడానికి) మాత్రమే పనికొస్తాయని, చనిపోయాక వచ్చే
కష్టాలకు లేదా పరలోక సుఖాలకు వాటితో సంబంధం లేదని వాదిస్తున్నారు.
వ్యాఖ్య
- వర్ణ ధర్మాలు మరియు ఆశ్రమ ధర్మాలను అనుసరించి
నడుచుకునే సదాచారాలను వారు ద్వేషిస్తారు. అటువంటి వారి పనులన్నీ
అనర్థదాయకమైనవి (కీడు కలిగించేవి) అని పెద్దలు చెబుతారు.
- వారు బ్రహ్మదేవుని, బ్రాహ్మణులను, వేదాలను, తపస్సును మరియు పరబ్రహ్మను
ద్వేషిస్తారు. అందుకే వారిని 'బ్రహ్మద్వేషులు' అని పిలుస్తారు.
- "ఓ ప్రభూ! ఈ వేదాలన్నీ కేవలం బ్రతుకుదెరువు కోసం (జీవనోపాధి కోసం)
సృష్టించబడ్డాయి" అని వారు ప్రచారం చేస్తారు. వేద వాక్యాలకు కేవలం ధన
సంపాదన అనే అర్థాన్ని మాత్రమే ఆపాదిస్తారు.
అమరకోశ వివరణ: శ్రుతిః స్త్రీ వేద ఆమ్నాయస్త్రయీ' ఇత్యమరాద్వేదవాక్యానామిత్యర్థః 'ఆమ్నాయ' అనే పదానికి అర్థం - 'శ్రుతి,
వేదము, ఆమ్నాయము, త్రయి'
అని అమరకోశం చెబుతోంది. అంటే ఇక్కడ ఆమ్నాయం అంటే 'వేద వాక్యాలు' అని అర్థం.
న సంధ్యాదీని కర్మాణి న్యాసం వా న
కదాచన |
కరోతి మనుజః కశ్చిత్సర్వే
పాఖండతాం గతాః || 33
తాత్పర్యం
మనుషులు సంధ్యోపాసన వంటి నిత్యకర్మలను చేయడం
లేదు. వైరాగ్య మార్గాన్ని వదిలేశారు. ధర్మాన్ని పాటించడం మానివేసి, తమ కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారు.
గమనిక: వేదధర్మాన్ని తర్కంతో తప్పుగా అర్థం
చెబుతూ, ధర్మానికి విరుద్ధంగా నడుచుకునే
వారినే 'పాషండులు' అంటారు.
వ్యాఖ్య
ఈ వాక్యాలు 'పాఖండత'
లేదా 'నాస్తికత్వం' అంటే
ఏమిటో వివరిస్తున్నాయి:
- న్యాసం: వారు సంన్యాసాన్ని (నిజమైన త్యాగాన్ని)
విడిచిపెట్టిన వారు లేదా వేషధారణ కోసం దానిని పొందిన వారు.
- పాఖండత (పాఖండులు) అంటే ఎవరు?:
- 'పా' అనే
శబ్దానికి 'త్రయీధర్మం' (వేద
ధర్మం) అని అర్థం. ఈ ధర్మాన్ని రక్షించే దానిని 'పాలక్షణ'
అంటారు.
- ఎవరైతే అటువంటి వేద ధర్మాన్ని తమ కుతర్కాలతో, అనవసరమైన వాదనలతో ఖండిస్తారో
(విమర్శిస్తారో), వారిని 'పాఖండులు'
అని పిలుస్తారు.
- ముగింపు: విద్వాంసుల (అభియుక్తుల) అభిప్రాయం ప్రకారం, వేద ధర్మాన్ని ధిక్కరించే ఇటువంటి
ప్రవర్తననే 'నాస్తికత్వం' అని
అంటారు.
శ్రుతే పిదధతి శ్రోత్రే
క్రతురిత్యక్షరద్వయే |
క్రియాః కథం ప్రవర్తేరన్ కథం
క్రతుభుజో వయమ్ || 34
తాత్పర్యం
'క్రతువు' (యజ్ఞం)
అనే మాట వినబడితేనే జనం చెవులు మూసుకుంటున్నారు. యజ్ఞాలే జరగకపోతే దేవతలకు హవిస్సు
(ఆహారం) ఎలా అందుతుంది?
- వేదాల ప్రకారం: భూమి మీద మనుషులు చేసే యజ్ఞాల ద్వారా
దేవతలు జీవిస్తారు. దేవతలు కురిపించే వర్షాల ద్వారా మనుషులు జీవిస్తారు.
వ్యాఖ్య
కాళిదాసు చెప్పినట్లు: రాజులు ప్రజల నుండి పన్నులు వసూలు
చేసి యజ్ఞాలు చేస్తారు, తద్వారా ఇంద్రుడు సంతోషించి
వర్షాలు కురిపిస్తాడు. ఇలా భూలోకానికి, స్వర్గానికి మధ్య ఒక
సంపద మార్పిడి (Mutual exchange) జరిగి రెండు లోకాలు సుఖంగా
ఉంటాయి.
ప్రవర్తన:
'క్రతు' (యజ్ఞము) అనే రెండు అక్షరాల మాట చెవిన
పడగానే, వారు తమ చెవులను మూసుకుంటారు (కర్ణపిధానం). అంటే
యజ్ఞయాగాదుల ప్రస్తావనను కూడా వారు వినడానికి ఇష్టపడరు.
క్రతువు
అంటే?: అమరకోశం ప్రకారం 'క్రతువు'
అంటే యజ్ఞము అని అర్థం. అమరకోశంలో యజ్ఞానికి 'సప్తతంతుః',
'మఖః', 'క్రతుః' అనే
పేర్లు ఉన్నాయి. (సప్తతంతుర్మఖః క్రతుః)
శివవిష్ణ్వాగమపరైర్లిఙ్గచక్రాదిచిహ్నితైః
|
పాఖండైః కర్మ సంన్యస్తం
కారుణ్యమివ దుర్జనైః || 35
తాత్పర్యం
బాహ్య రూపాలు - అంతర్గత దోషాలు: పుణ్యం లేని
కొందరు వ్యక్తులు తాము గొప్ప వైష్ణవులమని లేదా శైవులమని చెప్పుకుంటూ ఒంటి మీద
చక్రాలు, లింగ చిహ్నాలు ధరిస్తున్నారు.
కానీ, క్రూరమైన మనసున్న వాడు దయను వదిలేసినట్లు, వీరు తమ అసలైన ధర్మాన్ని వదిలేశారు.
వ్యాఖ్య
శివేతి స్పష్టోऽర్థః: 'శివ' అనే పదం యొక్క అర్థం చాలా స్పష్టమైనది
(మంగళకరమైనది అని భావం).
సంన్యస్తం (త్యక్తం): ఇక్కడ
సంన్యస్తం అంటే 'వదిలివేయడం' లేదా 'త్యాగం చేయడం' అని అర్థం.
విధిం వినైవ సముజ్ఝితమ్: శాస్త్రోక్తమైన
విధివిధానాలు పాటించకుండానే, అంటే ఏ నియమాలు లేకుండా
దేనినైనా వదిలివేయడాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు.
తత్త్వ వివరణ: శాస్త్రబద్ధంగా,
అర్హత కలిగిన వారు (అధికారి) చేసే 'వైధ
సన్యాసం' (నియమబద్ధమైన సన్యాసం) వేరు, కేవలం
బాధ్యతలను విస్మరించి వదిలేయడం వేరు. ఇక్కడ చెప్పబడిన అర్థం కేవలం వదిలివేయడం
గురించి మాత్రమే, ఇది శాస్త్రోక్తమైన సన్యాసానికి వర్తించదు
(అతివ్యాప్తి చెందదు).
అనన్యేనైవ భావేన
గచ్ఛంత్యుత్తమపూరుషమ్ |
శ్రుతిః సాధ్వీ మదక్షీబైః కా వా
శాక్యైర్న దూషితా || 36
తాత్పర్యం
ఈ శ్లోకం 'శ్రుతి'ని (వేదాన్ని) ఒక పతివ్రతతో పోలుస్తూ, భగవంతుని
వేడుకుంటున్న సందర్భాన్ని వివరిస్తుంది:
ఏ విధంగానైతే ఒక పతివ్రత తన భర్తను తప్ప అన్యం ఎరుగకుండా అనుసరిస్తుందో,
అప్పుడు మదోన్మత్తులైన దుష్టులు ఆమెను దూషించినట్లుగానే...'శ్రుతి' అనే సాధ్వీమణి కూడా క్షరాక్షరాతీతుడైన
(నశించే ప్రకృతికి, నశించని జీవుడికి
అతీతుడైన) ఆ పరమాత్ముని (ఉత్తమ పురుషుడు) వైపుకే అనన్యమైన భావంతో పయనిస్తోంది.
అంటే వేదాల తాత్పర్యం అంతా ఆ పరమాత్మను చేరడమే.
- : విద్యా గర్వంతో లేదా అజ్ఞానమనే మదంతో ఉన్మత్తులైన
వారు (ఇక్కడ శాక్యులు, బౌద్ధులు
అని ప్రస్తావించారు) ఆ వేదాలను దూషిస్తున్నారు. లోకంలో తాగుబోతులు పతివ్రతను
అవమానించినట్లే, ఈ మదోన్మత్తులు వేదాలను
నిందిస్తున్నారు. "ఓ ఉత్తమ పురుషుడా! నిన్ను
ప్రతిపాదించే (నీ గురించే చెప్పే) ఈ శ్రుతిని నీవు తప్పక రక్షించాలి"
అని కవి వేడుకుంటున్నారు.
వ్యాఖ్య
భావము: దీనికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి 'అభిప్రాయం', రెండోది 'అచంచలమైన ప్రేమ'.
ఉత్తమ పురుషుడు: భగవద్గీత వాక్యం ప్రకారం ('ఉత్తమః పురుషస్త్వన్యః..'), క్షర అక్షర పురుషుల కంటే విభిన్నమైన పరమాత్మ అని అర్థం. పతివ్రత పరంగా
చూస్తే, వివాహ విధి ద్వారా పొందిన శ్రేష్ఠుడైన భర్త అని
అర్థం.
గచ్ఛంతీ: వేదం పరంగా చూస్తే 'భగవంతుని వైపు తాత్పర్యాన్ని కలిగి ఉండటం'. పతివ్రత పరంగా 'భర్త చెంతకు వెళ్లడం'.
మదక్షీబైః: పండితుల పరంగా 'శాస్త్ర గర్వం' కలిగిన వారు, దుష్టుల పరంగా 'మద్యం మత్తులో ఉన్నవారు'.
వేదం కేవలం పుస్తకం కాదు, అది భగవంతుని చేరుకోవాలని తపించే ఒక
పవిత్రమైన పతివ్రత వంటిది. కాబట్టి దానిని అవమానించే వారి నుండి భగవంతుడే
రక్షించాలని ఈ శ్లోక సారాంశం.
సద్యః కృత్తద్విజశిరః
పఙ్కజార్చితభైరవైః |
న ధ్వస్తా లోకమర్యాదా కా వా
కాపాలికాధమైః || 37
తాత్పర్యం
బ్రాహ్మణుల శిరస్సులను పద్మాలు(తామర పూలు)గా
భావించి, ఆ శిరస్సులతో భైరవుడిని పూజించే
దుర్మార్గులైన 'కాపాలికుల' వల్ల ఈ
లోకంలో ఏ సంస్కృతి మాత్రం నాశనం కాలేదు? (అంటే, వారి అనాచారాల వల్ల అన్ని సంస్కృతులు ఏదో ఒక రకంగా ప్రభావితమయ్యాయి లేదా
దెబ్బతిన్నాయి అని భావం).
వ్యాఖ్య:
- కాపాలికులు: వీరు ఒక రకమైన తీవ్రవాద శైవ మతస్థులు.
వీరు కపాలాలను ధరించడం, భీకరమైన పూజలు చేయడం వంటివి చేసేవారు.
- అధర్మం: బ్రాహ్మణుల వంటి జ్ఞానులను హింసించడం మరియు
వారిని బలి ఇవ్వడం అనేది సమాజంలోని నైతిక విలువలను, సంస్కృతిని పతనం చేస్తుందని ఈ శ్లోకం
ఆవేదన వ్యక్తం చేస్తోంది.
- లోక స్థితి: అనాచారాలు పెరిగిపోయినప్పుడు, ఉత్తమమైన సంస్కృతి కూడా ఆ
క్రూరత్వానికి బలవుతుందని ఇక్కడ కవి వివరిస్తున్నారు.
అన్యే౽పి బహవో మార్గాః సంతి భూమౌ
సకంటకాః |
జనైర్యేషు పదం దత్త్వా దురంతం
దుఃఖమాప్యతే || 38
తాత్పర్యం
ధర్మ మార్గంలో నడిచేవారు అనేక రకాలైన
దుర్మార్గపు మతాల వల్ల లేదా విపరీత పోకడల వల్ల ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి
వస్తోంది. ఇది ఎలా ఉందంటే— ముళ్ళతో నిండిన దారిలో నడవడం ఎంత కష్టమో, ఆ దారిలో నడుస్తున్నప్పుడు ముళ్ళు
గుచ్చుకుని ఎంత నొప్పి కలుగుతుందో, అధర్మపరుల మధ్య ధర్మాన్ని
పాటించడం కూడా అంతటి బాధాకరంగా మారిందని భావం.
వ్యాఖ్య
అన్యే అంటే తార్కికులు మొదలైన వారు అని భావం
తద్భవాన్ లోకరక్షార్థముత్సాద్య
నిఖిలాన్ ఖలాన్ |
వర్త్మ స్థాపయతు శ్రౌతం జగద్యేన
సుఖం వ్రజేత్ || 39
తాత్పర్యం
కాబట్టి, మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము— వేద మార్గానికి (ధర్మానికి)
శత్రువులైన వారిని అంతం చేసి, తిరిగి వేద ధర్మాన్ని
ప్రతిష్టించండి. తద్వారా ఈ లోకాన్ని వినాశనం నుండి కాపాడండి.
వ్యాఖ్య
శ్లోకంలోని శ్రౌతం అనగా కేవలం
శ్రుతుల (వేదాల) ద్వారా మాత్రమే చెప్పబడిన పూర్వ, ఉత్తర
మీమాంస శాస్త్రాలు అని అర్థం. తంత్రములతో కలవనిది అని భావం]
ఇత్యుక్త్వోపరతాన్దేవానువాచ
గిరిజాప్రియః |
మనోరథం పూరయిష్యే మానుష్యమవలమ్బ్య
వః || 40
తాత్పర్యం
దేవతలు ఆ విధంగా ప్రార్థించినప్పుడు, పరమశివుడు వారితో ఇలా అన్నాడు: "నేను
మానవ రూపంలో జన్మించి, మీ కోరికను నెరవేరుస్తాను (అంటే
లోకంలో ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠిస్తాను)."
వ్యాఖ్య
మానుష్యమవలమ్బ్య అంటే మనుష్యత్వాన్ని
అవలంబించి లేదా మనుష్య భావాన్ని ఆశ్రయిస్తే మీ అందరి కోరిక నెరవేరుతుంది
దుష్టాచారవినాశాయ ధర్మసంస్థాపనాయ
చ ।
భాష్యం
కుర్వన్బ్రహ్మసూత్రతాత్పర్యార్థవినిర్ణయమ్ ।।41
తాత్పర్యం
దుష్టాచారాలను రూపుమాపి, ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠించడానికి నేను
భూమిపై అవతరిస్తాను. వేదాంత సారాన్ని వివరించే బ్రహ్మసూత్రాలకు సరైన అర్థాన్ని
తెలియజేస్తూ భాష్యాన్ని (వ్యాఖ్యానాన్ని) రచిస్తాను.
వ్యాఖ్య
అల్పాక్షరమసందిగ్ధం సారవద్విశ్వతోముఖమ్ | అస్తోభమనవద్యం చ సూత్రం సూత్రవిదో విదుః ||
సూత్రార్థో వర్ణ్యతే యత్ర వాక్యైః
సూత్రానుకారిభిః | స్వపదాని చ వర్ణ్యంతే భాష్యం
భాష్యవిదో విదుః ||
'తక్కువ అక్షరాలు కలిగి ఉండి,
సందేహం లేకుండా, సారవంతమై, అన్ని వైపులా అర్థాన్ని ఇచ్చేదిగా, వ్యర్థ పదాలు
లేకుండా, దోష రహితంగా ఉండేదానిని సూత్రమని సూత్రజ్ఞులు
అంటారు. సూత్రార్థమును సూత్రమును అనుసరించే వాక్యాలతో ఎక్కడ వర్ణిస్తారో, ఎక్కడ తన పదాలను తానే వివరించుకుంటుందో దానిని భాష్యమని భాష్యకోవిదులు
అంటారు.
మోహనప్రకృతిద్వైతధ్వాన్తమధ్యాహ్నభానుభిః
।
చతుర్భిః సహితః శిష్యైశ్చతురైర్హరివద్భుజైః ।।42
తాత్పర్యం
మోహము అనబడే అజ్ఞానమే దేనికి ఉపాదాన కారణమో (మూలమో), అటువంటి ద్వైతము అనే దట్టమైన చీకటిని పోగొట్టడానికి మధ్యాహ్న సూర్యుని
వంటివారైన నలుగురు సమర్థులైన శాస్త్రము మొదలైన అన్ని వ్యవహారాలలో ఆరితేరిన నాలుగు భుజములతో ఉన్న
విష్ణుమూర్తి వలె శోభిస్తున్న శిష్యులతో కలిసి నేను సంచరిస్తాను.
వ్యాఖ్య:
చతురైః అంటే శాస్త్రము మొదలైన అన్ని వ్యవహారాలలో
ఆరితేరిన వారు అని అర్థం || 42 ||
యతీన్ద్రః శఙ్కరో నామ్న్నా
భవిష్యామి మహీతలే ।
మద్వత్తథా భవన్తోఽపి మానుషీం
తనుమాశ్రితాః ।।
తాత్పర్యం
నేను ఈ భూమండలంపై శంకరుడు అనే పేరు గల
యతీశ్వరుడిగా అవతరిస్తాను. నా వలెనే మీరు (దేవతలు) కూడా మనుష్య రూపాలను ధరించి
భూమిపై జన్మించండి.
వ్యాఖ్య
యతీంద్రః అనగా పరమహంస పరివ్రాజకాచార్యుడు అని అర్థం
పరమహంస పరివ్రాజకాచార్యుడు' అనేది సన్న్యాస ధర్మంలో అత్యున్నతమైన
స్థితిని సూచించే బిరుదు. దీనిలోని ఒక్కో పదానికి అర్థం ఇక్కడ ఉంది:
- పరమహంస: సన్న్యాసులలో నాలుగు రకాలు ఉంటారు (కుటీచక, బహూదక, హంస,
పరమహంస). ఇందులో 'పరమహంస' అత్యున్నత స్థితి. పాలు, నీళ్లు కలిపి ఉంచితే
హంస కేవలం పాలను మాత్రమే ఎలా గ్రహిస్తుందో, అలాగే ఈ
లోకంలో అనిత్యమైన వాటిని వదిలేసి, కేవలం 'బ్రహ్మము' (సత్యము) అనే సారాన్ని మాత్రమే
గ్రహించే జ్ఞాని అని అర్థం.
- పరివ్రాజక: అంటే 'తిరుగుతూ ఉండేవారు' (Wandering monk). వీరు ఏ ఒక్క చోటా స్థిరంగా నివాసం ఉండకుండా, లోక
కల్యాణం కోసం, ధర్మ ప్రచారం కోసం నిరంతరం సంచరిస్తూ
ఉంటారు.
- ఆచార్యుడు: కేవలం జ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా, తన ఆచరణ ద్వారా ఇతరులకు మార్గదర్శనం
చేస్తూ, శిష్యులకు ఉపదేశించే గురువు.
మొత్తం కలిపి అర్థం:
సకల కోరికలను త్యజించి, నిరంతరం బ్రహ్మజ్ఞానంలో ఉంటూ, లోకానికి ధర్మాన్ని బోధించడానికి సంచరించే శ్రేష్ఠుడైన సన్న్యాసి అని
అర్థం. ఆదిశంకరాచార్యుల వంటి మహనీయులను సంబోధించేటప్పుడు ఈ గౌరవప్రదమైన బిరుదును
ఉపయోగిస్తారు.
తం మామనుసరిష్యన్తి సర్వే
త్రిదివవాసినః ।
తదా మనోరథః పూర్ణో భవతాం స్యాన్న
సంశయః ।।44
తాత్పర్యం
దేవతలైన మీరందరూ నన్ను అనుసరిస్తారు (నా కార్యంలో తోడ్పడతారు). అప్పుడు మీ
కోరికలన్నీ నిస్సందేహంగా నెరవేరుతాయి అని శివుడు దేవతలకు సెలవిచ్చాడు.
బ్రువన్నేత్రం దివిషదః
కటాక్షానన్యదుర్లభాన్ ।
కుమారే నిదధే భానుః కిరణానివ పఙ్కజే ।।45
తాత్పర్యం
దేవతలకు ఆ విధంగా అభయమిచ్చిన తర్వాత, సూర్యుడు తన కిరణాలతో పద్మాన్ని
వికసింపజేసినట్లుగా, పరమశివుడు తన కడగంటి చూపులతో
కుమారస్వామిని అనుగ్రహించాడు.
వ్యాఖ్య
ఈ శ్లోకంలో 'కుమార' అనే పదానికి రెండు లోతైన అర్థాలను ఇచ్చారు:
- మన్మథుడిని మించిన అందగాడు: తన సౌందర్యంతో మన్మథుడి
గర్వాన్ని సైతం అణచివేసేవాడు.
- దుష్టులను శిక్షించేవాడు: చెడు ఆలోచనలు కలవారిని లేదా
అధర్మాన్ని నాశనం చేసేవాడు.
సందర్భం:
- జ్ఞాన పునాది: శివుడు స్థాపించబోయే 'జ్ఞాన మార్గానికి' (సన్యాస ధర్మానికి) ముందుగా 'కర్మ మార్గం'
(వేదోక్తమైన కర్మలు) బలంగా ఉండాలి. ఆ కర్మ మార్గాన్ని
చక్కదిద్దడానికి జ్ఞాననిధి అయిన కుమారస్వామి సేవలు అవసరమని శివుడు భావించాడు.
- వంశ ప్రాశస్త్యం: శివుడు 'సుందరుడు', పార్వతీదేవి
'సౌందర్యవతి'. వీరిద్దరి కలయిక
వల్ల, తండ్రి యొక్క ఐదు ముఖాలు మరియు తల్లి యొక్క ఒక
ముఖం కలిపి ఆరు ముఖాలతో (షణ్ముఖుడు) జన్మించిన కుమారస్వామి అత్యంత
తేజోవంతుడు.
- లక్ష్యం: వేద వ్యతిరేక శక్తులను జయించి, ధర్మ సౌధానికి పునాది వేయడానికి
శివుడు తన కుమారుడిని భూమిపైకి పంపాలని నిశ్చయించుకున్నాడు.
దీని ప్రకారం, కుమారస్వామి 'కుమారిల భట్టు' గా జన్మించి కర్మ మార్గాన్ని ఉద్ధరిస్తారు, ఆపై
శివుడు 'శంకరాచార్యులు' గా వచ్చి
అద్వైతాన్ని ప్రతిష్ఠిస్తారు.
క్షీరనీరనిధేర్వీచిసచివాన ప్రాప్య
తాన్ గుహః ।
కటాక్షాన్ముముదే రశ్మీనుదన్వానైన్దవానివ ॥46
తాత్పర్యం
పాలకడలి అలల వలె ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న పరమశివుని చూపు సోకగానే, వెన్నెలను చూసి పొంగిపొర్లే సముద్రంలాగా కుమారస్వామి అమితమైన ఆనందాన్ని
పొందాడు.
వ్యాఖ్య
క్షీరసముద్రపు అలలతో సమానమైన (చల్లని మరియు
తెల్లని) కటాక్ష వీక్షణాలను పొంది కుమారస్వామి సంతోషించాడు. ఏ విధంగా అయితే
సముద్రం తన అలల ద్వారా చంద్రుని కిరణాలను తాకి ఆనందాన్ని పొందుతుందో, అదే విధంగా (కుమారస్వామి తన తండ్రి చూపులను
పొంది మురిసిపోయాడు) అని అర్థం
అవదన్నన్దనం స్కన్దమమన్దం
చన్ద్రశేఖరః ।
దన్తచన్ద్రాతపానన్దివృన్దారకచకోరకః
।।47
తాత్పర్యం
వెన్నెల కిరణాల వంటి కాంతిని విరజిమ్మే తన చిరునవ్వుతో, చకోర పక్షుల వంటి దేవతలకు అమితమైన సంతోషాన్ని కలిగిస్తూ... శివుడు తన
కుమారుడైన స్కందుడితో (కుమారస్వామితో) ఇలా మాట్లాడసాగాడు:
వ్యాఖ్య
చంద్రశేఖరుడైన శివుడు గొప్ప బుద్ధిమంతుడైన తన
కుమారుడగు స్కందునితో (కుమారస్వామితో) పలికాడు. చంద్రశేఖరుని విశేషణం ఏమిటంటే - తన
దంతాల వంటి చంద్రకాంతి ద్వారా దేవతలనే చకోర పక్షులకు ఆనందాన్ని కలిగించేవాడని
అర్థం. లేదా దంతాల లక్షణము కలిగిన చంద్రుల కాంతి అని కూడా చెప్పవచ్చు. పాఠాంతరంలో
(మరో పాఠంలో) ఇది క్రియావిశేషణంగా ఉంది || 47 ||
[ అమందం అంటే స్పష్టంగా అని అర్థం
] || 47 ||
శృణు సౌమ్య వచః శ్రేయో
జగదుద్ధారగోచరమ్ ।
కాణ్డత్రయాత్మకే వేదే ప్రోద్ధృతే స్యాద్
ద్విజోద్ధృతిః ॥48
తాత్పర్యం
"ముద్దుల బిడ్డా! లోక కల్యాణం మరియు అభివృద్ధి కోసం నేను చెప్పబోయే మాటలను
శ్రద్ధగా విను. వేదాల్లోని మూడు మార్గాలను (కర్మ, ఉపాసన,
జ్ఞానము) సరైన రీతిలో అర్థం చేసుకుని, ఆ
వేదాలను రక్షించినప్పుడే ద్విజులు రక్షించబడతారు."
వ్యాఖ్య
ద్విజులు అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు.
వీరికి భోగ మోక్షాలను
సిద్ధంపజేసి రక్షించడం అని అర్థం ]
తద్రక్షణే రక్షితం స్యాత్సకలం
జగతీతలమ్ ।
తదధీనత్వతో వర్ణాశ్రమధర్మతతేస్తతః ।।49
తాత్పర్యం
"ద్విజులు తమ విధులను (ధర్మాలను) వదలకుండా వారిని రక్షించడం ద్వారా, ఈ మూడు లోకాలు వాటం తట అవే రక్షించబడతాయి. ఎందుకంటే,
సమాజంలోని వివిధ వర్ణాల, ఆశ్రమల మరియు మతాల
యొక్క ధర్మబద్ధమైన విధి నిర్వహణ అనేది వారి (ద్విజుల) వేద
విజ్ఞానం మరియు ఆచరణపైనే ఆధారపడి ఉంటుంది."
ఇదానీమిదముద్ధార్యమితివృత్త మత్తః పురా
మమ గూఢాశయవిదౌ విష్ణుశేషౌ సమాపగా ।।50
తాత్పర్యం
నేను పూర్వం సంకల్పించిన ఈ వృత్తాంతాన్ని (ధర్మ రక్షణ
కార్యము) ఇప్పుడు నెరవేర్చవలసి ఉంది. నా అంతరంగాన్ని, రహస్య సంకల్పాలను తెలిసిన మహావిష్ణువు మరియు
ఆదిశేషుడు ఇద్దరూ నా ఆజ్ఞను స్వీకరించారు.
మధ్యమం కాణ్డముద్ధర్తుమనుజ్ఞాతౌ మయైవ తౌ
అవతీర్యాశతో భూమౌ సఙ్కర్షణపతఞ్జలీ ।।
51
తాత్పర్యం
వేదాలలోని
మధ్యమ కాండను (ఉపాసనా కాండను) ఉద్ధరించడం కోసం, నా
అనుమతితోనే వారు ఈ భూమిపై తమ అంశలతో సంకర్షణుడు మరియు పతంజలి మహర్షిగా అవతరించారు.
వ్యాఖ్య
వేదాలలో ఉన్న
మూడు ప్రధాన భాగాలలో (కాండలలో) మధ్యమ కాండ లేదా ఉపాసన కాండ రెండవది. దీని
ప్రాముఖ్యత మరియు స్వరూపాన్ని ఈ క్రింది విధంగా అర్థం చేసుకోవచ్చు:
1. వేద త్రయీ విభజనలో స్థానం
వేదాలను ఒక
క్రమపద్ధతిలో అర్థం చేసుకోవడానికి వాటిని మూడు కాండలుగా విభజించారు:
- కర్మ కాండ:
వేదాల మొదటి భాగం (సంహితలు, బ్రాహ్మణాలు). ఇది యజ్ఞయాగాదులు, శౌత-స్మార్త
కర్మల గురించి తెలుపుతుంది.
- ఉపాసన కాండ
(మధ్యమ కాండ): ఇది వేదాల మధ్య భాగం (ప్రధానంగా అరణ్యకాలు). ఇది మనస్సును
ఏకాగ్రం చేయడం, ధ్యానం
మరియు దేవతా ఉపాసన గురించి తెలుపుతుంది.
- జ్ఞాన
కాండ: వేదాల చివరి భాగం (ఉపనిషత్తులు). ఇది బ్రహ్మజ్ఞానం మరియు మోక్షం
గురించి వివరిస్తుంది.
2. ఉపాసన అంటే ఏమిటి?
'ఉప' అంటే దగ్గరగా, 'ఆసన'
అంటే కూర్చోవడం. అంటే, మనస్సును భగవంతుని
(లేదా ఒక పరమ సత్యం) రూపంపై లగ్నం చేసి, దానికి సమీపంగా
తీసుకువెళ్లడమే ఉపాసన.
- కర్మకాండలో
శరీరానికి పని ఉంటుంది (క్రియ).
- జ్ఞానకాండలో
బుద్ధికి పని ఉంటుంది (విచారం).
- ఉపాసన
కాండలో మనస్సుకు పని ఉంటుంది (ధ్యానం).
3. మధ్యమ కాండ ప్రాముఖ్యత
కర్మకాండ
ద్వారా చిత్తశుద్ధి (మనస్సు శుభ్రపడటం) లభిస్తే, ఉపాసన ద్వారా చిత్త
ఏకాగ్రత (మనస్సు నిలకడగా ఉండటం) లభిస్తుంది. మనస్సు నిలకడగా
లేనిదే జ్ఞానకాండలోని బ్రహ్మవిద్య అర్థం కాదు. అందుకే కర్మకు, జ్ఞానానికి మధ్య వంతెనలా ఈ ఉపాసన కాండ ఉంటుంది.
4. గ్రంథంలో ప్రస్తావన
పైన పేర్కొన్న
సంస్కృత భాగంలో మధ్యమ కాండమును (దేవతా కాండము) ఉద్ధరించడానికి విష్ణువు మరియు
శేషుడు సంకర్షణ మరియు పతంజలి మహర్షులుగా అవతరించారని ఉంది.
- పతంజలి
మహర్షి: ఈయనే 'యోగశాస్త్రం'
ద్వారా మనస్సును ఎలా నిగ్రహించుకోవాలో (ఉపాసన) నేర్పించారు.
- యోగము/ఉపాసన:
ఇది జీవుడిని పరమాత్మ వైపు నడిపించే సాధన.
ముఖ్య
విషయాలు:
- దీనినే దేవతా
కాండ అని కూడా అంటారు, ఎందుకంటే
ఇందులో వివిధ దేవతల స్వరూపాలను ధ్యానించే పద్ధతులు ఉంటాయి.
- ఇది
సగుణోపాసన (రూపం ఉన్న దైవాన్ని పూజించడం) నుండి నిర్గుణోపాసన (రూపం లేని
పరమాత్మను ధ్యానించడం) వైపు ప్రయాణానికి మార్గం సుగమం చేస్తుంది.
'సంకర్షణ'
అనే పదానికి ఆధ్యాత్మిక మరియు వ్యుత్పత్తి పరంగా లోతైన అర్థాలు
ఉన్నాయి.
1. పద
ఉత్పత్తి
'సంకర్షణ'
అంటే 'ఆకర్షించేవాడు' లేదా
'ఏకం చేసేవాడు' అని అర్థం. (సం + కృష్ +
ల్యుట్). గర్భం నుండి ఆకర్షించబడటం లేదా జీవులన్నింటినీ ప్రళయ కాలంలో తనలోకి
ఆకర్షించుకోవడం వల్ల ఈ పేరు వచ్చింది.
2. భాగవత/వైష్ణవ
సంప్రదాయంలో (వ్యూహ రూపం)
వైష్ణవ తత్త్వశాస్త్రం
ప్రకారం భగవంతుడు నాలుగు వ్యూహాలుగా (చతుర్వ్యూహాలు) వ్యక్తమవుతాడు. అందులో సంకర్షణుడు
రెండవ వాడు:
- వాసుదేవుడు:
పరమాత్మ స్వరూపం.
- సంకర్షణుడు:
జీవ తత్త్వానికి అధిపతి. ఈయనే అనంత శేషుడు.
- ప్రద్యుమ్నుడు:
మనస్తత్త్వానికి అధిపతి.
- అనిరుద్ధుడు:
అహంకార తత్త్వానికి అధిపతి.
పైన పేర్కొన్న గ్రంథ భాగంలో
"సంకర్షణ-పతంజలీ మునీ" అని ఉంది. దీని అర్థం:
- సంకర్షణుడు
(ఆదిశేషుడు): ఈయనే భూమిపై పతంజలి మహర్షిగా అవతరించారని పురాణాలు చెబుతాయి.
- ఉపాసనా
కాండం: పతంజలి మహర్షి 'యోగ సూత్రాలను' రచించారు. యోగం అంటే మనస్సును
భగవంతునితో అనుసంధానం చేయడం (ఉపాసన). అందుకే మధ్యమ కాండను లేదా ఉపాసనా
కాండాన్ని ఉద్ధరించడానికి సంకర్షణుడే పతంజలిగా వచ్చారని అక్కడ వివరించబడింది.
4. ఇతర
ప్రసిద్ధ అర్థాలు
- బలరాముడు: శ్రీకృష్ణుని
అన్నయ్య అయిన బలరాముడిని 'సంకర్షణుడు' అంటారు. ఎందుకంటే ఆయన దేవకీ దేవి
గర్భం నుండి రోహిణి గర్భంలోకి ఆకర్షించబడ్డారు (మార్చబడ్డారు).
- అనంత
శేషుడు: భూమండలాన్ని తన తలపై ధరించి, సమస్తాన్ని ధృడంగా పట్టి ఉంచే శక్తిని సంకర్షణ శక్తి
అంటారు.
52 శ్లోకం
మునీ భూత్వా
ముదోపాస్తియోగకాణ్డకృతౌ స్థితౌ |
అగ్రిమం జ్ఞానకాణ్డం
తూద్ధరిష్యామీతి దేవతాః || 52
తాత్పర్యం
మహావిష్ణువు మరియు ఆదిశేషుడు (సంకర్షణుడు)
ఇద్దరూ మునులుగా (పతంజలి వంటి రూపాలలో) అవతరించి,
ఎంతో సంతోషంతో ఉపాసనా యోగకాండమును రచించారు. ఆ తర్వాత,
"మున్ముందు రాబోయే జ్ఞానకాండమును నేనే స్వయంగా
ఉద్ధరిస్తాను" అని శివుడు దేవతలకు వాగ్దానం చేశారు.
వ్యాఖ్య
ఈ శ్లోకం శివుడు లోకకళ్యాణం కోసం చేసే వివిధ
అవతారాలను మరియు ఆ అవతారాల వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని వివరిస్తుంది:
- సమన్వయం: ఇక్కడ విష్ణువు మరియు శేషుడు కలిసి ముని రూపం
దాల్చడం అనేది భక్తి మరియు యోగ శాస్త్రాల సమ్మేళనాన్ని సూచిస్తుంది. వారు
పతంజలి వంటి మహర్షుల రూపంలో యోగ సూత్రాలను, ఉపాసనా పద్ధతులను లోకానికి అందించారు.
- కర్తవ్యం: వేదాలలో లేదా ఆధ్యాత్మిక మార్గంలో ఉపాసన
(సాధన) అనేది ఒక మెట్టు అయితే, జ్ఞానం (పరమాత్మ తత్త్వం) అనేది అంతిమ లక్ష్యం. ఉపాసనా
మార్గాన్ని సిద్ధం చేసిన తర్వాత, జ్ఞాన మార్గాన్ని తానే
స్వయంగా ప్రబోధిస్తానని శివుడు దేవతలకు అభయమిచ్చారు.
53 శ్లోకం
సమ్ప్రతి ప్రతిజానే స్మ జానాత్యేవ
భవానపి |
జైమినీయనయామ్భోధేః శరత్పర్వశశీ భవ
|| 53
తాత్పర్యం
"ఓ కుమార స్వామీ ! ఇప్పుడు నేను చేస్తున్న ఈ ప్రతిజ్ఞ నీకు కూడా తెలిసినదే. జైమిని మహర్షి
ప్రతిపాదించిన మీమాంసా శాస్త్రం (న్యాయం) అనే సముద్రానికి, నీవు
శరత్కాలపు పున్నమి చంద్రుడివి కావాలి (అంటే ఆ శాస్త్రాన్ని వెలుగులోకి తెచ్చి
అందరికీ అర్థమయ్యేలా చేయాలి)."
వ్యాఖ్య
ఈ శ్లోకంలో ఒక గొప్ప శాస్త్రవేత్త లేదా
శిష్యుడికి ఉన్న బాధ్యతను, ప్రతిభను శివుడు వర్ణించారు:
- జైమినీయనయం (మీమాంస): జైమిని మహర్షి వేదార్థాలను
వివరించడానికి 'పూర్వ
మీమాంస' అనే శాస్త్రాన్ని రచించారు. ఇది చాలా లోతైనది
మరియు సముద్రం వంటిది.
- శరత్పర్వశశీ (శరత్కాల చంద్రుడు): సముద్రం ఎంత
పెద్దదైనా, శరత్కాలంలో
ఉదయించే పూర్ణిమ చంద్రుడు తన వెన్నెలతో ఆ సముద్రానికి నిండుదనాన్ని, అందాన్ని ఇస్తాడు. అలాగే, కష్టతరమైన జైమిని
ప్రోక్త మీమాంసా శాస్త్రాన్ని తన జ్ఞానమనే వెన్నెలతో అందరికీ సులభంగా
అర్థమయ్యేలా వివరించమని ఇక్కడ ఆకాంక్ష కనిపిస్తోంది.
- గుర్తింపు: "భవానపి జానాతి" (నీకు కూడా తెలుసు) అనడంలో కుమారస్వామి యొక్క విద్వత్తుపై ఉన్న నమ్మకం వ్యక్తమవుతోంది. ఇది ఒక రకమైన
ప్రోత్సాహం మరియు బాధ్యతను అప్పగించడం వంటిది.
విశిష్టం కర్మకాణ్డం త్వముద్ధర
బ్రహ్మణః కృతే |
సుబ్రహ్మణ్య ఇతి ఖ్యాతిం గమిష్యసి
తతోఽధునా || 54
తాత్పర్యం
"ఓ కుమారస్వామి ! నీవు బ్రాహ్మణ సమూహం కోసం (లేదా వేదము కోసం) విశిష్టమైన కర్మకాండమును ఉద్ధరించుము.
అలా చేయడం ద్వారా, నీవు ఈ లోకంలో 'సుబ్రహ్మణ్యుడు'
(అంటే వేదాన్ని లేదా బ్రాహ్మణత్వాన్ని చక్కగా కాపాడేవాడు) అనే గొప్ప
కీర్తిని పొందుతావు."
వ్యాఖ్య
ఈ శ్లోకంలో 'బ్రహ్మణః కృతే' మరియు 'సుబ్రహ్మణ్య'
అనే పదాలకు ఉన్న లోతైన అర్థాలను కవి వివరించారు:
బ్రహ్మణః కృతే (బ్రాహ్మణుల కొరకు/వేదం కొరకు): మేదినీ
కోశం ప్రకారం 'బ్రహ్మ' అనే
పదానికి అనేక అర్థాలు ఉన్నాయి.( 'బ్రహ్మ తత్త్వతపోవేదే న
ద్వయోః పుంసి వేధసి | ఋత్విగ్యోగ్యభిదోర్విప్రః')
- నపుంసక లింగంలో వాడితే: తత్త్వము, తపస్సు, వేదము
అని అర్థం.
- పుంలింగంలో వాడితే: బ్రహ్మదేవుడు, ఋత్విక్కు, యోగి
లేదా విప్రుడు (బ్రాహ్మణుడు) అని అర్థం.
- ఇక్కడ సందర్భాన్ని బట్టి, వేదవిహితమైన కర్మలను ఉద్ధరించడం
ద్వారా బ్రాహ్మణ సమాజానికి లేదా వేద ధర్మానికి మేలు జరుగుతుందని భావం.
- సుబ్రహ్మణ్య ఖ్యాతి: ఎవరైతే వేద మార్గాన్ని
(బ్రహ్మమును) చక్కగా (సు) కాపాడతారో, వారు 'సుబ్రహ్మణ్యులు' అవుతారు. కర్మకాండను పునరుద్ధరించడం ద్వారా ఆ కీర్తి నీకు
దక్కుతుందని ఇక్కడ ఆశీర్వదించడం జరిగింది.
- సందర్భం: ఇది మీమాంస శాస్త్రవేత్త అయిన కుమారిల భట్టుకి సంబంధించిన సందర్భం. ఆయన
కర్మకాండను ఉద్ధరించడం ద్వారా వైదిక ధర్మాన్ని నిలబెట్టారు.
పదకోశ వివరణ (మేదినీ కోశం ప్రకారం)
'బ్రహ్మ తత్త్వతపోవేదే న ద్వయోః
పుంసి వేధసి | ఋత్విగ్యోగ్యభిదోర్విప్రః'
దీని అర్థం: 'బ్రహ్మ' శబ్దం తత్త్వము, తపస్సు, వేదము అనే అర్థాలలో నపుంసక లింగం.
సృష్టికర్త (వేధస), ఋత్విక్కు, యోగి,
బ్రాహ్మణుడు అనే అర్థాలలో పుంలింగం.
నైగమీం కురు మర్యాదామవతీర్య
మహీతలే |
నిర్జిత్య
సౌగతాన్సర్వానామ్నాయార్థవిరోధినః ||
55
తాత్పర్యం
"నీవు భూలోకంలో అవతరించి,
వేదార్థానికి విరోధులైన సౌగతులను (బౌద్ధులను)
అందరినీ జయించి, వేదోక్తమైన నైగమ మర్యాదను (వైదిక ధర్మాన్ని) తిరిగి ప్రతిష్ఠించుము."
వ్యాఖ్య
ఈ శ్లోకంలో వేద వ్యతిరేక వాదాలను ఖండించి, సనాతన ధర్మాన్ని కాపాడవలసిన ఆవశ్యకతను కవి
వివరించారు. ఇక్కడ వాడిన పదాలకు విద్వత్ పూర్వకమైన అర్థాలు ఇవి:
- నైగమీం (వైదిక ధర్మం): మేదినీ కోశం ప్రకారం 'నిగమ' అనే
పదానికి వ్యాపారం, నగరం, మార్గం
మరియు వేదము అనే అర్థాలు ఉన్నాయి. ఇక్కడ 'నైగమీం'
అంటే వేద సంబంధమైన లేదా వేద విహితమైన ధర్మం అని అర్థం.
- సౌగతాన్ (బౌద్ధులు): సుగతుడు (బుద్ధుడు)ని
అనుసరించేవారు సౌగతులు. వీరు వేద ప్రామాణ్యాన్ని అంగీకరించరు.
- ఆమ్నాయార్థ విరోధినః: 'ఆమ్నాయము' అంటే వేదము (అమరకోశం
ప్రకారం: శ్రుతిః स्त्री వేద ఆమ్నాయః). వేదాలలో చెప్పబడిన ధర్మానికి,
అద్వైత బ్రహ్మ తత్త్వానికి విరుద్ధంగా వాదించే వారిని ఓడించి,
వైదిక మార్గాన్ని పునరుద్ధరించమని ఇక్కడ ఆదేశం కనిపిస్తోంది.
కోశ వివరణలు
- మేదినీ కోశం: "నిగమో వాణిజే పుర్యా వాటే వేదే వణిక్పథే"
- అర్థం: నిగమ శబ్దం వాణిజ్యం, పట్టణం, తోట,
వేదము మరియు వర్తక మార్గం అనే అర్థాలలో వాడబడుతుంది. ఇక్కడ
వేద సంబంధమైన అర్థం గ్రహించబడింది.
- అమరకోశం: "శ్రుతిః స్త్రీ వేద ఆమ్నాయస్త్రయీ
ధర్మస్తు తద్విధిః"
- అర్థం: శ్రుతి, వేదము, ఆమ్నాయము,
త్రయి - ఇవన్నీ వేదానికి పర్యాయపదాలు. వేదార్థమైన ధర్మానికి
లేదా పరబ్రహ్మ తత్త్వానికి వ్యతిరేకంగా ఉండేవారు ఆమ్నాయార్థ విరోధులు.
బ్రహ్మాఽపి తే సహాయార్థే మణ్డనో
నామ భూసురః |
భవిష్యతి మహేన్ద్రోఽపి సుధన్వా
నామ భూమిపః || 56
తాత్పర్యం
"నీకు సహాయం చేయడం కోసం బ్రహ్మదేవుడు
కూడా భూలోకంలో మండన మిశ్రుడు అనే పేరుతో బ్రాహ్మణుడిగా జన్మిస్తాడు. అలాగే,
దేవేంద్రుడు కూడా సుధన్వుడు అనే పేరుతో రాజుగా అవతరిస్తాడు."
వ్యాఖ్య
ఈ శ్లోకం వైదిక ధర్మ పునరుద్ధరణ అనేది కేవలం
ఒక్కరి వల్ల సాధ్యమయ్యేది కాదని, అది ఒక
సమిష్టి దైవ సంకల్పమని చెబుతోంది:
- బ్రహ్మాఽపి మణ్డనః: జ్ఞానానికి అధిదేవత అయిన
బ్రహ్మదేవుడు 'మండన
మిశ్రుడు'గా అవతరించడం విశేషం. మండన మిశ్రుడు గొప్ప
మీమాంసకుడు. శాస్త్ర చర్చల్లో, కర్మకాండ ప్రచారంలో ఆయన
పాత్ర అత్యంత కీలకమైనది.
- భూసురః: భూమిపై ఉన్న దేవత (బ్రాహ్మణుడు) అని అర్థం.
బ్రహ్మదేవుడు విద్వత్తు కలిగిన విప్రుడిగా జన్మిస్తాడని ఇక్కడ తెలుస్తోంది.
- మహేన్ద్రోఽపి సుధన్వా: శాస్త్ర ప్రచారానికి పండితులతో
పాటు, ఆ
ధర్మాన్ని రక్షించే బలమైన రాజుల మద్దతు కూడా అవసరం. అందుకే దేవేంద్రుడు 'సుధన్వుడు' అనే రాజుగా అవతరించి, వేద విరోధులను అడ్డుకుని వైదిక ధర్మానికి రక్షణ కల్పిస్తాడని భావం.
- సహాయార్థే: అంటే ఈ అవతారాలన్నీ ఒక ప్రధాన లక్ష్యం
(వైదిక ధర్మ రక్షణ) కోసం పరస్పరం సహకరించుకుంటాయని అర్థం.
నేపథ్యం
శ్రీ శంకరాచార్యుల వారు అద్వైత ప్రచారం చేసే
సమయంలో, వారికి పూర్వమే కర్మకాండను
ఉద్ధరించడానికి కుమారిల భట్టు (కుమారస్వామి అంశ), మండన
మిశ్రుడు (బ్రహ్మ అంశ) మరియు సుధన్వ మహారాజు (ఇంద్రుడి అంశ) వంటి వారు జన్మించి
క్షేత్రాన్ని సిద్ధం చేశారని పురాణ గాథలు చెబుతున్నాయి.
తథేతి ప్రతిజగ్రాహ విధేరపి
విధాయినీమ్ |
బుధానీకపతిర్వాణీం సుధాధారామివ
ప్రభోః || 57
తాత్పర్యం
"దేవసేనాపతి (కుమారస్వామి),
సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని కూడా కార్యప్రవృత్తుడిని చేయగలిగే
పరమశివుని యొక్క ఆజ్ఞను/వాక్కును, అమృతధారలా భావించి 'తథాస్తు' (అలాగే కానివ్వండి) అని శిరసావహించి
అంగీకరించాడు."
వ్యాఖ్య
ఈ శ్లోకంలో శివుని ఆజ్ఞాబలం మరియు దానిని
స్వీకరించిన కుమారస్వామి భక్తిని కవి అద్భుతంగా వర్ణించారు:
- బుధానీకపతిః (దేవసేనాపతి): అమరకోశం ప్రకారం 'త్రిదశా విబుధాః సురాః'. ఇక్కడ 'బుధ'
అంటే పండితులే కాక 'దేవతలు' అని కూడా అర్థం. వారి సైన్యానికి పతి (అనీకపతి) అయిన కుమారస్వామి అని
భావం.
- విధేరపి విధాయినీమ్: 'విధి' అంటే బ్రహ్మదేవుడు.
బ్రహ్మదేవుడికి కూడా విధులను నిర్దేశించేది, ఆయన్ని
సైతం కార్యరంగంలోకి దింపే శక్తి కలిగినది పరమశివుని వాక్కు. అటువంటి
శక్తివంతమైన మాటను కుమారస్వామి స్వీకరించాడు.
- సుధాధారామివ (అమృత ధార వలె): భగవంతుని ఆజ్ఞ
కష్టతరమైనదిగా అనిపించినా, అది లోకకళ్యాణం కోసం కాబట్టి దానిని 'అమృతం'లా భావించి కుమారస్వామి స్వీకరించాడు.
- ప్రభోః వాణీమ్: ఇక్కడ ప్రభువు అంటే పరమశివుడు. శివుడు
ఆదేశించిన విధంగా భూలోకంలో అవతరించడానికి కుమారస్వామి అంగీకరించినట్లు ఈ
శ్లోకం చెబుతోంది.
అథేన్ద్రో నృపతిర్భూత్వా ప్రజా
ధర్మేణ పాలయన్ |
దివం చకార పృథివీం
స్వపురీమమరావతీమ్ || 58
తాత్పర్యం
"ఆ తర్వాత, దేవేంద్రుడు సుధన్వుడు అనే పేరుతో రాజుగా అవతరించి, ప్రజలను
ధర్మబద్ధంగా పాలించాడు. ఆయన తన రాజ్యపాలనతో ఈ భూమినే స్వర్గంగా మార్చివేశాడు. ఆయన
పరిపాలనలో ఉన్న నగరం దేవరాజధాని అయిన అమరావతి వలె వెలుగొందింది."
వ్యాఖ్య
ఈ శ్లోకం ధర్మరక్షణలో పాలకుడి (రాజు) పాత్ర ఎంత
కీలకమో వివరిస్తుంది:
- నృపతిర్భూత్వా (రాజుగా మారి): ఇంతకుముందు శ్లోకంలో (56వ శ్లోకం) చెప్పినట్లుగా, ఇంద్రుడు 'సుధన్వ' మహారాజుగా
జన్మించాడు.
- ధర్మేణ పాలయన్: కేవలం అధికారం చలాయించడం కాకుండా, వేదోక్తమైన ధర్మాన్ని అనుసరిస్తూ
ప్రజలను పాలించాడు. వైదిక ధర్మ పునరుద్ధరణకు రాజుల అండదండలు అవసరమని ఇక్కడ
సూచించబడింది.
- దివం చకార పృథివీం: అంటే భూమిని స్వర్గంగా మార్చాడని
అర్థం. సుభిక్షమైన పాలన, శాంతి, మరియు ధర్మం వర్ధిల్లినప్పుడు ఆ రాజ్యమే
స్వర్గతుల్యం అవుతుంది.
- అమరావతీమ్: ఇంద్రుని రాజధాని అమరావతి ఎంతటి
వైభవోపేతంగా ఉంటుందో, సుధన్వ
మహారాజు పాలనలో ఉన్న భూలోక నగరం కూడా అంతే వైభవంగా, పవిత్రంగా
ఉందని కవి వర్ణించారు.
సర్వజ్ఞోఽప్యసతాం శాస్త్రే
కృత్రిమశ్రద్ధయాఽన్వితః |
ప్రతీక్షమాణః క్రౌఞ్చారిం
మేలయామాస సౌగతాన్ || 59
తాత్పర్యం
"సర్వజ్ఞుడైనప్పటికీ (అన్నీ
తెలిసినవాడైనప్పటికీ), సుధన్వ మహారాజు అసత్-శాస్త్రాలైన (వేద
విరోధులైన) బౌద్ధుల శాస్త్రాల పట్ల కృత్రిమమైన (పైకి కనిపించే) శ్రద్ధను ప్రదర్శించాడు.
కుమారస్వామి అవతారమైన కుమారిల భట్టు రాక కోసం వేచి చూస్తూ, బౌద్ధ
పండితులందరినీ ఒకచోట చేర్చాడు."
వ్యాఖ్య
ఈ శ్లోకంలో ధర్మ స్థాపన కోసం అనుసరించిన ఒక 'యుక్తి' కనిపిస్తుంది:
- అసతాం శాస్త్రే (బౌద్ధ శాస్త్రము): అమరకోశం మరియు
వ్యాఖ్యానం ప్రకారం 'అసత్'
అంటే వేద ప్రామాణ్యాన్ని అంగీకరించని బౌద్ధులు. వారి
శాస్త్రాలపై రాజుకు నిజమైన గౌరవం లేదు, కానీ వారిని
చర్చకు పిలవడానికి వీలుగా కృత్రిమ శ్రద్ధను నటించాడు.
- కృత్రిమశ్రద్ధ: రాజు పండితులను గౌరవించే నెపంతో వారిని
తన సభకు రప్పించాడు. ఇది శత్రువుల బలాన్ని, బలహీనతలను తెలుసుకోవడానికి మరియు వారిని శాస్త్ర చర్చలో
ఓడించడానికి వేసిన ప్రణాళిక.
- క్రౌఞ్చారిం (కుమారస్వామి): అమరకోశం ప్రకారం 'కుమారః క్రౌఞ్చదారణః'. క్రౌంచ పర్వతాన్ని భేదించినవాడు
కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని 'క్రౌంచారి' అంటారు. ఇక్కడ కుమారస్వామి అంశతో జన్మించిన కుమారిల భట్టు కోసం రాజు
నిరీక్షిస్తున్నాడని భావం.
- మేలయామాస: అందరినీ ఒకచోట చేర్చాడు (సమ్మేళనం చేశాడు).
వైదిక ధర్మాన్ని నిలబెట్టడానికి పెద్ద ఎత్తున శాస్త్ర చర్చ జరగాలని రాజు
సంకల్పించాడు.
తతః స తారకారాతిరజనిష్ఠ మహీతలే |
భట్టపాదాభిధా యస్య భూషా
దిక్సుదృశామభూత్ || 60
తాత్పర్యం
"ఆ తర్వాత, తారకాసురుని శత్రువైన ఆ కుమారస్వామి భూలోకంలో అవతరించాడు. ఆయనకు 'భట్టపాద' (కుమారిల భట్టు) అనే పేరు స్థిరపడింది. ఆ
పేరు దిక్పాలకుల సుందరీమణులకు (దిగంగనలకు) ఒక ఆభరణం వలె, అంటే
దిక్కులన్నిటా వ్యాపించిన గొప్ప కీర్తిగా విరాజిల్లింది."
వ్యాఖ్య
ఈ శ్లోకం కుమారస్వామి భూమిపై ఏ రూపంలో
అవతరించారో, ఆయన కీర్తి ఎంతటిదో
వివరిస్తుంది:
- తారకారాతిః (తారక + అరాతి): అమరకోశం ప్రకారం 'బాహులేయస్తారకజిత్'. తారకాసురుడిని సంహరించినవాడు
(శత్రువు) కాబట్టి కుమారస్వామికి 'తారకారి' అని పేరు. ఆయనే భూమిపై అవతరించారు.
- భట్టపాదాభిధా: 'అభిధా' అంటే పేరు. ఆయన భూలోకంలో కుమారిల
భట్టు లేదా భట్టపాదులు అనే పేరుతో ప్రసిద్ధి చెందారు.
- దిక్సుదృశాం భూషా (దిక్కులకు అలంకారం): ఇక్కడ ఒక
చక్కని అలంకారం (Metaphor) ఉంది. ఆయన కీర్తి ఎంతలా వ్యాపించిందంటే, అది
పది దిక్కులనే స్త్రీలకు ఒక దివ్యాభరణంలా అందాన్ని ఇచ్చింది. అంటే ప్రపంచమంతా
ఆయన పాండిత్యాన్ని, వైదిక ధర్మ రక్షణను కొనియాడింది అని
అర్థం.
- అజనిష్ఠ: అంటే జన్మించాడు లేదా ప్రాదుర్భవించాడు అని
అర్థం.
స్ఫుటయన్వేదతాత్పర్యమభాజ్జైమినిసూత్రితమ్
|
సహస్రాంశురివానూరువ్యఞ్జితం
భాసయఞ్జగత్ || 61
తాత్పర్యం
"జైమిని మహర్షి తన సూత్రాలలో
(పూర్వ మీమాంస) సూచించిన వేద తాత్పర్యాన్ని స్పష్టం చేస్తూ, కుమారిల
భట్టు ప్రకాశించారు. అది ఎలా ఉందంటే—సూర్యుడు ఉదయించకముందు అనూరుడు (అరుణుడు)
జగత్తును కొద్దిగా వెలుగులోకి తెస్తే, ఆ తర్వాత సూర్యుడు
(సహస్రాంశువు) ఉదయించి లోకాన్ని సంపూర్ణంగా ఏ విధంగా భాసింపజేస్తాడో, అలాగే జైమిని సూత్రాలలోని నిగూఢార్థాలను ఈయన తన వార్తికముల ద్వారా
సంపూర్ణంగా వెలుగులోకి తెచ్చారు."
వ్యాఖ్య
ఈ శ్లోకంలో కవి కుమారిల భట్టును సూర్యుడితో, జైమిని మహర్షిని అనూరుడితో (సూర్య సారథి) పోల్చారు:
- జైమినిసూత్రితమ్: జైమిని మహర్షి 'అథాతో ధర్మజిజ్ఞాసా' వంటి సూత్రాలతో 'పూర్వ మీమాంస' శాస్త్రాన్ని రచించారు. ఇవి వేదంలోని కర్మకాండకు అర్థాన్ని చెబుతాయి.
అయితే అవి సూత్రప్రాయంగా ఉండటం వల్ల సామాన్యులకు అర్థం చేసుకోవడం కష్టం.
- స్ఫుటయన్ (స్పష్టం చేస్తూ): జైమిని సూత్రాలకు
శబరస్వామి రాసిన భాష్యంపై కుమారిల భట్టు 'శ్లోక వార్తికము', 'తంత్ర వార్తికము'
వంటి గ్రంథాలు రాశారు. వీటి ద్వారా వేదార్థం స్ఫుటంగా
(స్పష్టంగా) తెలిసింది.
- అనూరువ్యఞ్జితం: సూర్యుడు రాకముందు అరుణోదయం
జరుగుతుంది. అరుణుడు (సారథి) కాళ్లు లేనివాడు (అనూరుడు). ఆయన వెలుగు వల్ల
లోకం కొద్దిగా కనిపిస్తుంది. అలాగే జైమిని సూత్రాల వల్ల వేదార్థం
సూచనప్రాయంగా తెలిస్తే, భట్టపాదుల వివరణ వల్ల అది సూర్యకాంతిలా సంపూర్ణంగా ప్రకాశించింది.
- వేద తాత్పర్యం: ఇక్కడ వేదము అంటే ముఖ్యంగా కర్మకాండ
అని అర్థం. ఉపనిషత్తులకు (జ్ఞానకాండకు) శంకరాచార్యుల వారు భాష్యం రాస్తే, దానికి ముందరి భాగమైన కర్మకాండకు
కుమారిల భట్టు ప్రాణం పోశారు.
రాజ్ఞః సుధన్వనః ప్రాప నగరీం స
జయన్ దిశః |
ప్రత్యుద్గమ్య క్షితీన్ద్రో౽పి
విధివత్తమపూజయత్ || 62
తాత్పర్యం
"దిగ్విజయ యాత్ర చేస్తూ,
దిక్కులన్నింటినీ గెలుచుకుంటూ కుమారిల భట్టు (భట్టపాదులు) సుధన్వ
మహారాజు యొక్క నగరానికి చేరుకున్నారు. అప్పుడు ఆ రాజు (క్షితీంద్రుడు) స్వయంగా
ఎదురువెళ్లి, శాస్త్రోక్తంగా ఆయనను ఆహ్వానించి, విధిపూర్వకముగా పూజించి గౌరవించాడు."
వ్యాఖ్య
ఈ శ్లోకంలో ఒక గొప్ప పండితుడికి మరియు రాజుకు
మధ్య ఉండవలసిన సంబంధాన్ని, ధర్మాన్ని కవి వివరించారు:
- ప్రత్యుద్గమ్య (ఎదురువెళ్లి ఆహ్వానించుట): శాస్త్రం
ప్రకారం మనకంటే వయసులో గానీ, జ్ఞానంలో గానీ పెద్దవారు వచ్చినప్పుడు కూర్చున్నచోటు నుండి లేచి,
ఎదురువెళ్లి ఆహ్వానించాలి. "ఊర్ధ్వం
ప్రాణా హ్యుత్క్రామంతి యూని స్థవిర ఆగతే" (పెద్దవారు
వచ్చినప్పుడు యౌవనంలో ఉన్నవారి ప్రాణాలు పైకి లేస్తాయి, అంటే వారు లేచి నిలబడి గౌరవించాలి) అనే మనుస్మృతి ధర్మాన్ని ఇక్కడ
సుధన్వ మహారాజు పాటించాడు.
- క్షితీన్ద్రో౽పి (రాజు అయినప్పటికీ): సుధన్వుడు
సామాన్య రాజు కాదు, ఆయన
సాక్షాత్తు దేవేంద్రుని అంశతో జన్మించిన సార్వభౌముడు. అంతటి ఐశ్వర్యం,
అధికారం ఉన్నప్పటికీ, ఏమాత్రం గర్వం
లేకుండా ఒక వేద పండితుడికి సాష్టాంగ నమస్కారం చేయడం ఆయన వినయానికి నిదర్శనం.
- జయన్ దిశః (దిగ్విజయ యాత్ర): కుమారిల భట్టు కేవలం ఒక
ప్రదేశానికే పరిమితం కాకుండా, దేశమంతా పర్యటిస్తూ వేద విరోధులను తర్కంతో ఓడిస్తూ
వస్తున్నారు. ఆ క్రమంలోనే ఆయన సుధన్వుని నగరానికి విచ్చేశారు.
- విధివత్ అపూజయత్: ఒక అతిథికి లేదా గురువుకు ఇవ్వవలసిన
అర్ఘ్య, పాద్య,
ధూప, దీప నైవేద్యాది ఉపచారాలన్నింటినీ
శాస్త్రోక్తంగా నిర్వహించాడని సాధారణ
భావం.
- ఈ శ్లోకంలోని "విధివత్" అనే పదానికి రెండు గొప్ప అర్థాలు
ఉన్నాయి:
- శాస్త్రోక్తంగా: శాస్త్రంలో చెప్పబడిన విధి విధానాల
ప్రకారం (అర్ఘ్యపాద్యాదులతో) పూజించడం.
- బ్రహ్మదేవుని వలె (విధిం ఇవ): ఇక్కడ 'విధి' అంటే
బ్రహ్మదేవుడు.
- వాల్మీకి రామాయణంలో
విశ్వామిత్ర మహర్షి దశరథుని సభకు వచ్చినప్పుడు, దశరథుడు ఆయనను "బ్రహ్మాణమివ
వాసవః" (దేవేంద్రుడు బ్రహ్మదేవుని
ఆహ్వానించినట్లు) ఆహ్వానించాడని వాల్మీకి వ్రాసా రు.(
సర్గ 18- 41 వ శ్లోకం)
- అదే విధంగా, ఇక్కడ ఇంద్రాంశ సంభూతుడైన సుధన్వ
మహారాజు, బ్రహ్మాంశ సంభూతుడైన (మండన మిశ్రుడికి
గురువు/సమానుడైన లేదా సాక్షాత్తు జ్ఞానస్వరూపుడైన) భట్టపాదులను బ్రహ్మదేవునిగా
భావించి ఆహ్వానించారు.
- సమన్వయం: వాల్మీకి మహర్షి వాడిన ఉపమను ఇక్కడ
విద్యారణ్య స్వామి అత్యంత నేర్పుతో ఉపయోగించారు. సుధన్వుడు ఇంద్రుడైతే, ఆయన వద్దకు వచ్చిన భట్టపాదులు
బ్రహ్మదేవునితో సమానం. ఒక రాజు తన అధికారాన్ని పక్కన పెట్టి, జ్ఞానానికి ఇచ్చే అత్యున్నత గౌరవానికి ఇది నిదర్శనం. 'క్షితీంద్ర' (భూమికి ఇంద్రుడు) అనే పదం వాడటం
ద్వారా ఆయన ఇంద్రాంశను, 'విధివత్' అనడం ద్వారా భట్టపాదుల బ్రహ్మతేజస్సును కవి ధ్వనింపజేశారు.
సోఽభినన్ద్యాశిషా భూపమాసీనః
కాఞ్చనాసనే |
తాం సభాం శోభయామాస
సురభిర్ద్యువనీమివ || 63
తాత్పర్యం
"కుమారిల భట్టు (భట్టపాదులు)
ఆ సుధన్వ మహారాజును దీవించి, ఆయన సమర్పించిన బంగారు
సింహాసనంపై ఆసీనులయ్యారు. అప్పుడు ఆ సభ ఎలా ప్రకాశించిందంటే—వసంత కాలం రాగానే
దేవవనం (నందనవనం) ఏ విధంగా శోభాయమానంగా మారుతుందో, భట్టపాదుల
రాకతో ఆ రాజసభ కూడా అంతటి వైభవాన్ని పొందింది."
వ్యాఖ్య
ఈ శ్లోకంలో కవి కుమారిల భట్టును 'వసంత కాలం'తో, రాజసభను 'నందనవనం'తో పోల్చుతూ
అద్భుతమైన ఉపమాలంకారాన్ని ఉపయోగించారు:
- అభినన్ద్యాశిషా (దీవించి): శాస్త్ర మర్యాద ప్రకారం
రాజు పండితుడికి నమస్కరిస్తే, పండితుడు రాజును ఆశీర్వదించాలి. భట్టపాదులు తన
ఆశీస్సులతో రాజును అనుగ్రహించారు.
- కాఞ్చనాసనే (బంగారు ఆసనం): రాజు తన భక్తికి నిదర్శనంగా
భట్టపాదులకు అత్యున్నతమైన సువర్ణ పీఠాన్ని సమర్పించారు.
- ద్యువనీమ్ (దేవవనం): అమరకోశం ప్రకారం 'ద్యువనీ' అంటే స్వర్గంలోని వనం (నందనవనం). ఒక
పండితుడు సభలో ఉంటే ఆ సభ మనుష్య లోకపు సభలా కాకుండా, సాక్షాత్తు
స్వర్గసభలా మారిపోయిందని భావం.
- విద్యారణ్య
స్వామి (శంకర విజయకర్త) కేవలం అలంకారం కోసం కాకుండా,
ఔచిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పోలికను వాడారు. సుధన్వ మహారాజు సాక్షాత్తు దేవేంద్రుని
అంశతో జన్మించినవాడు (శ్లోకం 56 ప్రకారం). ఇంద్రుడి
వనం 'నందనవనం' (ద్యువనీ).
కాబట్టి, ఆయన సభను నందనవనంతో పోల్చడం ద్వారా ఆ రాజు
యొక్క దైవత్వాన్ని విద్యారణ్యులు స్ఫురింపజేశారు.
·
వసంతం - కుమారిల భట్టు: వసంత కాలం (సురభి) రాగానే నందనవనంలోని
కల్పవృక్షాలు ఎలా వికసిస్తాయో, వసంతం వంటి కుమారిల భట్టు రాకతో సుధన్వుని సభలోని
పండితుల జ్ఞానం అలా వికసించింది.
·
పునరుద్ధరణ: శిశిరంలో ఎండిపోయిన వనం వసంతంతో మళ్ళీ చిగురించినట్లు, అన్యమత ప్రభావంతో వాడిపోయిన వైదిక ధర్మం భట్టపాదుల రాకతో మళ్ళీ ప్రాణం
పోసుకుందని ఇక్కడ ధ్వని.
సభాసమీపవిటపిస్థితకోకిలకూజితమ్ ।
శ్రుత్వా జగాద తద్వ్యాజాద్రాజానం
పండితాగ్రణీః ॥ 64 ॥
తాత్పర్యం
సభకు సమీపంలో ఉన్న ఒక చెట్టుపై కూర్చున్న కోకిల
చేస్తున్న మధురమైన ధ్వనిని పండితాగ్రణి (కుమారిల భట్టు) విన్నారు. ఆ కోకిల కూతను నెపంగా పెట్టుకుని, రాజును
ఉద్దేశించి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆయన భావం ఏమిటంటే: "ఓ కోకిలమా! వినడానికి
కఠోరంగా, చెవులకు పీడ కలిగించేలా అరిచే
నీచమైన కాకుల సమూహంతో గనుక నీకు సాంగత్యం లేకపోతే, నీవు ఎంతో
శ్లాఘనీయుడవు (స్తుతింపదగినవాడివి) అవుతావు."
వ్యాఖ్య
1. పండితుడు అంటే ఎవరు?
వ్యాఖ్యానం ప్రకారం 'పండ' అంటే ఆత్మజ్ఞానం.
అట్టి ఆత్మజ్ఞానము కలవాడే పండితుడు. ఇక్కడ భట్టపాదులను
పండితాగ్రణిగా వర్ణించారు.
2. అంతరార్థం (గూఢోక్తి)
పైకి కోకిలను ఉద్దేశించి చెప్పినట్లున్నా, ఇందులో రాజుకు ఒక గొప్ప హితవు ఉంది.
- కోకిల: ఉత్తమ సంస్కారం, జ్ఞానం కలిగిన రాజుకు సంకేతం.
- కాకులు: వేదాలను దూషించే, నాస్తిక భావాలు కలిగిన నీచ వ్యక్తులకు
సంకేతం.
రాజు గనుక అపశబ్దాలు పలికే నాస్తికుల (కాకుల
వంటి వారి) సాంగత్యానికి దూరంగా ఉంటేనే, ఆయన కీర్తి శ్లాఘనీయంగా ఉంటుందని భట్టపాదుల ఉద్దేశ్యం.
3. అలంకారం
ఇందులో గూఢోక్తి అనే అలంకారం ఉపయోగించబడింది.
ఒకరిని ఉద్దేశించి చెప్పాల్సిన విషయాన్ని, మరొకరిని (ఇక్కడ కోకిలను) సాక్షిగా చేసుకుని చెప్పడమే గూఢోక్తి.
4. శబ్ద కాలుష్యం జ్ఞాన కాలుష్యం
కాకుల అరుపులు చెవులకు ఎలాగైతే పీడను (కర్ణస్య
దూషకః) కలిగిస్తాయో, నాస్తికుల వేద వ్యతిరేక వాదనలు
కూడా సమాజానికి, ధర్మానికి అలాగే హాని కలిగిస్తాయని ఈ శ్లోకం
హెచ్చరిస్తోంది.
మలినైశ్చేన్న సఙ్గస్తే నీచైః
కాకకులైః పిక ।
శ్రుతిదూషకనిర్హాదైః
శ్లాఘనీయస్తదా భవేః ॥ 65 ॥
తాత్పర్యం
బాహ్యార్థం (కోకిలను ఉద్దేశించి):
"ఓ కోకిలమా! అసహ్యకరమైన
నలుపు రంగు కలిగి, వినడానికి కఠోరంగా ఉండి చెవులకు బాధ
కలిగించేలా అరిచే ఆ నీచమైన కాకుల సమూహంతో గనుక నీకు సాంగత్యం లేకపోతే, నీవు ఎంతో ప్రశంసనీయుడవు అవుతావు."
అంతరార్థం (రాజును ఉద్దేశించి):
"ఓ రాజా! వేదాలను నిందిస్తూ,
ధర్మానికి విరుద్ధమైన కఠిన వాక్కులు పలికే నాస్తికుల (బౌద్ధుల వంటి
వారి) సాంగత్యం గనుక నీకు లేకపోతే, నీవు లోకంలో అత్యంత
గొప్పవాడివి, కీర్తివంతుడవు అవుతావు."
వ్యాఖ్య
1. మలినైః (మలినమైన వారు)
సాధారణంగా దీనికి 'నలుపు రంగు' అని
అర్థం. కానీ ఇక్కడ 'మేదినీ కోశం' ప్రకారం
'దూషితైః' అని అర్థం. అంటే నాస్తికత్వం
అనే దోషం చేత మలినమైన బుద్ధి గలవారు అని భావం.
2. నీచైః (నీచమైన వారు)
'విద్భక్షకత్వాత్' - అంటే అపవిత్రమైన వాటిని తినే కాకుల వలె, ధర్మ
విరుద్ధమైన పనులు చేసేవారు. వీరు వేద వాక్కులను కాదని 'శూన్యం'
వంటి సిద్ధాంతాలను నమ్ముతారు కాబట్టి అత్యంత తుచ్ఛులుగా
వర్ణించబడ్డారు.
3. శ్రుతిదూషక (వేద నిందకులు)
పక్షి పరంగా చూస్తే 'శ్రుతి' అంటే చెవి.
కాకుల అరుపులు చెవులకు కీడు చేస్తాయి. అదే రాజు విషయానికి వస్తే 'శ్రుతి' అంటే వేదాలు. వేద
ప్రామాణ్యాన్ని అంగీకరించకుండా, వాటిని దూషించే నాస్తికుల
వాదనలు వేద ధర్మానికి హానికరమని అర్థం.
4. కాకకుల (కాకుల సమూహం /
బౌద్ధులు)
కాకులు ఎప్పుడూ గుంపులుగా ఉంటూ తమ జాతిని
పోషించుకుంటాయి. అలాగే, వేద ధర్మానికి విరుద్ధంగా ఒక
సమూహంగా ఏర్పడి వాదించే బౌద్ధులు లేదా నాస్తికులను ఇక్కడ కాకులతో పోల్చారు.
5. గూఢోక్తి అలంకారం
"గూఢోక్తిరన్యోద్దేశ్యం
చేద్యదన్యం ప్రతి కథ్యతే" - అంటే ఒకరిని ఉద్దేశించి చెప్పాల్సిన విషయాన్ని,
మరొకరిని నెపంగా పెట్టుకుని చెప్పడం. ఇక్కడ కోకిల సాకుతో రాజుకు
హితవు చెప్పారు.
ఈ 66వ శ్లోకం, భట్టపాదుల (కుమారిల భట్టు) పరోక్ష
విమర్శకు బౌద్ధ పండితులు ఎలా స్పందించారో అత్యంత శక్తివంతమైన ఉపమానంతో
వివరిస్తుంది.
షడభిజ్ఞా నిశమ్యేమాం వాచం
తాత్పర్యగర్భితామ్ ।
నితరాం చరణస్పృష్టా భుజఙ్గా ఇవ
చుక్రుధుః ॥ 66 ॥
తాత్పర్యం
భట్టపాదులు పలికిన ఆ వ్యంగ్యపూరితమైన, అంతరార్థంతో కూడిన మాటలను విన్న వెంటనే షడభిజ్ఞులు
(బౌద్ధ పండితులు) విపరీతమైన కోపానికి లోనయ్యారు. వారి కోపం ఎలా
ఉందంటే - కాలుతో తొక్కబడిన పాము ఏ విధంగానైతే ఒక్కసారిగా రోషంతో బుసలు కొడుతుందో,
వీరు కూడా అలాగే ఉగ్రుడయ్యారు.
వ్యాఖ్య
ఈ శ్లోకంలోని పదాల వెనుక ఉన్న లోతైన అర్థాలను
పరిశీలిద్దాం:
1. షడభిజ్ఞాః (బౌద్ధులు)
వ్యాఖ్యానం ప్రకారం 'షడభిజ్ఞాః' అంటే బౌద్ధ
పండితులు. బౌద్ధ ధర్మంలో ఆరు రకాల ఉన్నతమైన జ్ఞానాలను (అభిజ్ఞలను) పొందిన వారిని
ఇలా పిలుస్తారు. కానీ ఇక్కడ భట్టపాదుల మాటలు వారి అహంకారాన్ని దెబ్బతీయడంతో వారు
ఆగ్రహించారు.
ఆ ఆరు రకాల ఉన్నత జ్ఞానాలు ఇవి:
- దివ్యచక్షువు: సాధారణ కంటికి కనిపించని దూర ప్రాంతాల్లోని దృశ్యాలను,
దేవతా రూపాలను లేదా ప్రాణుల పునర్జన్మలను చూడగలిగే శక్తి.
- దివ్యశ్రోత్రము: అతి దూరంలో ఉన్న శబ్దాలను లేదా దేవతలు, ఇతర ప్రాణులు పలికే సూక్ష్మమైన మాటలను వినగలిగే శక్తి.
- పరచిత్తజ్ఞానము : ఎదుటివారి మనస్సులో ఉన్న ఆలోచనలను, భావాలను తెలుసుకోగలిగే శక్తి.
- పూర్వనివాసానుస్మృతి : తన యొక్క మరియు ఇతరుల యొక్క గత జన్మలకు సంబంధించిన
వివరాలను గుర్తుకు తెచ్చుకోగలిగే జ్ఞానం.
- ఋద్ధివిధ : ఆకాశంలో ఎగరడం, నీటిపై నడవడం లేదా
ఒకేసారి అనేక రూపాలను ధరించడం వంటి అలౌకికమైన శక్తులు .
- ఆస్రవక్షయ జ్ఞానము : అన్ని రకాల మానసిక మాలిన్యాలను (కోరికలు, అజ్ఞానం) నశింపజేసి, నిర్వాణ స్థితిని లేదా
ముక్తిని పొందే పరమ జ్ఞానం.
కవి ఈ పదాన్ని ఒక రకమైన వ్యాజస్తుతి లేదా పరిహాసం (Irony) కోసం వాడారు. అంతటి ఉన్నత జ్ఞానాలు
(షడభిజ్ఞలు) కలవారు కూడా, భట్టపాదుల మాటలకు పాములాగా
కోపగించుకున్నారంటే - వారి జ్ఞానం కేవలం పాండిత్యానికే పరిమితమైందని, ఆచరణలో వారికి శాంతి లేదని ఇక్కడ కవి ధ్వనింపజేశారు.
2. తాత్పర్యగర్భితామ్
(అంతరార్థంతో కూడిన)
భట్టపాదులు పైకి కోకిల గురించి చెబుతున్నట్లు
ఉన్నా, అందులో రాజును హెచ్చరిస్తూ
బౌద్ధులను 'కాకులతో' పోల్చిన విషయం
వారికి అర్థమైంది. ఆ మాటల్లోని గూఢార్థం (తాత్పర్యం) వారిని సూటిగా తాకింది.
3. భుజఙ్గోపమ (పాముతో పోలిక)
ఇక్కడ బౌద్ధులను పాములతో (భుజంగ) పోల్చడం వెనుక
ఒక విశేషమైన ధ్వని ఉంది:
- ద్విజిహ్వత్వం: పాముకు రెండు నాలుకలు ఉంటాయి. అలాగే, ఈ పండితులు కూడా సత్యం ఒకటి ఉంటే
మరొకటి మాట్లాడుతారని ('రెండు నాలుకల ధోరణి') సూచించడానికి ఈ ఉపమానం వాడారు.
- తీవ్ర కోపం: పామును కాలుతో తొక్కినప్పుడు అది ఎంత
వేగంగా, భయంకరంగా
స్పందిస్తుందో, భట్టపాదుల మాటలు విన్న బౌద్ధులు కూడా
అంతే వేగంగా ప్రతిస్పందించారు.
4. నితరాం చుక్రుధుః (మిక్కిలి
కోపగించుట)
సాధారణంగా పండితులు చర్చల్లో శాంతంగా ఉండాలి.
కానీ తమ సిద్ధాంతాన్ని, ఉనికిని ప్రశ్నించేసరికి వారు
తమ సంస్కారాన్ని మరిచి పాముల్లా కోపగించుకున్నారని కవి ఇక్కడ వర్ణించారు.
ఛిత్త్వా యుక్తికుఠారేణ
బుద్ధసిద్ధాంతశాఖినమ్ ।
స తద్గ్రంథేంధనైః క్షీణైః
క్రోధజ్వాలామవర్ధయత్ ॥ 67 ॥
తాత్పర్యం
భట్టపాదులు తన 'యుక్తి' అనే గొడ్డలితో (కుఠారము)
'బౌద్ధ సిద్ధాంతము' అనే పెద్ద వృక్షాన్ని
నరికివేశారు. అలా నరకగా మిగిలిన ఆ సిద్ధాంత గ్రంథాలనే సమిధలుగా (కట్టెలుగా) చేసి,
బౌద్ధ పండితులలో రగులుతున్న క్రోధాగ్నిని (కోపమనే మంటను) మరింతగా
పెంచారు.
వ్యాఖ్య
1. యుక్తికుఠారము (తర్కమనే
గొడ్డలి)
భట్టపాదుల దగ్గర ఉన్న ఆయుధం భౌతికమైనది కాదు, అది ఆయన మేధస్సు నుండి పుట్టిన 'యుక్తి' (Logic). ఒక బలమైన వృక్షాన్ని పడగొట్టడానికి
పదునైన గొడ్డలి ఎలా అవసరమో, దశాబ్దాలుగా పాతుకుపోయిన బౌద్ధ
సిద్ధాంతాలను పడగొట్టడానికి ఆయన తర్కాన్ని ఆయుధంగా వాడారు.
2. సిద్ధాంతశాఖీ (వృక్ష రూపంలోని
సిద్ధాంతం)
బౌద్ధ సిద్ధాంతాన్ని ఇక్కడ ఒక వృక్షంతో
పోల్చారు. వృక్షానికి కొమ్మలు ఉన్నట్లే, సిద్ధాంతానికి అనేక గ్రంథాలు, ఉప-సిద్ధాంతాలు
ఉంటాయి. మూల సిద్ధాంతమే తప్పని నిరూపించినప్పుడు (వృక్షాన్ని నరికినప్పుడు),
దానికి సంబంధించిన శాఖోపశాఖలన్నీ అర్థం లేనివిగా మారిపోతాయి.
3. గ్రంథేంధనములు (పుస్తకాలే
కట్టెలు)
"వృక్షం కూలిపోయాక దాని అవయవాలు (కొమ్మలు, ఆకులు) కేవలం వంట చెరుకుగా (ఇంధనంగా) ఎలా
ఉపయోగపడతాయో, భట్టపాదుల తర్కం ముందు ఓడిపోయిన బౌద్ధ గ్రంథాలు
కూడా కేవలం మంటను పెంచే కట్టెల్లాగే మిగిలిపోయాయి." అంటే ఆ గ్రంథాలలోని
వాదనలే వారి ఓటమిని స్పష్టం చేస్తూ, వారిలో మరింత అసహనాన్ని,
కోపాన్ని కలిగించాయి.
4. క్రోధజ్వాల (కోపమనే మంట)
తమ సిద్ధాంతం ముక్కలు కావడాన్ని, తమ గ్రంథాలనే తర్కంతో ఖండించబడటాన్ని చూసిన
బౌద్ధ పండితుల కోపం ఆకాశాన్నంటింది. భట్టపాదుల వాదనలు ఆ కోపాన్ని తగ్గించడానికి
బదులు, నెయ్యి పోసినట్లుగా మరింత ప్రజ్వరిల్ల చేశాయి.
ఈ 68వ శ్లోకం, భట్టపాదుల తర్కానికి ఓడిపోయిన బౌద్ధ
పండితుల ముఖకవళికలను, ఆ సభా దృశ్యాన్ని ఒక అద్భుతమైన
ఉదాహరణతో (ఉపమాలంకారం) వర్ణిస్తోంది.
సా సభా వదనైస్తేషాం
రోషపాటలకాంతిభిః ।
బభౌ బాలాతపాతామ్రైః సరసీవ
సరోరుహైః ॥ 68 ॥
తాత్పర్యం
ఆ సభ అంతా కోపంతో ఎర్రబడిన బౌద్ధ పండితుల
ముఖాలతో నిండిపోయింది. ఆ దృశ్యం ఎలా ఉందంటే - ఉదయకాలపు సూర్యరశ్మి (బాలాతపము)
సోకడం వల్ల ఇంచుమించు ఎర్రగా (ఆతామ్రము) ప్రకాశించే పద్మాలతో నిండిన ఒక సరస్సులా ఆ
సభ ప్రకాశించింది.
వ్యాఖ్య
1. రోషపాటలకాంతి (కోపంతో ఎర్రబడిన
ముఖాలు)
సాధారణంగా పండితుల ముఖాలు ప్రసన్నంగా ఉండాలి.
కానీ ఇక్కడ భట్టపాదుల వాదనలకు ఓడిపోయిన బౌద్ధుల ముఖాలు 'రోషం' (కోపం) వల్ల
'పాటల' వర్ణంలోకి (తెలుపు కలిసిన ఎరుపు
రంగులోకి) మారిపోయాయి. వారి అహంకారం దెబ్బతినడం వల్ల కలిగిన ఉద్వేగం వారి ముఖాల్లో
స్పష్టంగా కనిపిస్తోంది.
2. బాలాతపము - సరోరుహములు
(ఉపమానం)
కవి ఇక్కడ ఒక చక్కని పోలికను వాడారు:
- సభ = సరస్సు: ఆ పండితుల సభను ఒక పెద్ద సరస్సుతో
పోల్చారు.
- పండితుల ముఖాలు = పద్మాలు: సరోరుహములు అంటే పద్మాలు.
సరస్సులో పద్మాలు ఎలా ఉంటాయో, సభలో పండితుల ముఖాలు అలా ఉన్నాయి.
- కోపం = ఉదయ సూర్యరశ్మి: ఉదయించే సూర్యుని కిరణాలు
సోకినప్పుడు పద్మాలు ఎలాగైతే ఎర్రగా మెరుస్తాయో, కోపం అనే వేడి సోకి పండితుల ముఖాలు
కూడా అలాగే ఎర్రబడ్డాయి.
3. బభౌ (ప్రకాశించుట)
సాధారణంగా 'ప్రకాశించడం'
అంటే శుభసూచకం. కానీ ఇక్కడ కోపంతో ముఖాలు ఎర్రబడటం వల్ల సభ అంతా ఒక
రకమైన తీక్షణమైన రంగుతో నిండిపోయిందని చెప్పడానికి ఈ పదాన్ని వాడారు.
ఉపన్యస్యత్సు సాక్షేపం ఖండయత్సు
పరస్పరమ్ ।
తేషూదతిష్ఠన్నిర్ఘోషో భిందన్నివ
రసాతలమ్ ॥ 69 ॥
తాత్పర్యం
భట్టపాదుల పక్షం మరియు బౌద్ధుల పక్షం -
ఇరువర్గాల వారు తమ తమ సిద్ధాంతాలను ప్రతిపాదిస్తూ (ఉపన్యాసం), ఎదుటివారి వాదనలను ఆక్షేపిస్తూ, పరస్పరం ఖండించుకోవడం మొదలుపెట్టారు. ఆ సమయంలో అక్కడ పుట్టిన వాద
ప్రతివాదాల ధ్వని (నిర్ఘోషం), భూమిని లేదా రసాతలాన్ని
(పాతాళాన్ని) చీల్చుకుంటూ వెళ్తున్నట్లుగా మిన్నంటింది.
వ్యాఖ్య
1. సాక్షేపం (ఆక్షేపణతో కూడిన)
ఇక్కడ చర్చలు కేవలం శాంతంగా సాగలేదు. ఒకరి
వాదనలోని తప్పులను ఎత్తిచూపుతూ, నిందిస్తూ
సాగాయి. అమరకోశం ప్రకారం 'ఆక్షేపం' అంటే
నింద లేదా తప్పు పట్టడం అని అర్థం.
2. ఉపన్యాసం - ఖండనం
- ఉపన్యాసం: అంటే ఒక విషయాన్ని ప్రవేశపెట్టడం లేదా
ప్రతిపాదించడం.
- ఖండనం: ఎదుటివారి వాదనలోని తర్కాన్ని ముక్కలు చేయడం.
ఇరు పక్షాల వారు ఈ రెండు ప్రక్రియలను అత్యంత
వేగంగా, వాడిగా చేపట్టారు.
3. నిర్ఘోషం (పెద్ద ధ్వని)
కేవలం మాటలే కాదు, ఆ వాదనల వల్ల కలిగిన కోలాహలం ఒక పెద్ద ఉరుములా లేదా సముద్ర
ఘోషలా ఉందట. అది ఎంతటి తీవ్రతతో ఉందంటే, 'రసాతలం భిందన్నివ'
- భూమి అడుగున ఉన్న రసాతల లోకాన్ని సైతం చీల్చేలా (బద్దలు కొట్టేలా)
ఆ ధ్వని ఉద్భవించింది.
4. పరస్పరం
ఇది ఏకపక్షంగా సాగిన చర్చ కాదు. భట్టపాదులు వేద
ప్రామాణ్యాన్ని స్థాపిస్తుంటే, బౌద్ధులు
దాన్ని ఖండిస్తున్నారు. మళ్ళీ బౌద్ధుల శూన్యవాదాన్ని భట్టపాదులు తమ తర్కంతో
తుత్తునియలు చేస్తున్నారు. ఇలా ఇద్దరి మధ్య ఒక గొప్ప మేధో యుద్ధం (Intellectual
War) సాగింది.
శంకర విజయంలోని ఈ ఘట్టం ప్రాచీన భారతదేశంలో
శాస్త్ర చర్చలు ఎంత గాఢంగా, ఆవేశపూరితంగా జరిగేవో మనకు
కళ్లకు కడుతుంది.
అధః పేతుర్బుధేన్ద్రేణ క్షతాః
పక్షేషు తత్క్షణమ్ ।
వ్యూఢకర్కశతర్కేణ తథాగతధరాధరాః ॥ 70 ॥
తాత్పర్యం
దేవేంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కలను
నరికి వాటిని ఎలాగైతే కింద పడేశాడో, అలాగే పండితశ్రేష్ఠుడైన భట్టపాదులు (బుధేంద్రుడు) తన పదునైన తర్కంతో
బౌద్ధుల (తథాగత) సిద్ధాంతాలనే పర్వతాల రెక్కలను విరిచి, వారిని
ఓడించి అధోగతి పాలు చేశారు.
వ్యాఖ్య
1. బుధేంద్రుడు (పండిత
శ్రేష్ఠుడు)
ఇక్కడ 'బుధేంద్ర'
అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి:
- భట్టపాదులు: పండితులలో (బుధ) శ్రేష్ఠుడైన ఇంద్రుని
వంటివాడు.
- దేవేంద్రుడు: విబుధులైన దేవతలకు ప్రభువు.
2. తథాగత ధరాధరాః (పర్వతాల వంటి
బౌద్ధులు)
'తథాగత' అంటే
బౌద్ధులు. 'ధరాధరాః' అంటే పర్వతాలు.
బౌద్ధ సిద్ధాంతాలు పర్వతాల వలె బలంగా, అచలంగా ఉన్నట్లు
అనిపించినా, భట్టపాదుల ముందు అవి నిలవలేకపోయాయి.
3. వ్యూఢ కర్కశ తర్కము (వజ్రాయుధం
వంటి తర్కం)
పర్వతాలను నరకడానికి ఇంద్రుడికి పదునైన వజ్రాయుధం
ఎలా అవసరమో, బౌద్ధుల వాదనలను ముక్కలు
చేయడానికి భట్టపాదులు 'కర్కశ తర్కాన్ని' (కఠినమైన, తిరుగులేని యుక్తిని) వాడారు.
- వ్యూఢ: అంటే విస్తారమైన లేదా వ్యూహాత్మకమైన తర్కం.
4. పక్షములు (రెక్కలు / వాదాలు)
ఈ పదంలో గొప్ప శ్లేష (Double Meaning) ఉంది:
- పర్వతాల పరంగా: పురాణాల ప్రకారం పూర్వం పర్వతాలకు
రెక్కలు (పక్షాలు) ఉండేవి. వాటిని ఇంద్రుడు నరికివేశాడు.
- శాస్త్ర చర్చ పరంగా: 'పక్షము' అంటే ఒక వాదం లేదా
సిద్ధాంతం (The the౽i౽/propo౽ition). బౌద్ధులు ప్రతిపాదించిన శూన్యవాదాది
పక్షాలను భట్టపాదులు ఖండించారు.
5. అధః పేతుః (కింద పడిపోవుట /
నికృష్టత)
రెక్కలు తెగిన పర్వతాలు ఎలాగైతే కింద పడిపోతాయో, భట్టపాదుల తర్కం ముందు సమాధానం చెప్పలేక
బౌద్ధ పండితులు తమ ప్రాభవాన్ని కోల్పోయి, సభలో
తలవంచుకున్నారు (నికృష్టతను పొందారు).
ఈ శ్లోకాల ద్వారా కుమారిల భట్టు వైదిక ధర్మాన్ని
నిలబెట్టడానికి ఎంతటి మేధోసంఘర్షణ చేశారో మనకు అర్థమవుతుంది.
స సర్వజ్ఞపదం విజ్ఞోఽసహమాన ఇవ
ద్విషామ్ ।
చకార
చిత్రవిన్యస్తానేతాన్మౌనవిభూషితాన్ ॥ 71
॥
తాత్పర్యం
సర్వము తెలిసినవాడు (విజ్ఞుడైన) ఆ భట్టపాదులు, తన శత్రువులైన బౌద్ధులకు ఉన్న 'సర్వజ్ఞ' అనే బిరుదును సహించలేకపోయారా అన్నట్లుగా -
వారిని నిరుత్తరులను చేశారు. ఆయన వాదనల ధాటికి సమాధానం చెప్పలేక ఆ బౌద్ధ
పండితులంతా మౌనంగా ఉండిపోయారు. ఆ దృశ్యం ఎలా ఉందంటే, సభలో
ఉన్నవారంతా మనుషులు కాదని, చిత్రపటంలో గీసిన బొమ్మలా
అన్నట్లుగా నిశ్చలంగా మారిపోయారు.
వ్యాఖ్య
1. సర్వజ్ఞపదం (సర్వజ్ఞ అనే
బిరుదు)
ఇక్కడ 'సర్వజ్ఞ'
అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి:
- బుద్ధుడు: బౌద్ధులు తమ గురువైన బుద్ధుడిని 'సర్వజ్ఞుడు' (అన్నీ
తెలిసినవాడు) అని పిలుస్తారు.
- భట్టపాదులు: నిజానికి సర్వశాస్త్ర పారంగతుడైన
భట్టపాదులే అసలైన విజ్ఞుడు. తన శత్రువులను 'సర్వజ్ఞులు' అని పిలవడం ఆయనకు ఇష్టం
లేనట్లుగా (అసహమాన ఇవ), వారిని అజ్ఞానులుగా నిరూపించి
వారి మౌనాన్ని శాసించారు.
2. చిత్రవిన్యస్తాన్
(చిత్రపటంలోని బొమ్మల వలె)
ఓడిపోయిన బౌద్ధ పండితులు ఏమీ మాట్లాడలేక, కదలలేక అలాగే ఉండిపోయారు. బ్రతికున్న
మనుషులు మాట్లాడతారు, చలిస్తారు. కానీ చిత్రపటంలో ఉన్న
బొమ్మలు నిశ్చబ్దంగా, కదలిక లేకుండా ఉంటాయి. ఆ పండితుల
పరిస్థితి కూడా అలాగే తయారైందని కవి వర్ణించారు.
3. మౌనవిభూషితాన్ (మౌనమే ఆభరణంగా)
సాధారణంగా పండితులకు వాక్పటిమ (మాటకారి తనం)
ఆభరణం. కానీ ఇక్కడ భట్టపాదుల తర్కం ముందు వారి వాక్పటిమ పనిచేయలేదు. ఫలితంగా
వారికి 'మౌనం' తప్ప
మరో దారి లేకపోయింది. ఆ మౌనమే వారికి ఆభరణం అయిందని చెప్పడంలో ఒక రకమైన వ్యంగ్యం (Irony)
ఉంది.
4. విజ్ఞః (విశేష జ్ఞానం కలవాడు)
వ్యాఖ్యానంలో 'విశేషేణ సర్వం జానాతీతి విజ్ఞః' అని
చెప్పారు. అంటే భట్టపాదులు కేవలం పండితుడు మాత్రమే కాదు, ప్రత్యర్థి
సిద్ధాంతాలలోని లోతులను కూడా పూర్తిగా తెలిసిన వాడు (విజ్ఞుడు). అందుకే వారిని
సులభంగా ఓడించగలిగారు.
తతః ప్రక్షీణదర్పేషు బౌద్ధేషు
వసుధాధిపమ్ ।
బోధయన్బహుధా వేదవచాంసి ప్రశశంస సః
॥ 72 ॥
తాత్పర్యం
బౌద్ధ పండితుల గర్వం (దర్పం) పూర్తిగా
క్షీణించిపోయిన తర్వాత, ఆ పండితాగ్రణి (భట్టపాదులు)
రాజుకు వేదాల యొక్క గొప్పతనాన్ని అనేక విధాలుగా బోధించారు. అదే సమయంలో, వేద వాక్కుల యందలి సత్యాన్ని గ్రహించిన ఆ రాజును (వసుధాధిపుడిని) కూడా ఆయన
ఎంతగానో ప్రశంసించారు.
వ్యాఖ్య
1. ప్రక్షీణదర్పేషు (గర్వం
అణిచివేయబడటం)
వాదంలో ఓడిపోవడం అంటే కేవలం తర్కంలో ఓడిపోవడం
కాదు, వారి అహంకారం కూడా నశించడం. 'ప్రక్షీణ' అనే పదం వారు పూర్తిగా నిరుత్తరులయ్యారని
సూచిస్తుంది. వారి దర్పం అణిగిపోవడంతో, సభలో వైదిక ధర్మానికి
ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.
2. వేదవచాంసి బోధయన్ (వేద బోధన)
భట్టపాదులు కేవలం వాదోపవాదాలకే పరిమితం కాలేదు.
గెలిచిన తర్వాత, రాజుకు వేదాలలోని పరమార్థాన్ని,
ధర్మ సూత్రాలను (బహుధా - అనేక రీతులుగా) వివరించారు. నాస్తిక వాదాల
ప్రభావంలో ఉన్న రాజుకు, వేదాల ప్రామాణ్యాన్ని మళ్ళీ గుర్తు
చేశారు.
3. వసుధాధిపమ్ ప్రశశంస (రాజును
ప్రశంసించడం)
జ్ఞాని అయిన వాడు ఎప్పుడూ ఎదుటివారిలోని మంచిని
గుర్తిస్తాడు. రాజు భట్టపాదుల బోధనలను శ్రద్ధగా విని, వేద ధర్మాన్ని ఆశ్రయించడానికి సిద్ధపడటంతో,
భట్టపాదులు ఆ రాజు యొక్క విజ్ఞతను మెచ్చుకున్నారు.
బభాషేఽథ ధరాధీశో విద్యాయత్తౌ
జయాజయౌ ।
యః పతిత్వా గిరేః
శృఙ్గాదవ్యయస్తన్మతం ధ్రువమ్ ॥ 73 ॥
తాత్పర్యం
బౌద్ధులు ఓడిపోయిన తర్వాత రాజు (ధరాధీశుడు) ఇలా
అన్నాడు: "వాదోపవాదాల్లో గెలుపోటములు అనేవి కేవలం అభ్యసించిన విద్యపై
(చాతుర్యంపై) ఆధారపడి ఉంటాయి. కాబట్టి కేవలం వాదనలతోనే ఏది నిజమైన మతమో తేల్చలేము.
ఎవరైతే పర్వత శిఖరం నుండి కిందకు దూకి కూడా ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా
(అవ్యయః) ప్రాణాలతో మిగులుతారో, వారి మతమే
పరమ సత్యమని (ధ్రువమ్) నేను నమ్ముతాను."
వ్యాఖ్య
1. విద్యాయత్తౌ జయాజయౌ (విద్యకు
లోబడిన గెలుపోటములు)
రాజు ఉద్దేశ్యం ప్రకారం, ఒక పండితుడు చాలా తెలివైనవాడైతే అబద్ధాన్ని
కూడా నిజమని వాదించి గెలవగలడు. గెలుపు అనేది వాక్పటిమ వల్ల రావచ్చు కానీ, అది ఆ మతం యొక్క సత్యానికి గీటురాయి కాదు. అందుకే "జయాజయౌ
విద్యాయత్తౌ" అని రాజు స్పష్టం చేశాడు.
2. ధ్రువ మతం (నిశ్చలమైన సత్యం)
ఏ మతం లేదా సిద్ధాంతం నిజమైనదో తెలుసుకోవడానికి 'ప్రత్యక్ష ప్రమాణం' కావాలని
రాజు కోరాడు. మాటలతో కాకుండా చేతలతో (ప్రాణాలను పణంగా పెట్టి) నిరూపించమన్నాడు.
3. గిరేః శృఙ్గాత్ పతిత్వా
(పర్వతం నుండి దూకడం)
ఇది ఒక అగ్నిపరీక్ష వంటిది. పర్వత శిఖరం నుండి
పడితే మనిషి చనిపోవడం సహజం. కానీ తన సిద్ధాంతంపై అంతటి అచంచల విశ్వాసం ఉండి, దైవబలంతో ఎవరైతే ప్రాణాలతో తిరిగి వస్తారో
వారిదే పైచేయి అని రాజు తీర్పునిచ్చాడు.
4. అవ్యయః (వినాశనం లేనివాడు)
వ్యాఖ్యాత "వినాశరహితః" అని దీనికి
అర్థం చెప్పారు. అంటే ఎముకలు విరగడం లేదా గాయాలు కావడం వంటివి కూడా జరగకూడదు.
అప్పుడే ఆ మతానికి అతీంద్రియ శక్తి ఉందని ఒప్పుకుంటానని రాజు షరతు విధించాడు.
తదాకర్ణ్య ముఖాన్యన్యే
పరస్పరమలోకయన్ ।
ద్విజాగ్ర్యస్తు
స్మరన్వేదానారురోహ గిరేః శిరః ॥ 74 ॥
తాత్పర్యం
రాజు మాటలు (పర్వతం నుండి దూకి ప్రాణాలతో
మిగలాలనే షరతు) విన్న వెంటనే, అక్కడ ఉన్న
ఇతరులు (బౌద్ధులు) భయంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కానీ బ్రాహ్మణ
శ్రేష్ఠుడైన భట్టపాదులు మాత్రం ఏమాత్రం చలించకుండా, తన రక్షణ
కోసం వేదాలను స్మరిస్తూ, ఆ పర్వత శిఖరాన్ని అధిరోహించారు.
వ్యాఖ్య
1. పరస్పరమలోకయన్ (ఒకరి ముఖాలు
ఒకరు చూసుకోవడం)
వ్యాఖ్య ప్రకారం 'అన్యే' అంటే ఇక్కడ బౌద్ధులు (సౌగతాలు).
రాజు విధించిన పరీక్ష ప్రాణాపాయంతో కూడుకున్నది. తర్కంతో వాదించడం వేరు, ప్రాణాలను పణంగా పెట్టడం వేరు. బౌద్ధ పండితులు తమ సిద్ధాంతంపై అచంచలమైన
నమ్మకం లేకనో లేదా భయంతోనో ఏం చేయాలో పాలుపోక ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇది
వారి ఓటమిని పరోక్షంగా సూచిస్తుంది.
2. ద్విజాగ్ర్యః
(బ్రాహ్మణోత్తముడు)
భట్టపాదులను ఇక్కడ 'ద్విజాగ్ర్యః' అని
పిలిచారు. వేదాలను క్షుణ్ణంగా అభ్యసించి, వాటి
ప్రామాణ్యాన్ని మనస్ఫూర్తిగా నమ్మినవాడు కాబట్టి ఆయనలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంది.
3. వేదాన్ స్మరన్ (వేదాలను
స్మరిస్తూ)
ఆయన పర్వతం ఎక్కుతున్నప్పుడు తన పాండిత్యాన్ని
లేదా అహాన్ని స్మరించలేదు. 'స్వరక్షార్థం'
(తన రక్షణ కోసం) కేవలం వేదమాతనే నమ్ముకున్నారు. వేదాలు అపౌరుషేయాలని,
అవి సత్యమని నిరూపించడానికి ఆయన సిద్ధపడ్డారు.
4. గిరేః శిరః (పర్వత శిఖరం)
శిఖరంపైకి వెళ్లడం అంటే మృత్యువుకు చేరువవ్వడం.
కానీ భట్టపాదులకు అది వేద సత్యాన్ని చాటిచెప్పే వేదికలా అనిపించింది.
యది వేదాః ప్రమాణం
స్యుర్భూయాత్కాచిన్న మే క్షతిః ।
ఇతి ఘోషయతా తస్మాన్న్యపాతి
సుమహాత్మనా ॥ 75 ॥
తాత్పర్యం
"వేదాలు గనుక ప్రమాణములే
(సత్యములే) అయితే, నాకు ఎటువంటి హాని కలగకూడదు" అని
గట్టిగా ప్రకటిస్తూ (ఘోషిస్తూ), ఆ సుమహాత్ముడైన భట్టపాదులు ఆ
పర్వత శిఖరం నుండి కిందకు దూకారు.
వ్యాఖ్య
1. వేదాః ప్రమాణం (వేదాలే పరమ
సత్యం)
భట్టపాదుల దృష్టిలో వేదాలు కేవలం పుస్తకాలు కావు, అవి అపౌరుషేయమైన సత్యాలు. తన ప్రాణ రక్షణ
కంటే వేదాల గౌరవం ముఖ్యమని ఆయన భావించారు. అందుకే "ఒకవేళ వేదాలు సత్యమైతే
నాకు ఏమీ కాదు" అని ఒక సత్యప్రమాణం (Oath of Truth) చేశారు.
2. ఇతి ఘోషయతా (బిగ్గరగా
ప్రకటిస్తూ)
ఆయన రహస్యంగా లేదా భయపడుతూ దూకలేదు. సభలో ఉన్న
రాజుకు, బౌద్ధులకు, ప్రజలందరికీ వినిపించేలా గట్టిగా ధర్మ ప్రకటన చేసి దూకారు. ఇది ఆయనకు
వేదాలపై ఉన్న అచంచలమైన విశ్వాసానికి నిదర్శనం.
3. సుమహాత్మనా (గొప్ప ఆత్మ
గలవాడు)
అంతటి ఎత్తు నుండి దూకడానికి సామాన్యులకు సాధ్యం
కాని ధైర్యం కావాలి.: "పర్వతం నుండి దూకేటప్పుడు ఆయనకు భయం కలగలేదా?" దానికి సమాధానంగా - వేద ప్రామాణ్యంపై ఆయనకు ఉన్న
నిశ్చయ బుద్ధి (అతివితతమతిః) ఆయనను మహాత్ముడిగా మార్చిందని, ఆ
నిశ్చయమే ఆయనకు అపారమైన ధైర్యాన్ని ఇచ్చిందని వివరించారు.
4. న మే క్షతిః (నాకు హాని కలగదు)
'క్షతి' అంటే
గాయం లేదా నాశనం. తన శరీరంపై ఆయనకు అంతటి ధీమా ఉంది, ఎందుకంటే
ఆ శరీరం వేద ధర్మాన్ని రక్షించడానికి అంకితమైనది.
ఒక చిన్న చారిత్రక విశేషం:
ఈ సందర్భంలోనే భట్టపాదులు "యది"
(ఒకవేళ) అనే పదాన్ని వాడినందుకు, అంటే వేదాల
ప్రామాణ్యంపై చిన్న సందేహాన్ని (Condition) ఉంచినందుకు గాను,
ఆయనకు ఒక చిన్న గాయం (కంటికి దెబ్బ) తగిలిందని కొన్ని సంప్రదాయ
కథనాలు చెబుతాయి. సంపూర్ణ విశ్వాసం ఉంటే ఆ గాయం కూడా తగిలేది కాదని అంటారు.
కిము దౌహిత్రవృత్తేఽపి పుణ్యే
విలయమాస్థితే ।
యయాతిశ్చ్యవతే
స్వర్గాత్పునరిత్యూచిరే జనాః ॥ 76 ॥
తాత్పర్యం:
భట్టపాదులు పర్వత శిఖరం నుండి కిందకు
పడుతున్నప్పుడు, అక్కడ చేరిన జనులు ఇలా
అనుకున్నారు: "తన దౌహిత్రులు (కూతురి కొడుకులు) ఇచ్చిన పుణ్యం కూడా
క్షీణించిపోవడంతో, యయాతి మహారాజు మళ్ళీ స్వర్గం నుండి భూమికి
దిగివస్తున్నాడా?" అన్నట్లుగా ఆ దృశ్యం ఉందట.
వ్యాఖ్య
1. యయాతి గాథా నేపథ్యం
యయాతి మహారాజు స్వర్గంలో ఉన్నప్పుడు తన తపస్సు
విషయంలో గర్వపడటంతో ఇంద్రుడు అతడిని కిందకు పంపేస్తాడు. అయితే, భూమిపై తన దౌహిత్రులైన అష్టక, శిబి, ప్రతర్దన, వసుమంతుడు అనే
వారు చేస్తున్న యాగశాల వద్ద పడతాడు. వారు తమ పుణ్యాన్ని తాతగారికి ధారబోయడంతో ఆయన
మళ్ళీ స్వర్గానికి వెళ్తాడు. ఈ శ్లోకంలో - భట్టపాదులు కిందకు పడుతుంటే, బహుశా యయాతి పుణ్యం మళ్ళీ అయిపోయి ఆయన కిందకు దిగుతున్నాడేమో అని జనం
భ్రమపడ్డారని కవి వర్ణించారు.
2. ఉత్ప్రేక్షా అలంకారం
'సంభావనా స్యాదుత్ప్రేక్షా...'
అంటే ఉన్నదానిని మరొక దానిలా ఊహించడం. భట్టపాదుల పతనాన్ని (Falling)
యయాతి పతనంగా జనులు ఊహించారు కాబట్టి ఇది ఉత్ప్రేక్షా అలంకారం.
3. కిము (వితర్కం)
'కిము' అనే
పదాన్ని ఇక్కడ 'వితర్కం' (సందేహం/ఊహ)
అనే అర్థంలో వాడారు. అంటే అది భట్టపాదులా లేక యయాతినా? అని
జనులు తర్కించుకున్నారని భావం.
4. జనులు ఎందుకు వచ్చారు?
జనాః శ్రీభట్టపాద ప్రతిజ్ఞాదివ్యకరణదర్శనార్థం
తత్కాలం మిలితాః] - భట్టపాదులు చేసిన ఆ భయంకరమైన
ప్రతిజ్ఞ (వేదాలే ప్రమాణమైతే నాకు ఏమీ కాదు అనే మాట) మరియు ఆయన చేయబోయే అద్భుత
కృత్యాన్ని చూడటం కోసమే జనులందరూ అక్కడ గుమికూడారు.
అపి లోకగురుః శైలాత్తూలపిండ
ఇవాపతత్ ।
శ్రుతిరాత్మశరణ్యానాం వ్యసనం
నోచ్ఛినత్తి కిమ్ ॥ 77 ॥
తాత్పర్యం:
లోకగురువు (భట్టపాదులు) ఆ పర్వతం నుండి ఒక దూది
పిండంలా (తేలికగా) కిందకు పడ్డారు. తననే శరణువేడిన వారి కష్టాలను వేదమాత
తొలగించకుండా ఉంటుందా? (తప్పక తొలగిస్తుంది).
వ్యాఖ్య
1. తూలపిండ ఇవ (దూది ఉండ వలె)
. అనగా పత్తి ఉండ ఎంత మెత్తగా, తేలికగా పడుతుందో, భట్టపాదులు
కూడా ఆ పర్వతం నుండి పడినప్పుడు అంతే సుకుమారంగా, ఎటువంటి
గాయాలు లేకుండా (అక్షత ఏవ) కిందకు చేరారు. ఇది ఆయన ప్రాణాలకు
వేదాలు కవచంలా నిలిచాయని సూచిస్తోంది.
2. వ్యసనమ్ (విపత్తు/దుఃఖం)
సాధారణంగా వ్యసనం అంటే చెడు అలవాట్లు అని అర్థం.
కానీ ఇక్కడ 'మేదినీ కోశం' ప్రకారం:
'వ్యసనం త్వశుభే సక్తౌ... విపత్తౌ
నిష్ఫలోద్యమే'
అంటే విపత్తు లేదా అశుభం అని అర్థం. భట్టపాదులకు
ప్రాణాపాయం కలిగే ఆ విపత్తును వేదాలు నాశనం చేశాయని (ఉచ్ఛినత్తి) భావం.
3. శ్రుతిరాత్మశరణ్యానామ్
(వేదాలనే నమ్ముకున్న వారు)
ఎవరైతే వేదాలను తన ఆత్మగా భావించి శరణు వేడుతారో
(శ్రుతిరాత్మా స్వయమేవ శరణ్యం యేషాం), వారిని వేదమాత ఎల్లప్పుడూ రక్షిస్తుంది. ఇది కేవలం భట్టపాదులకే కాదు,
వేదాలను విశ్వసించే ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని కవి ఒక సామాన్య
సత్యాన్ని (General Truth) ఇక్కడ ప్రతిపాదించారు.
4. లోకగురుః
భట్టపాదులను ఇక్కడ 'లోకగురువు' అని
సంబోధించారు. లోకంలోని అజ్ఞానాన్ని పోగొట్టి, వేద మార్గాన్ని
నిలబెట్టిన వారు కాబట్టి ఆయన లోకగురువు అయ్యారు. అట్టి మహనీయుడిని ఆపదలో దైవశక్తి
(వేదం) కాపాడటం సహజం.ఈ ఘట్టం ద్వారా శాస్త్రం మరియు విశ్వాసం కలిస్తే అసాధ్యమైనది
ఏదీ లేదని నిరూపితమైంది.
శ్రుత్వా తదద్భుతం కర్మ ద్విజా
దిగ్భ్యః సమాయయుః ।
ఘనఘోషమివాకర్ణ్య నికుంజభ్యః
శిఖావలాః ॥ 78 ॥
తాత్పర్యం:
దట్టమైన పొదల (నికుంజముల) చాటున దాక్కున్న
నెమళ్లు, ఆకాశంలో మేఘ గర్జన (ఘనఘోషం)
వినగానే పరవశించి బయటకు వచ్చినట్లుగా - భట్టపాదులు చేసిన ఆ అద్భుతమైన పని గురించి
విన్న బ్రాహ్మణులందరూ (ద్విజులు) నలుదిశల నుండి ఆ సభకు తరలివచ్చారు.
వ్యాఖ్య
1. ఘనఘోషం (మేఘ గర్జన)
భట్టపాదుల విజయం ఒక గొప్ప మేఘ గర్జన వంటిది.
ఎండల వల్ల తపించిపోయిన నెమళ్లకు మేఘ గర్జన ఎలాగైతే వర్షం రాబోతోందనే ఆనందాన్ని
ఇస్తుందో, నాస్తిక వాదాల వల్ల ఇబ్బంది
పడుతున్న వైదిక పండితులకు భట్టపాదుల విజయం అంతటి ఉపశమనాన్ని ఇచ్చింది.
2. నికుంజభ్యః (పొదల నుండి)
అంటే తీగలు, ఆకులతో కప్పబడిన పొదల లోపలి భాగం నుండి అని అర్థం. బౌద్ధుల ప్రాబల్యం వల్ల
అంతకాలం భయపడి లేదా అణగిమణిగి ఉన్న బ్రాహ్మణులు, ఇప్పుడు
ధైర్యంగా ఆ పొదల చాటు నుండి నెమళ్లలా బయటకు వచ్చారు.
3. శిఖావలాః (నెమళ్లు)
నెమళ్లకు సంతోషం కలిగితే అవి పురివిప్పి నాట్యం
చేస్తాయి. అలాగే భట్టపాదుల విజయం విన్న ద్విజులు కూడా అత్యంత సంతోషంతో (శిఖావలుల
వలె) అక్కడికి చేరుకున్నారు.
4. దిగ్భ్యః సమాయయుః (దిక్కుల
నుండి వచ్చారు)
ఈ వార్త దావాగ్నిలా వ్యాపించింది. ఏ ఒక్క
ప్రాంతానికో పరిమితం కాకుండా, దేశం
నలుమూలల (దిశల) నుండి వైదిక ధర్మాభిమానులు ఆ అద్భుతాన్ని చూడటానికి, భట్టపాదులను దర్శించుకోవడానికి కదిలి వచ్చారు.ఈ శ్లోకం నాస్తిక వాదంపై
వైదిక ధర్మం సాధించిన తొలి 'నైతిక విజయాన్ని' (Moral
Victory) చాటిచెబుతోంది.
దృష్ట్వా తమక్షతం రాజా శ్రద్ధాం
శ్రుతిషు సందధే ।
నినింద బహుధాత్మానం
ఖలసంసర్గదూషితమ్ ॥ 79 ॥
తాత్పర్యం:
భట్టపాదులు ఎటువంటి గాయాలు లేకుండా (అక్షతం) క్షేమంగా ఉండటం చూసిన రాజు, వేదాల (శ్రుతుల) యందు అచంచలమైన విశ్వాసాన్ని (శ్రద్ధను) కలిగించుకున్నాడు.
అంతకాలం దుర్జనుల (నాస్తికుల) సాంగత్యం వల్ల మలినమైన తన ప్రవర్తనను, తనను తాను అనేక విధాలుగా నిందించుకున్నాడు.
వ్యాఖ్య
1. అక్షతమ్ (గాయాలు లేనివాడు)
అంత ఎత్తు నుండి పడినా భట్టపాదుల శరీరానికి
కనీసం చిన్న గీత కూడా పడలేదు. ఆ దృశ్యం రాజుకు ఒక నిరూపణ (Proof) లాగా పనిచేసింది. దీనివల్ల రాజుకు
కేవలం ఆశ్చర్యం మాత్రమే కాకుండా, వేదాల పట్ల 'శ్రద్ధ' కలిగింది.
2. ఖలసంసర్గదూషితమ్ (దుర్జనుల
సాంగత్య దోషం)
'ఖలులు' అంటే
ఇక్కడ వేద నిందకుడైన బౌద్ధులు (సౌగతాలు). రాజు అంతకాలం వారి మాటలు విని, వారి సహవాసం చేయడం వల్ల తన బుద్ధి భ్రమించిందని, తన
సంస్కారం దూషితమైందని భావించాడు.
3. నినింద బహుధాత్మానమ్ (తనను
తాను నిందించుకొనుట)
తప్పు తెలుసుకున్న తర్వాత కలిగే పశ్చాత్తాపం
ఇది. ఒక రాజు స్థాయిలో ఉండి కూడా నాస్తిక వాదనలకు లొంగిపోయి, వేద ధర్మాన్ని విస్మరించినందుకు ఆయన తనను
తాను "నేనెంతటి అపరాధిని!" అని నిందించుకున్నాడు.
- బౌద్ధసంబంధసంజాతబాధమ్ —అంటే బౌద్ధుల సాంగత్యం వల్ల
కలిగిన మానసిక మాలిన్యం లేదా బాధ నుండి రాజు విముక్తుడైనట్లు అర్థం.
సౌగతాస్త్వబ్రువన్నేదం ప్రమాణం
మతనిర్ణయే ।
మణిమంతౌషధైరేవం దేహరక్షా భవేదితి
॥ 80 ॥
తాత్పర్యం:
అయితే బౌద్ధులు (సౌగతులు) మాత్రం రాజుతో ఇలా
అన్నారు: "రాజా! పర్వతం మీద నుండి దూకి ప్రాణాలతో మిగలడం అనేది ఒక మతం యొక్క
సత్యాన్ని నిర్ణయించడానికి సరైన ప్రమాణం (సాక్ష్యం) కాదు. ఎందుకంటే మణులు
(రత్నాలు), మంత్రాలు లేదా కొన్ని రకాల
ఔషధాల సహాయంతో కూడా ఇటువంటి దేహరక్షను (ప్రాణాలను కాపాడుకోవడం) సాధించవచ్చు."
వ్యాఖ్య
1. మతనిర్ణయే నైవ ప్రమాణమ్ (మత
నిర్ణయానికి ఇది సాక్ష్యం కాదు)
ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడటం అనేది అతని
వ్యక్తిగత సిద్ధాంతం సరైనదని చెప్పడానికి ఆధారం కాదని వారి వాదన. ఇది కేవలం ఒక
భౌతికమైన విన్యాసం మాత్రమే అని వారు కొట్టిపారేయడానికి ప్రయత్నించారు.
2. మణి-మంత్ర-ఔషధైః (సాంకేతిక
కారణాలు)
వారు భట్టపాదుల విజయాన్ని ఆధ్యాత్మిక శక్తిగా
కాకుండా, కేవలం కొన్ని లౌకిక సాధనాల
ప్రభావంగా చిత్రీకరించారు:
- మణి: కొన్ని రకాల రాళ్లకు లేదా రత్నాలకు విషాన్ని, ప్రమాదాలను అడ్డుకునే శక్తి ఉంటుందని
భావన.
- మంత్ర: క్షుద్ర మంత్రాలు లేదా ఇతర తంత్రాల వల్ల
దేహాన్ని రక్షించుకోవచ్చని వాదించారు.
- ఔషధ: శరీరం దెబ్బతినకుండా ఉండే కొన్ని లేపనాలు లేదా
రసాయనాలు వాడి ఉండవచ్చని సాకులు చెప్పారు.
3. ఇతిశబ్దో హేత్వర్థః (హేతువును
చూపడం)
వారు తమ వాదనకు కారణాన్ని (హేతువును) చెబుతూ, భట్టపాదుల వేద ప్రామాణ్యాన్ని
తిరస్కరించారు. "వేదాల వల్ల ఆయన రక్షించబడలేదు, కేవలం
పైన చెప్పిన మణిమంత్రాల వల్లే ఆయన బ్రతికారు" అని రాజుకు నూరిపోశారు.
అంతరార్థం:
ఓటమి అంచున ఉన్నవారు తమ అహంకారాన్ని వదులుకోలేక, ప్రత్యక్షంగా కనిపించే సత్యాన్ని కూడా
తర్కంతో ఎలా వక్రీకరిస్తారో ఈ శ్లోకం ద్వారా కవి చక్కగా చూపించారు.
దుర్విధైరన్యథా నీతే
ప్రత్యక్షేఽర్థేఽపి పార్థివః ।
భ్రుకుటీభీకరముఖః సంధాముగ్రతరాం
వ్యధాత్ ॥ 81 ॥
తాత్పర్యం:
కళ్లముందు కనిపిస్తున్న నిజాన్ని (ప్రత్యక్ష
ప్రమాణాన్ని) కూడా ఆ దుర్మార్గులైన బౌద్ధులు వక్రీకరించేసరికి, రాజుకు విపరీతమైన కోపం వచ్చింది. ఆయన
కనుబొమ్మలు ముడివేసి, భయంకరమైన ముఖంతో, అంతకుముందు కంటే మిక్కిలి ఉగ్రమైన (కఠినమైన) ఒక ప్రతిజ్ఞను లేదా
నిర్ణయాన్ని తీసుకున్నాడు.
వ్యాఖ్య
1. దుర్విధైః (దుర్మార్గులైన
వారు)
'దుర్విధులు' అంటే చెడ్డ బుద్ధి కలిగిన వారు. ప్రత్యక్షంగా జరిగిన అద్భుతాన్ని కూడా
"మణిమంత్రౌషధాల" ప్రభావం అని అబద్ధం చెప్పినందుకు వారిని ఇక్కడ 'ఖలులు' (వంచకులు) అని పిలిచారు.
2. ప్రత్యక్షేఽర్థేఽప్యన్యథా నీతే
(నిజాన్ని తారుమారు చేయడం)
కళ్లముందు భట్టపాదులు క్షేమంగా పడటం అందరూ
చూశారు. కానీ ఆ సత్యాన్ని (ప్రత్యక్ష అర్థం) వారు తమ కుతర్కంతో వేరే విధంగా మార్చి
చెప్పడానికి ప్రయత్నించారు. ఇది రాజు సహనాన్ని పరీక్షించింది.
3. భ్రుకుటీభీకరముఖః (భయంకరమైన
ఆగ్రహం)
రాజు కోపం ముఖంలో స్పష్టంగా కనిపించింది. 'భ్రుకుటి' అంటే
కనుబొమ్మలు ముడివేయడం. ఆయన ముఖం చూస్తుంటేనే భయం కలిగేలా (భయంకరం) మారిపోయింది.
ఇది ఆయన తీసుకోబోయే నిర్ణయం ఎంత కఠినంగా ఉండబోతోందో సూచిస్తుంది.
4. సంధాముగ్రతరాం వ్యధాత్
(ఉగ్రమైన ప్రతిజ్ఞ)
అంతకుముందు పర్వతం నుండి దూకమన్నది ఒక పరీక్ష
మాత్రమే. కానీ ఇప్పుడు రాజు ఒక 'సంధా'
(నిర్ణయం లేదా షరతు) విధించాడు. అది ఏమిటంటే - "ఇప్పుడు నేను
ఒక ఘటంలో (కుండలో) విష సర్పమును ఉంచి మూత పెడతాను. అందులో ఏముందో ఎవరైతే సరిగ్గా
చెబుతారో వారి మతమే సత్యమని నమ్ముతాను. ఓడిపోయిన వారిని కఠినంగా
శిక్షిస్తాను."
పృచ్ఛామి భవతః కించిద్వక్తుం న
ప్రభవన్తి యే ।
యన్త్రోపలేషు
సర్వాంస్తాన్ఘాతయిష్యామ్యసంశయమ్ ॥82
తాత్పర్యం
"ఓ బౌద్ధ పండితులారా!
మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను. దానికి సరైన సమాధానం చెప్పలేకపోయిన వారిని
ఏమాత్రం సందేహం లేకుండా యంత్రోపలముల ద్వారా (రాళ్లను విసిరే యంత్రాల సహాయంతో లేదా
రోళ్లలో వేసి) సంహరిస్తాను."
వ్యాఖ్య
- రాజుగారి ఆగ్రహం: అంతకుముందు జరిగిన వాదనల్లో బౌద్ధులు
కుతర్కంతో సత్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అందుకే రాజు
"అసంశయమ్" (నిస్సందేహంగా) అని హెచ్చరిస్తూ, ఇది కేవలం మాటల యుద్ధం మాత్రమే కాదు,
ప్రాణాలతో కూడిన పరీక్ష అని స్పష్టం చేశాడు.
- యంత్రోపలేషు : ఇక్కడ 'యంత్రం'
అంటే రాళ్లను విసిరే ఒక రకమైన ఆయుధం (Catapult వంటిది).మరొక అర్థంలో, పెద్ద పెద్ద రోళ్ల వంటి
యంత్రాలలో వేసి శిక్షించడం అని కూడా భావించవచ్చు.మూలార్థం ప్రకారం అది
యంత్రాల ద్వారా రాళ్లతో కొట్టి చంపడం లేదా నలగగొట్టడం అని అర్థం.
ఇతి సంశ్రుత్య గోత్రేశో
ఘటమాశీవిషాన్వితమ్ ।
ఆనీయాత్ర కిమస్తీతి పప్రచ్ఛ
ద్విజసౌగతాన్ ॥83
తాత్పర్యం
"ఈ విధంగా తన ప్రతిజ్ఞను
వినిపించిన పిమ్మట, ఆ భూపతి (సుధన్వ మహారాజు) విషసర్పంతో
కూడిన ఒక కుండను తెప్పించాడు. ఆ కుండను అక్కడ ఉంచి, బ్రాహ్మణులను
(వైదికులను) మరియు సౌగతులను (బౌద్ధులను) పిలిచి - 'ఇందులో
ఏముందో చెప్పండి?' అని ప్రశ్నించాడు."
వ్యాఖ్య
- గోత్రేశః : అమరకోశం ప్రకారం 'గోత్రా' అంటే భూమి అని అర్థం ('గోత్రా కుః పృథివీ').
కాబట్టి 'గోత్రేశః' అంటే భూమికి ప్రభువు, అంటే రాజు (సుధన్వ
మహారాజు) అని అర్థం.
- ఆశీవిషాన్వితమ్ : 'ఆశీ' అంటే కోరలు. కోరలలో విషం
కలిగినది (పాము) అని అర్థం. రాజు సామాన్యమైన వస్తువును కాకుండా, ప్రాణాపాయం కలిగించే సర్పం ఉన్న కుండను పరీక్ష కోసం ఎంచుకున్నాడు.
ఇది ఆ పరీక్ష యొక్క తీవ్రతను సూచిస్తుంది.
- ద్విజ-సౌగతాన్ : ఇక్కడ రాజు ఇద్దరినీ (వైదిక పండితులను మరియు బౌద్ధులను)
ప్రశ్నిస్తున్నాడు. సత్యాన్ని నిరూపించే బాధ్యత ఇరువురిపై ఉంచాడు. తప్పు
చెప్పిన వారికి మరణదండన తప్పదని ముందే హెచ్చరించి ఉన్నాడు.
- సందర్భం: బౌద్ధులు ఈ ప్రపంచమంతా 'శూన్యం' అని
వాదిస్తారు. రాజు ఆ వాదనను పరీక్షించదలచాడు. కుండలో ఉన్నది ఏమిటో సరిగ్గా
చెప్పగలిగిన వారే సత్యద్రష్టలని రాజు నమ్మకం.
వక్ష్యామహే వయం భూప శ్వః
ప్రభాతేఽస్య నిర్ణయమ్ ।
ఇతి ప్రసాద్య రాజానం
జగ్ముర్భూసురసౌగతాః ॥84
తాత్పర్యం
"ఓ రాజా! ఈ కుండలో ఏముందో
మేము రేపు ఉదయం (శ్వః ప్రభాతే) నిర్ణయించి చెబుతాము' అని
రాజును ఒప్పించి, బ్రాహ్మణులు (భూసురులు) మరియు బౌద్ధులు
(సౌగతులు) తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు."
వ్యాఖ్య
శ్వః ప్రభాతే - 'శ్వః' అంటే రేపు, 'ప్రభాతే' అంటే ఉదయాన్నే. ఆ రాత్రి సమయం వారికి
ఆలోచించుకోవడానికి లేదా తమ ఇష్టదైవాలను ప్రార్థించడానికి దొరికిన గడువు.
- భూసుర-సౌగతాః - ప్రకారం 'భూసురాః' అంటే బ్రాహ్మణులు (భూమిపై దేవతలు
వంటివారు).
- 'సౌగతాః' అంటే
బుద్ధుని అనుసరించే వారు (బౌద్ధులు).
- వీరిద్దరూ రాజు పెట్టిన గడువును అంగీకరించి
వెళ్ళిపోయారు.
- రాజానం ప్రసాద్య : రాజు తీవ్రమైన కోపంతో, మరణదండన
విధిస్తానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. అటువంటి ఉగ్రుడైన రాజును శాంతింపజేసి,
సమయం కోరి వెళ్లడం వారి వ్యూహంలో భాగం.
- సందర్భం: ఈ రాత్రి గడువులో బౌద్ధులు తమ మంత్ర
తంత్రాలతో కుండలో ఉన్న వస్తువును మార్చాలని లేదా తెలుసుకోవాలని
ప్రయత్నిస్తారు. మరోవైపు, వైదికులు (బ్రాహ్మణులు) కుమారిల భట్టు మార్గదర్శకత్వంలో వేద మాతను,
భగవంతుని శరణు వేడుకుంటారు. ఈ రాత్రి సమయం రేపటి అద్భుతానికి
నాంది.
పద్మా ఇవ తపస్తేపుః
కణ్ఠద్వయసపాథసి ।
ద్యుమణిం ప్రతి భూదేవాః సోఽపి
ప్రాదురభూత్తతః ॥85
తాత్పర్యం
"ఆ భూదేవులు (బ్రాహ్మణులు)
కంఠం లోతు నీటిలో నిలబడి, నీటిలో వికసించే పద్మాల వలె
నిశ్చలంగా ఉండి సూర్యభగవానుని (ద్యుమణి) గురించి తపస్సు చేశారు. అప్పుడు ఆ
సూర్యదేవుడు వారి భక్తికి మెచ్చి వారి ముందు ప్రత్యక్షమయ్యాడు."
వ్యాఖ్య
- పద్మా ఇవ : అమరకోశం ప్రకారం 'పద్మ' శబ్దం పుంలింగంలో కూడా వాడబడుతుంది. పద్మాలు నీటిలో ఉండి సూర్యుని
రాక కోసం ఎలా ఎదురుచూస్తాయో, ఈ బ్రాహ్మణులు కూడా అలాగే
సూర్యారాధనలో మునిగిపోయారని భావం.
- కణ్ఠద్వయసపాథసి : 'పాథసి' అంటే నీరు. 'కణ్ఠద్వయస' అంటే కంఠం ప్రమాణం (మెడ వరకు) ఉన్న
నీరు అని అర్థం. వారు అత్యంత నిష్ఠతో, శీతల జలాల్లో
నిలబడి తపస్సు చేశారని దీని అర్థం.
- ద్యుమణిం : ఆకాశానికి మణి వంటివాడు సూర్యుడు. బ్రాహ్మణులకు గాయత్రీ
మంత్రం ద్వారా సూర్యుడే ప్రధాన ఉపాస్య దైవం. శివుడు అష్టమూర్తి స్వరూపుడు
కాబట్టి, సూర్య రూపంలో ఉన్న ఆ పరమేశ్వరుని వారు
ప్రార్థించారు.
- సూర్యారాధన ప్రాశస్త్యం:
- సూర్యుడు అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే
కాంతిని ప్రసాదిస్తాడు.
- రావణుడు మాయా రాముని తల నరికినట్లు చూపి సీతమ్మను
భయభ్రాంతులకు గురిచేసినప్పుడు, విభీషణుని భార్య (లేదా సఖి) అయిన సరమ
ఆమెను ఓదారుస్తూ ఈ మాటలు చెబుతుంది.
రామాయణ
శ్లోకం (యుద్ధకాండ)
గిరివరమభితోఽనువర్తమానో హయ ఇవ
మణ్డలమాశు యః కరోతి ।
తమిహ శరణమభ్యుపేహి దేవం దివసకరం
ప్రభవో హ్యయం ప్రజానామ్ ॥
తాత్పర్యం:
"ఏ
సూర్యభగవానుడు అత్యంత వేగము కలిగిన అశ్వము వలె మేరు పర్వతాన్ని చుట్టి వస్తూ,
ఆకాశ మండలంలో నిరంతరం ప్రకాశిస్తుంటాడో.. సకల జీవరాశి సృష్టికి,
రక్షణకు మూలకారకుడైన ఆ దివాకరుని (సూర్యుని) నువ్వు శరణు
వేడుకో."
- పాండవులు సూర్యుని ఆరాధించి 'అక్షయపాత్ర'ను
పొందారు.
- అలాగే ఇక్కడ బ్రాహ్మణులు కూడా రాజు పెట్టిన ప్రాణాంతక
పరీక్ష నుండి నెగ్గడానికి, సత్యం నిలబడడానికి ఆ సూర్యభగవానుని శరణువేడారు.
సందిశ్య
వచనీయాంశమాదిత్యేఽన్తర్హితే ద్విజాః ।
ఆజగ్మురపి నిశ్చిత్య సౌగతాః
కలశస్థితమ్ ॥86
తాత్పర్యం
"సూర్యభగవానుడు ఆ
బ్రాహ్మణులకు రాజసభలో తాము చెప్పవలసిన విషయాన్ని (వచనీయాంశము) ఉపదేశించి
అంతర్ధానమయ్యాడు. ఆ తర్వాత బ్రాహ్మణులు సభకు చేరుకున్నారు. అటువైపు బౌద్ధులు
(సౌగతులు) కూడా కుండలో (కలశము) ఏముందో తమ బుద్ధిబలంతో, మంత్రశక్తితో
నిశ్చయించుకుని సభకు విచ్చేశారు."
వ్యాఖ్య
- వచనీయాంశమ్: సూర్యభగవానుడు బ్రాహ్మణులకు ఒక రహస్యం చెప్పాడు.
అదేమిటంటే - ఆ కుండలో ఇప్పుడు సర్పం లేదు, సాక్షాత్తు
"శేషశాయి అయిన మహావిష్ణువు" ఉన్నాడని (ఘటే
శేషశాయీ విష్ణురస్తీతి). ఇది భగవంతుని అనుగ్రహం
వల్ల జరిగిన మార్పు.
- సౌగతుల నిశ్చయం: బౌద్ధులు తమ ఆరాధ్య దైవమైన 'తార'
అనే దేవత (దశమహావిద్యలలో ఒకరు) ప్రసాదించిన మంత్ర శక్తితో
కుండలో ఉన్నది "శూన్యం" (ఏమీ లేదు) అని నిర్ధారించుకున్నారు.
- గోవర్ధనాచార్యుల వచనం ప్రకారం: "జిన సిద్ధాంతం ప్రకారం అది
శూన్యమే" అని వారు నమ్మారు. బౌద్ధ సిద్ధాంతం ప్రపంచాన్ని
శూన్యంగా చూస్తుంది కాబట్టి, వారి మంత్రబలంతో ఆ సర్పం
అదృశ్యమైందని వారు భావించారు.
- ద్విజాః - సౌగతాః:
- బ్రాహ్మణులు (ద్విజులు) సూర్యభగవానుని అనుగ్రహంపై
ఆధారపడ్డారు.
- బౌద్ధులు (సౌగతులు) తమ మంత్రశాస్త్రం మరియు తర్కంపై
ఆధారపడ్డారు.
తతస్తే సౌగతాః సర్వే
భుజంగోఽస్తీత్యవాదిషుః ।
భోగీశభోగశయనో భగవానితి భూసురాః ॥87
తాత్పర్యం
"ఆ తరువాత, ఆ బౌద్ధులందరూ (సౌగతులు) కలిసి 'కుండలో సర్పము
(భుజంగము) ఉన్నది' అని చెప్పారు. కానీ బ్రాహ్మణులు
(భూసురులు) మాత్రం 'అందులో ఆదిశేషుని శరీరముపై శయనించి ఉన్న
సాక్షాత్తు ఆ మహావిష్ణువు ఉన్నాడు' అని పలికారు."
వ్యాఖ్య
సౌగతుల సమాధానం (భుజంగోఽస్తి): బౌద్ధులు తాము
మొదట చూసిన నిజాన్ని (రాజు కుండలో పామును ఉంచడం) మరియు తమ మంత్ర శక్తిని నమ్మి
అందులో 'పాము' ఉన్నదని
చెప్పారు. (గమనిక: కొన్ని పాఠాంతరాల్లో బౌద్ధులు 'శూన్యం' అన్నారని ఉన్నా, ఇక్కడ ఇచ్చిన శ్లోకం ప్రకారం వారు
రాజు ఉంచిన 'పాము' గురించి చెప్పారు).
- భూసురుల సమాధానం (భోగీశభోగశయనః): బ్రాహ్మణులు రాజు
పెట్టిన పామును గురించి చెప్పలేదు. సూర్యభగవానుడు తమకు ఉపదేశించిన పరమ
సత్యాన్ని చెప్పారు.
- భోగీశ: అంటే పాములకు ప్రభువైన ఆదిశేషుడు.
- భోగ: అంటే శరీరము.
- శయనః: శయనించి ఉన్నవాడు.
- అంటే, అందులో కేవలం పాము మాత్రమే లేదు,
ఆ పామును పరుపుగా చేసుకుని పడుకున్న శ్రీమహావిష్ణువు ఉన్నాడని
వారు బల్లగుద్ది చెప్పారు.
- వైరుధ్యం: రాజు దృష్టిలో కుండలో ఉన్నది కేవలం ఒక పాము.
బౌద్ధులు ఆ భౌతిక రూపాన్ని (Matter) మాత్రమే చూడగలిగారు. కానీ బ్రాహ్మణులు
భగవదనుగ్రహంతో ఆ వస్తువు యొక్క దివ్య పరిణామాన్ని దర్శించారు.
శ్రుతభూసురవాక్యస్య వదనం
పృథివీపతేః ।
కాసారశోషణమ్లానసారసశ్రియమాదదే ॥88
తాత్పర్యం
"బ్రాహ్మణులు (భూసురులు)
చెప్పిన మాటలు విన్న వెంటనే, ఆ సుధన్వ మహారాజు ముఖం
ఒక్కసారిగా వెలవెలబోయింది. ఎండిపోయిన కొలనులో (కాసారము) వాడిపోయిన పద్మం (సారసము)
ఎలా ఉంటుందో, రాజు ముఖం కూడా అలాగే కాంతివిహీనమై, విచారంతో నిండిపోయింది."
వ్యాఖ్య
శ్రుతభూసురవాక్యస్య : రాజు స్వయంగా ఆ కుండలో పామును ఉంచాడు.
బ్రాహ్మణులు అది "మహావిష్ణువు" అని చెప్పేసరికి, వారు
అబద్ధం చెబుతున్నారని రాజు భావించాడు. ధర్మాన్ని రక్షించాల్సిన వారే అసత్యం
పలికారని రాజు కలత చెందాడు.
- కాసారశోషణమ్లాన :
- కాసారము: అమరకోశం ప్రకారం (పద్మాకరస్తడాగోఽస్త్రీ
కాసారః) అంటే
చెరువు లేదా కొలను.
- శోషణ: ఎండిపోవడం.
- మ్లాన సారస: వాడిపోయిన పద్మం.
- కొలనులో నీరు లేకపోతే పద్మం ఎలా నిస్తేజమవుతుందో, సత్యం లేని ధర్మం కూడా అలాగే
ఉంటుందని రాజు ఆవేదన చెందాడు. బౌద్ధులు (సౌగతులు) చెప్పిన 'పాము' అనే సమాధానమే నిజమని రాజుకు
అనిపించింది.
- రాజు ఆవేదన: బౌద్ధుల సిద్ధాంతం వేద విరుద్ధమని రాజుకు
తెలుసు. కానీ, ప్రస్తుత
పరీక్షలో వారు నిజం చెప్పి, వేద పండితులు అబద్ధం
చెప్పారని రాజు భావించడం వల్ల అతనికి తీవ్రమైన దుఃఖం కలిగింది. "సత్యమేవ
జయతే" అన్న సూక్తి ఏమైపోతుందో అని ఆయన భయపడ్డాడు.
అథ ప్రోవాచ దివ్యా
వాక్సమ్రాజమశరీరిణీ ।
రుదన్తీ సంశయం తస్య సర్వేషామపి
శృణ్వతామ్ ॥89
తాత్పర్యం
"ఆ తరువాత, రాజుకు మరియు అక్కడ ఉన్న వారందరికీ వినిపించేలా ఒక దివ్యమైన ఆకాశవాణి
(అశరీరిణి) పలికింది. అది రాజు మనసులో ఉన్న సందేహాన్ని పూర్తిగా తుడిచివేస్తూ
(రుదన్తీ) ఈ విధంగా సంబోధించింది."
వ్యాఖ్య
అశరీరిణీ దివ్యా వాక్ : శరీరం లేని దేవతా వాణి ఆకాశం నుండి
వినిపించింది. ఇది కేవలం రాజుకే కాక, సభలో ఉన్న
"సర్వేషామపి" (అందరికీ) వినిపించింది. దీనివల్ల ఇది రాజు భ్రమ కాదని,
దైవ సంకల్పమని అందరికీ అర్థమైంది.
- రుదన్తీ సంశయమ్ : 'రుదన్తీ' అంటే ఇక్కడ నశింపజేయడం
లేదా పారద్రోలడం అని అర్థం. బ్రాహ్మణులు అబద్ధం చెప్పారేమో అని రాజుకు కలిగిన
భయాన్ని ఆ వాణి పోగొట్టింది.
- శంకర స్వరూపం : ఆకాశం అనేది పరమశివుని ఎనిమిది రూపాలలో (అష్టమూర్తులు)
ఒకటి. కాబట్టి, ఆ సాక్షాత్తు శంకర స్వరూపమే ఆకాశం
ద్వారా రాజును ఊరడించి, సత్యం వైపు నడిపించిందని భావం.
- సందర్భం: బౌద్ధులు భౌతికమైన 'పాము'ను చూశారు.
కానీ బ్రాహ్మణులు చేసిన సూర్యోపాసన వల్ల, ఆ కుండలో ఉన్న
వస్తువు యొక్క తత్త్వమే మారిపోయింది. లోకంలో అసాధ్యమైనది ఏదీ లేదని, భక్తికి తర్కం అతీతమని నిరూపించడానికి ఈ ఆకాశవాణి ఒక సాక్షిగా
నిలిచింది.
సత్యమేవ మహారాజ బ్రాహ్మణా
యద్వభాషిరే ।
మా కృథః సంశయం తత్ర భవ
సత్యప్రతిశ్రవః ॥90
తాత్పర్యం
"ఓ మహారాజా! ఆ బ్రాహ్మణులు
ఏదైతే చెప్పారో అది అక్షరాలా సత్యం. వారి మాటల విషయంలో ఏమాత్రం సందేహించకు (మా
కృథః సంశయమ్). నీవు చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకుని సత్యసంధుడవు అనిపించుకో (భవ
సత్యప్రతిశ్రవః)."
వ్యాఖ్య
సత్యమేవ : రాజు కళ్ళతో చూసి కుండలో పామును ఉంచాడు. కానీ ఆకాశవాణి అది పాము కాదు,
బ్రాహ్మణులు చెప్పినట్లు 'మహావిష్ణువు'
అని ధృవీకరించింది. భగవంతుని సంకల్పం ఉంటే విషసర్పం కూడా
విశ్వంభరుడైన విష్ణువుగా మారుతుందని ఇక్కడ నిరూపితమైంది.
- మా కృథః సంశయమ్ : మానవ మాత్రులకు కంటికి కనిపించేదే సత్యం అనిపిస్తుంది.
కానీ యోగశక్తి, మంత్రశక్తి మరియు భగవదనుగ్రహం ముందు
భౌతిక ధర్మాలు మారిపోతాయి. రాజు తన కళ్లను నమ్మాడు కానీ, బ్రాహ్మణుల తపశ్శక్తిని శంకించాడు. ఆ శంకను దైవమే స్వయంగా
తొలగించింది.
- సత్యప్రతిశ్రవః : రాజు అంతకుముందు ఒక కఠినమైన ప్రతిజ్ఞ చేశాడు (82వ శ్లోకంలో)—ఎవరు తప్పు సమాధానం చెబితే వారిని శిక్షిస్తానని.
ఇప్పుడు బౌద్ధులు 'పాము' అని
చెప్పి ఓడిపోయారు (ఎందుకంటే కుండలో ఇప్పుడు విష్ణువు ఉన్నాడు). కాబట్టి నీ
ప్రతిజ్ఞ ప్రకారం ధర్మాన్ని నిలబెట్టు అని ఆకాశవాణి రాజును పురికొల్పింది.
- అన్వయం: ఈ ఘట్టం ద్వారా వేద ప్రామాణ్యం, బ్రాహ్మణుల తపశ్శక్తి మరియు
సూర్యోపాసన యొక్క మహిమ లోకానికి చాటిచెప్పబడింది.
శ్రుత్వాఽశరీరిణీం వాణీం దదర్శ
వసుధాధిపః ।
మూర్తిం మధుద్విషః కుమ్భే సుధామివ
సురాధిపః ॥91
తాత్పర్యం
"ఆ ఆకాశవాణి మాటలను విన్న
వెంటనే, ఆ వసుధాధిపుడు (సుధన్వ మహారాజు) కుండను తెరిచి
చూశాడు. ఇంద్రుడు (సురాధిపుడు) అమృతాన్ని (సుధామ్) చూసినట్లుగా, ఆ రాజు ఆ కుండలో (కుమ్భే) మధుసూదనుడైన శ్రీమహావిష్ణువు (మధుద్విషః) యొక్క
దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించాడు."
వ్యాఖ్య
మధుద్విషః : 'మధు' అనే రాక్షసుని సంహరించినవాడు కాబట్టి
విష్ణువును 'మధుద్విషః' అని
పిలుస్తారు. అంటే, దుష్టత్వాన్ని అంతం చేసే శక్తి ఆ కుండలో
ఆవిర్భవించింది.
- ఉపమానము : ఇక్కడ కవి ఒక చక్కని పోలిక చెప్పారు.
- దేవరాజు ఇంద్రుడు (సురాధిపః) - సుధన్వ మహారాజు
(వసుధాధిపః)
- అమృతము (సుధామ్) - విష్ణుమూర్తి (మధుద్విషః మూర్తిమ్)
- దేవతలు అమృతాన్ని చూసి ఎలాగైతే పరమానందం పొందుతారో, అమరత్వాన్ని పొందుతారో, రాజు కూడా ఆ విష్ణుమూర్తిని చూసి అలాగే పరవశించిపోయాడు.
- దైవలీల - సత్య విజయం: రాజు స్వయంగా కుండలో సర్పమును
ఉంచాడు. బౌద్ధులు అది 'సర్పము' అని చెప్పారు (వారు తమ కళ్ళను, తర్కాన్ని నమ్మారు). కానీ బ్రాహ్మణులు సూర్యభగవానుని మాటపై నిలబడి 'విష్ణువు' అని చెప్పారు. ఇప్పుడు కుండలో
విష్ణువు కనిపించడం అంటే - వేద ధర్మం మరియు భక్తి ముందు భౌతిక సత్యాలు కూడా
తలవొంచుతాయని నిరూపితమైంది.
- విజయం: ఈ అద్భుత దర్శనంతో బౌద్ధుల వాదన పటాపంచలైంది.
సనాతన ధర్మాన్ని కించపరిచిన వారు ఓటమి పాలయ్యారు.
నిరస్తాఖిలసందేహో
విన్యస్తేతరదర్శనాత్ ।
వ్యధాదాజ్ఞాం తతో రాజా వధాయ
శ్రుతివిద్విషామ్ ॥92
తాత్పర్యం
"తాను కుండలో ఉంచిన వస్తువు
(పాము) కాకుండా, మరొక వస్తువు (మహావిష్ణువు) కనిపించడంతో
రాజుకు ఉన్న అన్ని సందేహాలు (నిరస్తాఖిలసందేహః) తొలగిపోయాయి. అప్పుడు ఆ రాజు,
వేదాలను ద్వేషించే ఆ బౌద్ధులను (శ్రుతివిద్విషామ్) సంహరించమని
ఆజ్ఞాపించాడు."
వ్యాఖ్య
విన్యస్తేతరదర్శనాత్ : రాజు స్వయంగా కుండలో 'పాము'ను ఉంచాడు. కానీ అక్కడ 'విష్ణువు'
కనిపించాడు. దీనివల్ల బ్రాహ్మణులు చెప్పినది సత్యమని, వారు దైవానుగ్రహం పొందినవారని రాజుకు అర్థమైంది.
- శ్రుతివిద్విషామ్ : బౌద్ధులు వేద ప్రామాణ్యాన్ని అంగీకరించరు. ప్రత్యక్షంగా
కనిపించే నిజాన్ని కూడా తమ కుతర్కంతో వక్రీకరించే వారిని 'వేద విరోధులు'గా పరిగణించి, వారిని శిక్షించడం ద్వారా ధర్మాన్ని నిలబెట్టాలని రాజు
నిర్ణయించుకున్నాడు.
ఋషి వాక్కు - భవభూతి వివరణ:
ఈ సందర్భంలో భవభూతి తన 'ఉత్తర రామచరితం'లో
చెప్పిన ఒక గొప్ప సూక్తిని గుర్తుచేసుకోవాలి:
లౌకికానాం హి సాధూనాం అర్థం వాగనువర్తతే ।
ఋషీణాం పునరాద్యానాం వాచమర్థోఽనుధావతి ॥
- సామాన్యులు: మనం ఒక వస్తువును చూసి దానికి తగిన పేరు
(శబ్దం) చెబుతాము. అంటే మన మాట వస్తువును అనుసరిస్తుంది.
- ఋషులు/మహాత్ములు: వీరు ఏదైనా మాట అంటే, ఆ వస్తువే ఆ మాటను అనుసరిస్తుంది.
అంటే, కుండలో ఉన్నది 'విష్ణువు'
అని వారు వాక్కుతో అంటే, ఆ పాము కూడా
విష్ణువుగా మారిపోతుంది. దీనినే "సత్య
సంకల్పం" అంటారు.
ఆసేతోరా
తుషారాద్రేర్బౌద్ధానావృద్ధబాలకమ్ ।
న హంతి యః స హంతవ్యో
భృత్యాన్నిత్యన్వశాన్నృపః ॥93
తాత్పర్యం
"దక్షిణాన
సేతువు (రామసేతు) మొదలుకొని ఉత్తరాన తుషారాద్రి (హిమాలయాల) వరకు ఉన్న ఈ భరతభూమిలో,
బౌద్ధులను (బాల వృద్ధులను సైతం వదలకుండా) ఎవరైతే సంహరించరో, అటువంటి నా సేవకులను నేనే సంహరిస్తాను అని రాజు తన భృత్యులను (సేవకులను)
ఆజ్ఞాపించాడు."
వ్యాఖ్య
ఆసేతోరా తుషారాద్రేః : ఇది అఖండ
భారత దేశ భౌగోళిక సరిహద్దులను సూచిస్తుంది. రామేశ్వరం నుండి హిమాలయాల వరకు ఉన్న
సమస్త భూభాగంలో వైదిక ధర్మాన్ని ధిక్కరించేవారిని ఏరివేయాలని రాజు సంకల్పించాడు.
- ఆవృద్ధబాలకమ్ : 'ఆవృద్ధబాలకమ్'
అంటే పసిబిడ్డల నుండి ముసలివారి వరకు అని అర్థం. అంటే బౌద్ధ మత
ప్రచారాన్ని లేదా ఆ ప్రభావాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలనే రాజు యొక్క
తీవ్రతను ఇది తెలుపుతుంది.
- న హంతి యః స హంతవ్యః : రాజు తన
సేవకులకు ఇచ్చిన హెచ్చరిక ఇది. "నేను ఇచ్చిన ఆజ్ఞను ఎవరైనా పాటించకపోతే,
అంటే బౌద్ధులను శిక్షించడంలో వెనుకాడితే, అటువంటి సేవకుడిని నేనే స్వయంగా శిక్షిస్తాను" అని అర్థం.
- చారిత్రక సందర్భం: బౌద్ధులు ప్రత్యక్ష ప్రమాణాన్ని
(కుండలోని పామును) కూడా తమ కుతర్కంతో వక్రీకరించడానికి ప్రయత్నించారు.
సత్యాన్ని కప్పిపుచ్చే ఇటువంటి ధోరణి సమాజానికి ప్రమాదకరమని భావించిన సుధన్వ
మహారాజు, ధర్మాన్ని నిలబెట్టడానికి ఇటువంటి
కఠిన నిర్ణయం తీసుకున్నాడు.
ఇష్టోఽపి
దృష్టదోషశ్చేద్వధ్య ఏవ మహాత్మనామ్ ।
జననీమపి కిం
సాక్షాన్నావధీద్భృగునందనః ॥94
తాత్పర్యం
"మహాత్ములైన
వారు (ధర్మనిష్ఠ గలవారు), తమకు అత్యంత ఇష్టులైన వారైనప్పటికీ,
వారిలో దోషం ఉన్నట్లు రుజువైతే వారిని శిక్షించక తప్పదు.
భృగువంశీయుడైన పరశురాముడు, తన తండ్రి ఆజ్ఞ మేరకు స్వయంగా తన
తల్లిని (రేణుకా మాతను) సంహరించలేదా?"
వ్యాఖ్య
ఇష్టోఽపి : రాజుకు
అంతకుముందు బౌద్ధుల పట్ల గౌరవం ఉండవచ్చు లేదా వారు గురువులుగా ఉండవచ్చు. కానీ,
ఎప్పుడైతే వారు సత్యాన్ని వక్రీకరించి, వేదాలను
దూషించారో (దృష్టదోషః), అప్పుడు వారు శిక్షార్హులయ్యారు.
- భృగునందనః : పరశురాముడు
తన తండ్రి జమదగ్ని ఆజ్ఞను అనుసరించి, ధర్మరక్షణ కోసం తన
తల్లిని కూడా లెక్కచేయకుండా శిక్షించాడు. ఇది వ్యక్తిగత బంధాల కంటే ధర్మం
మిన్న అని చెప్పడానికి నిదర్శనం.
- అలంకార విశేషం : * ఈ
శ్లోకంలో 'వికస్వర' అలంకారం ఉన్నది.
- ఒక ప్రత్యేక విషయాన్ని (బౌద్ధుల శిక్ష)
సమర్థించడానికి, ఒక సామాన్య ధర్మాన్ని
(మహాత్ములు తప్పు చేసిన వారిని శిక్షిస్తారు) చెప్పి, ఆ
పైన మరొక విశేష ఉదాహరణను (పరశురాముని కథ) జోడించడాన్ని వికస్వర అలంకారం
అంటారు.
- సందర్భం: సత్యం మరియు వేద ధర్మం పట్ల రాజుకు ఉన్న
నిబద్ధతను ఈ శ్లోకం చాటిచెబుతోంది. లోకకల్యాణం కోసం, అధర్మాన్ని పెంచే శక్తులను తుడిచిపెట్టడం పాలకుడి బాధ్యత అని కవి
ఇక్కడ ఉద్ఘాటించారు.
భట్టానుసారిరాజేన జైనా
ధర్మద్విషో హతాః ।
యోగీన్ద్రేణేవ యోగఘ్నా
విఘ్నాస్తత్త్వావలమ్బినా ॥95
(గమనిక: పాఠాంతరంలో 'స్కన్దానుసారి'
అని ఉంది,.కుమారిల భట్టు సుబ్రహ్మణ్యేశ్వరుని
(స్కందుని) అవతారమని ప్రతీతి, కాబట్టి రెండు పదాలూ ఆయన్నే
సూచిస్తాయి.)
తాత్పర్యం
"కుమారిల
భట్టును అనుసరించే సుధన్వ మహారాజు, వేద ధర్మాన్ని ద్వేషించే
వారిని (జైనులను/బౌద్ధులను) సంహరించాడు. ఇది ఎలా ఉందంటే - పరమ సత్యాన్ని
(తత్త్వాన్ని) ఆశ్రయించిన ఒక శ్రేష్ఠుడైన యోగి, తన యోగ
సాధనకు ఆటంకం కలిగించే విఘ్నములను (అంతరాయాలను) ఎలాగైతే పూర్తిగా నిర్మూలిస్తాడో,
రాజు కూడా అలాగే ధర్మ విరోధులను నిర్మూలించాడు."
వ్యాఖ్య
భట్టానుసారిరాజేన : సుధన్వ
మహారాజు కుమారిల భట్టు యొక్క శిష్యుడు. కుమారిల భట్టు సాక్షాత్తు శివకుమారుడైన కుమారస్వామి
(స్కందుడు) అవతారమని నమ్మకం. ఆయన మార్గదర్శకత్వంలోనే రాజు ఈ కార్యానికి
పూనుకున్నాడు.
- యోగీన్ద్రేణేవ : ఇక్కడ
రాజును ఒక గొప్ప యోగితో పోల్చారు.
- ఒక యోగికి 'సమాధి'
స్థితి కలగకుండా అనేక విఘ్నాలు అడ్డుపడతాయి.
- యోగశాస్త్రం ప్రకారం అవి: వ్యాధి, స్త్యాన (స్తబ్దత), సంశయ, ప్రమాద, ఆలస్య, అవిరతి
(విషయాసక్తి), భ్రాంతిదర్శన, అలబ్ధభూమికత్వ,
అనవస్థితత్వములు.
- ఒక సాధకుడు వీటిని ఎలాగైతే వివేకంతో
తొలగించుకుంటాడో, రాజు కూడా సమాజానికి
విఘ్నాలుగా మారిన అధర్మ శక్తులను అలాగే తొలగించాడు.
- తత్త్వావలమ్బినా : యోగి
ఎలాగైతే అద్వైత ఆత్మజ్ఞానాన్ని లేదా పరమ సత్యాన్ని ఆశ్రయించి విఘ్నాలను
జయిస్తాడో, రాజు కూడా 'వేద
ప్రమాణాన్ని' (సత్యాన్ని) ఆశ్రయించి శత్రువులను
జయించాడు.
- ఉపమాన అలంకారం: రాజును యోగితోను, ధర్మ విరోధులను యోగ విఘ్నాలతోను పోల్చడం ద్వారా, రాజు చేసిన పని హింస కాదు, అది ఒక 'ధర్మ సాధన' అని కవి స్పష్టం చేశారు.
హతేషు తేషు దుష్టేషు
పరితస్తార కోవిదః ।
శ్రౌతవర్త్మ తమిస్రేషు
నష్టేష్వివ రవిర్మహః ॥96
తాత్పర్యం
"దుష్టులైన
ఆ బౌద్ధులు అంతమొందిన తర్వాత, పండితుడైన కుమారిల భట్టు
(కోవిదః) వేద మార్గాన్ని (శ్రౌతవర్త్మ) అన్ని దిక్కులా విస్తరింపజేశాడు. చీకట్లు
(తమిస్రములు) తొలగిపోయిన తర్వాత సూర్యుడు తన తేజస్సును (మహః) ఎలాగైతే లోకమంతటా
ప్రసరింపజేస్తాడో, భట్టపాదులు కూడా అలాగే వైదిక ధర్మాన్ని
ఉద్ధరించారు."
వ్యాఖ్య
కోవిదః : ఇక్కడ 'కోవిదః' అంటే సర్వ శాస్త్ర పారంగతుడైన కుమారిల
భట్టు. ఆయన కేవలం వాదనే కాదు, ఆచరణలో కూడా నిష్ణాతుడు.
- పరితస్తార : ఆయన కేవలం
మాటలతో కాకుండా, ప్రతి ఇంట్లో వేదాధ్యయనం, అగ్నిహోత్రం వంటి యజ్ఞకర్మలు మళ్ళీ మొదలయ్యేలా చేశారు. వైదిక జీవన
విధానాన్ని పునఃప్రతిష్ఠించారు.
- తమిస్రేషు నష్టేష్వివ :
- తమిస్రము (చీకటి): ఇది బౌద్ధుల కుతర్కాలకు, అజ్ఞానానికి సంకేతం.
- రవిర్మహః (సూర్య తేజస్సు): ఇది కుమారిల భట్టు
ప్రబోధించిన వేద జ్ఞానానికి సంకేతం.
- చీకటి ఉన్నంత సేపు సూర్యకాంతి కనిపించదు. అలాగే
కుతర్కాలు ఉన్నంత కాలం వేద సత్యం మరుగైపోయింది. ఎప్పుడైతే ఆ అడ్డంకులు
తొలగిపోయాయో, వేద ధర్మం సూర్యకాంతిలా
స్వయంప్రకాశితమైంది.
- సందర్భం: సుధన్వ మహారాజు ఆజ్ఞతో బాహ్య శత్రువులు
(అధర్మ శక్తులు) తొలగిపోగా, కుమారిల భట్టు తన పాండిత్యంతో
అంతర్గత శత్రువైన 'అజ్ఞానాన్ని' తొలగించి,
కర్మకాండకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చారు.
కుమారిలమృగేన్ద్రేణ హతేషు జినహస్తిషు ।
నిష్ప్రత్యూహమవర్ధన్త శ్రుతిశాఖాః సమన్తతః ॥97
తాత్పర్యం
"సింహము వంటివాడైన కుమారిల భట్టు (మృగేన్ద్రేణ), వేదారణ్యాన్ని నాశనం చేసే మదగజాల వంటి బౌద్ధులను (జినహస్తిషు) సంహరించాడు.
ఆ తరువాత, అడ్డంకులు లేని ఆ వేద వృక్షం (శ్రుతి) తన
శాఖోపశాఖలతో అన్ని దిక్కులా వర్ధిల్లింది."
వ్యాఖ్య
కుమారిల మృగేన్ద్రేణ : కుమారిల భట్టును
ఇక్కడ సింహంతో పోల్చారు. వ్యాఖ్యానం ప్రకారం, 'కుమార'
అంటే స్కందుడు (సుబ్రహ్మణ్యేశ్వరుడు). ఆయన తండ్రి అయిన శివుని
ఆజ్ఞను శిరసావహించి, వేద రక్షణ కోసం కుమారిల భట్టుగా
అవతరించారు.
- సింహం గర్జన వింటే ఏనుగులు భయపడినట్లు, కుమారిల భట్టు పాండిత్యం ముందు బౌద్ధుల కుతర్కాలు నిలబడలేకపోయాయి.
- జినహస్తిషు : అడవిలో
ఏనుగులు చెట్ల కొమ్మలను విరిచివేసి అడవిని పాడుచేస్తాయి. అలాగే, బౌద్ధులు తమ వాదనలతో వేదాలలోని కర్మకాండను, శాఖలను
విమర్శిస్తూ వేద ధర్మాన్ని బలహీనపరిచారు. వారిని ఇక్కడ 'మదగజాల'తో పోల్చారు.
- నిష్ప్రత్యూహమవర్ధన్త : విఘ్నాలు
తొలగిపోయిన తర్వాత వేద వృక్షం (శ్రుతి) మళ్ళీ పచ్చగా కళకళలాడింది.
- శ్రుతిశాఖాః: వేదాలకు అనేక శాఖలు ఉన్నాయి.
కుమారిల భట్టు కృషితో యజ్ఞయాగాదులు, వేదాధ్యయనం
మళ్ళీ దేశమంతటా విస్తరించాయి.
- సందర్భం: ఈ శ్లోకం ఒక గొప్ప పీఠిక (Prologue)
వంటిది. కుమారిల భట్టు కర్మకాండను నిలబెట్టారు. కానీ, మానవుడికి
మోక్షం కలగాలంటే కేవలం కర్మలు సరిపోవు, బ్రహ్మజ్ఞానం
కావాలి. ఆ జ్ఞానకాండను బోధించడానికి సాక్షాత్తు పరమశివుడు శంకర భగవత్పాదులుగా
అవతరించబోతున్నారని ఈ శ్లోకం సూచిస్తోంది.
ప్రాగిత్థం
జ్వలనభువా ప్రవర్తితేఽస్మిన్కర్మాధ్వన్యఖిలవిదా కుమారిలేన ॥
ఉద్ధర్తుం భువనమిదం
భవాబ్ధిమగ్నం కారుణ్యాంబునిధిరియేష చంద్రచూడః ॥ 98 ॥
తాత్పర్యం
"ఈ విధంగా, అగ్ని నుండి ఉద్భవించినవాడు (జ్వలనభూః),
సర్వజ్ఞుడు అయిన కుమారిల భట్టు మొదటగా ఈ లోకంలో వైదిక
కర్మమార్గాన్ని (యజ్ఞయాగాది క్రియలను) పునరుద్ధరించారు. ఆ తర్వాత, సంసార సాగరంలో (భవాబ్ధి) మునిగిపోయిన ఈ జగత్తును ఉద్ధరించడం కోసం, కారుణ్య సముద్రుడైన ఆ చంద్రశేఖరుడు (పరమశివుడు) స్వయంగా అవతరించాలని
సంకల్పించాడు."
వ్యాఖ్య
జ్వలనభువా : కుమారిల
భట్టును 'జ్వలనభూః' అని సంబోధించారు.
పురాణాల ప్రకారం కుమారస్వామి (స్కందుడు) అగ్నిదేవుని నుండి ఉద్భవించాడు, అందుకే ఆయన అవతారమైన భట్టపాదులను ఇలా పిలిచారు.
- కర్మాధ్వని : మోక్ష సౌధానికి కర్మ మార్గం మొదటి మెట్టు. చిత్తశుద్ధి కోసం వేదోక్త
కర్మలు అవసరం. ఆ మార్గాన్ని భట్టపాదులు సిద్ధం చేశారు.
- అద్వైత
శాస్త్ర ప్లవేన : వ్యాఖ్యానం ప్రకారం, సంసార
సముద్రంలో మునిగిపోయిన వారిని రక్షించడానికి పరమశివుడు 'అద్వైత వేదాంతం' అనే పడవను తీసుకుని రాబోతున్నాడు. కర్మలు మార్గాన్ని
సుగమం చేస్తే, జ్ఞానం మోక్షాన్ని ప్రసాదిస్తుంది.
- చంద్రచూడః : పరమశివుడు అత్యంత దయామయుడు (కారుణ్యాంబునిధి). లోకులు పడుతున్న
అజ్ఞానపు కష్టాలను చూసి చలించి, వారిని జ్ఞానమార్గంలో
నడిపించడానికి 'శంకరాచార్యుల' రూపంలో
అవతరించాలని నిర్ణయించుకున్నారు.
- ఛందస్సు: ఈ
శ్లోకం 'ప్రహర్షిణి' వృత్తంలో ఉంది.
శ్రీ శంకరభగవత్పాదుల కృపతో తాడేపల్లి పార్వతీశశాస్త్రి,
సుశీలల మూడవ కుమారుడు తాడేపల్లి పతంజలి వ్యాఖ్యానించిన శ్రీ మాధవీయ శంకరవిజయములో మొదటి సర్గ సమాప్తము
******
No comments:
Post a Comment